దివ్య వత్సరాంతకాల నిర్ణయము

ఋషులు సూతుని ‘పూర్వము స్వాయంభువ మన్వంతరమున వ్యవస్థ చేయబడిన చతుర్యుగముల వ్యవస్థను స్వరూపమును సంఖ్యా పరిమాణమును సవిస్తరముగ వినగోరు చున్నాము’ అని అడిగిరి. సూతుడిట్లు చెప్పసాగెను. పృథివీలోక ద్యులోక (భూగోళ ఖగోళ వ్యవస్థా కథన) ప్రసంగమున నేను ఇదివరకు మీకు అది చెప్పి యుండలేదు. ఇపుడది మీకు తెలిపెదను. ఎరుగుడు. మొదట మీకు మానుష ప్రమాణముతో సంవత్సర పరిమాణమును నిష్పన్నము చేసి దాని ఆధారమున చతుర్యుగ పరిమాణమును తెలిపెదను. పదునైదు నిమేషములు (ఱెప్ప పాటు కాలములు) కాష్ఠ, ముప్పదికాష్ఠలుకల; ముప్పది కలలు ముహూర్తము; ముప్పది ముహూ ర్తములు ఒక రేయింబగలు; రవి రేయింబవళ్లుగా మానవ లౌకిక కాలమును విభజించుచున్నాడు. మానవులు పనులు చేసికొనుటకు పగలు నిద్రించుటకు రాత్రి-ఉపయోగపడుచున్నవి. ఒక మానవ మాసము పితరులకు ఒక రేయింబవలు; అందునను కృష్ణపక్షము పగలు; శుక్ల పక్షము రాత్రి; మానవ మాసములు ముప్పది కలిసి పితరుల కొక మాసము; మానవ మాసములు మునూటరువది కలిసి పితృ సంవత్సరము; మానవ మాసముచే నూరు సంవత్సరములైనచో పితరులకు-మూడు సంవత్సరముల నాలుగు మాసములగును. మానవ లౌకిక ప్రమాణమున సంవత్సరము దేవతలకు రేయింబగలు అని వేదము తెలుపుచున్నది. అందును-మానవుల ఉత్తరాయనము దేవతలకు పగలు-దక్షిణాయనము రాత్రి; మానవ లౌకిక వత్సరములు ముప్పది దేవమాన మాసము; మాన వత్సరములు నూరైనచో దేవతలకు మూడు మాసములు (మరి పది దినములు) అగును, మానవ లౌకిక వత్సరములు మూడు వందల అరువది యైనచో ఒక దేవ వత్సరము. (మాత్రా లఘూచ్ఛారణ కాలము; నిమేషము)

మూడువేల ముప్పది మానవ లౌకిక సంవత్సరములు ఒక సప్తర్షి వత్సరము. దీనికి మూడింతలు-అనగా తొమ్మిదివేల తొంబది మానవ లౌకిక సంవత్సరములు ఒక ధ్రువ సంవత్స రము. ముప్పది ఆరువేల మానవ లౌకిక సంవత్సరములు నూరు దివ్య సంవత్సరములు; మూడు లక్షల అరువది వేల మానవ లౌకిక సంవత్సరములు వేయి దివ్య సంవత్సరములు; ఇట్లు దివ్య (దేవ సంబంధి) ప్రమాణాను సారము చతుర్యుగ వ్యవస్థ పెద్దలచే చేయబడినది; ఋషి వచనానుసారము భారత వర్షమున కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు నాలుగు వ్యవహారమందున్నవి. నాలుగువేల దివ్యవర్షములు కృతయుగము, అన్ని వందల దివ్యవర్షములు కృత త్రేతా సంధికాలము; అవే నాలుగు వందల దివ్యవర్షములు సంధ్యాంశకాలము; ఇట్లే మూడు వేల దివ్యవర్షములు త్రేతాయుగ పరిమాణము, మూడు వందల దివ్యవర్షములు దాని సంధ్యాకాలము; మరి మూడు వందల దివ్యవర్షములు దాని సంధ్యాంశ కాలము; రెండువేల దివ్య వర్షములు ద్వాపరయుగ ప్రమాణము; రెండు వందల దివ్యవర్షములు దాని సంధ్యాకాలము; రెండు వందల దివ్యవర్షములు దాని సంధ్యాంశ కాలము; వేయి దివ్య వర్షములు కలియుగ ప్రమాణము; నూరు దివ్య వర్షములు దాని సంధ్యా కాలము; నూరు దివ్య వర్షములు దాని సంధ్యాంత కాలము.

