సావిత్రిని పొందుట బ్రహ్మకు దోషము కాదు

ఈ చతుర్ముఖుడు సర్వవిద్యలకు అధిష్ఠాత సర్వ విద్యా రూపయగు ఈ గాయత్రి (శబ్దరూప) అతని శరీరము నుండి పుట్టినదనియు అందుచే కూతురనియు చెప్పబడుచున్నది. ఆ ఇద్దరకును మూర్తి (ఆకారము-శరీరము) ఉండుగాక-లేకుండుగాక! ఆ ఇద్దరు దంపతులే. ఇట్లు విద్యాధిష్ఠాత యగు బ్రహ్మ ఉన్నచోట విద్యారూపిణి అగు సరస్వతి భాషారూప-శబ్ద రూపకూడ ఉండనే ఉండును. భారతి ఉన్నచోట బ్రహ్మ ఉండి తీరును. సూర్యుడులేని ఛాయ ఎక్కడను ఉండనట్లు గాయత్రి (సరస్వతి)యు బ్రహ్మ సమీపమును విడిచి ఉండదు. బ్రహ్మ వేదరాశి రూపుడు. సావిత్రి ఆతనిని ఆశ్రయించి ఉండును. కనుక బ్రహ్మ సావిత్రిని పొందెను అనుటలో దోషము ఏ మాత్రమును లేదు. ఏలయన సావిత్రితో కలియనంతవరకును బ్రహ్మ అజ్ఞానముతో కూడి ఉండెను.