మత్స్య మహా పురాణము
యయాతి, అష్టక సంవాదము
యయాతి, “నేను యయాతి అనువాడను. నహుషుని పుత్రుడను. పూరుని తండ్రిని. సర్వభూతములను అవమానించినందున పుణ్యము తరిగి పడద్రోయబడి సురసిద్ధ ఋషిలోకము నుండి జారినవాడనగుచు పడుచున్నాను. వయస్సుచేత మీకంటె పూర్వుడను కావున మీకు నమస్కరింపకున్నాను. ద్విజులలో (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో) విద్యచేగాని తపస్సుచేగాని జన్మచేగాని వృద్ధుడగువాడు పూజ్యుడు. అష్టకుడు: “రాజా! ‘నేను వయస్సుచే చాల పెద్దవాడను” అని నిను గూర్చిచెప్పితివి. ఏదోయొక విధముగా (మాకంటె)అత్యధికుడవే. ఎవడు తాను విద్వాంసుడును వయస్సుచేతను పెద్దవాడునునై యుండునో అతడు ద్విజులలో తప్పక పూజ్యుడే.” యయాతి: “కర్మములలో (ఇతరులకు) ప్రతికూలమయినది పాపము అనబడును. దానిని అనుసరించువారికి పాపలోకమే గమ్యస్థానము. సత్పురుషులు అసత్పురుషులు అనుసరించెడు పాపకర్మము అనువర్తించరు. వీరికి సత్పురుషులు అనుకూలురైనట్లు అసత్పురుషులు కారు. నాకు విస్తారమగు ధనమున్నది. అది గొప్పది కూడను. యత్నముచేసినచో దానిని పొందక పోవుదునా? అని మనస్సున నిశ్చయము కలిగి ఆత్మ హితమునకై అభినివేశముతో యత్నించువాడు జీవుని తత్త్వమును అనుభవ సహితముగా తెలిసికొనగలడు. జీవలోకము నందలి జీవులు నానా రూపములలో నున్నారు. వీరందరును దేవునకుఅధీనులు. తమతమ యత్నలందును ఆలోచనములందును అస్వతంత్రులు. బుద్ధిమంతుడగువాడు అదృష్టము బలవత్తరమయినదని ఎరుగవలయును. తనకు అప్రియములగు ఆయాఅనుభవములు ప్రాప్తించినపుడు దుఃఖము నొందరాదు. జీవులు సుఖమును కాని దుఃఖమును కాని దైవమునకు అధీనులై పొందుదురే కాని తమ శక్తితో (స్వతంత్రతతో) కాదు. కావున దైవము బలవత్తరమని గురుతెరిగి ఎప్పుడును దుఃఖమును గాని హర్షమునుగాని పొందరాదు. దుఃఖము ప్రాప్తించినచో మోహముగాని సుఖము ప్రాప్తించినపుడు హర్షమునుకాని పొందక విచారశీలుడై రెంటియందును సమభావముతో ఉండవలయును. దైవము బలవత్తరమని ఎరిగి ఎట్టి స్థితియందును మనస్సున బాధనొందకుండ వలయును. అష్టకా! నేను మాత్రము భయము ప్రాప్తించినను మోహము పొందను. ఏ సమయ మందును నా మనస్సునకు ఏమాత్రమును సంతాపము ఉండదు. సృష్టికర్త లోకమునందు ఎట్లు చేయునో నేను అట్లే అగుదునని నేను తలంతును. స్వేదజములు జరాయుజములు అండజములు ఉద్భిజ్జములు సరీసృపములు (ప్రాకెడి ప్రాణులు) క్రీములు మత్స్యములు మొదలగు ప్రాణులుకాని, శిలలు తృణములు కాష్ఠములు ఇట్టివి ఏవి అయినను తమతమ అదృష్టమును అనుభవించుట ముగియగనే తమతమ స్వాభావికస్థితిని పొందును. సుఖదుఃఖములు రెండును అనిత్యములే అని నాకు తెలియును. ఇట్టి నేను ఏ హేతువుచే సంతానమును పొందవలసి యున్నది? జీవునకుఏది చేసిన తరువాతను ఏది చేయుచున్నప్పుడును ఈ సంతాపము కలుగకుండును? ఏది చేసిన తరువాతగాని ఏది చేయుచున్నప్పుడుగాని ప్రతిపనివలన కలుగు ఫలము కూడ సుఖదుఃఖ సంమిశ్రితమే కావున ఏది చేయువానికిని దుఃఖము కలుగుట తప్పదు. అందుచే నేను ఏమియు పొరపడక (అన్ని సందర్భములందును) సంతాపమును పొందక యుందును.
