మత్స్య మహా పురాణము
తారకాసుర వధ
ఋషులు సూతుని ఇట్లడిగిరి, సూతకుమారా! తారకాసుర వధము ఎప్పుడు జరిగెను? ఈ మహావిషయమును మత్స్యరూపుడగు నారాయణుడు తెలిపిన విధమున మాకు నీవు తెలు పుము. నీనోరు క్షీరసాగరము. దానినుండి వెలువడు ఈకథ అమృత రూపమయినది. మీరు చెప్పుచున్న కథలు ఎంత వినుచున్నను తృప్తి కలుగుటలేదు. మహా బుద్ధిశాలియగు సూతమునీ! మా మనోగతమగు కుతూహలము తీర్చుము.
అనగా సూతుడు ఋషులతో ఇట్లు పలికెను, మనువు మత్స్యరూపుడగు నారా యణుని ‘సర్వజగద్వ్యాపియు సర్వ సమర్థుడును (విభుః) అగు షణ్ముఖుడు (కుమారస్వామి) శరవణమున (ఱెల్లు గుబురులలో) ఎట్లు జన్మించెను?’ అని అడిగెను. అమితమగు ఓజస్సు (చిత్త దృఢత్వము)కల మను రాజడిగిన ప్రశ్నవిని (సర్వ వేదమూర్తియగు బ్రహ్మ దేవునికి తండ్రియగు నారాయణుడు ప్రీతుడై తాను చెప్పినదాని తత్త్వమెరుగగల మహామతియగు మనువుతో ఇట్లు పలికెను:
పూర్వము వజ్రాంగుడను అసురుడుండెను. అతని కుమారుడు తారకుడు. ఆ మహాబలుడు దేవతలను వారివారి పురములనుండి వెడలగొట్టెను. వారు భయ నిపీడి తులయి బ్రహ్మ కడకు పోయిరి. భీతులగు దేవతలనుచూచి బ్రహ్మ వారితో ఇట్లనెను: దేవతలారా! భయము విడువుడు. శంకరునకు ఆత్మజుడును హిమవంతునకు దౌహిత్రుడునునగు శిశువు ఆ దానవుని చంపును అనెను.
తరువాత కొంత కాలమునకు శివుడు శైలరాజసుతను వివాహమాడెను. అతడు కారణాంత రమున తన వీర్యమును అగ్ని నోటియందు వదలెను. అగ్ని తన నోటపడిన ఆ రేతస్సు దేవ తలకు అర్పించెను. వారది మ్రింగగా అది వారి ఉదరము లందు జీర్ణము కాక వారి పొట్టలు చీల్చివచ్చి రెల్లు దుబ్బుల నడుమ పడెను. దానినుండి రవి తేజస్కుడగు గుహుడు అనగా కుమార స్వామి జనించెను. ఏడు దినముల బాలుడుగా ఉండియే అతడు తారకాసుని చంపెను.
అనగా సూతుని వచనమును విని ఋషులు ఇల్లు అనిరి, ఈ కథ మిగుల ఆశ్చర్యకరమును రమ్యమును అగుటతో పాటు పాపనాశిని అని తోచుచున్నది. నీవు ఉన్నది ఉన్నట్లు మాకు సవిస్తరముగ వినిపింపుము. పూర్వమందుండిన వజ్రాంగుడను దైత్యేంద్రు డెవరి వంశమందు ఉద్భవించెను? దేవతలను నలుగ గొట్టిన వాడును బలశాలియునగు తారకుడు అతని కుమారు డయ్యెననిన ఆ వజ్రాంగు డెంతటివాడో! ఇట్టి దైత్యేశ్వ రుని వధించు వాడెవడయ్యెను? మహ నీయా! స్కంధుని జన్మమును మాకు సమగ్రముగా వినిపింపుము.
