ప్రయాగ మాహాత్మ్యము

నందికేశ్వరుడు (స్నాన ప్రసంగమున) నారదునకు ఇట్లు చెప్పెను, పూర్వము పాండుపుత్రుడగు ధర్మరాజునకు మార్కండేయుడు చెప్పిన ప్రయాగ తీర్థ క్షేత్రోపవర్ణనమును తెలిపెదను.

మహాభారత యుద్ధానంతరము యుధిష్ఠిరుడు రాజ్యమును పొందియు భ్రాతృశోక సంతప్తుడయ్యెను. మా భ్రాత దుర్యోధనుడు ఏకాదశాక్షౌహిణీ సేనా నాధుడుగా చక్రవర్తిగా నుండెను గదా! అతడును అతనివారును మమ్ములను చాల విధములు బాధించిరేకాని తుదకు వారును మరణించిరి కదా! వాసుదేవుని ఆశ్రయించియు పాండవులము మేము ఐదుగురమే మిగిలితిమి. భీష్మ ద్రోణ కర్ణులను పుత్ర భ్రాతృ సహితుడగు దుర్యోధనుని చంపి తాము శూరులమనుకొను మావీరులందరును తామును మరణించిరి. గోవిందా! మాకు రాజ్యముతోగాని భోగములతోగాని జీవిత ముతోగాని ఏమిపని? ఛీ! ఎంత దుఃఖకరమిది! అని యుధిష్ఠిరు డేమియు తోచక నిర్విచేష్టుడు నిరుత్సాహుడునునై అధోముఖుడై ఊరకుండెను. మరల తెప్పరిల్లెను. కాని చింత అతనిని వదలలేదు. ఏ విధానమును అనుష్ఠించి నియమ మవలంబించి తీర్థము సేవించి ఈ మహాపాతక దోషము నుండి విముక్తుడను కాగలుగుదును? ఏక్షేత్రవాసము చేసినచో సర్వోత్తమ విష్ణులోక ప్రాప్తియగును? ఇవి అన్నియు నాచే జరిపించిన కృష్ణునేమని అడుగుదును? ధృతరాష్ట్రుని నూర్గురు కొడుకులనుచంపి అతని నేమడుగుదును? అని ఇట్లు ధర్మరాజు ఏమియు తోచని వాడయ్యెను. పాండవులందరును కుంతీ ద్రౌపదులును మరియు నచటచేరిన ఇతరులగు పెద్దలును భూమిపై పడి దొరలుచు ఏడువసాగిరి.

ఆ సమయమున వారాణసియందుండిన మహాతపస్వి మార్కండేయుడు యుధిష్టిరుని ఈ స్థితిని ఎరిగి శీఘ్రమే హస్తినాపురమున కేతెంచి రాజద్వారమున నిలువ ద్వారపాలుడు రాజు కడకువచ్చి అసమాచారమును తెలిపినంత ధర్మజుడును త్వరితమే ద్వారము కడకు పోయెను.

అతడు ఆ మునితో మహాభాగా! స్వాగతము. మహామునీ! స్వాగతము. మీ దర్శనమున ఇపుడు నా జన్మము సఫలమయినది. నా కులమువారు తరించిరి. నా పితరులు సంతుష్టులయిరి. నేను పవిత్ర శరీరుడ నయితిని. అని పలికి లోనికి కొనిపోయి సింహాసనమున మునిని కూర్చుండజేసి పాద ప్రక్షాళన అర్చనాదులతో మహాత్ముడు యుధిష్ఠిరుడు ఆ మునిని పూజించెను.

మార్కండేయుడు సంతుష్టుడై యుధిష్ఠిరునితో “రాజా! నీవేల ఏడిచితివి; నీవేల ఏమియు తోచని వాడవయితివి. నీ బాధఏమి? నీకు కలిగిన అప్రియము ఏమి?” అని అడిగెను. అతడును “మునీ! మాకు రాజ్యము విషయమున జరిగినదంతయు తలచితలచి చింతావశుడనయితిని” అనగా మార్కండేయుడనెను: “రాజా! క్షాత్త్ర ధర్మమున యుద్ధము చేయునపుడు ఇది పాపము అనునదిలేదు. విశేషించి రాజధర్మము ననుసరించి యుద్ధము చేయుటలో పాపము లేదని చెప్ప వలసిన పనియేలేదు. క్షత్రియుడు సైనికుడై యుండి జీవనమునకే కాని దీనజన రక్షణమునకే కాని యుద్ధముచేయుట క్షాత్రధర్మము. రాజైన అతడు తన రాజ్యమును రక్షించుకొనుటకో దానిని శత్రువులనుండి సంపాదించుటకో దీనజన రక్షమునకో యుద్ధము చేయుట రాజధర్మము. ఇది ఎరిగి వివేకమునంది నీవు నీకు పాపము కలుగునని ఆలోచింపకుము.” అనెను.

అంతట యుధిష్టిరుడు మునికి శిరసా నమస్కరించి వినయోపేతుడై “అయ్యా! తాము త్రైలోక్య (ధర్మ) ద్రష్టలు; మహాప్రాజ్ఞులరు; పాప మోచనమగు ఉపాయమును సంక్షేపమున చెప్ప మిమ్ము వేడుచున్నాను” అనెను. ఆ మునియు “రాజా! వినుము; పుణ్య కర్మాచరణమున పాప మోచనము కోరువారికి ప్రయాగ గమనము శ్రేష్ఠమయినది” అని పలికెను.

