పితరుల వృత్తాంతము

సూతుడు ఇంకను ఇట్లు చెప్పనారంభించెను, ద్యులోకమునందు శోభనమగు వర్చస్సు (కాంతి) కలిగిన మరికొన్ని లోకములు గలవు. వాని పేరు విభ్రాజములు. వానియందే సువ్రతులు (ఉత్తమ నియమానుస్థానపరులు) అగు బర్హిషదులు అను పితరులు నివసింతురు. (బర్హిసద్= ర్హిషద్=నెమిళ్ళపై కూర్చుండువారు) ఆ లోకముల యందలి పితృదేవతల విషయములో చక్కగా ఆచరింపబడిన యజ్ఞములు (శ్రాద్ధములు) (బర్హిస్=యజ్ఞము) విశేషముగా ఫలములను ఇచ్చును. వారినుద్దేశించి శ్రాద్ధములను ఆచరించినవారు అభ్యుదయశాలల ప్రాపంచిక సుఖముల నిచ్చెడు గృహముల) యందు ఆనందింతురు. వీరిని అసుర దానవ గంధర్వాప్సరో యక్షరక్షోగణముల వారును ద్యులోకమునందలి దేవతలును ఆరాధింతురు. వీరు పులస్త్య ప్రజాపతి కుమారులు. తపస్సుచేతను యోగసాధనము చేతను కలిగిన నూర్లకొలది శక్తులు కలవారు. వీరి మానసీ కన్య పీవరి అను పేరుతో ద్యులోకమున ప్రసిద్ధయైయున్నది. ఈమె యోగమునకే తల్లి అనదగిన యోగిని. ఈమె మిగుల భయంకరమగు తపస్సాచరించెను. భగవానుడగు హరి ఆమెను అనుగ్రహించెను. పురుషోత్తమా! నీకు నా యందు అనుగ్రహము కలిగినచో నాకు యోగసిద్ది కలవాడును సుందరుడును విజితేంద్రియుడును అగు భర్తను ఇమ్ము! అని ఆమె వరము కోరెను. హరి ఇట్లు పలికెను. “ముందుముందు వ్యాసునకు శుకుడను కుమారుడు కలుగును. అతడు యోగాచార్యుడు. నీవు ఆచరించిన ఈ సుతపోవ్రతముకు ఫలముగా నీకు అతడు భర్తయగును. యోగిని కాగల కృత్తి అను కూతురు నీకు కలుగును. నీవామెను మానవుడగు పాంచాల దేశరాజునకు ఇమ్ము. ఆమెకు బ్రహ్మదత్తుడను కుమారుడు కలుగును. ఆతనికిని యోగసిద్దులగు కుమారులు కలుగుదురు. నీకు కృష్ణుడు గౌరుడు ప్రభుడు శంభుడు అను కుమారులు కలుగుదురు. వారు మహా త్ములును మహాభాగులునై పరమపదమును చేరుకొందురు. ఇట్టి కుమారులకు తల్లివై నీవు నీ భర్తతో కూడ మోక్షమును పొందుదువు.”

ఇది అమూర్తులు-(మూర్తి లేనివారు)అగు పితృ దేవతా గణముల విషయము.

సుకాలిన్ అను పేరుగల పితృదేవతల గణమువారు వసిష్ఠుని మానస పుత్త్రులు. వారంద రును ధర్మమూర్తులు. వారు ద్యులోకమునకు పైగా ఉన్న “జ్యోతిర్భాసి” అను (నక్షత్రాది జ్యోతిస్సు లతో ప్రకాశించు) లోకములందు నివసింతురు. తమ పూర్వుల నుద్దేశించి, శ్రాద్ధములను జరిపిన శూద్రులైనను ఈ లోకములందు విమానములపై ప్రకాశించుచు క్రీడించుచు, వివిధ భోగములను అనుభవించుచుందురు. ఇక భక్తిమంతులై సరిగా కర్మలను అనుష్ఠించువారై శ్రాద్ధములను జరుపు బ్రాహ్మణుల విషయము చెప్పవలసినదేమున్నది? గౌః అను పేరుకలవారి మానసపుత్రి ద్యులోకమున ప్రకాశించుచుండును. ఆమె శుక్రునకు ప్రియ భార్య అయ్యెను. ఆమె సాధ్యులకు దేవతలకు కీర్తిని వర్ధిల్లజేయునది. (ఈ పితృదేవతా గణమును విప్రులారాధింతురు)

