మత్స్య మహా పురాణము
భృగు గోత్ర ప్రవర వర్ణనము
సూతుడు ఋషులతో ఇట్లు చెప్పెను. రాజేంద్రుడగు వైవస్వత మనువు ఓంకారాభి వర్ణపమును విని అనంతరము జలార్ణవమునందు మత్స్య రూపమున నున్న దేవేశుడగు నారాయణుని ఇట్లు వేడెను: ప్రభూ! ఋషుల నామములను నామములను బట్టి ఏర్పడిన గోత్ర ములను ఏయే వంశములవారు ఏగోత్రమున జనించిరో ఎరుగు విధమును గోత్ర నామములతో సంబద్ధములయి యున్న ప్రవరముల సమానత్వాం సమానత్వములను (ఇవి వివాహాది కార్యముల విషయమున సగోత్రత్వమును నిర్ణయించుటకును గోత్ర భేదముల గుర్తించుటకును ఉపకరించును కావున) నాకు సవిస్తరముగా తెలుపవేడెదను. స్వాయంభువ మన్వంతరమున మహాదేవుడు (శివుడు) ఋషులను శపించెనుకదా! వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత మరల వారు పుట్టిన విధమును దక్షపుత్రికల సంతతులను వారినుండి వర్ధిల్లిన ఋషి వంశములను భృగు వంశ ప్రవర్తకులను నాకు తెలుపవేడెదను.
ఇట్లడిగిన వైవస్వత మనువునకు మత్స్యరూప జనార్దనుడు ఇట్లు చెప్ప నారంభించెను. పూర్వము స్వాయంభువ మన్వంతరమున పరమేష్ఠి (పరమాకాశమునందు-ఉత్తమ స్థానము నందు–ఉండువాడు) అగు బ్రహ్మ అనుష్ఠించు యజ్ఞము వితతమయి (యజ్ఞ పరికర ప్రసారణము చేయబడి) ఉండగా మహాదేవుడిచ్చిన శాపముచే ఋషులు స్వయముగా దేహ త్యాగము చేసిరి. తరువాతవారు వైవస్వత మన్వంతరము వచ్చిన తరువాత యాదృచ్ఛికముగా స్కన్నమయిన (పట్టు తప్పి జారిపడిన) బ్రహ్మదేవుని శుక్రమునుండి సముద్భవించిరి. అది ఎట్లన -దేవమాతలను దేవపత్నులను చూచిన తరి బ్రహ్మదేవుని శుక్రము స్థలితమయ్యెను. (ఇది లోకములో జరుగునట్టిది కాదు. బ్రహ్మ యనగానేమి-దేవమాతలు-దేవపత్నులు అను వారెవ్వరు అను విషయములను ప్రతీక రూపముగా శాస్త్రీయార్థమును గ్రహించినపుడే ఈవిషయము తెలియును. ) దానిని బ్రహ్మ హోమము చేసెను. అంతట అగ్నినుండి (ఈ వైవస్వత మన్వంతరపు) ఋషులు జనించిరి. వారిలో మొదట భృగు మహర్షి జనించెను. అతడు మహాతేజస్కుడును- తపోనిధియును, (ముందు చెప్పబోవు ఋషుల ఉత్పత్తినిబట్టి చూడగా భృగుడు సమగ్రమగు హోమాగ్ని నుండియే జనించెనని చెప్పవలయును.) నిప్పు కణికల నుండి అంగిరుడును అర్చిస్సుల (జ్వాలల) నుండి అత్రియు మరీచుల (తేజః కిరణముల) నుండి మహా తపస్కుడగు మరీచియు కేశముల నుండి కపిశ (కశ్యప?) పులస్త్యులును ప్రలంబములగు (పొడవుగ వ్రేలాడుచున్న) కేశముల (కొనల) నుండి పులహుడును వసు (అగ్ని తేజో) మధ్యము నుండి వసిష్ఠుడును జనించిరి. వీరు అందరును తపోధనులు. వీరిలో