దానోపాయ విచారము

శ్రీమత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను; సర్వోపాయములలో దానము శ్రేష్టత మమును - గొప్పదియును; అది చక్కగ ఇచ్చినచో (ఉభయ) ఇహపర లోకములు జయించగలుగును; రాజా!దానముచే వశవర్తికానివాడెవడును లేడు; ఈ లోకమునందలి మానవులకును దేవతలు కూడ దానముతోనే సదా వశులు అగుచున్నారు; నృపోత్తమా! సర్వ ప్రజలను దానమును అవలంబించియే జీవనము చేయగలుగుచున్నారు; (అందరకును దానమే జీవన సాధనము); ఏలయన దానముచేయు ప్రతియొకడును ప్రతియొకనికి ప్రీతిపాత్రుడగుచున్నాడు. అటులే దానపరుడగువాడు అచిరకాలముననే పరులు జయించగలుగును. దానవంతుడే సుసంహతులగు శత్రువులను కూడ భేదింపగలుగును. (కావున భేద ప్రయోగమున గూడ దానము ఉపయుక్త మగును;) అభేద్యులు, అలుబ్ధులు, గంభీరులు; సాగర సమానులు అగు పురుషులు ఉండవచ్చును. వారు ఇతరులు ఇచ్చినది తీసికొనని మాట వాస్తవమే; అయినను అట్టివారు కూడ దానపరుడు ఉదారుడు అగు రాజునందు పక్షపాతమువహింతురు; ఇతరుల విషయమున చేసిన దానము కూడ ఆదాన గ్రహీతలనేకాక ఇతరులను కూడ వశీకరించుకొనును. అందుచేతనే జనులు ఇతర ఉపాయములకంటె దానము శ్రేష్ఠతమము అందురు. దానము పురుషులకు శ్రేయస్కరము. దానము మిగుల శ్రేష్ఠతమము. దానవంతుడే (ఇహపర)లోకములందు యత్న పూర్వకముగా నిలువబడును? (దేవతలు అతనికి ఇహపర సుఖములనిచ్చి వానిని ఉన్నత స్థానము నందు నిలుపుదురు.) దానపరులగు పురుష ప్రవీరులు కేవలము ఒక భూలోకమును మాత్రము జయించరు. రాజా! వారు విబుధుల (దేవతల) అధివాసమును జయింప (పొంద) సులభముగా అలవి కానిదియునగు సురేంద్ర లోకమునుగూడ జయింతురు.