నారదుడు విశేషములు తెలుపుట

నారదుడు అనౌపమ్యకు ఇట్లు చెప్పెను. వేద పారంగతుడగు విప్రునకు తిలధేను దానము చేసినచో సముద్రవన ద్వీప సహితముగా భూమినంతను దానమిచ్చినట్లగును; దీని దాతలు తమ శాసనము అందరపై చెల్లుచుండ కోటిసూర్య సమతేజముగలిగి అన్నికోరికలను తీర్చు విమానములపయి సంచరించుచు అతిచిరకాలము ఆనందింతురు. తీయమామిడి, ఉసిరిగ, వెలగ, రేగు, కదంబము, సంపెంగ, అశోకము, పున్నాగము, పిప్పలము, అరటి, మర్రి, దానిమ్మ, పిచుమందము, ఇప్ప మొదలగు వృక్షములను ఉపవాస పూర్వకముగా దానమీయ వలయును. వెలగ దానముచే వెలగ పండ్లవంటి స్తనములు, అరటిచే అరటి కంబముల వంటి తొడలు కలుగును. దానిచే అందరి వందనము అందుకొనును. పిచుమందవృక్షముచే సుగంధి దేహము, సంపెంగచే ఆ పూవు వంటి చాయ, అశోకముచే శోకరాహిత్యము, ఇప్పచే తీయని మాటలు, మర్రిచే మృదు శరీరము, రేగుచే స్త్రీలకు సౌభాగ్యము సిద్ధించును; కుక్కుటియు కర్కటి అరగా దోసయు దానయోగ్యములే; దానవ్రత సందర్భములో కడిమి పూలతో కలిపిన ఉమ్మెత్త పూలతో పూజ చేయవలయును; అగ్నియందు పక్వము కాని ఆహారమును కొబ్బరి కాయను తినవలయును, ఇతర ఫలములు తినక విడువవలయును, సంధ్యాసమయములందు మౌనముతో ఉండ వల యును, అందును మొదట యథాశక్తిగా క్షేత్ర పాలుని పూజించవలయును, ఇట్లు జరిపిన స్త్రీకి భర్తవశుడై సదా ఆమె ఆజ్ఞకై ఆమె మొగమువైపు చూచుచుండును; అష్టమి చతుర్థి పంచమి ద్వాదశి సంక్రాంతి విషువత్ (రాత్రింబవళ్ళు సమాన పరిమాణముతో ఉండు దినము) ఛిద్ర తిథుల (అష్టమి, ద్వాదశి, షష్ఠి, చతుర్థి, చతుర్థశి) ఆరంభకాలము. ఇవి దివ్యదినములు. దీని యందు ఉపవసించి ధర్మము నాచరించు స్త్రీకి నిస్సంశయముగా స్వర్గవాసము లభించును, ఇట్టి స్త్రీలు కలిదోష ముక్తలయి సర్వపాప రహితలగుదరు, ఇట్లు ఉపవాసముల యందాసక్తిగల స్త్రీదగ్గరకు యముడు రానైన రాజాలడు అని నారదుడు అనౌపమ్యతో చెప్పెను.

అది విని ఆమె అతని ఇట్లడిగెను. ఉపేంద్రా! నారదమునీ! నేను ఈ జన్మమందును పూర్వజన్మమందును చేసిన పుణ్యఫలముగా మీరు ఇటకు వచ్చితిరి; చిన్నమాట అడుగుచున్నాను, బలిచక్రవర్తికి పత్నియు కీర్తిశాలినియు అగు వింధ్యావళి యున్నదికదా! ఆమె మా అత్తగారు; ఆమెకు నా విషయమున సంతోషమేలేదు; మా మామగారును నన్నెప్పుడును చూచుచు (నా గుణము లెరిగి) ఉండియు నాయందు సంతుష్టుడుకాడు, కుంభీనసియను నా ఆడుబిడ్డ యున్నది, ఆమె చేయునవన్నియు పాపపు పనులే; నేను కనబడిన చాలు నిరతము ఆమె మెటికలు విరచుచుండును; (ఇవి తొలగి) దివ్యమార్గమున నాకు సౌఖ్యములభించు ఉపాయము తెలుపుము, చవుటిపర్రలో విత్తనములు ఎట్లును ఎన్నడును మొలకెత్తవు గదా! నేను మీకు దాస్యమైన చేయుదును, ఏవ్రత మాచరించినచో వీరందరు ఆ వశవర్తులగుదురో విపేంద్రా! నాకు ఆ  వ్రతము తెలుపుము అనెను.

నారదుడు ఆనౌపమ్యతో ఇట్లు పలికెను, శుభాననా! నేను ఇంతవరకును నీకు చెప్పిన వ్రతము ఏది కలదో దానిని పార్వతి ఆచరించి శంకరుని అర్ధ శరీరమందుండ గలిగెను. లక్ష్మి విష్ణుని శరీరమందును, సావిత్రి బ్రహ్మ శరీరమందును, అరుంధతి వసిష్ఠ శరీరమందును ఉండగలిగిరి; ఈ ఉపవాసవ్రత ఫలముగా నీభర్త నీవశమందుండును, నీ అత్తమామలు నోళ్ళు మూతపడును, నేను చెప్పినది వింటివికదా! ఇక నీకు తోచినట్లు చేయుము; అనగా నారదుని వచనమును విని రాణి ఇట్లు పలికెను; విప్రేంద్రా! నాయందను గ్రహము చూపుము; నీకిష్టమైనన్ని దానములు స్వీకరింపుము; విప్రా! బంగారము మణులు రత్నములు వస్త్రములు ఆభరణములు, ఇవియేకాదు, ఇంకను దుర్లభమగునవి ఏవియున్నను అవన్నియు నీకిత్తును; ద్విజశ్రేష్ఠా! హరి శంకరులు ప్రీతినందునట్లు అవి గ్రహించుము. అన నారదుడు ఇట్లనెను. శుభరూపా! జీవనా ధారములేని మరెవరికైన విప్రునకు ఇమ్ము, అన్ని విషయములందును సంపన్నుడను, నాయందు భక్తిమాత్రము చూపుము; అని ఇట్లు నారదుడు పతివ్రతము నుండి వారందర మనస్సులను హరించి పెడత్రోవ పట్టించి భరతశ్రేష్ఠా! ధర్మజా! మరల తన స్థానమునకు పోయెను; తరువాత నుండి అత్రిపుర స్త్రీలు హర్షములేని (అసంతృప్త) హృదయములతో కూడిన వారును మరి ఇత రములందు వ్యాప్తములగు మనస్సులుగల వారునునయిరి. దానిచే మహాత్ముడగు ఆ బాణాసురుని త్రిపురము నందు ఛిద్రములు (లోపములు) ఏర్పడెను.