యయాతి చరితమున కచ వృత్తాంతము

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి, పూరుడు యయాతి కుమారులలో చిన్నవాడే అయినను అతని వంశము లోకమున శ్రేష్ఠమయినదిగా ఏల ప్రసిద్ధమయ్యెను? యదువు జ్యేష్ఠుడే అయినను అతని వంశము ఏల శోభలో తక్కువది అయ్యెను? కారణము తెలుపుడు. అంతేకాక యయాతి చరితమును కూడ ఇంకను విస్తరించి తెలుపుడు. అది పుణ్యకరమును ఆయుర్వృద్ధికరమును దేవతలు కూడ అభినందించునదియును.

సూతుడు ఈ విధముగా చెప్పెను,”ఋషులారా! మీరు అన్నట్లు ఈ యయాతి చరిత్రము పుణ్యకరమును పవిత్రమును ఆయుర్వృద్ధికరమును చాల గొప్పది కలడా. పూర్వము శతానీకుడు (జనమేజయుని కుమారుడు) అడుగగా శౌనకుడు దీనిని అతనికి చెప్పెను. ఎట్లన-ప్రజాపతినుండి ఎనిమిదవ తరమునకు చెందినవాడును మా పూర్వ పురుషుడును అగు యయాతి మిగుల సౌందర్యవతియు శుక్రుని కూతురును అగు దేవయానిని ఎట్లు వివాహమాడెను? తపోధనా? ఇదియంతయు సవిస్తరముగా వినవలెనని నాకు కుతూహలముగా ఉన్నది. యయాతి మొదలు కొని ఆనుపూర్వితో పూరుని వంశమును నిలిపిన రాజుల నందరను నాకు వివరింపుడు. అని శతానీకుడు శౌనకుని అడిగెను.

శౌనకుడు ఇట్లు చెప్ప నారంభించెను, యయాతి రాజర్షి. దేవేంద్రునితో సమానముగా ప్రకాశించిన రాజు. శుక్రుడును వృషపర్వుడును ఆతనిని తమ అల్లునిగా చేసికొనిరి. ఆ విధమును నీకు తెలిపెదను. రాక్షసగురుడగు శుక్రునికూతురుదేవయాని. మానవలోకాధిపతియగు నహుషుని కుమారుడు యయాతి. వీరిద్దరకును దంపతులుగా కలయిక ఎట్లు జరిగెను? అని నీవడిగితివి. రాజసత్తమా! మొదట నీకు అది తెలిపెదను.

చరాచరాత్మకమగు మూడు లోకములకు మేమే అధిపతులము అను భావముతో ఈ విషయమున దేవతలకును అసురులకును పరస్పరము స్పర్ధ(పోటీ) ఏర్పడెను. వారు ఒక పక్షము వారు మరొక పక్షమువారిని జయించవలెనను తలంపుతో అంగిరసుని కుమారుడగు బృహస్పతిని దేవతలును కవి వంశీయుడగు ఉశనసుని (శుక్రుని) రాక్షసులును తాము జరిపెడి యజ్ఞములందు పురోహితులుగా నుండునట్లు ఏర్పరచుకొనిరి. ఆ బ్రాహ్మణులు ఇరువురును ఒకరిపై ఒకరు పోటీపడుచుండిరి. యుద్ధములందు పురోహితులుగా నుండునట్లు ఏర్పరచుకొనిరి. అబ్రాహ్మణులు ఇరువురును ఒకరిపై ఒకరు పోటీపడుచుండిరి. యద్ధములందు దేవతల చేతిలో మరణించిన దానవులను శుక్రుడు తన విద్యాబలము నాశ్రయించి పునర్జీవితులనుగా జేయుచుండెను. వారును మరల జీవించి లేచి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. బృహస్పతియు ఉదారమగు బుద్ధికలవాడే కానీ తపోవిద్యా వీర్యముకల శుక్రునకు తెలిసిన సంజీవనీ విద్య బృహస్పతికి తెలియకపోవుటచేత రాక్షసులచేతిలో మరణించిన దేవతలను తిరిగి బ్రదికింప లేకుండెను. అందుచే దేవతలు మిగుల విషాదమును పొందుచుండిరి. వారు కావ్యుడగు ఉశనసునకు (శుక్రునకు) మిగుల భయపడుచు బృహస్పతి జ్యేష్ఠపుత్రుడగు కచుని కడకు వచ్చి ఇట్లు పలికిరి: అయ్యా! మేము మిమ్ముల ఆశ్రయించుచున్నాము. మాకు మీరు రక్షణ మీయవలెను. మాకు మీరొక సహాయము చేయవలెను. అమిత తేజోవంతుడగు శుక్రుని యొద్దనున్న సంజీవనీ విద్యను శీఘ్రముగా సంపాదించి తెచ్చి మాకు ఉపకారము చేయుడు. మేము నీకు మాతోపాటు యజ్ఞ భాగమును అంగీకరింతుము. నీవు ఆ బ్రాహ్మణుని రాక్షస రాజగు వృషపర్వుని యెద్ద దర్శింప వచ్చును. అతడచ్చట నుండి రాక్షసులను రక్షించుచు రాక్షసులు కాని వారికి రక్షణ కలుగ నీయకున్నాడు. ఇంతకుముందు ఎవ్వరును అతనిని మెప్పించ గలవారు లేకుండిరి. ఆ మహాత్మునకు దేవయానియను ప్రియపుత్రి కలదు. నీవు తప్ప ఆమెను ఆరాధించి మెప్పించ గలవారు ఇంకెవ్వరును లేరు. నీ శీలము, తీయని నడువడి, ప్రీతిభావము, ఆచారము, ఇంద్రియ నిగ్రహము, వీటితో నీవామెను ఆరాధించి సంతుష్టురాలనుగా చేయుము. ఆమె సంతుష్టురాలయినచో నీవు నిశ్చయముగా ఆ విద్యను సంపాదింపగలవు.”