అనగా విని సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను, బ్రహ్మమానస పుత్ర్తుడగు దక్షుడను ప్రజాపతికి వైరిణియను పత్నియందు అరువదిమంది కుమార్తెలు కలిగిరి. అతడు వారిలో పదిమందిని ధర్మునకును పదుముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడుమందిని సోమునకును నలుగురను అరిష్టనేమికిని ఇద్దరను భృగుపుత్రునకును ఇద్దరను అంగిరసునకును, ఇద్దరను కృశాశ్వునకును ఇచ్చెను. అదితి, దితి, దనువు, విశ్వా, అరిష్టా- సురసా, సురభి, వినతా, తామ్రా, క్రోధవశా, ఇరాకద్రూముని అను ఈ పదుముగ్గురును కశ్యపుని పత్నులు; వీరు లోకమాతలు అని ప్రసిద్దలు. గో(పశు) జాతియు స్థావర జంగమాత్మకమగు ఇతర ప్రాణి సమూహమును ఇతరములగు నానా ప్రకారములగు ప్రాణులును ఈ పదుముగ్గుర నుండియే జనించెను. దేవేంద్రుడు, ఉపేంద్రుడు (వామన విష్ణువు) పూష (మొదలగు ఆదిత్యులు) మొదలగు వారికి అందరకును అదితి తల్లి యయ్యెను. దితి వలన హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు జన్మించిరి. దనువు అనునామె గర్భమున దానవులు జన్మించిరి. సురభి అనునామెకు గోవులు జన్మించెను. వినతకు గరుడుడు మొదలగు పక్షులు కలిగెను. కద్రువకు నాగులు కలిగెను. మిగిలిన కశ్యప పత్నులకు మిగిలిన ప్రాణులు జనించెను.
మహాబలుడగు హిరణ్యకశిపుడు త్రైలోక్యనాథుడగు ఇంద్రుని గెలిచి ఆరాజ్యమును తానే ఏలసాగెను. తరువాతకొంతకాలమునకు హిరణ్యకశిపుడు మొదలగువారు విష్ణుని చేతిలోను మిగిలిన దైత్యదానవులు ఇంద్రుని చేతిలోను మరణించిరి. తరువాత హతపుత్రయగు దితి తన భర్తయు దేవుడు అగు కశ్యపుని మహాబలుడును శక్రుని చంపువాడును అగు మరియొక కుమారుని వరముగా నిమ్మనెను. సర్వసమర్థుడగు ఆ కశ్యపు డామెతో ఇట్లనెను:
దేవీ! వేయేండ్లు శుచి మనస్కవై నియమముతో ఉండుము. కుమారుని పొందుదువు. అనగా ఆమె అట్లేచేయ ఆరంభించెను. ఆకాలమున ఇంద్రుడు సమాహితచిత్తుడై ఆమెను సేవింప సాగెను. ఆమెయు ఆసేవ అంగీకరించెను. వేయిటికి పదిఏండ్లు కొరతఉండగా తపస్సు నందున్న దితి మిగుల ప్రీతురాలయి వరమును ఈయదలచి ఇంద్రునితో ఇట్లు పలికెను: పాకశాసనా! నావ్రతము దాదాపు ముగిసినదని ఎరుగుము. నీకు భ్రాత కలుగును. అతనితో కలిసి వత్సా! త్రైలోక్యమును నిష్కంటకముగా యథేచ్ఛగా అనుభవించుము.
ఇట్లు పలికి ఇన్నాళ్ళు నియమములతో ఉండిన దితి కానున్న విషయము బలవత్తర మగుటచే (కాబోలు) నిద్రావేశమున తనజుట్టు ముడివీడి వెంట్రుకలపై తన కాళ్ళు పడి తగులు చున్నను ఎరుగక గాఢ నిద్ర పోయెను. ఈ అశుచిత్వపు అవకాశము దొరుకగనే ఇంద్రుడు వేగముగా మాయతో వజ్రముతో దితిగర్భమును ప్రవేశించి గర్భమును ఏడుగా చేసెను. అతడు కోపము కొలది వాటిలో ఒక్కొక్క దానిని మరల ఏడేసి ముక్కలు చేసెను.