భృగువు పులోముడను రాక్షసుని కూతురైన (దివ్యత్వము నందిన) పౌలోమిని పెండ్లాడెను. ఆమెయందు ఇతనికి యాజ్ఞికులు (యజ్ఞ ప్రవర్తకులు) అగుపండ్రెండు మంది కుమారులు కలిగిరి. వారు 1. భువనుడు; 2. భౌవనుడు; 3. వసుజన్యుడు; 4. సుజనుడు; 5. శుచి; 6. క్రతువు; 7. మూర్ధన్; 8. యాజ్యుడు; 9. వసుధుడు; 10. ప్రభవుడు; 11. అవ్యయుడు; 12. దక్షుడు. ఈపండ్రెండు మందియు దేవులు (దేవతలలోని వారు) గానే గణింప బడుచు భృగువులని ప్రసిద్ధులైరి. భృగువు పౌలోమియందు ఉత్పన్నుల నొనర్చిన చిన్న కుమారులు మరికొందరు గలరు. వారు 1. చ్యవనుడు; 2. ఆప్నువానుడు (అను బ్రాహ్మణులు), ఆప్నువానుని కుమారుడు ఔర్వుడు, అతని కుమారుడు జమదగ్ని,
మహాత్ములగు ఈ భృగు వంశము వారిలో ఔర్వుడు గోత్ర ప్రతిష్టాపరుడు; దీప్త తేజస్సు డగు భృగునికి చెందిన గోత్ర ప్రవర్తక ఋషులను పేర్కొందును; భృగువు చ్యవనుడు ఆప్నువానుడు ఔర్వుడు జమదగ్ని వాత్స్యుడు దండిన్ నడాయనుడు వైగాయనుడు వీతి(త) హవ్యుడు పైలుడు, శౌనకుడు, శౌనకాయనుడు జీవంతి ఆవేదుడు కార్షణి (పార్షకుడు) వైహీ(హా) నరి విరూపాక్షుడు రౌహిత్యాయని వైశ్వానది నీలుడు లుబ్ధుడు సావర్ణికుడు విష్ణువు పౌనుడు బాలాకి ఐలికుడు అనంతభాగినుడు మృగుడు (భృత) మార్గే (భార్గే)యుడు మార్కండుడు జవినుడు (వీ) నీతినుడు మండుడు మాండవ్యుడు మాండూకుడు ఫేనపుడు సనితుడు (సురతి) స్థల పిండుడు శిఖావర్ణుడు శార్కరాక్షి జాలధి సౌధికుడు క్షుభ్యుడు కుత్సన్యుడు మౌద్గలాయనుడు మర్కా (కర్మా) యనుడు దేవపతి పాండురోచి గాలవుడు సాంకృత్యుడు చాతకి సార్పి యజ్ఞపిండాయనుడు గార్ద్యాయనుడు గాయనుడు గార్హాయనుడు గోపాయనుడు వాత్స్యాయనుడు వైశంపాయనుడు వైకర్ణిని శాంకరవుడు యాజ్ఞేయి భ్రాష్ట్రకాయని లలాటినాకుని లౌక్షిణ్యుడు పరికుండలుడు అలుకి సాచకి కౌత్సుడు పైంగలాయనుడు సత్యాయని మాలాయని కౌటిలి కౌచహస్తికుడు సౌహసోక్తి కావాక్షి కౌసి చాంద్రమని నైకజిహ్వుడు జిహ్మకుడు వ్యధాద్యుడు లోహవైరిణుడు శారద్వతికుడు నేతిష్యుడు లోలాక్షి చలకుండలుడు వాగాయని అనుమతి పౌర్ణిమాగతికుడు అనకృత్-అనువారు వీరు, ఈ ఋషుల (గోత్రములవారి కందరకును సమాన రూపమున - భృగువు - చ్యవనుడు-అప్ను వానుడు ఔర్వుడు జమదగ్ని - అను ఐదుగురును ప్రవర ఋషులు; అనగా పైచెప్పిన గోత్రముల వారు పంచార్షేయ ప్రవరాన్వితులు; సమాన ప్రవరాన్వితులగు ఈ ఋషు (లగోత్రముల వార)లు పరస్పరము ఇచ్చి పుచ్చుకొనుచు వివాహ సంబంధములు జరుపుకొనరాదు.