బృహస్పతి కుమారుడగు కచుడు దేవతల ప్రార్థన నంగీకరించి దేవతలు తను అభి పూజించుచుండ బయలుదేరి వృషపర్వుని రాజధానికి పోయి అచట శుక్రుని దర్శించి ఇట్లు పలికెను: ”నేను అంగిరసుని మనుమడను-బృహస్పతి కుమారుడను. కచుడనువాడను. తాము నన్ను తమ శిష్యునిగా గ్రహింపవలెను. గురుకులమున వేయి సంవత్సరములైనను బ్రహ్మచర్య వ్రతమును ఆచరింపగలను. అందులకు నన్ననుమతించుడు.” అనగా శుక్రుడును కచునకు ఆదరముతో స్వాగతము పలికి నాయనా! నీ కోరిక నంగీకరించుచున్నాను. నీవు అర్చనీయుడవు. కావున నిన్నర్చింతును. నిన్నర్చించినచో బృహస్పతిని అర్చించినట్లే అనెను. కచుడును కవిముని పుత్రుడగు ఉశనసుడు (శుక్రుడు) స్వయముగా ఆదేశించిన బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించెను. ప్రతకాలమంతయును గురువు చెప్పినట్లు పాటించుచు తన ఉపాధ్యాయుని దేవయానిని కూడ ఆరాధించుచుండెను.

కచుడు తానును యువకుడు. దేవయానియు యౌవనమందుండెను. అందుచే ఆమెను మెప్పింప గోరి అతడు నిరంతరమును గానము చేయుట నృత్యము చేయుట వాద్యములు మ్రోయించుట ద్వారమున ఆమెను సంతోషపెట్టుచుండెను. ఆమె మనస్సును అనుసరించి నడుచుకొనుచు ఆమెకు ఇష్టములగు పూవులు పండ్లు తెచ్చి ఇచ్చుచు ఆమె చెప్పిన పనులు చేయుచుండెను. ఆ విప్రుడు కచుడు ఇట్లు గురుకుల నియమములను అనుష్ఠించుచు తనదేహ సంస్కారమును కూడ మరచియుండెను. ఇట్టి కచునిపై ప్రీతి కలిగి దేవయాని అపుడపుడు ఏకాంతమున అతనితో మాటలాడుచుండెడిది.

