మత్స్య మహా పురాణము
ఋషి గోత్ర ప్రవర విషయ పరిచయము
[బ్రహ్మ మానస పుత్రులగు సప్త మహర్షులను బట్టి ఏర్పడిన సప్త ప్రధాన గోత్ర వర్గము లును-ఎనిమిదవవాడుగా అగస్త్యుడు కూడ గ్రహింపబడగా మొత్తము ఎనిమిది ప్రధాన ఋషి గోత్రముల వర్గములగునని సంప్రదాయము చెప్పుచున్నది. బౌధాయనమున ఈ విషయమున ఇట్లు చెప్పెను:
“విశ్వామిత్రో జమదగ్ని ర్భరద్వాజోథ గౌతమః |
అత్రిర్వసిష్ఠః కశ్యప ఇత్యేతే సప్తఋషయః,
సప్తానా మృషీణా మగస్త్యాష్టమానాం యదపత్యం తత్ గోత్రం ఇత్యాక్షతే.”
ఈ చెప్పిన ప్రధాన ఋషుల అపత్యము (అపత్యమనగా స్త్రీ సంతానము కూడ కావచ్చును. కాని ఇచట పురుష సంతతి మాత్రమే గ్రహించవలెను.) [అనగా కుమారులును వారికి తరువాతి తరములవారును] గోత్రము అని వ్యవహరింపబడును.
గోత్రములను పేర్కొనునపుడు ప్రవర ఋషులను కూడ పేర్కొనుట సంప్రదాయము; ప్రవర శబ్దమునకు అర్ధము విషయమున మాధవాచార్యులు “ప్రవరము అనునది ఆయా గోత్రములను ప్రవర్తిల్లచేసిన ముని వ్యక్తిని అదే పేరుగల మరియొక ముని నుండి వేరుపరచు ముని సమూహము” అని చెప్పిరట. కాని అది దోషగ్రస్త లక్షణము అని ‘స్మృతి కౌస్తుభమను ధర్మశాస్త్ర గ్రంథమును రచించిన అనంతదేవుడు ఖండించెను. అనంతదేవుడు ప్రవరను గూర్చి ఇట్లు చెప్పెను: “ప్రవరణము-ప్రవరము-రెండు పదములును సమానార్థకములు. ఈ పదములకు ప్రార్థనము అని అర్థము; ఆయా శ్రాతస్మార్త కర్మానుష్ఠానములందు యజమానుడు స్వయముగా గాని యజమానుని పక్షమున ఋత్విక్కులు కాని అగ్నిని ఉద్దేశించి ప్రార్థన మొనర్పవలెను. ఆ ఋషులే ప్రవర ఋషులు” అని అనంత దేవుడును అతని తమ్ముడు ‘సంస్కార కౌస్తుభ’ రచయిత యగు జీవదేవుడును చెప్పిన వచనముల సారాంశము.