విశ్వ చక్రదాన విధానము

శ్రీ మత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను. ఇప్పుడిక అనుత్తమమును సర్వపాతక నాశనమును నగు విశ్వచక్ర ప్రదానిక మను ప్రఖ్యాత మహాదానమును తెలిపెదను; విషువాది పుణ్యదినముల యందు ఈ దాన మాచరించవలయును, అందులకై జ్యేష్ఠమైనచో వేయి - మధ్యమముగా ఐదు వందలు కనిష్ఠముగా రెండు వందల - ఏబది - పలములు శుద్ధ సువర్ణముతో - మరియు అశక్తుడు ఇరువదిపలముల కెక్కువ - బంగరుతో విశ్వచక్రము (సమస్త ప్రపంచ మండలము)ను చేయించ వలయును; అనంతరము అందు పదునారు అరలు అనగా ఆకులుకల ఎనిమిది ఆవరణములుకల చక్రమును యంత్రరూపమున చేయించవలెను. ఆ చక్రపు నాభియం అనగా కుండ అనబడు భాగమునందు ఉండునట్లు యోగారూఢుడు చతుర్భుజుడునగు విష్ణుని చేయించవలెను, ఇతనికడ శంఖచక్రములును చుట్టును ఎనిమిది అరలయందు అష్ట (లక్ష్మీ) దేవులు నుందురు. మిగిలిన ఎనిమిది అరల యందును వివిధ భూషణముల ఆవృతులు చిత్రించవలయును. (ఇదిలోపలి నుండి ప్రథమావరణము); ఇక ద్వితీయావరణమున తూర్పున జలశయనునకు కూర్పుగా అత్రి భృగువసిష్ఠ బ్రహ్మ కశ్యపులను మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామరామకృష్ణ బుద్ధ కల్కులను పదిమందిని మొత్తము పదునారుమందిని రూపొందించవలెను. తృతీయ ఆవరణమున బహు (15 మంది) మాతృకలతోకూడి గౌరియుండును; చతుర్థా వరణమున ద్వాదశా దిత్యులు చతుర్వేదములును పంచమావరణమున పంచభూతైకాదశ రుద్రాష్టలోకపాలురు అను పదునారు మంది ఉందురు. షష్ఠావరణమున అష్టదిగ్గజములును అష్టదిక్పాలురును (16) ఉందురు. సప్తమావరణమున సర్వాస్త్రములను మంగళకర దేవతాదులు అన్నిటిని ఉంచవలెను, అష్టమావరణమున అంతరాంతర (నడుమ నడుమ ఉంచదగిన) దేవతలను పదునారుమందిని ఎవరినైన నుంచవలెను, మిగిలినవన్నియు అన్నివైపులను తులాపురుష దానమందువలె ఏర్పరచవలెను, అట్లే ఋత్విజులను మండపమును సంభారములను భూషణములను వస్త్రములను సమకూర్చుకొనవలెను. తరువాత విశ్వచక్ర ప్రతిమను కృష్ణాజినముపై తిలలపై నుంచవలెను, అష్టాదశ ధాన్యములను లవణాదిరస ద్రవ్యములను ఎనిమిది పూర్ణకుంభములను వివిధ వస్త్రములను శాలిధాన్యమును చెరకుగడలను ఫలములను రత్నములను ఉంచి వితానకమును ఏర్పరచవలయును; తరువాత యజమాన గృహస్థుడు మంగళవాద్య వేదధ్వనులతో స్నానమాడి శుక్ల వస్త్రములను ధరించి హోమమును అధివాసనమును అయి తరువాత దోసిట పూవులు తీసికొని దేవతా ప్రతిమాదులను త్రిఃప్రదక్షిణించి ఈ మంత్ర ముచ్చరించవలయును.

“విశ్వమయుడవగు నీకు నమః; విశ్వచక్రాత్ముడవగు నీకు నమస్కారము; పరమానంద రూపుడవగు నీవు మమ్ము సంసారసాగరము నుండి కాపాడుము; యోగులు సదా తమ హృదయ మందు త్రిగుణాతీతమగు ఈతేజోమయ చక్రమును దర్శించుచుందురు; కావున ఇట్టి ఈ విశ్వ చక్రమును నేను నమస్కరించుచున్నాను; వాసుదేవునియందు చక్రమున్నది; విశ్వచక్ర మధ్యమందు మాధవుడు ఉన్నాడు; ఇందు ఇట్లు అన్యోన్యాధార రూపమున నున్న ఈ ఇరువురను నమస్కరించుచున్నాను; ఈ విశ్వచక్రము సర్వపాపహరమును పరమము (ఉత్తమము)ను; ఇది విష్ణునకు ఆయుధమును అధివాసస్థానమును అయియున్నది. ఇంత గొప్పదానవు కావున ఓ విశ్వ చక్రమా! ఈ సంసారము నుండి నన్ను ఉద్ధరించుము.”

ఇట్లామంత్రించి విశ్వచక్రమును విమత్సరుడై (మత్సరము - ఇతరులలో పోటీ - లేనివాడై) దానమొసగువాడు సర్వపాపవిముక్తుడై విష్ణులోక మందు పూజితుడై సుఖమందును, అతడు విష్ణులోకముచేరి సనాతనుడును చతుర్భాహుడునగు విష్ణునిరూపముతో నుండి అప్సరః సంఘములచే సేవింపబడుచు, మూడువందల కల్పములుండును, దినదిన మందును విశ్వచక్రమునకు పండ్రెండు మారులు నమస్కరించ వలయును; అట్టి వానికి ఆయుర్వృద్ధియగును; నిత్యమును విపులయగు లక్ష్మియు కలుగును; ఇట్లు సకలజగత్తులకును సురలకును అధివాసమును పదునారు అరలుకలదియునగు ఈ స్వర్ణమయ విశ్వచక్రమును ఎవరు దానము చేయుదురో అట్టివారు హరి లోకమును పొంది సిద్ధులచేతను శిరస్సులతో నమస్కరింప బడుచు చిరకాలము సుఖమందును; అతడు కనక సుదర్శన దానము చేత దగ్దపాపుడై సుదర్శన చక్రముతోను కేశవునితోను అనురూపుడు (వారిని పోలినవాడు) అయి తన శత్రువులకును శుభదర్శనుడు (వారికి శత్రువుగా కాక మిత్రుడుగా కనబడువాడు) అగును; స్త్రీలకు మన్మథునివలె అందముగా కనబడువాడు అగును.

ఇట్లు దానము ఈయబడు ఈషోడశార విశ్వచక్రమునందలి మురారి యుత్తమ రూపము మానవులచే చేయబడిన మహాపాపములను సంసారమువలన జనించెడు అత్యంత భయమును భువనమునందు సంభవించెడు ఆయా భయములను మిక్కిలిగి అణగద్రొక్కి వేయును.