ఈశ్వరుడు త్రిపురముల దహించుట

మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను, ధర్మరాజా! నీవు నన్నడిగినది తెలిపెదను వినుము; ఈ నడుమ కాలములో నర్మదాతీరమునందు త్రిలోక ప్రసిద్ధమగు మహేశ్వరమను స్థానము నందుండి త్రిపురవధ విషయము ఆలోచించెను. మందర పర్వతమును (గాండీవ) ధనువుగా వాసుకిని అల్లెత్రాటినిగా కుమారస్వామిని శరము నిలుపు స్థానమునుగా విష్ణుని శరమునుగా చేసికొనెను; బాణపు మొనయందు అగ్నిని పై ప్రదేశమున వాయువును నిలిపెను; దేవతలందరు కూడి రథము కాగా నాలుగు వేదములు గుర్రములయ్యెను; అశ్వినులు పగ్గములు ఇంద్రుడు ఇరుసు అయ్యెను. కుబేరుడీశ్వరాజ్ఞచే ప్రధాన ద్వారమందు నిలిచెను; కుడిచేతి వైపున యముడును ఎడమచేతి వైపున భయంకరుడగు కాలదేవుడును ఉండిరి. చక్రమునందు కోట్లకొలదిగా లోకప్రసిద్ధులగు దేవతలును గంధర్వులు నుండిరి. రథపు ముందు భాగమున ప్రజాపతి యుండెను; బ్రహ్మ సారథి అయ్యెను; ఇట్లా దేవేశుడు సర్వదేవమయమగు రథమును నిర్మించుకొని స్థాణుభూతుడై, నిశ్చలుడై, వేయి పరివత్సరముల కాలము అట్లే వేచియుండెను. ఎపుడు ఆ మూడు పురములును ఒకటిగా కూడి అంతరిక్షమునందుండెనో అపుడు రుద్రుడు త్రిపురముల మీదకు తన శరమును ప్రయోగించెను. అది మూడు కణుపులుకు మూడు మొనలును కలది; దానితో రుద్రుడు త్రిపురములను భేదించదలచెను; అప్పటికే త్రిపుర స్త్రీలు తేజో హీన లయిరి; వారి బలము శిథిలమయ్యెను, ఆ త్రిపుర మందును వేలకొలది ఉత్పాతములు ప్రాదు ర్భవించి కనబడెను; అవి అన్నియు త్రిపుర వినాశకరములగు కాలపురుషరూప మయినవి; అవి ఏవి అనిన, కొయ్యతో చేసిన గుర్రములు అట్టహాసములు చేసెను; చిత్తరువులలో బొమ్మలును కన్నులు మూయుచు తెరచుచు ఉండెను, కలలో ఎవరికి వారు తాము రక్తవస్త్రము ధరించి యున్నట్లు కనబడిరి.