ఇట్లు ఐదువందల సంవత్సరములు గడచెను. ఈ విషయమును రాక్షసులు తెలిసికొనిరి. అతడేదో సంకల్పముతో ఇట్లు తీవ్రమగు బ్రహ్మచర్య వ్రతమును పాటించుచున్నాడని వారు గుర్తించిరి. వారు బృహస్పతిపై పగతీర్చుకో వలెననియు సంజీవని విద్య రక్షించుకొనవలెననియు సంకల్పించుకొనిరి. ఒకనాడు ఆ కచుడు ఒంటిగా అడవిలో గోవులను కాచుచుండుట చూచి వారు అతనిని చంపిరి. నువ్వు గింజలంత ముక్కలుచేసిరి. వాటిని సాలావృకములను మృగము లకు తినవేసిరి. గోవులు అంతట సాయంకాలమున తమ్ము కాచు కచుడు లేకయే తమ (శుక్రుని) ఆశ్రమమునకు పోయెను. కచుడు లేకయే వనము నుండి మరలివచ్చిన గోవులను దేవయాని చూచెను. కొంతసేపటి తరువాత ఆమె శుక్రుని కడకుపోయి ఇట్లు పలికెను. ”తండ్రీ! సూర్యుడు అస్తమించినాడు. మీ అగ్నిహోత్రములందు హోమము ముగిసినది. గోపాలకుడు లేకయే గోవులు మరలివచ్చినవి. కచుడుమాత్రము కనబడుటలేదు. అతనిని ఎవరో చంపుటయో అతడు తానే కారణముననో మరణించుటయో జరిగినట్లు తోచుచున్నది. ఉన్నమాట చెప్పుచున్నాను. అతడు లేనిదే నేను జీవించజాలను.” అది విని శుక్రుడును ”ఇదుగో! ఇదుగో! రమ్ము! అని పలికినంతనే కచుడు జీవించి వచ్చును” అనుచు సంజీవనీ విద్యనుప్రయోగించెను. కచుని పిలిచెను. పిలిచిన వెంటనే అతడు ఆవిద్యకు అంది జీవించివచ్చి ఎదుట నిలిచెను.

మరల ఒకనాడు దేవయాని కోరగా ఆమె కొరకు పుష్పములను తెచ్చుటకై శాశ్వతమగు (ఏలయన అది పరబ్రహ్మమువలెనే శాశ్వతమును-ప్రతి సృష్టియందును తనంతట తాను నిష్పన్నమై బ్రహ్మాది ఋషులకు దర్శనమును ఇచ్చుచు లోకమున పరంపరాగత మయి వ్యాపించునదియును) బ్రహ్మమును-వేదమును అయిను పఠించుచు అరణ్యమునకు పోయెను. అంతట మరల రాక్షసులు రెండవమారు కచుని చంపి చూర్ణముగా చేసి దానిని మద్యములో కలిపి శుక్రునకు తావుటకై ఇచ్చిరి.

మరల దేవయాని తన తండ్రి కడకు పోయి తండ్రితో ఇట్లు పలికెను. “నాయనా! నేను పూలు తెమ్మని కచుని పంపితిని. ఆ పనికై వెళ్ళిన అతడు తిరిగి కనబడలేదు. బృహస్పతి పుత్రుడు మృతుడై ప్రేతల గతికి పోయియుండును.”

శుక్రుడు”నేను అతనిని మరల విద్యతో జీవింపజేసినను నేను నీకు చేయు ఉపకారమే మున్నది? దేవయానీ! నీవు ఇట్లు శోకింపకుము. ఏడువకుము. ఐనను నీకు మాత్రము తక్కువ ఏమున్నది? ఇంద్రుని సేవించుచుండు. దేవర్షులును బ్రహ్మర్షులును మునులును ఇంద్రాది దేవతలును వసువులును అశ్వినులును రాక్షసు లందరును లోకమునందలి ప్రతియొక పదార్థమును నా తపః ప్రభావమున నీ సేవకై నీ ఎదుట నిలుచును. ఇట్టి నీ వంటి స్త్రీ ఒక మర్త్యుని విషయములో శోకించుట తగినది కాదు. అదియును కాక ఈ బ్రాహ్మణుని జీవింపజేయుట సాధ్యముకాదు. ఒకవేళ జీవింపజేసినను అతడు మరల మరణించును.”

అందుకు దేవయాని, సాక్షాత్ ప్రజాపతియగు అంగిరసుడు లోకము నందలి వృద్ధతముల లోనివాడు ఈ కచునికి తపోనిధియగు బృహస్పతి ఇతని తండ్రి. బ్రహ్మచర్య వ్రతమును అను ష్ఠించుచున్నవాడు. తపోధనుడు. ఎల్లప్పుడు ఉన్నతమగు చిత్తవృత్తితో ఉండువాడు. కార్యములను ఎట్టివానినైనను నిర్వహించుటలో సమర్థుడు. చాలసుందరుడు. నాకు ఇష్టుడు. నేను కచుని మార్గమునే అనుసరింతురు. భోజనము చేయను.”