ఇట్లు చెప్పుచుపోవుచున్న యయాతి రాజును అష్టకుడు మరల అడిగెను, యయాతి అష్టకునకు మాతామహుడు కావున ఏ విషయమునైన అడుగదగిన చనవు తనకు గలదు. అతడు సర్వ విషయములను ఎరిగియుండుటేకాక సర్వ సద్గుణములును గలవాడు. కావున ఏ విషయములనైనను విసుగులేకుండ చెప్పగలడు. అష్టకుడిట్లడిగెను: “రాజేంద్రా! యయాతిరాజా! నీవు క్షేత్ర -క్షేత్రజ్ఞతత్త్వమును ఎరిగినవాడువలె ధర్మమును చెప్పుచున్నావు. ఇట్టి నీవు స్వర్గలోకము నందు ఎచ్చటనెచ్చట నుంటివో ఏయే ప్రధాన లోకముల ననుభవించితివో ఎంతకాలము అనుభవించితివో ఎట్లనుభవించితివో ఈ ప్రతి ఒక్క అంశమును వాస్తవ రూపమున నాకు తెలుపుము.” యయాతి: “నేను భూలోకమునందు ఉన్నంతవరకును సార్వభౌముడనగు రాజుగా నుంటిని. దేహత్యాగానంతరము ‘మహత్’ జనులు నివసించెడి లోకములందు సంచరింపసాగితిని. అచ్చట సహస్రవర్షములుంటిని. తరువాత అంతకంటెను పై లోకములకు పోయితిని. తరువాత అచ్చటి నుండి ఇంద్రుని నగరికి పోయినాను. అది రమ్యమయినది. అది వేయివాకిండ్లు గలది. నూరు యోజనముల పరిధి కలది. దానియందు సహస్ర సంవత్సరములుంటిని. తరువాత దానికంటె పై లోకములకు వెళ్లితిని. తరువాత లోక రక్షకుడగు ప్రజాపతి లోకమునకు వెళ్లితిని. అది దివ్యము. ఎన్నటికిని చెడనిది. దానిని చేరుట సుకరము కూడ కాదు. అచ్చటను నేను సహస్రవర్షము లుంటిని. తరువాత దానికంటె పైలోకమునకు వెళ్లితిని. ఇట్లు ఏయే దేవుని లోకమున కైనను (నా పుణ్యబలముచే) దానిని జయించి వెళ్లితిని. కనుకనే వాటియందు నేను నా ఇచ్చ ననుసరించి నివసించితిని. లోకేశ్వరుల కాంతితో ప్రభావముతో తుల్యములగు ద్యుతియు ప్రభావమును కలిగి అచ్చట నుండెడివాడను. సమస్త దేవతలును నన్నచ్చట సంపూజించు (సర్వోపచారములతో ఆదరించు చుండెడివారు. అట్లు నేను నందనవనమునందు కామరూపుడనై అయుతవత సంవత్సరములు (10000x100=1000000) ఉంటిని. అచ్చట మనోహరములగు రూపములు కలవియు పుష్పించినవియు అగు పుణ్య సుగంధవంతములగు మనోహర పుష్పములను చూచుచు అప్సరసలతోకూడి సంచరించెడివాడను. ఇట్లు దేవభోగముల యందు ఆసక్తుడనై నేనచటనుండగా అవధి లేనంత అధికకాలము గడచెను. అంతలో భయంకర రూపుడగు దేవదూత యొకడు వచ్చి ప్లుతస్వరముతో ‘ధ్వంస’ (జారిపడుము!) అని మూడు మారులుబిగ్గరగా అనెను. రాజసింహా! నాకుఇంత మాత్రమేతెలియును. వెంటనే నేను క్షీణపుణ్యుడనై నందనమునుండి జారిపడితిని. ఇంతేకాక అంతరిక్షమందు నాస్థితికై శోకించు దేవతల దయాపూర్ణమైన వాక్కులు నాకిట్లు వినబడెను: “అయ్యో! ఎంత కష్టము! ఇదుగో! ఈ యయాతి పుణ్యకర్మములు ఆచరించి పుణ్యమును సంపాదించినవాడు. పుణ్యకరమగు కీర్తి కలవాడు. ఇట్టివాడు క్షీణపుణ్యుడై క్రింద పడుచున్నాడే!” ఏమైనను నేనచ్చటినుండి పడ ద్రోయబడితిని. క్రిందకు పడుచునేయుంటిని. కనుక సత్ జనుల నడుమ నేను పడవలెనని దీవించి పలుకుడని నేను వారిని వేడితిని. వారును మీయజ్ఞ భూమిని పేర్కొనిరి. నాకువెంటనే ఇది కనబడినది. త్వరితముగా ఇటకు చేరితిని. ఎట్లన హవిర్గంధములే మీయజ్ఞ భూమిని నాకు చూపినవి. యజ్ఞ ధూమపుకొనను దాని సుగంధమును అందుకొని ఆనందితుడనైతిని.”
