కనక కామధేను దాన విధానము

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను. భూపాలా! ఇపుడిక షోడశ మహాదాన క్రమము నందలి కనక కామధేను దాన విధానమును వినుము; ఇది పరమమయినది - మానవులకు సర్వ కామములను ఇచ్చునది - మహాపాతక నాశన మయినది; తులాపురుష దాన మందు వలెనే ఇందును కుండములు మండపము వేదికలు లోకేశ ఆవాహనము హోమము అధివాసనము జరుపవలయును; అల్ప ప్రక్రియయైనచో ఎక్కువమంది ఋత్విజులతో పనిలేక ఏకాగ్ని విధానమున ఆచార్యుడు ఒక్కడే సమాహితుడై ఆయా కార్యములు జరుపవలెను; మేలిమి బంగారుతో ఆవును దూడను చేయించవలయును, వేయి - ఐదు వందలు - రెండు వందల ఏబది - పలముల బంగారము దీనికై ఉపయోగించుట ఉత్తమ మధ్యమాధమ విధానములు; ఎంతో అశక్తుడైనచో మూడు పలములకు తక్కువ కాని ఎంత బంగారుతోనైన ఇవి చేయించవచ్చును; వేదికయందు కృష్ణాజినమును పరచి ప్రస్థపరిమాణక గుడమును దానిపైనుంచి నూతన వస్త్రము దానిపై పరచి దానిపై మహారత్నాలంకృతమగు ఆ ధేను వత్సముల నుంచవలయును, ఆ దగ్గరలో ఎనిమిది పూర్ణ కుంభములు నానా ఫలములు అష్టాదశ ధాన్యములు ఎనిమిది చెరకు గడలు ఆసనము పాత్రలు పాలుపితుకుటకు రాగిపాత్రము రెండు పట్టు వస్త్రములు దీపములు ఛత్రములు ఆభరణ ములు చామరములు కుండలములు ఘంటలు బంగరు కొమ్ముల సొమ్ములు వెండికాలి గిట్టలు సర్వ విధరసములు పసుపు -  అనేక పుష్ప ఫలములు నుంచవలయును; జీలకర్ర ధనియాలు చక్కెర (కలిపి చేసిన పొడి) ఉంచవలెను; ఐదు వన్నెల వితానకమును (మేలుకట్టును) అమర్చవలయును. తరువాత మంగళ వేదధ్వనులతో యజమానుడు స్నానమాడి అగ్న్యాధికమును బ్రాహ్మణులను ధేనువత్సములను ప్రదక్షిణించి పూవులు దోసిట పట్టుకొని దర్భపాణియై గురువు చెప్పు మంత్రములతో ధేనువు నామంత్రించి తరువాత అవి విప్రునకు ఈయవలెను.

“విశ్వేశ్వరినగు కామధేనూ! నీవు సర్వదేవ గణములకును గృహ భూతురాలవు; (నీయందు సకల దేవతలు నివసింతురు;) గంగానదికిని సముద్రములకును పర్వతములకును నీవు అంగ (శరీర) భూతురాలవు; నిన్ను దానముచేయుట ఆయుధముగానై నాపాతకరాసులు ఖండితములు కాగా అత్యంతము ఉత్తమమగు ఆనందమును పొందుచున్నాను; ఇట్టి నిన్ను నమస్కరించుచున్నాను; యథేష్ట ఫలప్రదాయినివి నీవుండగా ఈ భూలోకమునందలి ఏ మానవుడు దుఃఖములను పొందును? నీవు మా సంసార దుఃఖములను శమింపజేయుటకై మిక్కిలిగ ప్రయత్నింపుము; అట్లు ప్రయత్నింతువు; కామములను తీర్తువు; కావుననే నిన్ను దేవతలు కూడ కామధేనువు అనుచున్నారు.”

అని ఇట్లు ధేనువును ఆమంత్రించిన తరువాత యజమానుడు తాను ఆమంత్రించి (ఆహ్వానించి) తెచ్చుకొన్న గుణశీల సమన్వితుడగు విప్రునకు ఈ కనక కామధేనువును దానమీయ వలయును, దాని ఫలముగా నతడు దేవకన్యా గణములతో కూడినవాడయి ఇంద్రాది దేవతలు కూడ ఆశ్రయింపగోరు శివ స్థానమును పొంది సుఖించును.