విద్యున్మాలి వధాది కథ

మేరుపర్వతపు కాంతులవంటి కాంతుల మొలకలతో సహస్రకిరణుడు రవి ఉదయించెను. దేవ దానవుల బలములు రెండును ప్రళయకాల సాగరములవలె ధ్వనింపసాగెను. అంతట సహస్ర నేత్రుడును శత్రుపురముల భేదించిన వాడును మహాశక్తిశాలియునగు ఇంద్ర దేవుడును త్రిపుర దాహమునకు సన్నద్ధుడయ్యెను. హరుడును మహేంద్రునితో వరుణునితో కూడి త్రిపుర దుర్గమునకు బయలుదేరెను. శత్రువులను మిగులమథించగలవారును నానావిధరూపులు నగు ప్రమథులు భయంకర సింహనాదములతో వాద్యధ్వనులతో యుద్ధమునకు బయలువెడలిరి. మ్రోగుచున్న వాద్యములతో ఛత్రములతో ధ్వజములతో ఒప్పు ఆదివ్యదేవతా సేనవనమే కదలిపోవు చున్నట్లు కనబడెను. భయంకరమగు ఆరుద్రసేన వచ్చి పడుచుండుట చూచి దానవ శ్రేష్ఠులును సముద్రమువలె సంక్షోభిల్లసాగిరి. వారెల్లరును ప్రాసములు, ఖడ్గములు, పట్టనములు, శక్త్యాయుధములు, శూలములు, గండ్రగొడ్డండ్రు, బాణములు, ఖడ్గ విశేషములు, ధనువులు, వజ్రములు, బరువైన ఇనుప రోకళ్లు తీసికొని కోపముతో కండ్లెర్రచేసి రెక్కలుగల కొండలవలె కనబడుచుండిరి. అ దానవులు ఏనుగులవలె వర్షాకాల మేఘములవలె బయలుదేరి విద్యున్మాలి కడకు వచ్చి తగిన సమయమున అతనికి నమస్కరించి ‘నమస్తే’ అని పలికి సింహగర్జనలు చేసిరి. దేవతల నుద్దేశించి అరచిరి. వారందరును పూర్వము ఇంద్రుని ఎదుర్కొన సిద్ధపడిన పర్వతముల వలె మరణించుటకైన జయించుటకైన సిద్ధపడి దృఢ నిశ్చయముతో నుండిరి. వారు భయంకరముగ గర్జిల్లు మేఘముల వలెనుండిరి. వారెల్లరు మేఘముల కాంతులవంటి కాంతికలవారు; బుద్ధి శాలురు; యుద్ధమున నేర్పరులు. ఇంతలో దేవదానవుల నడుమ యుద్ధ మారంభమాయెను. వారొకరి కొకరు ఆయుధములతో అపకారము చేసికొనసాగిరి. చంద్రునివలె ప్రకాశించుచు ప్రజ్వలించుచున్న ఆయుధములు చేతుల దాల్చి పొగలు గ్రక్కుచున్న అగ్నులవలె నుండిరి. కోపముతోను యుద్ధమునందలి పేరాసతోను ఒకరి నింకొకరు చూర్ణము చేసికొనుచుండిరి. వారు వజ్రపు దెబ్బలతో చక్రాయుధాఘాతములతో బాణ ప్రయోగములతో ముక్కలయి చీలికలయి సముద్ర జలమున పడిపోవుచుండిరి. ప్రమథులును దేవతలును కూడ మాలికలు దండలు హారములు తెగి వస్త్ర భూషణములు జారిపడి సముద్రములో తిమితిమింగిల నక్రాది జల జంతువుల నోళ్లలో పడుచుండిరి.

గదలు, ముసలములు, తోమరములు, ప్రాసములు, గుర్రములు, వజ్రములు, శూలములు, ఋష్టులు (చిన్న ఖడ్గములు), కొండరాళ్లు దేవతలచే, దానవులచే ప్రయోగింపబడి రవి సమాన కాంతులను పొగలను క్రక్కుచు మహారాసులై సముద్రములో పడుచుండెను. అవి పడునపుడు వేగము తగ్గుచు పోయి జల జంతువులపై పడి వాటిని నశింపజేయుచుండెను. ఇది ఏనుగుల పోరులో వాటి నడుమ అల్ప జంతువులు నలిగి చచ్చినట్లుండెను.