అంతలో దితికి మెలకువ వచ్చి ‘ఇంద్రా! నా సంతానమును చంపవలదు’ అనెను. అది విని ఇంద్రుడు బయటకు వచ్చి ప్రాంజలియై ఎదుట నిలిచి భయపడుచు తల్లితో మెల్లగా ఈ వాక్యమును పలికెను, తల్లీ! నీవు కేశములను పాదాలతో ఆక్రమించి పగలు నిద్రించుచుంటివి. (రెండు దోషములు) ఈ అవకాశముతో నేను నీగర్భమును ఈ వజ్రముతో ఏడుపడులు నలువది తొమ్మిది ముక్కలుగా చేసితిని. వారు శుభులు. దేవతా పూజితమగు ద్యులోకమున వారికి స్థాన ముల నిచ్చెదను. ఇంద్రుడిట్లు పలుకగా దితి ఏమియు మారుపలుకలేదు. ఆమె మరల దేవుడగు తన భర్తతో దుఃఖముతో ఇట్లు పలికెను. ప్రజాపతీ! ఇంద్రుని జయించగలవాడు స్వర్గవాసుల శస్త్రాస్త్రముల కవధ్యుడు. బలశాలియగు కుమారు (నింకొకని) నిమ్ము. అదివిని అతి దుఃఖితయగు పత్నితో అతడిట్లనెను: పుత్రవత్సలా! నీవు పదివేలయేండ్లు నిష్ఠాపరురాల వయినచో అట్టి పుత్రుని పొందెదవు. వజ్రసారమయములగు దృఢావయవములతో వజ్రాంగుడను పుత్రుడు నీకు కలుగును. వరము పొంది ఆ దేవి తపమునకై వనమునకు పోయెను. పదివేలయేండ్లు ఘోర తపము ఆచరించెను. అది ముగిసిన పిమ్మట ఆ భగవతికి దుర్జయుడును ఎవరికి ఏమి చేయుటకు అలవికాని వాడు, వజ్రముతో ఛేదింప శక్యము కానివాడు అజేయుడునగు కుమారుడు కలిగెను. అతడు పుట్టినంతనే సర్వశస్త్రాస్త్ర పారంగతుడయ్యెను. వాడు భక్తితో తల్లితో తల్లీ! నీకై ఏమి చేయుదుననెను. దితి హర్షముతో ఆ దైత్యాధిపతితో ఇట్లనెను: సహస్రాక్షుడైన ఇంద్రుని వర్చస్సుతో నా బహుపుత్రులు హతులయిరి. నీవు దానికి ప్రతీకారముగా పోయి ఇంద్రుని చంపిరమ్ము. అనగా సరేయని ఆమెతో పలికి ఆ బలశాలి స్వర్గమునకు పోయెను. అమోఘ శక్తిగల పాశముతో ఇంద్రుని వ్యాధుడు క్షుద్రమృగమునువలె బంధించి తల్లికడకు తెచ్చెను. ఇంతలో ఆ తల్లి కొడుకులు ఉన్న చోటికి బ్రహ్మయు, మహాతపస్వి కశ్యపుడును వచ్చిరి. వారిద్దరును అతనితో ‘నాయనా! వీనితో ప్రయోజనమేమున్నది! ఈదేవేంద్రుని విడువుము. లోకమున సంభావితుడగు వానికి అవమానము వధ వంటిది. చెడుమాట అనిపించుకొని శత్రువు నుండి విడిపించుకొనిన వాడు చచ్చినవాడే; మహాయుద్ధమున శత్రుని చేజిక్కివాని నుండి ఆదరముతో విడువబడినవాడు దినదిన క్రమమున జీవన్మృతుడగుచుండును. తనకంటె గొప్పవారగు శత్రువులకు వశీభూతుడైన శత్రువు విషయమున శత్రుత్వమింకేమున్నది? అనిన బ్రహ్మకశ్యపుల మాటవిని వినతుడై వజ్రాంగుడు ఇట్లనెను, నాకు వీనితో పనిలేదు. తల్లి ఆన నెరవేర్చితిని అంతే. నీవు సురాసురనాథుడవు. నాకు ప్రపితా మహుడవు; దేవా! నేను నీమాట పాటింతును. ఇదిగో! ఇంద్రుని వదలుచున్నాను. నాకు తపస్సునందాసక్తి కలదు. నాకు అందు నిర్విఘ్నత కావలయును. భగవన్! ఇదియే నేను కోరు నీఅను గ్రహము. అనగా బ్రహ్మ ఇట్లనెను, క్రూరత్వమును పొందియు నీవు నా శాసనమందు నిలిచితివి కావున నీ జన్మము ఈ చిత్తశుద్దిచే సఫలమయినది. అని బ్రహ్మ మనోహర విశాల లోచనయగు ఒక కన్యను సృజించి ఆమె అతనికి భార్యగా ఇచ్చెను.