ఈ మత్స్య పురాణానుసారము భృగు వంశోత్పన్నుల గోత్రములు ఆరు వర్గములుగా విభక్తములగును. ఈ చెప్పిన వారందరును మొదటి వర్గమువారు.
రెండవ వర్గము వారు: ఇకమీదట మరికొందరను భృగువంశ శ్రేష్ఠులను తెలిపెదను, జమదగ్ని, భృగువు, పౌలస్త్యుడు, బైజభృత్, ఋషి, ఉభయజాతుడు కాయని శాకటాయనుడు - వీరు 8 మంది ఔర్వుని సంతతివారును మరుత్ సంతతివారును; వీరికందర కును భృగువు, చ్యవనుడు, అప్నువానుడు - ఈ మువ్వురును ప్రవర ఋషులు; ఈ ఋషుల గోత్రములవార)లు పరస్పరము ఇచ్చిపుచ్చుకొను వివాహ సంబంధములు చేసికొనరాదు.
మూడవ వర్గమువారు: భృగుదాసుడు, మార్గపథుడు, గ్రామ్యాయని, వటాయని ఆపస్తం బుడు, భల్లి, నైకశి, కపి, ఆర్టిషేణుడు, బిందుభి, కార్డమాయని, ఆశ్వాయని, రూపి అను పదుముగ్గురును పంచార్షేయులు. భృగువు, చ్యవనుడు, అప్నువానుడు, అర్జిషేణుడు, రూపి- ఈ ఐదుగురును ఈ ఋషుల గోత్రముల వార)ల ప్రవర ఋషులు; వీరికి పరస్పర వివాహ సంబంధము కూడదు.
నాలుగవ వర్గమువారు: (16 మంది) యస్కుడు (వీతహవ్యుడు), మయితుడు, దముడు, జైవంత్యాయని, మౌంజ్ఞు, పిలి, బలి, భాగిళుడు, భాగవిత్తి, కౌశాపి, కాశ్యపి, బాలపి, శ్రమదాగోపి, సౌరుడు, తిథి, గ్రామదుడు అను ఈ ఋషుల (గోత్రముల వారల)కు భృగువు వీతహవ్యుడు వేతను డను వారు ప్రవరఋషులు. ఈగోత్రములవారు పరస్పర వివాహ సంబంధము చేసికొనరాదు.
ఐదవ వర్గము వారు: శాలాయని శాకటాక్షుడు మైత్రేయుడు ఖాండవుడు ద్రౌణాయనుడు రౌక్మాయనుడు అ పిశలి అపికాయని హంసజిహ్వుడు-అను ఈ ఋషు(ల గోత్రముల వార)లకు భృగువు, వక్త్ర్యశ్వుడు, దివోదాసుడు, అర్జీషేణుడు రూపి అను ఐదుగురును ప్రవర ఋషులు: వీరు పరస్పర వివాహ సంబంధములు చేసికొనరాదు.
ఆరవ వర్గమువారు: ఏకాయనుడు, యాజ్ఞపతి, మత్స్యగంధుడు, ప్రత్యూహుడు, సౌరి ఔక్షి, కార్ధమాయని, గృత్సమదుడు, సనకుడు అను ఋషుల గోత్రముల వారలకు భృగువు గృత్సమదుడు ప్రవర ఋషులు; వీరు పరస్పర వివాహములు జరుపుకొనరాదు. ఈ చెప్పిన గోత్రకారులగు భృగు వంశ జాతుల నామములను కీర్తించినంత మాత్రమున నరుడు సకల పాపవిముక్తుడగును.