యుగము   యుగపు మాసము   యుగ సంధ్య    యుగ సంధ్యాంశము   మొత్తము

కృత                 4000 +                     400                + 400                        = 4800

త్రేతా                3000 +                     300                + 300                        = 3600

ద్వాపర            2000 +                     200                + 200                        = 2400

కలి                  1000 +                      100                 + 100             = 1200

చతుర్యుగము 10000 +                   1000              + 1000                      = 12000

మానవ మాసముచే యుగ ప్రమాణము సంవత్సరములలో

యుగము      యుగ ప్రమాణము     యుగ సంధ్య    యుగ సంధ్యాంశము   మొత్తము

కృత       1440000 +            144000 +                 144000         = 1728000

త్రేతా    1080000 +              108000 +                 108000         = 1296000

ద్వాపర 720000 +               72000 +                  72000          = 864000

కలి      360000 +                36000 +                   36000          = 432000

3600000 +          360000 +            360000      = 4320000

ఈ విధమగు చతుర్యుగమునకు దివ్యయుగమని వ్యవహారము. ఇటువంటి దివ్య యుగ ములు డెబ్బదియొకటి పై చిల్లరయైనచో ఒక మన్వంతరమగును. ఇది మనుష్య లౌకిక మాసాను సారము ముప్పదియొక్క కోట్ల పదిలక్షల ముప్పది రెండువేల ఎనిమిది వందల ఎనుబది సంవత్సరముల ఆరు మాసము లగును. ఇదే మన్వంతర పరిమాణము దివ్య మానము నను సరించి తొమ్మిది లక్షల నలువదివేల సంవత్సరములగును.

మన్వంతరమునకు పదునాలుగు రెట్లు కల్ప ప్రమాణము; ఇదే బ్రహ్మకు పగలు.

దీనికి రెండింతలు సంపూర్ణ ప్రళయకాలము; దీనికి మహాప్రళయకాలమనియు పేరు; ద్వాపర కలియుగములు రెండును పరస్పరము విడదీయరానివై కలిసియుండుటచే వాని లక్షణము వేరువేరుగా వివరించ వీలుగాక నేను మీకు వివరించలేదు. అట్లే త్రేతాయుగ లక్షణములను గూడ ఋషివంశ ప్రసంగమున నాకు కలిగిన వ్యగ్రతచే చెప్పియుండలేదు. శేషాంశమగు ఆత్రేతాయుగ విషయము ఇపుడు చెప్పెద వినుడు.

శుభకరములగు త్రేతాయుగ ధర్మములను వినుడు. త్రేతాయుగారంభమున స్వయంభూ బ్రహ్మ స్వాయంభువ మనువునకును (మరీచ్యాది సప్త ప్రజాపతులగు) సప్త ఋషులకును శాశ్వతమగు శ్రౌతస్మార్తమగు ధర్మమును విధిరూపమున బోధించెను. దారాగ్నిహోత్ర సంబంధము గల అగ్నిహోత్ర విధానసంబంధులగు శ్రౌతకర్మముల ననుష్ఠించు విధానము ఋగ్యజుః సామాత్మకమగు వేదసంహితలు తత్సంబంధి ధర్మములు తదంగములు తత్సంబంధి విద్యలు ఈ మొదలగు విస్తృత శ్రౌత ధర్మమును సప్త ఋషులును తమ తరువాతి తరములవారికి ప్రతి పాదించి లోకమున ఆ ధర్మములను ప్రవర్తిల్లచేసిరి. సామయాచారికధర్మమను ప్రసిద్ధిగల వర్ణా శ్రమాచార ధర్మములను తనకు బ్రహ్మనుండి గురు పరంపరగా లభించిన వానిని స్వాయంభువ మనువు ఈ లోకమున ప్రవర్తిల్ల జేసెను. ఇవి స్మార్త (స్మృతిప్రోక్త) ధర్మములు.