అంతలో మెరుపులతో మెరయు మేఘము నెదుర్కొన్నట్లు విద్యున్మాలి నందిని ఎదుర్కొనుటకై అతనివైపునకు పరుగున పోయెను. యుద్ధమున నిశ్చితాభిప్రాయముకల ఆ దానవుడు తన పేరు తెలుపుచు శిలాద పుత్రుడగు నందీశ్వరునితో ‘ఓయీ! నాకు యుద్ధమనిన మక్కువ ఎక్కువ; బలవంతుడనగు నేను యుద్ధకాంక్షినై నీతో పోరవచ్చితిని. నీవు ఇపుడిక ప్రాణాలతో పోజాలవు’ అనెను. అతని ఈపలుకులు విని మహాతపస్వియగు నందీశ్వరుడు నవ్వుచు వాక్యాంకార భూషితమగు వాక్యమిట్లు పలికెను: ‘ఓయీ! మీరు దానవులు కదా! మావంటివారు దమము (ఇంద్రియశాంతి) కోరువారమయినను అట్టిదానికి ఇది సమయముకాదు. నీజాతి సహజ స్వభావముతో బడాయిమాటలు పలుకుచున్నావేకాని నీవు నన్ను చంపగలవాడవా ? ఇదివరకే యుద్ధములో ఎందరినో దానవుల చంపిన నేను నీవంశమునే నాశము చేయపుట్టిన నిన్ను చంపక ఎట్లు విడువగలను?’ అనగా విద్యున్మాలి నందితో ‘ఓయీ! ఆకాశమును భుజములతో పట్టగలవాడును సూర్యుని క్రింద పడగొట్టగలవాడును గూడ నన్ను కన్నులతో చూడనైన జాలడు’ అనుచునే - నందితో బలమున సాటికాని ఆదానవుడు - ఏనుగు తన తొండముతో మేఘమును చీల్చినట్లు ఒక బాణముతో నందిని గ్రుచ్చెను. ఆ బాణము - రవి తన కిరణములతో సముద్ర జలమును త్రావినట్లు నంది రక్తమును త్రావెను. ఆ దెబ్బతో రోషించిన నంది గజేంద్రుడువలె వృక్షమొకటి పెకలించి విద్యున్మాలిపై విసరెను.

అవృక్షము నంది హస్తము నుండి విద్యున్మాలి దగ్గరకువచ్చు లోపుగనే వాడు ప్రయోగించిన బాణపు దెబ్బలతో దాని పూవులన్నియు రాలిపోయెను. వాని బాణముతో ఛిన్నమయి అది మహా వేగమున గరుడునివలె క్రింద పడెను. అది చూచి ఉత్తమమూర్తిగల నందీశ్వరుడు మిగుల కోపించి రవికర సదృశమగు తన కరమెత్తి మహిషముమీదికి పరెగెత్తు గజేంద్రునివలె విద్యున్మాలి మీదకు పరుగెత్తెను. వేగమున వాయు సమానుడును బలశాలియునగు ఆ విద్యున్మాలి మహా వేగమున తనపైకి వచ్చు నందీశ్వరుని వందలకొలది శరములతో నింపెను. అట్లు గాయపడి నంది తన శరీరమంతయు ఆ బాణములతో గగుర్పాటు చెందినదివలె కనబడు చుండ మహా వేగమునవచ్చి విద్యున్మాలి రథమును తీసికొని మహావేగమున అటనుండి పోయి గిరగిర త్రిప్పి వేసెను. దానిచే ఆ రథము ముని శాపమున సూర్యునితోకూడ పడిపోయిన రవి రథమువలె పడిపోయెను. విద్యున్మాలియును పడిపోవుచున్న ఆరథము నుండి తన మాయా బలమున తప్పించుకొని బయటపడి అచ్చటనే నిలిచియున్న నందీశ్వరుని శక్త్యాయుధముతో కొట్టి గాయపరచెను. ప్రమథ శ్రేష్ఠుడుగు ఆనందియును తన గాయపునెత్తుటితో తడిసిన ఆశక్తినే లాగి ఆదానవునిపై విసరగా వానికవచమును హృదయమును బ్రద్దలయివాడు వజ్రపు దెబ్బ తినిన పర్వతమువలె క్రింద పడిపోయెను. అదిచూచి సిద్ధులను, చారణులును, కిన్నరులును, ‘సాధు-సాధు’ ‘బాగు-బాగు’ అని పలికి శివునికడకు పోయిరి. విద్యున్మాలి మృతి విని కోపించి మయుడు ప్రజ్వలించు అగ్ని ఎండుగడ్డిని వలె ప్రమథ సేనను కాల్చెను. శూలముతో రొమ్ములు చీలికయి గదలతో తలలు పగిలి గాఢముగా బాణపు దెబ్బలుతిని ప్రమథులు సముద్రమున పడుచుండిరి. అది చూచి ఇంద్రయను కుబేర నంది షణ్ముఖులు దానవ వరశ్రేష్ఠుడగు మయుని వివిధ శస్త్ర గణములు ప్రయోగించి కొట్టిరి. నాగాధిపతి గరుత్మంతుని చీల్చినట్లు మయుడు శ్రేష్ఠ బాణములతో యముని కుబేరుని చీల్చి గంభీర మేఘమువలె ప్రకాశించెను అంతట ప్రమథులును దేవతలును ఏకమై దానవులను కొట్టగా వారు తామెంత ఉత్తమ దర్పము విక్రమము కలవారయినను ఆయుధపు దెబ్బల వ్యథ అధికము కాగా పూర్వము విష్ణుని చేతిలో దెబ్బలు తినిన అసురులవలెనే యుద్ధము వదలి త్రిపురదుర్గమున ప్రవేశించిరి. అంతట దేవసేనలో నుండి శంఖములు తప్పెటలు నగారాలు ఢంకలు సింహనాదములు ఆకసమునుండి పడుచున్న పిడుగుల మ్రోతలు వెలువడి దానవుల గుండెలు బ్రద్దలు చేయసాగెను.