మత్స్య మహా పురాణము
లక్షహోమమను గ్రహయజ్ఞము
ఇంతవరకును అయుత హోమ గ్రహయజ్ఞ విధానము తెలిపితిని. ఇకమీదట లక్ష హోమ విధానమును తెలిపెదను. ఇది సర్వ కామముల నెరవేర్చునది. పితృదేవతలకు ప్రీతికరమయినది. సాక్షాత్ (మరియొక కర్మ సాధనముతో పనిలేక) భుక్తిముక్తి ఫలము నిచ్చునది.
శుభ దినమున తారాబల గ్రహబలములుకల శుభ సమయమున బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనము జరిపించి ఈ కార్యమారంభించవలయును. యజమానుడు తన ఇంటికి ఈశాన్యమునగాని, శివాలయ ప్రదేశమునగాని, చతురస్రముగ ఉదఙ్ముఖముగా (ఉదక్ల్పవముగా-ఉత్తరపు వైపునకు వాలుగా) ఉండు మండపమును నిర్మించవలయును. ఆ మండపపు భుజము పది హస్తములుగాని ఎనిమిది హస్తములుగాని ఉండవలయును. వీలునుబట్టి మండపపు నేల ఉత్తరమునకో తూర్పునకో వాలుగా ఉండునట్లు చూడవలయును. ఈమండపమునకు ఈశాన్యమున లక్షణ యుక్తమును హస్త మాత్రము పొడుగు వెడల్పు లోతులుకల కుండమును యోని రూపమగు ముఖముతో (యోని = త్రిభుజము)తో నిర్మించవలయును. ఈ కుండమునకు నాలుగు వైపులను మేఖల (అంచుకట్ట) నాలుగు భారతీయాంగుళముల వెడల్పు ఎత్తులతో ఏర్పరచ వలయును. ఇంత చెప్పుట ఏలయన నవగ్రహ మఖము సర్వలోక శాంతికై చేయునది కావున అది కొలతలలో ఎక్కువగాని తక్కువగాని యున్నచో శాంతి కలిగించక పోగా భయము కలిగించును. కనుక శాంతిప్రక్రియకై నిర్మించు కుండము మిక్కిలి సంపూర్ణముగను శాస్త్రీయము గను నుండవలయును. (దీనియందలి కొలతలు మాత్రము అయుత హోమ విధానమునకు సంబంధించినవి.)
అయుత హోమగ్రహ యజ్ఞమునందలి ఆహుతులకు పదిరెట్ల అహుతులు కలది లక్షహోమ గ్రహయజ్ఞము. ఋత్విక్సంఖ్య కూడ పదింతలుండును కావున యథాశక్తిగ దక్షిణలును అయుత హోమమునందుకంటె పదింతలుగా ఉండవలయును. ఈ లక్ష హోమ గ్రహ యజ్ఞమునకై మండపమునకు ఈశాన్యమున రెండు హస్తముల వెడలుపు నాలుగు హస్తముల పొడవుగల దీర్ఘ చతురస్రాకారపు కుండము (లోతు చెప్పబడలేదు) త్రవ్వవలెను. దానికి ముందు యోని రూపమయిన ముఖమును కుండము చుట్టు పైని చెప్పినట్లు మేఖలయు ఉండవలయును. ఈ కుండమునకు ఈశాన్యమున మూడు జేనల కొలతతో చతురస్రాకారపు అరుగును ఉత్తరమునకుగాని తూర్పునకుగాని వాలుగా దేవతాఽవాహన ప్రతిష్ఠాపనములకై ఏర్పరచవలయును. దీనికి చుట్టును మూడు ప్రాకారములుండవలెను. అన్నిటిలో మొదటిది స్థండిలమునకు వెలుపల రెండు అంగుళములు దానికి వెలుపలిది (నడుమది) యు-దానికి వెలుపలిది (అన్నిటిలో బయటిది)యు ఒక్కొక్క అంగుళము ఎత్తున ఉండవలెను. స్థండిలముపై దాని బయటి అంచుమీద పదిఅంగుళముల ఎత్తున ప్రాకారము ఉండవలెను. వెడల్పుమాత్రము అన్నిటికిని మూడు అంగుళములే.
