మత్స్య మహా పురాణము
యయాతికి యౌవనప్రాప్తి
శౌనకుడు శకానీకునకు ఇంకను ఇట్లు చెప్పెను, రాజర్షియగు యయాతి (తన కుమారుడగు) పూరుని సమాధానము విని (లోగడ శుక్రుడు చెప్పియున్నట్లు) మహావేదవ్రత సంపన్నుడగు కావ్యుని-శుక్రుని-స్మరించి మహాత్ముడగు (మహా మనస్కుడగు) పూరునియందు తన ముసలి తనమును వ్యాపింపజేసెను. పూరుని యౌవనముతో తాను తన యోగ్యతకు తగినట్లును తన కామమును ఉత్సాహమును ప్రీతిని సుఖమును అనుసరించియు ధర్మమునకు అవిరుద్ధముగా తనకు ప్రియములగు విషయసుఖములను అనుభవించి ప్రీతియుక్తుడయ్యెను. దేవతలను వారికి అర్హములగు యజ్ఞములతోను పితరులను శ్రాద్ధములతోను దీనులను అనుగ్రహములతోను ద్విజసత్తములను వారికిష్టములగు కోరికలను తీర్చుటతోను అతిథులను అన్నపాన ములతోను వైశ్యులను వాణిజ్యము కనిపెట్టి చూచుటతోను శూద్రులను కరుణా భావనముతోను దొంగలను దోపిడిగాండ్రను నిగ్రహణము (దండించుట)తోను ప్రజలను అందరను ధర్మముతోను ఎవరికి తగినట్లు వారిని అనురంజింప (తృప్తినంద) జేయుచు సాక్షాత్ రెండవ ఇంద్రుడువలె యయాతి పాలించుచుండెను. ఆరాజు సింహమువలె విక్రమము చూపుచు యువకుడై విషయ సుఖములు ననుభవించుచునే ధర్మమునకు అవిరుద్ధముగా ఉత్తమమగు సుఖమును అనుభవించెను. ఆయయాతి రాజు సుఖముగా ఆయాకోరికలను అనుభవించితృప్తిపొందెను. పొందుటతో పాటే వాటి విషయమున భేదముకూడ పొందెను. ఇంతలో వేయి ఏండ్లు గడచెను. అతడది కూడ జ్ఞాపకము చేసికొనెను. అతడు కాలమును కాలతత్త్వమును ఎరిగినవాడు కావునను వీర్యవంతుడై నను కాలము ఎప్పుడెప్పుడు ముగియునా అని ఎదురు చూచుచున్నవాడు కావునను తాననిన వేయిఏండ్ల కాలము ముగిసెనని గుర్తించి పుత్రుడగు పూరునితో ఇట్లుపలికెను: “కామము కామములను అనుభవించుటచేవిన్నటికిని ఉపశమించదు. హవిస్సుతో అగ్నివలె ఇంకను పెరుగుచునే యుండును. పుడమి మొత్తముపై గల మరియు యవలును బంగారును పశువులును స్త్రీలును అన్నియు కలిసినను ఒక్కనికి కూడ చాలవు. కావున తృష్ణను విడువవలెను. అన్ని విధములగు శత్రువులను అణచిన వాడా! నేను నాసుఖమునకు కామమునకు ఉత్సాహమునకు తగినట్లు నేను నీ యౌవనముతో విషయ సుఖముల ననుభవించితిని. ఇందు నీ యోగ్యత నాకు ఇంత ప్రీతి కలిగించినది. ఇదిగో! నీ యౌవనము తీసికొనుము. ఇదిగో! రాజ్యము కూడ తీసికొనుము. ఏలయన నాకు ప్రీతి కలిగించు పుత్రుడవు నీవు. “ఇట్లు పలుకుచునే యయాతి తన వార్ధకమును తీసికొనెను. పూరునకు తన యౌవనము మరల లభించెను.