అష్టకుడు, “కృతయుగపువారిలో ప్రధానుడవగు యయాతి, నీవు నందనవనమున కామరూపుడవయి నూరు పదివేల సంవత్సరములున్న తరువాత దానిని విడిచి భూలోకమునకు చేరుకొంటివిగదా! కారణమేమి?” యయాతి: “ఈ లోకములో మానవునకు ధనము క్షీణించిన తరువాత అతనిని అతని జ్ఞాతులును మిత్రులును స్వజనులును విడిచిపెట్టుదురు గదా! అట్లే ఆలోకములందు లోకపాలురును దేవ సంఘములును మనుష్యుని పుణ్యము నశించగానే అతనిని వదలి వేయుదురు.” అష్టకుడు: “మానవు లచట క్షీణపుణ్యు లెట్లగుదురు? ఈ విషయమున నాకేమియు తెలియుటలేదు. ఏ విషయమున ఎంత విశిష్టులు (ఇచట పడిన తరువాత మరల) ఏ లోకమును చేరుదురు? ఇది యంతయు నాకు చెప్పుము. నీవు క్షేత్ర తత్త్వమును దేహము- దేహధారికి కలుగు ధర్మాధర్మ ఫలములు మొదలగునవి ఎరిగినవాడవను విశ్వాసముతో అడుగుచున్నాను.” యయాతి, “స్వర్గము నుండి ఈ భూలోకమును చేరుకొనిన జీవులు ఈ భౌమ (భూలోక సంబంధి) నరకమున పడుదురు. వారందరును రాజా! (తమకు కలిగిన ఈ స్థితికై) విలపింతురు. భూలోకమునపడి వారు అనేక విధముల ప్రాణులుగా వృద్ధిపొంది రాబందులు నక్కలు పిల్లులు మొదలగు ప్రాణులకు ఆహారమగుదురు. కావున మానవుడు ఈ లోకములో దుష్టమును నిందనీయమును నగు కర్మమును చేయక విడువవలయును. నీవడిగినది అంతయును చెప్పితిని. ఇపుడింకేమి చెప్పవలయును?” అష్టకుడు: “పాపకర్ములగు వారిని గ్రద్దలు నెమళ్ళు మొదలగు పక్షులు ఎట్లు బాధించును? ఈ నరక బాధలలో ఈ జీవులు ఎట్లు ఉందురు? ఎట్లు ఉండరు? భౌమమగు నరకమును గురించి ఇంకను వినగోరుచున్నాను.” యయాతి: “ఈ దేహము కర్మను అనుసరించి రూపొందుచుండును. (ఎవరు చేసిన కర్మమునకు తగిన శరీరమును వారు పొందుదురు.) దేహమును విడిచిన తరువాత వారు దానిని బట్టియే పృథివి యందును ఆయా దేహములను ధరించి సంచరింతురు. స్వర్గమునుండి పడినవారును అట్లే ఈ భౌమ నరకమున వారు పడుదురు. అనేక సంవత్సరములపాటు మరల వెనుకకు తిరిగి చూడనైన లేకుందురు. పుణ్యలోకములనుండి భ్రష్టులైనవారు క్రిందికి పడుచు అరువదివేల ఎనుబది సంవత్సరములపాటు అంతరిక్షమునందే యుందురు. వారిని ఆ కాలములో వాడి కోరలుగల భయంకర రాక్షసులు పీడించుచుందురు.” అష్టకుడు, “ఇట్లు ఆ భయంకర రాక్షసుల పీడలు అనుభవించిన తరువాత ఈ జీవులు ఏఏ విధముల ఉందురు: ఎట్లుండరు? ఏయే స్థితుల పొంది ఈ జీవులు గర్భముగా రూపొందుదురు?” యయాతి: “కొందరు జీవులు మానవులగుదురు. వారి విషయము. పురుషుడు వదలిన రేతస్సు