ఈ స్టండిలమునందు వెనుకటివలె పూవులతో తండులములతో గ్రహతదధిదేవతా ప్రత్యధి దేవతలు ఆవాహితులై వీరెల్లరును ఆదిత్యునకు అభిముఖులై యుండవలయును. అంతేకాని రవికి వీరిలో నెవరును పెడమొగమయి యుండరాదు. ఈ లక్ష హోమ విధానము నందు గరుత్మంతునధికముగా నావాహనము చేయుటవలన అధిక క్షేమము కలుగును. (గరుడా వాహన మంత్రార్థము) “నీవు సామవేద శరీరుడవు; పరమేష్ఠి (విష్ణునకు) వాహనమవు; సదా విషహరుడవు; పాపహరుడవు: కావున ఇట్టి నీవు మాకు శాంతిని కలిగింపుము.” వెనుకటి వలెనే యజమానుని స్నానమునకై జల కుంభమును సిద్ధపరచి ఆమంత్రించవలెను. పిమ్మట హోమ మాచరించవలెను. లక్ష సమిధలను లెక్కించి ఆహుతులవేల్చి మృత కుంభమును వసు ధారను (ఆయా నాణెముల కాని వెండి బంగారు రత్నములు కాని ధారగా) అగ్నిపై పడవేయ వలెను. వంకరలేనిదియు తొర్రలు లేనిదియు భుజమాత్రము పొడవు కలదియునగు పచ్చి మేడికర్రను స్రుక్ గా చేసి (మండపపు) రెండు స్తంభముల మీదకు వచ్చునట్లు ఉంచవలెను. అట్లే హోమ సమయము నందు చక్కగా నేతిధారను కూడ అగ్నిపై వదలవలెను. అగ్ని విష్ణు రుద్ర సూక్తములను మహా వైశ్వానర సామ జ్యేష్ఠ సామములను పఠించవలయును. వెనుకటివలెనే యజమానున కభిషేకమును స్వస్తి వాచనమును జరుపవలెను. వెనుకటి వలెనే యజమానుడు కామక్రోధ రహితమగు శాంత చిత్తముతో ఋత్విక్కులకు వేరువేరుగా దక్షిణల నీయవలెను.
అయుత హోమము అనెడు నవగ్రహ మఖ (యజ్ఞ) మునందు వేదవాదులు శాంతులగు నలుగురుగాని ఇద్దరే కాని ఋత్విక్కులు చాలును. అంతకంటె విస్తరము పనికిరాదు. అట్లే లక్ష హోమ విధానమునందు పండ్రెండు మందికాని ఎనిమిది మందికాని నలుగురేకాని చాలును.
మిగిలిన అంశములన్నియు లక్ష హోమ విధానమునందు అయుత హోమ విధానము నందుకంటె పది రెట్లుండ వలయును. భక్తితో మంచివస్త్రములను బంగారుసొమ్ములను కడియములను చెవి పోగులను ఉంగరములను కంఠసూత్రములను కూడ శక్తియున్నచో ఈయవలయును. శక్తి ఉండియు కొంటెతనముతోను లోభముతోను దక్షిణల విషయమున కొరత చేయరాదు. లోభ మోహములచే సరిగా దక్షిణలనీయనిచో కులక్షయమగును.
తనకు క్షేమము కలుగవలెనని కోరువాడు యథాశక్తిగా అన్నదానమును చేయవలెను. ఏలయన అన్నదాన హీనముగా చేసిన కార్యము వలన దుర్భిక్షము కలుగును. అన్నహీనముగా జరిపిన జయజ్ఞము రాష్ట్రమును మంత్రహీన యజ్ఞము ఋత్విక్కులను దక్షిణలు కొరతగా జరిగిన యజ్ఞము యజమానిని దహించును. కొరతలతో జరిగిన యజ్ఞము వంటి శత్రువు (అపకారకము) మరియొకటి లేదు.
(అశక్తుని విషయము) ఈ కారణములచేత తగినంత ధనము లేనివాడు ఎప్పుడు ఎట్టి స్థితియందును లక్ష హోమగ్రహ యజ్ఞము చేయరాదు. తనకు పీడాకరములుగా నున్న రెండు మూడు గ్రహములను మాత్రమే(తనకు గల శక్తిని బట్టి) యథావిధిగా పూజించవలెను. వేద పారంగతుడగు ఒకే బ్రాహ్మణునైన (ఎక్కువమందికి మారుగా) దక్షిణలతో అర్చించవలెను.
లక్ష హోమగ్రహయజ్ఞపు విశిష్టత, యజమానుడు తనకు ఇంటియందుగల ధనావకాశమును బట్టి లక్షహోమ గ్రహ యజ్ఞమును యథావిధిగా చేయవలెను. దీనిని సరిగా నాచరించినచో ఇహమున సర్వకామ పూర్తియగును. పరమునను ఎనిమిది వందల కల్పముల కాలము వసు ఆదిత్య మరుద్గణములచే పూజింపబడుచు శివలోకమున సుఖించును. పిమ్మట ముక్తిని పొందును.
సకామముగా (అనగా-కోరికలు తీరవలెనని సంకల్పించి) ఈ లక్ష హోమ గ్రహయజ్ఞమును యథావిధిగా జరిపించుకొనినచో సర్వ కామములును నెరవేరి అనంతమగు (మోక్ష) స్థానమును పొందును. పుత్రార్థి పుత్రులను ధనార్థి ధనమును భార్యార్థి శోభయగు భార్యను కుమారి శోభనుడగు పతిని భ్రష్టరాజ్యుడు మరల రాజ్యమును శ్రీకాముడు (కీర్తి-ఆయువు-ఆరోగ్యము మొదలగు వానిచే ప్రకాశము కోరువాడు) అట్టి శ్రీని పొందును. ఇట్లు ఏఏ కోరిక కోరినచో అది ఎల్ల పుష్కలముగ నెరవేరును. నిష్కాముడై ఆచరించువాడు పరబ్రహ్మ సాయుజ్యమును పొందును.