పూరుడు కడసారి కుమారుడే యైనను యయాతి అతనికే తన రాజ్యము నీయదలచెను. అది తెలిసి బ్రాహ్మణులు మొదలగు ఆయా వర్ణములవారు ఈవిధముగా పలికిరి: “ప్రభూ! శుక్రునికి దౌహిత్రుడును దేవయానికి కుమారుడును కొడుకులలో పెద్దవాడును అగు యదుని విడిచి రాజ్యమును పూరున కిచ్చుచున్నావు. ఇది ఎట్లు? క్రమముచే యదువు మొదటివాడు. తుర్వసుడు రెండవవాడు. శర్మిష్ఠ కుమారులలో ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అనువారు క్రమముగా కుమారులు. పెద్దవానిని విడిచి కడసారి వాడు రాజ్యమునకు ఎట్లు అర్హుడగును? ఇది నీకు తెలియజేయుచు హెచ్చరించుచున్నాము. నీవు ధర్మమును అనుపాలనము చేయుట మంచిది.”
యయాతి, “బ్రాహ్మణులు మొదలగు సర్వవర్ణములవారు అందరును నామాట వినగోరు చున్నాను. పెద్దవానికి ఏ విధముగను రాజ్యము ఈయగూడని హేతువును చెప్పెదను. యదువు నా పెద్దకొడుకు అయి ఉండియు నా నియోగమును అనుపాలించలేదు. అదియుకాక తండ్రికి ప్రతికూలుడగు పుత్రుడు పుత్రుడు కాడని విజ్ఞుల తలపు. తల్లిదండ్రుల మాట పాటించుచు వారికి హితుడు అనుకూలుడుగా ఉండు కుమారుడే పుత్రుడును, పుత్రులలో శ్రేష్ఠుడుగా తల్లిదండ్రులకు దగ్గరవాడై యుండును. యదువు, తుర్వసుడు, ద్రుహ్యుడు అనువు ఈ నలుగురును నన్ను లెక్క సేయలేదు. పూరుడు మాత్రము నామాటను అధికమగు ఆదరముతో పాటించినాడు. నా జరను తాను మోసికొనిన పూరుడే చిన్నవాడైనను నా ఆస్తిని అనుభవించుటకు అధికారి. పుత్రులలో మేటియై అతడే నా కోరికను తీర్చినాడు. అదికాక కవి మునికి కుమారుడు అగు ఉశనసుడు (శుక్రుడు) స్వయముగా “నిన్ను అనువర్తించు కుమారుడే నీతరువాత రాజు కాదగినవాడు” అని వరమును ఇచ్చియున్నాడు. కావున పూరుని రాజ్యమునందు అభిషేకము చేయుటకు మీకభ్యంతరము లేదను విషయము స్పష్టముగా చెప్పగోరుచున్నాను.” ప్రకృతులు (పౌరులు జానపదులు అగు ప్రజాజనము): “గుణ సంపన్నుడు మాతాపితరులకు ఎల్లప్పుడు మేలు సేయువాడు అగు కొడుకే ప్రతియొక విధమునను శుభమును పొంద అర్హుడు. కడగొట్టు వాడైనను అతడే ప్రభువు. నీకు ప్రియము నాచరించి నీ ప్రీతికి పాత్రుడైనందున పూరుడే ఈరాజ్యమునకు అర్హుడు. ఈ విషయమున శుక్రుని వరదానము కూడ ఇట్లే యుండుటచేత మరేమియు పైమాట మేము చెప్పు అవకాశము లేదు.”
పౌరులును జానపదులును నగు ప్రజాజనము సంతుష్టులై ఇట్లు పలుకగానే యయాతి పూరుని తన రాజపదము నందు అభిషేకించెను. అతనికి తన రాజ్యమును అప్పగించెను. వన వాసమునకై దీక్ష తీసికొనెను. బ్రాహ్మణులును తాపసులును వెంటరాగా పురమును వెలువడి వనమునకు పోయెను.
యదుని సంతతివారు యాదవులును తుర్వసుని సంతతివారు యవనులును ద్రుహ్యుని సంతతివారు భోజ జాతీయులును అనుసంతతివారు మ్లేచ్ఛ జాతులవారునునైరి. పూరుని సంతతి వారు పౌరవులని ప్రసిద్ధినొందిరి. ఈ వంశమునందే నీవు (శతానీకుడు) జనించి వేయి ఏండ్ల పాటు రాజ్యము నేలువాడవయినావు.