అచటివారి కందరకును లోకవిరుద్ధములగు ఏయే విషయములు స్వప్నమునందు .కనబడెనో అవియే ఉత్పాతములుగా జాగ్రదావస్థలో జనులకు కనబడసాగెను. వారి బుద్ధియు బలమును హరుని కోపమున నాశ మందెను. కల్పాంతమందువలె ప్రళయమారుతము చెలరేగి వీచసాగెను, ఆ వాయువుచే ప్రేరణనందిన అగ్నియు, అచటి వారి తలలపైగా పరుగెత్తసాగెను, వృక్షములు మండుచుండెను, భవనములు మొదలగువాని శిఖరములు పడసాగెను; అంతటను కలవరపాటు హాహాకారము చైతన్యము లేకపోవుట వ్యాపించెను, ఉద్యానములన్నియు భగ్నములయ్యెను; ఇంతలో ఆ నగరమే ముక్కలు కాసాగెను, ఆ రుద్రుని మూడు మొనల శరములతో సర్వ నగ రము పీడితమయ్యెను, వృక్షములు ఉద్యాన భాగములు వివిధ గృహములు అన్నియు దగ్ధము లయ్యెను, ఈ సమృద్ధిగల అగ్ని మనశ్శిలల రాశివలె వెలుగుచు పదిదిక్కు లందును పది విధ ములుగ భాగములయి ప్రవర్తిల్లి వ్యాపించెను, పురమంతయు మోదుగపూ వన్నెతో మండుచు కనబడెను, పొగమూలమున ఒక ఇంటి నుండి మరియొక ఇంటికి పోవుటకును శక్యము కాక పోయెను; అది హరకోపాగ్నితో దగ్ధమగుచు, ఏడ్చుచు, దుఃఖించుచు ఉండెను; అట్లా త్రిపుర పురము పెద్దగా మండుచుండ ఆ మంటలన్ని దెసలకును వ్యాపించెను; వేలకొలదిగా ప్రాసాద శిఖరాగ్రములు శిథిలములయ్యెను; నానా మణులతో విచిత్రములయి కనబడు అనేక విమా నములు (మహాభవనములును, ఆకాశ యానములును) రమ్యములగు గృహములును అనేక ములు ఆ ప్రజ్వలించు అగ్నిలో కాలిపోయెను; అచటి జనులందరును తామును కాలిపోవుచు రక్షణకై చెట్ల గుబురులలోనికిని భవనములమీది గూడులవంటి గృహభాగముల (వలభుల) లోనికిని పరుగెత్తసాగిరి; వారు అగ్నిని చూచి వివిధ స్వరములతో ఏడువ సాగిరి; కేకలు వేయ సాగిరి; అచట కొలదిసేపటిలో కొండలశిఖరములంతటి బొగ్గుల, నిప్పు కణికెల, కుప్పలు కనబడసాగెను.

మమ్ము ఇపుడు రక్షించుమా అని దేవదేవేశుని వారు ప్రార్థించసాగిరి; వారు ఒకరి ఇంకొకరు కౌగిలించుకొని అగ్నిమయ బాణజ్వాలలతో జ్వలించ జేయబడుచు వందల, వేలకొలదిగా దాన వులు అచట దహించబడుచుండిరి. హంసలతో, కారండవ పక్షులతో వ్యాప్తము లయి పద్మములతో కూడిన సరస్సులును పురోద్యానములును వాడని పద్మములతో వ్యాపింపబడిన యోజనముల కొలది పొడవు వెడల్పులు కలిగి విశాలములైన నడబావులును అగ్నిచే దగ్ధములయి కనబడ సాగెను. పర్వత శిఖర సమానములును రత్న భూషితములును అగు ప్రాసాదములును అగ్నిచే దగ్ధములయి కనబడసాగెను. పర్వతశిఖర సమానములును రత్నభూషితములును నగు ప్రాసాదములును అగ్నిచే పూర్తిగా కాల్చబడి జలములేని మేఘములవలె బూడిదయై కనబడుచు క్రింద పడుచుండెను. హరుని కోపముచే ప్రేరింపబడిన యగ్ని నిర్దయుడై యువతుల యందును బాలురయందును వృద్ధులయందును క్రమ్మి వారిని దహించుచుండెను. గాఢనిద్ర యందును, స్వప్నములందును మునిగియున్న వేలకొలది జనులు తమతమ పుత్రులను గాఢముగా కౌగిలించుకొని త్రిపురాగ్నిలో కాలిపోవుచుండిరి. అట్లు దీపించుచున్న ఆ త్రిపురములలో అప్సరసల వంటి స్త్రీలు అగ్ని జ్వాలల తాకిడికి చచ్చియు కాలియు ధరణీతలమున పడుచుండిరి. విశాల నయనములు కలదియు ముక్తాహార విభూషితయు నగు ఒకానొక చామనచాయగల సుందరి పొగతో కలత నంది ధరణీతలమున పడెను. బంగారుచాయ కలదియు ఇంద్రనీలమణి విభూషితయు నగు ఒక ముత్తైదువ తన భర్త పడిపోవుట చూచి తాను నతనిపై పడిపోయెను; గాఢనిద్రలో తన ఇంట నున్న సూర్య తేజస్కయగు ఒక స్త్రీ అగ్ని జ్వాలాహతయై తెలివితప్పి పడిపోయెను; గదాహస్తుడై లేచి నిలువబడిన మహాబలుడగు దానవుడు ఒకడు అంతలోనే అగ్నిహతుడయి ధరణీతలమున పడెను; హారములతో కేయూరములతో (బాజబందులతో) భూషితయగు మేఘ సమచ్చాయగల యొక యువతి తెల్లనివస్త్రము ధరించియుండి తన బాలునకు పాలు త్రావించుచుండి అంతలో బాలుడు కాలుచుండుట చూచి మేఘధ్వనితో ఏడువ సాగెను. హరక్రోధ ప్రేరితుడగు అగ్ని త్రిపురమును ఇట్లు దహించసాగెను.