దేవయాని పలికిన మాటలువిని మహర్షియు కవి కుమారుడునగు శుక్రుడు క్రోధావేశముతో ఇట్లుపలికెను, ఈరాక్షసులు నాశిష్యుని యందు పగపూని ఇట్లు చంపుచున్నారు. అనిన-వారు నన్నును ద్వేషించుచున్నట్లున్నది. దానవులు ఈ విధముగా చేయుచున్నారనిన-వారు బ్రాహ్మణులనే నశింపజేయదలచుచున్నట్లున్నది. వారుచేయదలచు-చేయు-ఈపని కూడ ఇంతటితోనే ముగియగలదు. బ్రహ్మహత్యా దోషము ఎవనిని కాల్చివేయకుండును? అది ఇంద్రుని కూడ విడువదు.”

ఇట్లు పలికి శుక్రుడు విద్యతో కచుని పిలిచెను. దానితో అతడు బ్రదికెను. తరువాత అతనిని దగ్గరకు రమ్మని పిలిచెను. అతడు శుక్రుని ఉదరమందుండియే నెమ్మదిగా మాటలాడెను. శుక్రుడును కచునితో ”విప్రా! ఎవరు చేసిన పనిచేత నీవు నా ఉదరములోనికి వచ్చి ఇక్కడ ఇట్లున్నావో చెప్పుము” అనెను.

కచుడు, అయ్యా! మీ అనుగ్రహమువలన పూర్వ స్మృతి జ్ఞానము నన్ను విడుచుటలేదు. ఏది ఎట్లు జరిగినదో అంతయు స్మృతియందు ఉన్నది. (ఇక్కడ నాకు కలుగుచున్న బాధను నా తపో మహిమతో పోగొట్టుకొనగలను. బయటకు రాగలను. కాని) నా తపోనాశము జరుగనీయ రాదనుతలంపుతో ఈ బాధను సహించుచు ఊరకున్నాను. రాక్షసులు నన్ను చంపి కాల్చి నీ మధ్యములో కలిపి నీకు ఇచ్చినారు. మీరు ఇంతటివారు ఉండగా రాక్షసమాయ కాని మరి ఏ ఇతరుల మాయకాని వేదశక్తితో సిద్ధించిన బ్రాహ్మణ మాయను మించిపోగలదు?”

శుక్రుడు,”పుత్త్రీ! నామరణము జరుగనిదే కచుడు జీవించుట జరుగదు. నా ఉదరము చీలనిదే నా పొట్టలోని ఈ కచుడు బయటకు వచ్చి కనబడు అవకాశము లేదు. ఈ రెంటిలో నీకు ఏది ప్రియమో తెలిపినచో అది చేయుదును.”

దేవయాని, ”నన్ను అగ్నివంటి రెండు శోకములు దహించుచున్నవి. వానిలో ఒకటి కచుని మరణము-రెండవది మీ నాశము. కచుని నాశము వలన నాధర్మము నశించును. మీరు మరణించినచో నేను బ్రదుకనే బ్రదుకజాలను.”

శుక్రుడు (కచునితో): ”బృహస్పతి కుమారా! నీవు భక్తితో దేవయానిని సేవించి ప్రతిఫలముగా నీవు ఆమె భక్తిని పొందగలుగుటచేత నీవు నీ యత్నములో సంపూర్ణముగా సిద్ధి పొందితివి. ఇదిగో! ఈసంజీవనీ విద్యను నీకు అందించుచున్నాను. గ్రహింపుము. నీవు కచుని రూపములో నున్న ఇంద్రుడవు ఐనచో మాత్రము నీకు నేను ఈ విద్యనీయను. ఏలయనగా బ్రాహ్మణుడుతప్ప మరెవ్వడును నా ఉదరమునుండి పునర్జీవితుడయి బయటకు వచ్చు అవకాశము లేదు. నీవు బ్రాహ్మణుడవే కనుక నాకుమారుడవయి నానుండి విద్యను స్వీకరింపుము. అనంతరము ఆ విద్యా గ్రహణముతో దానిని భావనచేసి (ఆ మంత్రము నందు సిద్ధిని పొంది) తరువాతనే నీవు నా శరీరము నుండి వెలుపలికి రావలెను.”

