తిలపర్వత దానము

ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను, ఇక మీదట తిలపర్వత దాన విధానమును తెలిపెదను. దీని నాచరించినవారు సర్వోత్తమమగు విష్ణులోకమును పొందుదురు. దీనికై పదికాని, ఐదుకాని, మూడుకాని ద్రోణముల తిలలుకావలెను. దీనియందు అన్ని యంశములును ధాన్య పర్వత దానమందువలెనే (దానమంత్రము) శ్రీమహావిష్ణువు మధు దానవుని వధించునపుడు ఆతని దేహమునుండి తిలలును, కుశలును, మినుములును జనించినవి. అట్టి తిలలు నాకు శాంతిని కలిగించుగాక! హవ్యకవ్య (దేవతా-పితృ దేవతా) కర్మములందు తిలలే అభిరక్షించునవి: అట్టి తిలలపర్వతమా! నన్ను సంసారము నుండి తరింపజేయుము. ఇట్లు ఆమంత్రించి (ఆ వాహనముచేసి) తిలపర్వత దానము చేయువాడు పునరావృత్తి రహితమగు విష్ణులోకమునుచేరి సుఖించును. ఇహలోకము నందును దీర్ఘాయువును పుత్త్ర పౌత్త్రులను పొందును. పితరులును, దేవతలును, గంధర్వులును పూజించుచుండ స్వర్గమున సుఖించును.