ఆమె పేరు వరాంగి అని పలికి పద్మ సంభవుడైన ఆ బ్రహ్మ వెడలిపోయెను. వజ్రాంగుడును ఆమెతో తపమునకై వనమేగెను. కమలపత్రాకుడగు ఆ దైత్యేంద్రుడు ఎనిమిదివేలేండ్లు శుద్ధబుద్ధియై మహాతపమాచరించెను. మరి అంతకాలము తలవంచియు, మరియు అంతకాలము పంచాగ్ని మధ్యగుడయ్యు నిరాహారుడై ఘోర తపస్సాచరించి తపోరాశియయ్యెను. పిమ్మట వేయేండ్లు వాడు నీటిలోపలనుండి తపమాచరించెను. అతడు నీట ప్రవేశించగనే అతని పత్నియు మహా వ్రతయై ఆ సరస్సు తీరమున మౌనము అవలంబించి నిరాహారయు మహాతేజోవంతురాలునై ఘోర తపమాచరించెను. ఆమె తపమందున్న కాలమున ఇంద్రుడు ఆమెను భయపెట్టు పనులు చేసెను; అతడు కోతియై ఆ మహావనమందలి ఆమె ఆశ్రమమున పనిముట్లుగా ఉన్న సొర బుర్ర నీటికడవ బరిణలు అన్నియు చెల్లాచెదరు చేసెను. భయంకరరూపుడై మహా భయము కలిగించెను. పామయి ఆమెకాళ్ళు బంధించి చాల దూరమీడ్చుకొని పోయెను. ఆమె నా ప్రదేశ మంతయు త్రిప్పి తానును తిరిగెను. కాని తపోబలాఢ్యురాలగు ఆ వరాంగి అతనికి అవధ్యురాల య్యెను. ఇంద్రుడంతట నక్కయై ఆశ్రమమున రోతచేసెను. మేఘమయి ఆశ్రమ ప్రదేశమును తడిపెను. ఇట్లనేకములగు బెదరింపులు చూపుట ఇంద్రుడు సాగించుచునే పోయెను. ఇది అంతయు తన ఆశ్రమ స్థానమున్న పర్వతపు దుష్టత్వమని తలచి వరాంగి దానిని శపింప బూనెను. ఆమె శాపాభిముఖి యగుటచూచి కొండ మానవ రూపముదాల్చి ఆ వరారోహ (సుందర రూప)తో భయపడు చిత్తముతో నున్న వరాంగనా! నేను దుష్టుడను కాను; నేను సర్వ ప్రాణులకు ఆశ్రయమిచ్చువాడను. ఇంద్రుడు పొగరుతో ఈ చేష్టలు చేయుచున్నాడు. అనెను. అంతలో వేయిఏండ్లు ముగిసెను. బ్రహ్మ మెచ్చి హర్షముతో ఆ జలాశయమునకు వచ్చి ఆ వజ్రాంగు నితో ఇట్లనెను: ‘దితిపుత్రా! నీకన్ని కోరికలును ఇత్తును’ అనగా తపోనిధియు దైత్యేంద్రుడు అగు ఆవజ్రాంగుడు లేచి ప్రాంజలియై సర్వలోక పితామహుడగు బ్రహ్మతో నాకు అసుర స్వభావము లేకుండవలయును. అక్షయ పుణ్యలోకములు లభించ వలయును. తపస్సు నందాసక్తియు నిలువవలయును. ఈ దేహ యాత్రయు నడుచుచుండవలయును అని చెప్పెను.
అనగా బ్రహ్మ సరేయని తన లోకమున కేగెను! స్థిరములగు సంయమములతో తపస్సా చరించి ముగించిన అతనికి ఆకలివేయగా ఆహారము కావలసి తన యాశ్రమము నందు భార్యకై చూడగా ఆమె కనబడలేదు. క్షుదావిష్టుడగు అతడు నాభార్య ఎక్కడకు పోయి ఉండుననుకొనుచు పర్వతపు వనప్రదేశమున ఫలమూలములేవైన తెచ్చుకొందమని లోపలకు పోయి అచట చూచుచుండ అతనికి తనప్రియురాలు దీనురాలయి చెట్టుచాటున మొగము కప్పుకొని ఏడ్చుచు కనబడెను. ఆమెనుచూచి ఆ దైత్యేంద్రుడు ఓదార్చుచు ‘పిరికిదానా! యమలోకము పోగోరినవాడెవడు నీకపకారము చేసెను? మానినీ! నీకేమి కోరిక తీర్చవలయునో తెలుపుము’ అనెను.