ఇట్లు పలికి శుక్రుడు అధర్మపరులయి ప్రవర్తించువారి భేదమును (ధర్మపరులకును అధర్మపరులకును గల భేదమును) నిందించెను. అంతట కచుడు గురువగు శుక్రుని నుండి సంజీవనీ విద్యను అందుకొని విద్యాసహితుడై అతని దక్షిణకుక్షిని (ఉదరమును) చీల్చుకొని ఎప్పటి సుందర రూపముతో వెలుపలికి వచ్చెను. అపుడతడు రాత్రి కాగానే హిమవత్పర్వతపు తెల్లని శిఖరపు చాటునుండి ఉదయించి పైకి వచ్చు పూర్ణిమ చంద్రునివలె ప్రకాశించెను. కచుడును పడియున్న వేదరాశివంటి శుక్రునిచూచి తన విద్యాబలముచే అతనిని మరల బ్రదికించి లేవదీసెను. ఇట్లు సిద్ధి పొందిన విద్యను సంపాదించుకొని కచుడు గురునికి నమస్కరించి ఇట్లు పలికెను.”సర్వోత్తమమగు బ్రహ్మచర్యవ్రతమును ప్రదానము చేసినవాడును నీధులలో గొప్ప నిధియు గొప్పవారందరలో గొప్పవాడును పూజింపదగినవాడునగు గురుని ఎవరు ఆదరిం చరో- వారు అయోగ్యములును పాపానుభవమును కలిగించునవియును అగు లోకములను పొందుదురు.”

శుక్రుడు తాను సురాపాన ప్రభావమున రాక్షసులవలన వంచనకు పాత్రుడయ్యెను. తన చిత్తమునకుగల తెలివి అంతయు ఘోరమగు నాశమును పొందెను. మిగుల సుందరుడును యోగ్యుడును అగు కచుడు అజ్ఞానముచే మద్యముతో పాటు తనచేత త్రాగబడిన విషయము నాతడాలోచించెను. ఇందుచే ఆ మహానుభావునకు కోపము కలిగి అతడు లేచి నిలువబడెను. సురాపానము విషయమున ఏ సందేహమును లేని నిశ్చయము చేసికొనెను. ఆ కావ్యుడు ఉశ నసుడు బ్రాహ్మణులకు హితము చేయగోరి స్వయముగా ఈ విధముగా పలికెను.”ఇది మొదలు కొని ఏ బ్రాహ్మణుడైన మందబుద్ధియై అజ్ఞానవశమున మధ్యమును త్రావినచో అతడు ధర్మభ్రష్టుడై బ్రహ్మహత్యా పాపమును పొందును. ఇహలోకమునందును పరలోకమునందును నిందితుడగును. బ్రాహ్మణులు ఆచరించవలసిన ధర్మము విషయములో నేను చెప్పిన అవధిని ధర్మవ్యవస్థను లోకమునందంతట విప్రులు నిలుపుకొందురుగాక! వేదములందును శాస్త్రము లందును పెద్దల వచనములందును ప్రామాణ్య బుద్ధి కలవారును గురువుల నుండి వేదశాస్త్ర తత్త్వమును అధ్యయనము చేసినవారును అగు విప్రులును దేవలోకమునందలి దేవతలును, దేవర్షులును అందరును దీనిని విందురుగాక!”

మహానుభావుడును తపోనిధులలోగూడ ఇంత గొప్పది అని చెప్పనలవికాని గొప్పనిధి యును అగు అశుక్రుడు విమూఢ బుద్ధులగు దానవులను కూడ పిలిచి ఇట్లు పలికెను.”బాలిశులైన దానవులారా! మీకు ఒకమాట చెప్పుచున్నాను వినుడు. నా శిష్యుడగు ఈ కచుడు నావలన మాయారహితమగు సంజీవనీ విద్యనుసంపాదించి నాప్రభావముతో సమాన ప్రభావము కలిగి బ్రహ్మత్వమునే పొందిన బ్రాహ్మణుడై నా సమీపమున ఉండును.”

ఇట్లు కచుడు ఋషియు తన గురువును అగు శుక్రుని దగ్గర వేయి సంవత్సరములు ఉండి గురునినుండి అనుమతిని పొంది స్వర్గమునకు మరలి పోదలచెను.