ఈ సప్తర్షులును స్వాయంభువ మనువును కల్పాది త్రేతాయుగాదియందు సత్యము బ్రహ్మ చర్యము శ్రుతము (శాస్త్రములను సంప్రదాయ శుద్ధితో అధ్యయనము చేయుట) తపస్సు. (నియమపాలనముతో శరీరమును శ్రమకు పాల్పరచుట) అనెడు ఈ ప్రక్రియలతో అతి తీవ్రమగు తపస్సు ఆచరించిరి. (ఇచ్చట తపస్సు అనగా చిత్తమునకు అత్యుత్తమ సంస్కారమును సంపా దించుట); తత్ఫలముగా వారికి తమ సంకల్పమేమియు లేకయే వారికి మరెవ్వరి నుండియు ఉపదేశములేకయే అదియే ఈ కల్పమున ప్రథమ పర్యాయముగా వేదమంత్రములు అన్నియు అభివృత్తములయ్యెను (వారి దగ్గరకు అవి తమంతట తామే వచ్చెను.) వైదిక మంత్రములు వీరికి సాక్షాత్కరించుట దర్శనమున (మంత్రములందు ప్రతిపాదింపబడు విషయము శబ్ద రూపమున చిత్తమునకు మాత్రమే కాక చెవికి గూడ గోచరించుట) తారక’రూపమున (నక్షత్రము లందు అంతరిక్షముననే ఈ మంత్రరూపములును వానియందు ప్రతిపాదింపబడు దేవతా తత్త్వము లును వానితో ఆచరించవలసిన యాగాది ప్రక్రియలును గోచరించుట దత్తాత్రేయాది యోగులు ఎరిగిన తారక యోగసిద్ధిచే ఈ విషయములు వారి చిత్త శ్రవణములకు గోచరించుట) ఇట్టి అద్భుత విధానములతో జరిగెను. ఈ వేద మంత్రములు దేవతలకు అందరకును శబ్దాత్మకములగు ఆశ్రయములు. మరి ఈ వేదమంత్రములు సప్తర్షుల కెట్లు మొదటిసారిగా ఈ కల్పమున ప్రతిభాత ములు (స్ఫురించినవి) అయ్యెను? అనిన-ఇతః పూర్వపు కల్పములందును ఆయా ప్రమాణ జ్ఞానము నందు సిద్ధినందిన ఆయా మహానుభావులకు అంతకుముందటి కల్పములందు వలెనే స్ఫురించగావారు వానిని ఆకల్పములందు లోకములందు ప్రవర్తిల్లజేసిరి. ఇవి వేలకొలది మంత్ర ద్రష్టలకు వేలకొదిగా ప్రతిభాతములై యుండెను. అవియే ఈ కల్పమునందు మరల ఈ సప్తర్షులకును స్వాయంభువ మనువునకును వారివారి ప్రతిభ (స్వయం సిద్ధమగు బుద్ధి స్పందన - యందు గోచరించెను. అని సమాధానము. ఇవి ఋగ్యజుః సామాథర్వణ రూపములగు నాలుగు వేదములు. వీనినే సప్తర్షులు తాముదర్శించి లోకమున ప్రవచించిరి. (ఇచట సప్తర్షు లనగా వారును వారి వంశజులగు మరి ఇతరులగు ఋషులును) స్మార్త ధర్మమును స్వాయంభువ మనువు లోకమున ప్రవర్తిల్లజేసెను. ఇట్లు కల్పాది యందలి త్రేతాయుగాదియందు సంహతము లయిన (వ్యవస్థా పూర్వకముగా అమర్చబడిన) వేదములు ధర్మసేతువులుగా (ధర్మాతిక్రమణము జరుగకుండ కాపాడు అడ్డుకట్టలుగా) అయ్యెను. ఆయుః పరిమాణము మొదలగు శక్తులు తగ్గుటచే ఈ ద్వాపరయుగము నాటికి అవి మొదటివలె నుండక వ్యత్యాస మందినవి. ఈ వేదములను ఋషులు తమ తపోబలాధిక్యముచే అహోరాత్రములు అధ్యయనము చేయు చుందురు. వీనికి ఆదియు అంతమునులేదు. (ఇవి నిత్యశబ్దములు) వీటిని స్వయంభూ బ్రహ్మ తాను స్వయముగా-అవి ప్రతిపాదించు ధర్మము వాటియందు చక్కగా సంస్కరింప బడిన రూపములో నిలిపి అయా యుగ ధర్మములకు అనుగుణముగా ఉండు రూపములో వాటి అంగములతో కూడ ప్రతియుగము (కల్పభేదము) నందును ప్రవచించును. కాని ఆయా యుగములలో ధర్మ వ్యవస్థ యందలి మార్పుల ననుసరించి ఒక వేదముకంటె మరియొక వేదము మార్పునొంది కనబడును. ఈ శ్రుతులను అనుసరించి తెలియు తత్త్వము ఏమనిన లోకక్షేమరకమగు కర్మలను ఉత్సాహముతో తమ విక్రమముతో ఆచరించుటయే క్షత్రియులకును - హవిస్సులు (ప్రజల నిత్య జీవనములకు సాధనములగు ఆహారాది పవిత్ర వస్తువులు) జనులకు సమకూర్చుటయే వైశ్యులకును-తమ శారీరక శ్రమతో జనులకు ఉపయోగించు పరిచర్యలు (కృత్యములు) [సేవ అని అర్థము కాదు] చేయుటయే శూద్రులకును యజ్ఞములు; బ్రాహ్మణులకు జపమే [జనులకు క్షేమము కూర్చవలెనను దృష్టిచేయు వేదాధ్యయనమే అని అర్థము; మంత్ర జపమని అర్థముకాదు;] వాస్తవ మగు యజ్ఞము. దీనిని ఇట్లే అందరును ఆచరించెడు వారు కావునను నాటి జనులు స్వధర్మాచరణ శాలురు కావునను వారు కార్యపరులు సత్సంతానవంతులు సమృద్ధి కలిగి సుఖించు వారునై యుండిరి. బ్రాహ్మణులు ఉపదేశించినట్లు క్షత్రియులు క్షత్రియులు ఉపదేశించినట్లు వైశ్యులు వైశ్యులు ఉపదేశించినట్లు శూద్రులు ఆచరించుచు అనుగ్రహము (జనానుకూల ప్రవర్తనము) తో నడచెడివారు. నాటి జనుల ప్రకృతులు (స్వభావములు) శుభకరము లయి వర్ణాశ్రమానుకూల ధర్మరూపములయి యుండెడివి.

