త్రేతాయుగమున యజ్ఞ ప్రవృత్తి స్వరూపము

పూర్వము స్వాయంభువ మన్వంతరమున త్రేతాయుగారంభమున యజ్ఞ ప్రవృత్తి ఎట్లుం డెను? ఎట్లు జరిగెను? కృతయుగమును దాని సంధ్యా సంధ్యాంశములును ముగిసి కాలనామము ననుసరించిన ప్రవృత్తులతో త్రేతాయుగ మారంభమయెను. తద్ యుగానుసారము ఓషధులు మొలచెను. వానలు కురియసాగెను. గ్రామము లందును పురములందును జనుల జీవన ప్రవృత్తికి వలసిన వృత్తిధర్మపు నడక ఆరంభమయ్యెను. ఇట్టి దశలో పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను లోకమున ఎట్లు నిలిపెను? మంత్రములను ఎట్లు ఏకత్ర కూర్చెను? వాటితో వేద సంహితలనెట్లు కూర్చెను? వాటితో యజ్ఞములను ఎట్లు ప్రవర్తిల్లజేసెను? ఇది యంతయు మాకు తెలుపుమని ఋషులడుగ సూతుడిట్లు వారికి చెప్పెసాగెను. ఋషులారా! మీరడిగిన ప్రశ్నకు సమాధానమును తెలిపెదను; వినుడు; సమర్థుడగు వాడును విశ్వమందలి ప్రాణులను తమ ఆహారమును భుజించునట్లు అనుగ్రహించి వారిచ్చిన హవిరాదులను అనుభవించు వాడునునగు ఇంద్రుడు ఐహ లౌకిక పారలౌకిక (స్వర్గపద) కర్మానుష్ఠానమునకు ఉపయుక్తములగు మంత్రములను సమకూర్చి వాటితో లోకమున యజ్ఞములను ప్రవర్తిల్లజేసెను. అందులకై ఇంద్రుడు తానే యజమానుడై సర్వసాధనములను సమకూర్చుకొని దేవతలందరతో కూడి అశ్వమేధ యాగ మాచరించపూనెను. యజ్ఞమును వితతము చేయు సమయమునకు మహర్షు లును వచ్చిరి. ఆయజ్ఞ కర్మమునందలి ఆరంభ కర్మము ననుష్ఠించుటకై ప్రవర్తిల్లసాగిరి. దేవతల నుద్దేశించి హవనము చేయుటకై ప్రణయనము చేయబడిన అగ్నియందు బహు విధములగు హవిస్సులు హోమము చేయబడుచుండెను. దేవతలందరును సంతుష్టులయిరి. సుస్వరముతో సామ వేదము గానము చేయబడుచుండెను. అధ్వర్యు పురుషులు మిగుల వేగముగా అటునిటు తిరుగుచుండిరి. యజ్ఞ పశువులును ఆలంభము (మంత్ర పూర్వకముగ ప్రాణములు తీయబడుట) చేయబడెను. యజ్ఞభాగముల ననుభవించ వలసిన దేవతలును ఆహ్వానించబడిరి. ఇంద్రియాభి మానులగు దేవులు ఎవరెవరో వారువారు మాత్రము యజ్ఞ భాగములను అనుభ వించువారయిరి. మిగిలిన దేవతలందరును ఆ ఇంద్రియాధిష్ఠాన దేవతల నారాధించిరి. ప్రతి కల్పాదులయందును యజ్ఞ భాగ భోక్తలగు దేవతలు ఈ ఇంద్రియాభిమాని దేవతలే. (కాని ఈ యజ్ఞమున విశేషము ఒకటి జరిగెను.) ఆధ్వర్యువులు ‘ప్రైష’ మంత్రములతో ఆయా దేవతలను ఆహ్వానించిన సమయమున ఋషులును మహర్షులును లేచి నిలువబడిరి. యజ్ఞమున ఆలంబము చేయబడిన (చేయబడుచున్న) దీనములగు పశు (దేవ) గణములను చూచిరి. విశ్వభుక్ గా నున్న ఇంద్రుని వారు ఇట్లు ప్రశ్నించిరి: “నీ ఈ యజ్ఞ విధానము ఎటువంటిది. (ఇది ఏమి యజ్ఞ ప్రక్రియ?) దీనియందు విశ్వభుక్ ఎవరు? సహజముగా ఇతరులు చేయు యజ్ఞమున విశ్వభుక్ గా నున్న నీవే యజమానుడవై యుండగా దీనియందు ఎవరు ‘విశ్వభుక్’ స్థానమునందుండును? ధర్మ (ఫల)మును పొందగోరి నీవు చేయు ఈ (పశు) హింస మిగుల బలవత్తరమగు అధర్మము; సురోత్తమా! నీ ఈయజ్ఞమునందు పశు బంధమును వాని వధయును నీకు ఇష్టమయినట్లున్నది. పశువులు ఉపకరణములుగా నీవు ఆచరించు ఈ అధర్మము నీ ధర్మమును నశింపజేయును. ఇది ధర్మముగాదు; ఇది అధర్మము; హింస ధర్మము అని ఎవరును అనరు. నీకు ఇట్టి యజ్ఞము నాచరించుటయే ఇష్టమైనచో ఇది తగునని ఆగమ (శాస్త్రవిధి) ప్రమాణమును చూపి ఇది ధర్మమని నిశ్చయించుము. సురశ్రేష్ఠా! ఇంద్రా! ప్రజలను ధర్మమునుండి నివారించు సేతువుఅగు ధర్మమును అవలంబించినదియు శాస్త్రవిధియందు కనబడుచున్నదియు అగు యజ్ఞ ప్రక్రియతోను ధర్మార్థకామములచే ఆకర్షింపబడిన (వాటిని సాధించగల) యజ్ఞ బీజముల (వేదమంత్రముల) తోను స్వయంభూబ్రహ్మ పురాతన కాలమునందే ఈ యజ్ఞమును వేదములందు విధించెను. అనిరి. విశ్వభుక్ (ప్రతియొక విధమగు దేవతారాధనములందును ప్రజలర్పించిన దానియందలి భాగమును తప్పక అనుభవించువాడు) అగు ఇంద్రునితో తత్త్వద్రష్టలగు ఋషులిట్లు పలుకగా మానమునకును మోహము (అజ్ఞానము) నకును వశీభూతుడు అయి యున్న ఇంద్రుడు వారి మాటలను అంగీకరించలేదు.