సూర్యమండలమునందు “మరీచి గర్భములు” (తమ అంతర్భాగమునందు కిరణములు కలవి) అను లోకములు గలవు. అంగిరః ప్రజాపతికి పుత్రులగు బర్హిష్మంతులను పితృ దేవతలు ఈ లోకములందు వసింతురు. తీర్థ శ్రాద్ధములను జరుపు క్షత్త్రియ యశోద అనుపేర లోకప్రసిద్ధురాలు. ఈమె పంచజనుని కుమారుడగు అంశుమంతుని భార్య. దిలీపుని తల్లి. భగీరథుని నాయనమ్మ.

కోరిన భోగఫలములను ఇచ్చు “కామదుఘములు” అను లోకములు కలవు. సత్కర్మము లను అనుష్ఠించువారగు ఆజ్యపులు అను పితృదేవతలు ఈ లోకములందు వసింతురు. వీరు కర్దమ ప్రజాపతి కుమారులును పులహుని కుమారులును. వీరిని వైశ్యులారాధింతురు. వీరిని ఆరాధించినవారు ఈ లోకములకు పోయి అచ్చట తమ పూర్వమృతులగు తల్లులు సోదరులు మేనత్తలు మిత్రులు వియ్యాలవారు ఇతర బంధువులు మొదలగువారు ఇప్పటికి పదివేల జన్మలను ఎత్తిన వారైనను వేలకొలది ఏయే విధములుగా వారిని తాము చూచి అనుభవము పొంది యున్నారో అదే విధముగా వారిని చూడగలుగుదురు. వీరి మానసపుత్రి విరజ అనుపేర ప్రసిద్ధురాలు. ఈమె తరువాత నహుషుని భార్య - యయాతికి తల్లి - అయ్యెను. ఈమె బ్రహ్మ లోకమునకు చేరిన తరువాత ‘ఎకాఽష్టక’ అనుపేర ప్రసిద్ధురాలయ్యెను. ఇట్లు మూర్తిమంతములగు మూడు పితృగణముల వృత్తాంతము చెప్పుటయైనది నాలుగవ గణము విషయము వినుడు.

బ్రహ్మదేవుని నగరమునందు మానసములు అనులోకములు కలవు. నర్మద అను మానస పుత్రికి తండ్రులను సోమపులు అను పితృదేవతలు ఈ లోకములందు నివసింతురు. వీరందరును ధర్మమూర్తిని ధరించినవారు. శాశ్వతులు. బ్రహ్మకు పై స్థానమునందు ఉండువారు. వీరు “స్వధ” నుండి జనించిరి. యోగసిద్ధిచే బ్రహ్మత్వమును పొందిరి. సృష్టి మొదలగు వ్యాపారము లను నిర్వహించి ఇప్పుడు మానస లోకములందున్నారు. వారి మానస పుత్రియగు నర్మద నీటిని ప్రవహింపజేయుచు నదిగా అయినది. ఆమె దక్షిణాపథము (వింధ్యకు దోణమునందు ఉన్న భారతదేశము) నందు ప్రవహించుచు ప్రాణులను పవిత్రులనుగా చేయుచున్నది.

ప్రజాపతులు తాము చేసిన ప్రజా సృష్టులలో ఈ పితృదేవతల నుండియే మనువుల నందరను సృజించిరి. ఈ విషయమును ఎరిగి జనులు ఏయజ్ఞయాగాది ధర్మమునైనను ఆచరించి నను ఆచరించకున్నను ఎల్లప్పుడును శ్రాద్ధములనుమాత్ర మాచరించవలెను. వారి అనుగ్రహము వలననే మరల ప్రజలు యోగసిద్ధిని నిరంతరముగా (అవిచ్ఛిన్నముగా) పొందగలరు. ఏలయన ఆది సృష్టియందు జనులు అనుష్ఠింపవలసిన కర్మముగా పితృశ్రాద్ధమే విధింపబడినది.

