రౌప్య పర్వత దానము

ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను, ఇకమీదట రౌప్యపర్వత (వెండికొండ) దాన విషయము తెలిపెదను. ఇది సర్వోత్తమము. దీని నాచరించినవారు సోమలోక ప్రాప్తులగుదురు. దీనికై పదివేల పలములుకాని, ఐదువేల పలములు కాని రెండున్నర వందల పలములు కాని తూకము కల వెండి కావలయును. శక్తిలేనివారు భక్తితో ఇరువది ఫలములకు తక్కువ కాని వెండితోనైన చేయవచ్చును. పైవలెనే చతుర్థాంశముతో విష్కంభ పర్వతములను వెండితోనే మందరాది పర్వతముల నాయా దిశలందును బంగారుతో లోకపాలురను బంగారుతో నెత్తము చేయించి దానిపై బ్రహ్మ విష్ణు రవి రుద్రుల స్వర్ణ ప్రతిమలను చేయించవలెను. మిగిలిన పర్వతముల విషయమున వెండిని ఉపయోగించిన వానికి ఈ రౌష్య పర్వత దానములో బంగారు ఉపయోగించవలెను. హోమజాగరణాదికము పైవలెనే చేయవలెను. తెల్లవారిన పిదప ఈ రజతా చలములోని నడుమభాగమును ఆచార్యునకును విష్కంభ పర్వతములను ఋత్విక్కులకును ఈయవలెను. (దాన కాలమున) వారినందరను వస్త్రాభరణములతో పూజించవలయును. దర్భపాణియై విమత్సరుడై ఈ మంత్రమును పఠించ వలయును. “రజతమా! నీవు పితరులకును విష్ణు శంకరులకును ప్రియమైనదానవు. ఇట్టి నీవు సంసార సాగరమునుండి నన్ను దాటించుము” ఇట్లు అవాహనముచేసి ప్రార్థించి రజతాచల దానము నొనరించువారు వేయి పదివేల (1000 × 10000) గోవుల దానమిచ్చినంత ఫలము నందుదురు. గంధర్వ కిన్నర అప్సర గణముల పూజలనందుకొనుచు కల్పాంతము వరకును సోమలోకము నందు వసింతురు.