స్త్రీకి చెందిన పుష్ప ఫలముతో (రజోరక్తముతో) కలిసి స్ర్తీ రక్తమున ప్రవేశించును. ఇట్లు జీవుడు మానవ రజస్సును చేరును. పిమ్మట అచ్చట గర్భముగా అగును. మరికొన్ని జీవులు వనస్పతులను ఓషధులను వాయువును నీటిని పృథివిని అంతరిక్షమును చతుష్పాత్ప్రాణులను ద్విపాత్ర్పాణులను-దీనిలో వేటినైనను ప్రవేశించును.” అంత అష్టకుడు, “మానవలోకము నందలి ఆయా శరీరములను జీవులు పొందుటలో వారు తమ సంకల్పము ననుసరించి తాము కోరిన శరీరమును పొందుదురా? లేక మరిఏదైన హేతువు వారిని గర్భముగా (గర్భస్థ శిశువుగా) రూపొందించునా? నాకుగల ఈ సంశయమును తెలియగోరుచున్నాను. చెప్పుము. ఏహేతువుచే హెచ్చుతగ్గులుగల వివిధ శరీరములను వాని యందలి చక్షుఃశ్రోత్రాదీంద్రియ భేదములను సంజ్ఞా (అనుభూతి) భేదమును పొందగలుగుదురు? నేను ప్రశ్నించిన ఈ విషయములన్నియు చెప్పుము. ఏలయన నీవు క్షేత్ర (శరీర సృష్టి) తత్త్వమును ఎరిగినవాడవని మేమందరము (అష్టక సోదరులు) అనుకొనుచున్నాము.’ యయాతి: “ఋతుకాలమునందు రేతస్సుతో రజస్సుతో సంపర్కము చెందిన గర్భయోనిని (గర్భము నిలిచి యుండెడి ఉదరకోశమును) వాయువు లాగిపట్టి యుంచును. ఆ వాయువు అ గర్భకోశమునందు పంచతన్మాత్రలకు తాను ఆశ్రయమైయుండి గర్భమును వృద్ధిపొందించును. అనంతరము జీవుడు వ్యక్తత పొందుచు అవయవములు స్పష్టములగుచురాగా అనుభవ జ్ఞానమును పొందుచు వచ్చును. క్రమముగ శ్రోత్రముతో శబ్దమును చక్షుస్సుతో రూపమును ఘ్రాణముతో గంధమును జిహ్వతో రసమును త్వక్కుతో స్పర్శమును మనస్సుతో భావమును తెలిసికొనును. అష్టకా! ఈ జీవ లోకములో దేహి యొక్క (మానవుల) దేహబుద్ధి క్రమము ఈ విధముగ నుండును అని ఎరుగుము.” అష్టకుడు: “మరణించిన మానవుడు దహింపబడికాని పాతివేయబడికాని ప్రాణులచే తినబడికాని అభావమునుపొంది నశించునుకదా! అతడు మరల తనుతాను చేతన పదార్థముగా ఎట్లు రూపొందించు కొనును?” యయాతి: “గాఢనిద్ర పోవువాడు గుర్రుపెట్టినట్లు మానవుడు మూలిగి ప్రాణములను విడుచును. అనగా ఈ దేహమును విడుచును. అతని సుకృత దుష్కృత ములు మాత్ర మతనికి ముందుండి అతనిని తమవెంటగొని పోవును. తరువాత మరల నతడు తన పుణ్యపాపముల ననుసరించి లభించిన మరియొక (మాతృ, పితృ) గర్భమును ప్రవేశించును. మహానుభావా! పుణ్యమును చేసినవారు పుణ్యయోనిని (జన్మమును) పాపము చేసినవారు పాప జన్మమును పొందుదురు. అతి పాపులు కీటకములుగా పక్షులుగా అగుదురు. వాటిని వివరించి చెప్పు శక్తి