అన్ని వర్ణములవారు పెట్టు శ్రాద్ధములందును రజత (వెండితో చేసిన) పాత్రమే పితృ ప్రీతికరము. (పితృ దేవతలను ఉద్దేశించి సమర్పించు ఏ పదార్థమునైనను ఏవర్ణము వారైనను రజత పాత్రమునందే సమర్పించవలెను) పితరులను ఉద్దేశించి ఏది సమర్పించినను స్వధాకార పూర్వకముగా ఈయవలెను. సంప్రదాయమును ఎరిగినవారు అగ్నీష్చోములకును యమునకును శ్రాద్ధదానముచే తృప్తిని కలిగించవలెను. ఇది అగ్ని ఉన్నచో అగ్నియందును, లేనిచో విప్రుని చేతియందో, జలమునందో, మేకచెవియందో, గుర్రపు చెవియందో, గోవులు నిలుచు స్థానమునందో, శివ సన్నిధియందో చేయవచ్చును. దక్షిణదిశ పితరులకు ప్రశస్తమయిన స్థానము (దిక్కు)

ప్రాచీనావీతము (కుడి భుజము మీదకు ధరించిన యజ్ఞోపవీతము) ఉదకము నూవులు సవ్యమయిన (ఎడమవైపు) అవయవము దర్భలు కూర్మమాంసము అవుపాలు మధురరస ద్రవ్యములు ఖడ్గమృగపు మాంసము తేనె చామలు అను వడ్ల బియ్యము వరిబియ్యము యవలు నివ్వరి బియ్యము పెసలు చెరకు బెల్లము పూవులు నేయి ఇవి ఎల్లపుడును పితృ దేవతలకు ప్రియములై నవియు ప్రశస్తములైనవియును. కనుక శ్రాద్ధమున ఇవి గ్రహింపదగినవి. విడువ దగినవి చెప్పెదను వినుము. చిరుసెనగలు సెనగలు, అనుములు, బొబ్బరలు, ఉలవలు (అలచందలు), తామర పూవు, బిల్వము, జిల్లేడు, ఉమ్మెత్త, వేప, అడ్డసరము, మేకల గొర్రెల పాలు, కొర్రలు, అడవి కొర్రలు, దానిమ్మ, వెలగ, ఇప్ప, అవిసె గింజలు ఇవి శ్రాద్ధమునందు వినియోగించకూడదు. శోభ, సిద్ధి తగ్గును. భక్తిచే పితరులను తృప్తిపరచిన వానిని పితరులును సంతృప్తి పరతురు. పితరులు తుష్టి చెందినచో వారు కర్తకుగూడ తుష్టిని స్వర్గమును అరోగ్యమును సంతానమును ఫలముగా ఇత్తురు.

దేవకార్యముకంటెను పితృకార్యము విశిష్టతరమయినది. దేవతలను తృప్తిపరచుట కంటెను ముందు పితరులను తృప్తి పరచవలయును. పితృదేవతలు శీఘ్రముగా అనుగ్రహించు వారును క్రోధము లేనివారును మిగుల శాంతులును స్థిరముగా నిలిచియుండు సుహృద్భావము కలవారును శుద్ధ సత్వగుణ ప్రధానమగు చిత్తవృత్తి కలవారును దేహమునను చిత్తమునను శుచిత్వమునందు శ్రద్ధ కలవారును ఎల్లప్పుడు ప్రీతికరముగా మాటలాడువారును భక్తులయందు ప్రీతికలవారును వారికి సుఖమును ఇచ్చువారునుగా ఉన్నారు. ఇంతేల? వారు దేవతలలో మొదటివారు. సూర్యుడు హవిష్మంతులు అను పితృదేవతల ఆధిపతిత్వము కలవాడును శ్రాద్ధ కర్మాణు స్థానమునకు అధిష్టాన దేవతయునై యున్నాడు. మహర్షులారా! మీకు నేను పితృవంశాను కీర్తనము అంతయు చెప్పితిని. ఇది పుణ్య కరము - పవిత్రమయినది. ఆయుష్యమును వృద్ధి చేయునది. మానవులు ఎల్లప్పుడును కీర్తింప దగినది.