యజ్ఞము నాచరించవలసినది జంగమ ప్రాణులగు పశువులతోనా-స్థావర ప్రాణులగు వృక్షాదులనుండి లభించు కందమూల ఫలాదులతోనా? అను విషయమున ఇంద్రునకును మహర్షులకును గొప్పవాదము నడచెను. మహర్షులు ఈవాదముతో శక్తిహీనులై మిగుల భేదము (అలసట) చెందిరి. చివరకు వారు ఇంద్రునితో (వసుని మధ్యవర్తిగా గ్రహించి అతడు చెప్పిన మాట ఇరుపక్షములవారును అంగీకరింతమని) ఒప్పందమునకు వచ్చి అంతరిక్ష సంచారియగు వసుని ఇట్లడిగిరి. ఉత్తానపాదుని పుత్రుడవును మహాప్రాజ్ఞుడవును అగు వసురాజా! ఈ రెండు విధములలో ఏ యజ్ఞము విధివిహితమని నీవు తలంచుచున్నావో తెలిపి మాసంశయమును పోగొట్టుము అనిరి. అది వినిన వసురాజు ఈరెండు పక్షముల బలాబలములను విచారించకయే (తనకు స్ఫురించిన) వేదశాస్త్రము ననుసరించి యజ్ఞ తత్త్వమునిట్లు చెప్పెను. యజమానుడు తన శక్తి ననుసరించి ఏవి సమకూర్చుకొన్నచో వానితోనే యజ్ఞము చేయుట సమంజసము; పవిత్రములగు పశువులతోనైనను సరే కందమూల ఫలాదులతోనైన సరే. యజ్ఞము సహజముగనే హింసా స్వభావము కలది అని శాస్త్రములనుండి నాకు తెలిసిన విషయము. అదికాక మహర్షులు కూడ మంత్రములు హింసారూపములగు అర్థములనే ప్రతి ప్రతిపాదించునని వివరించుచున్నారు. అ ప్రమాణమునే నేను చెప్పితిని. కావున మీరు శాంతింప వేడుచున్నాను. విప్రులారా! మీరు అంగీకరించుచున్న మంత్రవాక్యములు మీకు ప్రమాణములయినచో యజ్ఞమును జరుగనిండు; కాదందురా; కాదనుట తగదు; ఏలయన-నేను చెప్పినది అనృతము కాదు. వసురాజిట్లు తమకు సమాధానము చెప్పగా ఆ మహర్షులు తమ బుద్ధిని హృదయమును సంయోజనముచేసి (యోగ దృష్టితో ఆలోచించి) రాబోవు విషయము ఇదియని ఎరిగి అది సత్యమగునట్లు వారు ఆవసుని శపించిరి. వారు శాపవచనమును పలుకగనే రాజు రసాతలమును ప్రవేశించెను. అంతవరకును ఆకాశచరుడుగానుండిన అతడిప్పుడు రసాతలచరుడయ్యెను. ఈశాపవాక్యముతో అతడు వసుధా తలమున చరించువాడు కూడ నయ్యెనుకాని ఖేచరత్వము లేకపోయెను. ఇట్లు అతడు ధర్మ విషయక సంశయమును ఛేదింప యత్నించి అధోగతి నందెను. కావున తానెంతగా బహు విషయముల నెరిగిన వాడైనను ఒక్కడే (ఇతరులతో సంప్రతించక) సంశయమును నిర్ణయించ రాదు. ఏలయన ధర్మ నిశ్చయమును చేరుటకు వాకిండ్లు ఎన్నోయున్నవి. వానిలో ఏ ద్వారము నుండి పోయినచో ధర్మమును సరిగా చేరవచ్చునో నిర్ణయించి సరియగు మార్గమున నడుచుట సుకరముకాదు. కావున దేవతలును ఋషులును స్వాయంభువమనువు అంతటివారు తప్ప మరి ఎవ్వరును సంశయాస్పద విషయమున నిశ్చయముచేసి చెప్పజాలరు.

