మత్స్య మహా పురాణము
శ్రాద్ధ కాల నిర్ణయము
పగటి కాలము మొత్తము పదునైదు ముహూర్తములగును. వరుసగా ప్రాతఃకాలము పూర్వాహ్ణము మధ్యాహ్నము అపరాహ్ణము సాయాహ్నము-ఇవి ఒక్కొక్కటి మూడేసి ముహూర్తములు. సాయాహ్నమునకు రాక్షసీ హోరా అనియు పేరున్నది. ఆ సాయాహ్న కాలము నందు శ్రాద్ధము జరుపరాదు. ఏలయన రాక్షసీహోరా ఏ కర్మములకును పనికిరాదు. వీనిలో ఎనిమిదవ ముహూర్తమునకు కుతప కాలమని శాస్త్రమున పేరు. మధ్యాహ్న కాలమున ఏ సమయము నుండి రవి చల్లదనము పొందునో అప్పటి నుండి సాయాహ్న మారంభమగు లోపల శ్రాద్ధము జరిపిన వారికి రవి అనంత ఫలము ఇచ్చును.
ఇదియును కాక-మధ్యాహ్న కాలము ఖడ్గము నుంచు పాత్రము (ఒక) నేపాళ దేశమున నేసిన కంబళము దీపము దర్భలు తిలలు గోవులు దౌహిత్రుడు-ఈ ఎనిమిదింటికిని కుతపము అని పేరు. కుతపము అను శబ్దమునందలి కు-అనగా కుత్సితము-పాపము అని అర్థము. తపము అనగా దానిని తపింపచేయునది. ఇదియును కాక పగటి ముహూర్తములలో ఎనిమిదవది అగు కుతప ముహూర్తమును దాని తరువాత వచ్చు నాలుగు ముహూర్తములును-మొత్తము ఈ అయిదు ముహూర్తములకు స్వధా భవనములు అని వ్యవహారము.
దర్భలును నల్లని నువ్వులును విష్ణు శరీరము నుండి ఉత్పన్నమయినవి. శ్రాద్ధము శుభ ఫలమును ఈయవలెననినచో శ్రాద్ధమున వీనిని వినియోగించవలయును అని ద్యులోక నివాసులగు పితృ దేవతలు స్వయముగా చెప్పిరి. కనుక శ్రాద్ధము లందును చేతియందు (ఒక చేతిలోనే) దర్భలు ధరించి తిలోదకమును పితరుల నుద్దేశించి ఈయవలెను.
పూర్వము మత్స్య రూపుడగు నారాయణుడు మనువునకు చెప్పిన శ్రాద్ధాను కీర్తనము పుణ్యకరము-పవిత్రమ-ఆయుఃప్రదము-సర్వ పాపములను నశింపజేయునది. దీనిని చదివినను వినినను నరుడు శ్రీమంతుడగును. తీర్థ శ్రాద్ధ సమయమున దీనిని తప్పక చదువుటయో వినుటయో చేయవలెను. దానివలన అశుభము-నశించును. ఇది పవిత్రమయినది. కీర్తి కలుగు టకు మూల కారణమయినది. మహాపాప హరము. ఈ శ్రాద్ధ మాహాత్మ్యము బ్రహ్మార్కరుద్రులు కూడ ఆదరించునది అని దాని తత్త్వము నెరిగినవారు చెప్పుచున్నారు.