మత్స్య మహా పురాణము
దశాశ్వమేధాది తీర్థ మహిమాను వర్ణనము
మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను. తరువాత నరక తీర్థము, దానియందు స్నానమాడినచో నరకదర్శనమే యుండదు. పాండునందనా! ఈ తీర్థపు మాహాత్మమును తెలి పెదను వినుము. దీనియందు ఎవనివైన అస్థులనువైచినచో అవి అందు విలీనమగును. ఇందు స్నాన మాడినవాడు రూపవంతుడగును; తరువాత దర్శన మాత్రమున పాపముక్తిని కలిగించు గోతీర్థము; తరువాత కపిలాతీర్ణము; దానియందు స్నానముచే గోసహస్ర దాన ఫలము లభించును, జ్యేష్ఠ (శుక్ల) చతుర్దశి నాడచట ఉపవసించి భక్తితో కపిలా గోదాన మొనరించినచో-అదిఎట్లన నేతి దీపము వెలిగించి నేతితోనే శివునకు అభిషేకించినచో నేతితో మారేడు ఫలమాహారముగా తినిపించి (నివేదించి)నచో తరువాత శివుని కపిలగోవును కూడ ప్రదక్షిణించి ఘంటలతో ఆభ రణములతో కూడిన ఆ గోవును దానమిచ్చినచో శివతుల్య భోగముల ననుభవించును; వానికిక పునర్జన్మ ముండదు; చవితి మంగళవారమున నవమీ మంగళవారమున అమావాస్యా మంగళ వారమున అచ్చట శివునభిషేకించినచో రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడు నగును; అంత మున పుష్పక విమానముపై వేలకొలది మంది పరివారముతో శివస్థానము నందును; తన కభిమతమగు చోట్లనెల్ల రుద్రసమభోగములతో అనంతకాలము సుఖించును; ఫల భోగానంతరము కర్మ సంయోగ వశమున భూలోకమునకు వచ్చినను ఉత్తమ వంశమున రూపవంతుడును ధార్మికుడు అగు రాజగును.
తరువాత అనుత్తమము (అంతకంటె గొప్పదిలేనిది) అగు గణేశ్వర తీర్థము; శ్రావణ కృష్ణ చతుర్దశినాడు అందు స్నానమాడినంతనే రుద్రలోక ప్రాప్తుడగును; పితృ తర్పణముతో (దేవ ఋషి పితృ) ఋణత్రయ మూర్తియగును; తరువాత అనుత్తమమగు ఋషి తీర్థము; తృణ బిందుడను ద్విజ ఋషి అందు స్నానమాడి ఆ తీర్థ ప్రభావమున శాపముక్తుడయ్యెను; గంగేశ్వర మను లింగమునకు దగ్గరలో గంగావదన తీర్థము కలదు; (దాని మహిమ) తెలిసికాని తెలియక కాని (కోరికలుండికాని లేకకాని) స్నానమాడినచో ప్రాణి తన పుట్టుక మొదలు చేసిన పాపములు తొలగును; తుదకు శంకర లోక ప్రాప్తుడగును; అందు ప్రతి పర్వ సమయమందును స్నానమాడి పితృ తర్పణముచేసినచో అశ్వమేధ ఫలము లభించును, ప్రయాగతీర్థమునకు ఏఫలము కలదని మహాత్ముడగు శంకరుడు అనెనో ఈగంగా వదన సంగమతీర్థము కూడ అంత ఫలము నిచ్చును.
దీని పశ్చిమ పార్శ్వమున చాలదగ్గరలో త్రిలోక విశ్రుతమగు దశాశ్వమేధ తీర్థము గలదు; భాద్రపద అమావాస్య నాడందు స్నానమాడి ఒక అహోరాత్రముపవసించి పితృతర్పణము చేయుటచే దశాశ్వమేధ ఫల ప్రాప్తుడగును; దీనికి పశ్చిమమున భృగు తీర్థముగలదు; దీని ఉత్పత్తి ఈ విధముగా ఉన్నది. పూర్వము బ్రాహ్మణ సత్తముడగు భృగుడు సహస్ర దివ్య వర్ష కాలము ఇట ఈశ్వరుని ఉపాసించుచుండెను; అతని చుట్టును మీదను పుట్టి పెరిగి చుట్టి వేసెను; అందు పక్షులు గూండ్లు పెట్టెను; ఇది చూచి ఉమాశంకరులకు ఆశ్చర్యము కలిగెను; ఇట్లున్న ఈతడెవ్వడు; దేవుడా! దానవుడా! మహేశ్వరా! తెలుపుమని గౌరి దేవేశు నడిగెను; ఈశ్వరుడును: ప్రియా! ఇతడు భృగుడను ద్విజుశ్రేష్ఠుడు; మునియును ఋషి ప్రవరుడును; ఇతడిందు సమాధిస్థుడయి నన్ను ధ్యానించుచున్నాడు అనెను. అంతట దేవి పెద్దగ నవ్వి: “ఇతనిపై ఇతని జుట్టుకొన (అగ్నిజాల) పొగవలె (పొగతో కూడినదై) ఏర్పడినది; ఇప్పటికిని నీవతనిని మెచ్చకున్నావు; దీనిని బట్టి నీవు దురారాధ్యుడవు (సులభముగా మెప్పింపరానివాడవు), ఇందు సందియము లేదు” అనెను: శివుడది విని “దేవీ! ఇతని విషయము నీవు ఎరుగవు; ఇతడు క్రోధవేష్టితుడు; దీని యథార్థత్వము చూపి నీకు ప్రత్యక్షము చేయుదును; అనెను. అంతట మహాదేవుడు ధర్మ రూపుడగు వృషభమును స్మరించెను. దేవదేవుడు స్మరించినంతనే శీఘ్రముగా ఆ వృషభము వచ్చి ఎదుట నిలిచెను: అది మానుష వాక్కుతో ప్రభూ! ఆదేశము నిమ్మనెను: అంత ఈశ్వరుడును ఈ వల్మీకమును త్రవ్వుము; ఈ విప్రుని క్రిందకు పడవేయుము అనెను. యోగస్థుడయి ధ్యాన మందున్న భృగుని ఆ ధర్మ రూప వృషభము క్రిందపడవేసెను. తత్క్షణ మతడు క్రోధ సంతప్తుడయి చేయిఎత్తి ఇట్లు పలుకుచు దానిని శపించెను: “ఓరీ! (సీ!) ఎద్దా! ఎక్కడకు పోయెదవు: వృషభమా! నేనిపుడే నాకోపముతో నాశమొందింతును.” అంత వృషభ మతనిని ఎత్తివేయగా ఋషి అంతరిక్షమునకు ఎగిరిపోయెను. అచ్చట అతనికా వృషభ మంతరిక్ష మందున్నట్లు కనబడెను: ఇది అతనికి ఉత్తమముగ అద్భుత మనిపించెను. అంతట రుద్రుడు పెద్దగా నవ్వుచు ఋషి ఎదుట నిలిచెను. మూడవ కన్ను కనబడినంత ఋషి వెలవెల పోవుచు క్రిందపడెను. భూమిపైపడి నమస్కరించి పరమేశ్వరుని ఇట్లు స్తుతించసాగెను.