వజ్రవైడూర్యభూషితయు చంద్ర సమానకాంతియు సౌమ్య స్వభావయు నగు ఒక యువతి పుత్రుని కౌగిలించుకొని కాలిపోవుచు వణకుచు నేలపై బడెను; సూర్యునివలెను అద్దమువలెను తళతళ మెరయు వన్నెకలదయి లక్ష్మియే అనదగి శోభిల్లు ఒక యువతి వహ్ని దహ్యమాన యగుచు ధరణీ తలమున పడిపోయెను, మొల్లపూవువలెను చంద్రుని వలెను దేహకాంతిగల యొకతె తన గృహమున నిద్రించుచుండగా ఆ గృహము కాలుచుండ అగ్నిజ్వాలల తాపమునకు మేల్కాంచి అంతయు మండుచుండుట చూచి అయ్యో! నా సుతుడు మరణించెనే అని ఏడ్చుచు కుమారుని కౌగిలించుకొని ధరణి తలమున పడెను; బంగరుచాయ గలదియు నీలరత్నభూషితయు అగు ఒక స్త్రీ పొగతో కలవరపడి క్రింద పడిపోయెను, అనేక దివ్యరత్నాలంకృతయగు తన బాలిక దహింపబడుచుండుట చూచి దహనుని తాపముచే దిక్కు తోచకయుండి తాను తన చెలితోడయి పట్టుకొని యుండగా శిరస్సునందు అంజలి ఘటించి అగ్నికి ఇట్లు మనవి చేయ సాగెను; “నీవు అపకారులగు పురుషులందు పగబూనిన పూనెదవు కాక! గృహమను పంజం “మందు కోకిలలవంటి వారగు స్త్రీలు నీకేమి అపరాధ మొనర్చినారు. పాపా! నిర్దయా! నిర్లజ్జా! స్త్రీలపై నీకు కోపము ఏల? నీకు దాక్షిణ్యము లేదు; లజ్జ లేదు; సత్యము లేదు; శౌర్యము లేదు అనుచు ఈ ఉపద్రవముతో బాధ నందిన ఆ స్త్రీ అగ్నిని నిందింపసాగెను, శత్రుపక్షము వారినే యైనను స్త్రీలను చంపరాదను మాట నీవు వినలేదా? కాని అగ్నీ! నీ గుణములన్నియు నాశము విషయమందే ప్రవర్తిల్లుచున్నవి. నీకు స్త్రీలపై దయలేదు; దాక్షిణ్యము లేదు; కారుణ్యములేదు; కాలిపోవుచున్న ఆడువారిని చూచినపుడు మ్లేచ్ఛులకైనను దయ కలుగునే! నీవు ఆ మ్లేచ్ఛులకంటెను నీచతరుడవు, నిన్నెవరు కాని మానుపజాలరు; ఏలయన నీవు బుద్ధి రహితుడవు! ఈ స్త్రీలను ఇట్లు పడగొట్టుటలో నీకు కలుగు లాభమేమి? దుష్టా! దయా రహితా! సిగ్గులేనివాడా! వేల్చినదాని నెల్ల తినువాడా! మందభాగ్యుడా! పుణ్యాశలు లేనివాడా! దురాచారా! నిర్దయా! అబలలను దహించుచున్నావే! అనుచు ఆ స్త్రీలను ఇట్లు బహు విధములుగా విలపించుచు నిందావాక్యములు పలుకుచు ఉండిరి.