నాకులేదు. ఆయా భూతములు గర్భభూతులై (గర్భమునందలి శిశువులుగానై) మరికొందరు నాలుగు పాదములు-రెండు పాదములు- ఆరుపాదములు-కల ప్రాణి విశేషములుగా నగుదురు. నీవడిగిన ఈ విషయ మంతయు ఏమియు వదలక చెప్పితిని. మరింకేమి యడుగుదువు?” అష్టకుడు: “తండ్రీ! మర్త్యుడుఏమి చేసినచో-తపస్సును చేసియో-విద్యను ఆర్జించియో-శ్రేష్ఠములగు లోకమును పొందును? క్రమక్రమముగా ఉత్తరోత్తరము మేలగు లోకములను ఏ ఉపాయముచే పొందవచ్చును? నేనడిగిన ఈ ప్రశ్నకు సమాధానము ఉన్నదున్నట్లు చెప్పుము.” యయాతి: “తపస్సు, దానము, శమము (అంతఃకరణ నిగ్రహము), దమము (బహిరింద్రియ నిగ్రహము), సిగ్గు బిడియము, ఋజు (వంకరలేని) స్వభావము, సర్వ భూతముల యందును దయ ఈ ఏడును మానవులకు స్వర్గలోకమునకు పోవు ద్వారములని వివేకులు చెప్పుదురు. మానవులు ఎల్లప్పుడును దురభిమానముచే అజ్ఞానము క్రమ్మగా నశింతురని పెద్దలు చెప్పుదురు. ఎవరు తాను విద్యలను అధ్యయనముచేసి తాను పండితుడయ్యెనని అహంకారపడుచు తన విద్యచే ఇతరులు కీర్తిని నశింపజేయునో అట్టివాని లోకములు (వాడు సుకృతము చేసి పుణ్యలోకములను సాధించుకొన్నను) అంతవంతములు (ముగిసినవి-నశించినవి) అగును. అంతేకాదు. అతడు అధ్యయనము చేసిన వేదము కూడ అతనికి ఫలము నీయదు. మానవునకు భయమును పోగొట్టి ఉత్తమ లోకములకు కొనిపోవు కర్మములు నాలుగును-అగ్ని హోత్రము-మౌనము-(తపస్సు) అధ్యయనము-యజ్ఞము- చేయవలసినట్లు చేయనిచో అధమలోక ప్రాప్తి భయమును కలిగించును. అవి 1. మానాగ్ని హోత్రము; 2. మానతపస్సు; 3. మానాధ్యయనము; 4. మాన యజ్ఞము అనునవి ఇతరులు ఆదరించగా హర్షమునందక అవమానించిరని సంతాపపడక యుండు వానిని సత్ జనులు ఈ లోకమందును పైలోకమందును పూజింతురు. కాని అసాధుజనులు సాధుబుద్ధిని పొందుట దుర్ఘటము. (అది స్వాభావికముగ కలుగవలెను. ఈ ప్రయోజనమునకై దానము చేయుచున్నాను. ఇందులకై యజ్ఞము (దేవతారాధనము) చేయుచున్నాను. ఇందులకై అధ్యయనము చేయుచున్నాను. ఇందులకై వ్రతములను (వైదిక స్మార్త కర్మలను) అనుష్ఠించుచున్నాను. అనిచేయు ఈ పనులన్నియు భయమును కలిగించునవి. కావున వాటిని ఎల్లప్పుడును అన్ని విధముల తప్పక విడువవలయును. ఎవరు తత్త్వము నెరిగినవారై అతి ప్రాచీనము శాశ్వతము అగు ఆశ్రయమును పరమాత్ముని తమ చిత్తవృత్తియందు స్థిరముగ నిలిపి ఆదరింతురో వారు తైజసమగు (స్వయం ప్రకాశమగు) రూపమును పొంది నిః శ్రేయసమును ఇహముననుపరమునను పరమ శాంతిని పొందుదురు.