త్రేతాయుగమున ధర్మము సమగ్రముగా నడుచుచుండ మనస్సుతో చేయు సంకల్పము నోటితో చెప్పెడి మాట చేతితో చేయుపని- ఈ మనోవాక్కాయిక కర్మములు మూడును ఏకరూపములు కాగా జనుల కర్మాచరణములు సఫలములయి యుండెను. జనుల ఆయువు రూపము బలము మేధా ఆరోగ్యము ధర్మశీలము ఇవి జనులలో త్రేతాయుగమున సర్వసాధారణమయి యుండెను. బ్రహ్మ ఆనాటి వారికి వర్ణాశ్రమ వ్యవస్థను అట్లేచేసెను. వేదసంహితలను వేద మంత్రములను బ్రహ్మమానస పుత్రులగు ఋషులు అంత బాగుగా ప్రవర్తిల్లజేసిరి. వారు యజ్ఞ ములను అంత తిన్నగా ఆనాడు ప్రవర్తిల్లజేసిరి. సత్య జపతపోదానములు పూర్వ యుగములందలి ధర్మములయి యుండెను. కాని క్రమముగ ధర్మశాఖ తగ్గిన కొలది అధర్మము అధికము కాసాగెను. ఆ యుగములందు జనులు శూరులు ఆయుష్మంతులు మహా బలులు క్షమావంతులు (ఎవరిని దండించనివారు) న్యక్తదండులు మహాయోగులు యజ్ఞానుష్ఠాతలు వేదాధ్యయన తత్త్వజ్ఞానపరులు పద్మపత్ర్తనేత్రులు విశాల ముఖులు చక్కని దేహపు అమరిక కలవారు సింహవక్షముకంటె దృఢ విశాలవక్షము కలవారు మహాసత్త్వులు మదపుటేనుగువలె నడుచువారు మహాధానుష్కులు న్యగ్రోధ పరిమండలులు సర్వలక్షణ సంపూర్ణులునై నాటి చక్రవర్తు లుండెడివారు. న్యగ్రోధము అనగా ‘బార’ అని అర్థము. బారకొలతకు వచ్చుటచే బాహువులకును న్యగ్రోధములు అని నామము; నిలువునగాని అడ్డమునగాని బారలతో కొలువదగినంత పొడవు లావు (చుట్టు కొలత)కల వారిని న్యగ్రోధ పరిమండలులు అందురు. ఆ స్వాయంభువ మన్వంతరమున- చక్రవర్తులు విష్ణు వంశమున చక్రము రథము మణులు భార్య నిధి (ధనరాశి) అశ్వములు గజ ములు అనెడు సప్తరత్నములు కలిగియుండెడువారు. గడిచిన గడచుచున్న గడువనున్న త్రేతా యుగములందెల్ల చక్రవర్తులు ఇట్టివారే; ఈ చెప్పిన సప్త రత్నములును ముందు చెప్పబోవు లక్షణములును వారికి శుభకర లక్షణములుగా నుండును.