మరికొందరు స్త్రీలు తమ బాలురు మరణించిన శోకముతో ఏమియు తోచక ఏడ్చుచుండిరి. వహ్నీ! నీవు మా పూర్వ శత్రువువలె నిర్దయుడవై మహాక్రోధముతో దహించు చున్నావే! మ్లేచ్ఛుడా! నీవు పుష్కరిణులయందును బావులందునుగల నీటిని కూడ కాల్చితివి; మమ్ములను కూడ దహించి ఏ గతి పొందింతువో తెలియదు అని ఇట్లు వారు ప్రలాపములు చేయుచుండ విని అగ్ని ఇట్లు పలికెను: నేను నా ఇచ్ఛతో మీకు నాశము కలిగించుట లేదు. నేను (శివుని) ఆదేశ మాచరింతునే కాని స్వయముగ అనుగ్రహము చూపగల వాడగాను; రుద్రుని క్రోధము నన్నా వేశించగా అతని ఇచ్ఛ ననుసరించి నడుచుకొనుచున్నాను అనెను.

అంతట తన ఆసనమందున్న మహాతేజస్కుడగు బాణుడు త్రిపురము జ్వలించుచుండుట చూచి ఇట్లనుకొనెను; దేవతలు నన్ను నాశమందించిరి. అల్పసత్వులు అనగా మనస్సున నిబ్బరము అంతగా లేని వారు దురా చారులు అయి ఈశ్వరునకు నా మీద నివేదించినారు, శంకరుడు తాను గొప్ప మనస్సుకలవాడు అయియు సరిగా విచారించకయే నన్ను దహించుచున్నాడు, మహేశ్వరుడు తప్ప నన్ను చంప గలవారు ఎవరును లేరు; అనుచు అతడు లేచి నిలిచి త్రిభువనేశ్వరుడగు లింగరూపుని శిరమున ధరించి పురద్వారము వెలువడెను, పుత్ర మిత్రులను మహావిచిత్ర రత్నములను నానా విధ స్త్రీ జనమును విడిచెను. లింగమును మాత్రము శిరమున నుంచుకొని గగనమండలములోనికి పోవుచు దేవదేవేశుడును త్రిలోకాధి పతియునగు శివుని ఇట్లు స్తుతించసాగెను. శంకరా! నీ కోపాగ్నిచే నేను నిర్దగ్ధుడను అయితిని, అగుచున్నాను. నేను నీకు వధ్యుడనుగా తోచితినేమో! అగుగాక! మహాదేవా! నీ ప్రసాద ప్రభావమున నా ఈ లింగము మాత్రము నశించకుండుగాక! దేవా! నేను ఇంత వరకును పరమ భక్తితో నీ ఈ లింగమును అర్చించియుంటిని గదా! కావున నేను నీకు వధ్యుడనుగా తోచినను ఇది మాత్రము నశించకుండవలయును, మహాదేవా! నీ కోపముచే నేను దహింప బడుటయు మెచ్చదగినదే! ప్రతిజన్మమందును నేను నీ పాదములందు అత్యంత ఆసక్తి కలవాడను కావలయునను నా కోరికను దయతో మన్నించి నన్ను అనుగ్రహించుము ఓ పరమేశ్వరా! ఆనుచు తోటక ఛందస్సుతో ఇదే స్తుతింతును అని బాణుడు తోటక వృత్తములతో శివుని అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ విధముగా స్తుతించెను.