మత్స్య మహా పురాణము
అవాంతర ప్రళయాదికము
అటు తరువాత మనువు ఆ విష్ణుని భగవన్! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును? ప్రభూ! మధుసూదనా ప్రాణులను ఎట్లు రక్షింతును? నేను మరల నీతో ఎట్లు కలియగలను? అని అడిగెను. మత్స్యము ఇట్లనెను: ఇది మొదలుగా మహీతలమున అనావృష్టి కలుగును. నూరేండ్ల వరకు కరవులు కలిగి ప్రాణులకు మరణము కలిగించును. పిమ్మట అల్పప్రాణులకు నాశము కలిగించుచు సూర్యుని ఏడు కిరణములు కాలేడి నిప్పుకణికలను వర్షించును. ఆ ప్రళయ కాలమున బడబాగ్నియును విజృంభించును. పాతాళమునుండి సంకర్షణుని (భగవంతుని ఒక వ్యూహము) ముఖమునుండి అగ్ని వెలువడును. శివుని నుదుటి మూడవ కంటి అగ్నియు మూడు లోకములను నిర్దహించుచు క్షోభము కలిగించును. ఇట్లు భూమి అంతయు తగులబడి తాబేటి (వీపు)వలె అగును. ఆకాశము సూర్యునిచే మిగుల వేడిమీ పొందును. దాని వలన దేవతలు నక్షత్రములు కూడ నశించును. సంవర్తము భీమనాదము ద్రోణము ఇంద్రము వలాహకము విద్యుత్పతాకము శోణము అను ఈ ఏడు ప్రళయమేఘములును ప్రళయాగ్ని వేడిమికి పుట్టి భూమిని తమ వాననీటితో ముంచివేయును. ఏడు సముద్రములును కలిసి ఒకటిగా ఏర్పడి కలవరము చెందును. ఇవి మూడు లోకములను పూర్ణముగా ఏకార్ణ వముగా చేయును. అట్టి స్థితిలో నీవు ఈ దేవనౌకను తీసికొని బీజములు మొదలగు వాని నిలువను దీనియందు ఉంచి నేను ప్రవర్తిల్లచేయు యోగము (రక్షణ విధానము)తో వాటిని రక్షించుము. ఈ నావను నాకొమ్మునకు కట్టి వేసి నాప్రభావమున అన్ని విధముల రక్షింపబడుచు, దేవతలు నశించినను, నీవు ఒక్కడవు ఉందువు. ఈ అవాంతర ప్రళయకాలమున చంద్ర సూర్యులు-నేను బ్రహ్మ-నాలుగు లోకములు (స్వర్గ, మర్త్య, పాతాళ, బ్రహ్మలోకములు)-పుణ్య అగు నర్మదా నది-మార్కండేయ మహాఋషి శివుడు వేదము(లు) పురాణములు ఇతర విద్యలు నీవు ఇవి అన్నియు నిలుచును. ఇట్లు చాక్షుష మన్వంతరము తరువాత అవాంతర ప్రళయముతో ఏకార్ణవముకాగా పిమ్మట ఈ సృష్టికి ఆరంభమున, మహీతలమున వేదములను ప్రవర్తిల్ల జేయుదును.
అని పలికి భగవానుడు అక్కడనే అంతర్ధానము చెందెను. మనువుకూడ పూర్వము సూచింపబడిన ప్రాణి ప్రళయము వరకును తనకు వాసుదేవుని అనుగ్రహము వలన కలిగిన యోగమును అవలంబించి అభ్యాసము (మరలమరల అనుష్టించుట) చేయుచు ఉండెను. వాసు దేవుడు చెప్పిన సమయమున అట్లు జరుగగానే జనార్దనుడు కొమ్ముగల మత్స్య రూపమున ప్రాదుర్భవించెను. ఆదిశేషుడు త్రాటిరూపమున ముని(మనువు)కడకు వచ్చెను. ఆ ధర్మవేత్త సర్వభూతములను లాగి దగ్గరకు తీసికొని సర్పపు త్రాటితో చేపకొమ్మున నావను కలిపికట్టెను. జనార్దనునికి నమస్కరించి ఆ మత్స్యపు శృంగమునకు సమీపమున నిలిచెను. ఆ అవాంతర ప్రళయము గడిచిన తరువాత మనువు అడుగగా మత్స్వరూపుడు అగు యోగశాయి (విష్ణువు) ఈ మత్స్యపురాణమును ప్రవచించెను. ఋషిసత్తములారా! ఇంతకుముందు మీరు నన్ను అడిగిన సృష్టి మొదలగు విషయములను గూర్చియే మీకు ఇప్పుడు చెప్పెదను దానిని వినుడు అని తెలిపెను. అప్పుడు ఏకార్ణవమున ఉన్న మనువు కేశవుని ఇట్లు ప్రశ్నించెను, ప్రపంచపు ఉత్పత్తిని ప్రళయము వంశమును మన్వంతరములను వంశాను చరితమును భువన విస్తారమును వివిధము లగు దానములను ధర్మములను శాశ్వతమగు శ్రాద్ధకల్పమును వర్ణాశ్రమ విభాగమును ఇష్టములు పూర్తములు అను సత్కర్మములను దేవతల ప్రతిష్ఠలు మొదలగునవి అన్నింటిని గురించి ప్రతి ఒక్కటిని చెప్పవేడుచున్నాను అని సూతుడు శౌనకాది మునులకు వివరించి ఇంకను ఇట్లు చెప్పెను.