యుధిష్ఠిరుడు మార్కండేయునితో, భగవన్! ప్రయాగ యాత్ర ఎట్లు చేయవలెను? అచట మరణించినచో కలుగు ఫలము ఏమి? స్నానముచే కలుగు ఫలమెట్టిది? అచట నివసించువారికి కలుగు పుణ్యమేమి? ఈ విషయమున దేవ ముఖ్యుడగు బ్రహ్మ ఏమని చెప్పెనని పురా కల్పము నందు చెప్పబడినది? తెలుపుము అని ప్రశ్నించెను.

ధర్మజుని ఆ మాటలకు మార్కండేయుడు, నాయనా! ప్రయాగ క్షేత్రమువలన కలుగు ఫలమేమో దాని శ్రేష్ఠత ఏమో అదంతయు పూర్వము బ్రాహ్మణులు చెప్పుకొనుచుండ నేను వినిన దానిని తెలిపెద; వినుము. ప్రయాగ (పుర)ము-ప్రతిష్ఠాన నగరము (ఇది నేటి పైథాను మాత్రమేకాదు; నేటి అలహాబాదు స్థానమున నొక ప్రతిష్ఠాన నగరముండెడిది. అది ఒకప్పుడు- దుష్యంతాదుల కాలమున పూరు వంశీయుల రాజధానిగా నుండెను.) వాసుకి హ్రదపురము - కంబలాశ్వతరులను నాగుల స్థానములు-బహుమూలకుడను నాగుని స్థానము అను ఈనాలుగు అవధుల లోపలనున్నది ప్రజాపతి క్షేత్రము అని లోకత్రయ ప్రసిద్ధము; అచట స్నానము చేసినచో స్వర్గ ప్రాప్తి; అట మరణించినవారికి పునర్జన్మము లేదు; అందుననే బ్రహ్మాది దేవతలు అందరును కూడి దీనిని రక్షించుచుందురు. ఇంకను ఇచట గల బహుతీర్థముల సంఖ్య ఇంతయని వందల ఏండ్లకును చెప్పనలవికాదు. ఐనను ప్రయాగ క్షేత్ర కీర్తనమును సంక్షేపమున చేయుదును. అచటి గంగను ఆరువేల ధనువులు (అంతమంది ధానుష్కలు) రక్షించుచుందురు యమునను సప్తాశ్వుడగు రవి కాపాడుచుండును. ప్రయాగమును ఇంద్రుడు విశేషించి రక్షించుచుండును. ఈ ప్రయాగ మండలము నంతటిని హరి సకల దేవసహాయుడై రక్షించుచుండును. అచటి వటవృక్షమును శూలపాణియగు మహేశ్వరుడు రక్షించును; సర్వపాపహరమగు ఆ పుణ్య స్థానమును దేవతలు రక్షింతురు. లోకమునందలి మానవుడు అధర్మావృతుడైనంతవరకును అచటికి పోజాలడు; అల్పాల్పమగు పాపమున్న వానికి మాత్రము ప్రయాగను తలంచినంతనే అదియు నశించును; ఆ తీర్థమును దర్శించినను పేర్కొన్నను అచటి మృత్తికను స్పృశించినను నరుడు పాపముక్తుడగును.

రాజా! అచట పంచకుండములు (తీర్థములు) కలవు. వానిలోనిదే జాహ్నవి (గంగ) యును; ప్రయాగములో ప్రవేశించిన తత్ క్షణమే పాపనాశమగును; యోజన సహస్రముల నుండి యైనను ఆమెను స్మరించినంతనే ఎట్టి దుష్కృత కర్ముడును పాపముక్తుడై పరమగతి నందును. దర్శించినంతనే శుభములు పొందును. స్నానమాడినను ఆ నీటిని త్రావినను ఏడు తరములవారిని పవిత్రుల నొనరించిన వాడగును. ఇక సత్యవాదియు జితక్రోధుడును అహింసకుడును ధర్మాను సారియు తత్త్వజ్ఞుడును గోబ్రాహ్మణ హితరతుడును అగు సజ్జనుడు గంగా యమునా మధ్యమున స్నానమాడినంత పాపముక్తుడగును; మనసా నిరంతరము దానినే ధ్యానించుచుండువాడు సుపుష్కలమగు కామములన్నియు నెరవేరును.

అందువలన సర్వదేవాభిరక్షితమగు ప్రయాగమున కేగి బ్రహ్మచర్యముతో మాసముండి పితృదేవతలకు దేవతలకు తర్పణ మీయవలెను. తత్పుణ్యమున అత డెచట జన్మించినను సర్వకామపూర్తి నందును.

రవి పుత్రిగా త్రిలోక విశ్రుతయగు మహాభాగ యమున అచట గంగతో కలియును. అచట సాక్షాన్మహేశ్వరుడు సదా సన్నిహితుడు; ప్రయాగ క్షేత్రోపాసనమున మానవులకు దుష్ప్రాప్యమగు పుణ్యము లభించును. ఏలయన దేవదానవ గంధర్వ సిద్ధ చారణులును ఋషులును ఆ క్షేత్రమున ఆచమించినంతమాత్రముననే స్వర్గ సుఖములను అందగలుగుచున్నారు.