చతుఃషష్టి పదవాస్తు విషయము

“శాంతి కమలాకరము” అను నిబంధమును రచించిన కమలాకరభట్టు రచించిన ‘శాంతిరత్నము’ అను నిబంధము నందు చతు-షష్టి పదవాస్తుయంత్ర పరిలేఖన క్రమమును అందలి దేవతలకు వాస్తుపురుషుని దేహమునందు ఉనికియు ఈ విధముగా చెప్పబడినది:

వేదికపై (నూతన) వస్త్రముమీద కుంకుమము వెడల్పుగాపోసి దానియందు బంగారు కడ్డీతో పడమటి నుండి తూర్పునకు 1. శాంత, 2. యశోవతి, 3. కాంత, 4. విశాల, 5. ప్రాణవాహిని, 6. సతి, 7. సుమతి, 8. నంద, 9. సుభద్ర అను తొమ్మిది రేఖలను -దక్షిణము నుండి ఉత్తరమునకు 1. హిరణ్య, 2. సువ్రత, 3. లక్ష్మి, 4. విభూతి, 5. విమల, 6. క్రియ, 7. జయ, 8. కాల, 9. విశోక అను తొమ్మిది రేఖలను గీయవలెను. దీనిచే 8x8=64 కోష్ఠములు (గదులు) ఏర్పడును. నట్టనడుమ ఏర్పడిన నాలుగు గడులును ఒకటిగా అగునట్లు గుర్తింపురేఖ గీయవలెను. ఈనడిమి చతురస్రపు నాలుగుమూలల నుండియు అన్నిటి కంటె బయటి ఆయా మూలల రేఖా సంధులవరకు వరుసగా నాలుగు ఏటవాలు రేఖలను గీయవలెను: దీనిచే ఈ రేఖలు తాకిన చోట్లనున్న గడులు రెండు రెండుగా విభజింపబడును. ఇపుడు ఆయా స్థానములందు చెప్పబోవు విధమున దేవతలను ఆవాహనము చేయవలెను. (ఇందు నిర్దేశించినట్లు వాస్తుపురుషుని ఆయా అవయవము లందు ఆయా దేవతలు ఉన్నట్లు భావన చేయబడును.)

గృహములు చతుశ్శాలములు, త్రిశాలములు, ద్విశాలములు, ఏకశాలములునని నాలుగు విధములు: వీని నామ క్రమాను సారముగా వాని స్వరూపమును కూడ తెలిపెదను.