బలము ధర్మము సుఖము ధనము ఇవి అత్యద్భుతములగు లక్షణములు; వీటిని పరస్పర విరోధము లేకుండ ఆ త్రేతాయుగ రాజులు సమముగా నిర్వహింతురు. ధర్మార్ధకామ యశో విజయైశ్వర్యాణిమాది ప్రభుశక్తి శాస్త్ర తపో లక్షణములందు వారు (నాటి చక్రవర్తులు) ఋషులను మానవులను దానవులనుకూడ తిరస్కరించగలిగియుందురు. మానవ సహజ శరీర లక్షణములు కూడ వారికున్నతములుగా నుండును. ఎట్లన-వారి జుట్టు నుదుటి వైశాల్యమును క్రమ్మి వేయు నంతగా మీదికివచ్చి పడుచుండును. నాలుక నోటినంతటిని ఒరయునంతగా పొడవుగా నుండును. చామనచాయ- నాలుగు కోరదంతములు కలిగి ఉన్నత వంశమున పుట్టి జితేంద్రి యులు ఆజాను బాహువులు తాటికాండమువంటి చేతులు వృషభములవంటి ఠీవికల ఆకృతితో వృషభములకువలె దేహనిర్మాణము పెద్దకొలత కలిగి సింహపు మూపు వంటి మూపులతో మేధావంతులయి యుందురు. వారి పాదములందు శంఖచక్ర రేఖలు హస్తములందు శంఖపద్మ రేఖలు కలిగి ఎనుబది ఐదువేల సంవత్సరములు ఏ రోగమును వార్ధకమును లేక జీవింతురు. ఆ చక్రవర్తులు అంతరిక్షమున సముద్రము లందు పాతాళమున పర్వతము లందు ఈ నాలుగు చోట్లకూడ వీరు అడ్డులేక సంచరింతురు.

మొత్తముమీద త్రేతాయుగమున యజ్ఞదాన తపత్సత్యములు ప్రధాన ధర్మములు; వర్ణాశ్రమధర్మములు సరిగా నడచును; ఐనను ఎవరి మేరలో వారిని నిలుపుటకై దండనీతియు నామమాత్రముగా ప్రవర్తిల్లును. జనులు ఎల్లరు హర్షముతో పుష్టితో మానస శరీరారోగ్యములతో నుందురు. త్రివిధ వేదములును (కర్మపరములు ఉపాసనాపరములు జ్ఞానపరములు) ఋగ్- యజుః-సామాథర్వణములను నాలుగు పాదములతో ఏకవస్తువుగా అఖండరూపమున నుండును. ప్రజలు మూడువేలేండ్లు జీవింతురు. వారు పుత్రపౌత్రాది పరివారమునడుమ క్రమముగా నెప్పుడో మరణింతురు. ఇది త్రేతాయుగ ధర్మము; త్రేతా సంధ్యాకాలములో ఈ ధర్మములన్నియు ఇందు నాల్గవవంతున నడుచును. సంధ్యాంశ కాలమునందు సంధ్యాకాల ధర్మములో నాల్గవవంతు మాత్రము నడుచును.