విరక్తుడగు భృత్యుని గుర్తించుట

విరక్తుడగు భృత్యుడు మదముతో నిండిన మాటలు పలుకును; తుదకు తన జీవనమునకే ముప్పుతెచ్చుకొనును; వాక్యములు ఆరంభించునప్పుడు సంతోషముతోనే ఉండి ఆరంభించును; కాని అదేవిధముగా తుదవరకు మాటలాడడు, రాజు నారాధించి, మెప్పించ వలసిన సర్వ విష యములందును నిదురపోవుచున్నట్లు వర్తించును; మాటలందు తప్పులు వెదకి ఎత్తి చూపు చుండును; మాటకు నడుమనే త్రుంచివేయును, తన ప్రభుని గుణములను కీర్తించునప్పుడు కూడ విముఖుడుగా కనబడుచుండును, తాను పనులు చేయుచుండియు తన చూపును మరియొక చోట నుంచును, విరక్తుని లక్షణములు ఇట్లుండును. ఇక- రక్తుడగు భృత్యుని లక్షణములు ఇట్లుండును. తన ప్రభుని చూచినంతనే ప్రసన్నుడగును; చెప్పిన వాక్యమును ఆదరముతో స్వీకరించును, కుశలప్రశ్నాదికము చేయునపుడు హర్షములో విన ఇంపుగా మాటలాడును; ఏకాంతమునందు రహస్య వివిక్త స్థలములందు తన ప్రభువు తనకు కనబడినను జంకుగొనడు; తన ప్రభుని గూర్చిన మాటలు ఇతరుల నోట వినునపు డతని మొగమున హర్షము కనబడును; తన ప్రభువుతన్నేవైన ఆప్రియ వచనములాడినను అవి మెచ్చునే కాని కోపింపడు; తన ప్రభువిచ్చిన ఆదరము గాని పారితోషికముగాని అల్పమైనను గొప్పదియను గౌరవముతో గ్రహించును, మాటలనడుమ తనప్రభుని గూర్చినమాట తటస్థించినచో హర్షము మొగమున పొడచూపును, ఇట్టివానిని రక్తుడగు సేవకునిగా గురుతించి వానిచేత సేవ చేయించుకొనవలెను; ఆపదల యందున్న భృత్యునికాని ఎవరు విడువక ఆదుకొందురో అట్టి ప్రభువును తన ప్రభువును రాజును త్రిగుణాతీతుడు అప్రమేయుడు అగు భగవంతునిగా ఎవరు భావించి వాని నాశ్రయింతురో అట్టి భృత్యులును ప్రజలును అమర బృందాశ్రితమగు దేవేంద్ర స్థానమగు స్వర్గమునుచేరి సుఖింతురు.