ఈ చెప్పిన దానిని బట్టి ఋషుల అభిప్రాయానుసారము యజ్ఞమున హింస యుక్తము కాదు. హింస లేకుండగనే పూర్వము వేలకోట్ల ఋషులు (మరి వేరు సాధనములతో) స్వర్గము చేరిరి. పైచెప్పిన కారణముననే మహర్షులెల్లరును యజ్ఞమే కాదు-దానము కూడ-హింసా సాధ్యమయినచో తగనిదని తలచిరి. దానిని వారు మెచ్చరు. నీరు మూలములు-(దుంపలు- వేళ్లు) ఫలములు శాకములు జలపాత్రము ఇట్టివి తమ శక్త్యనుసారము దానము చేసి స్వర్గమును సంపాదించి అచట స్థిరముగా నిలిచిరి. ద్రోహము (అపకారము) చేయకుండుట లోభము లేకుండుట బహిరింద్రియ నిగ్రహము భూతదయ అనెడు తపము బ్రహ్మచర్యమను తపము సత్యము జాలి ఓర్పు నిబ్బరము ఈ తొమ్మిదియు సనాతన (సనా=పదా; సనాతన= ఎల్లప్పుడు ఉండునది; శాశ్వతమయినది) ధర్మమునకు మూలమగు అంశములు; ఋషుల అభిప్రాయాను సారము 1. (హింసాయుక్తము కాకుండ) కేవలము యజ్ఞ విహిత ద్రవ్యములును మంత్రములును యజ్ఞపు వాస్తవరూపము; అట్లే 2. సర్వ భూతములందును సమతాదృష్టితో నుండుట వాస్తవమగు తపస్సు; ఇట్లు యజ్ఞముల నాచరించుటచే దేవత్వ ప్రాప్తియు తపస్సుచేత విరాడ్రూపతా ప్రాప్తియు సిద్ధించును. 3. కర్మల ననుష్ఠించుచుండియు తత్ఫలములు తాను పొందవలెనను నభిసంధి లేకుండి కర్మఫల సంన్యాసము చేయుటచే బ్రహ్మలోక (హిరణ్య గర్భస్థాన) ప్రాప్తియు; 4. వైరాగ్యముతో జీవించుట వలన ప్రకృతి లయమును; 5. జ్ఞానము వలన కైవల్యమును పొందును. ఇట్లు ఉత్తమగతి ప్రాప్తికి ఈ ఐదును మార్గములు అని ఋషులు సిద్ధాంతీకరించిరి.

ఈ విధముగా స్వాయంభువ మన్వంతరమునందే (హింసా సహితమగు) యజ్ఞమును ప్రవర్తిల్లజేయుట విషయమున ఋషులకును దేవతలకును మహావివాదము జరిగెను.

తరువాత ఋషులు బలముతో ధర్మము నెట్టివేయబడుట చూచి వసురాజు చెప్పిన వాక్యమును లెక్కపెట్టకయే (ఆ దేవప్రవర్తిత యజ్ఞమున విడిచి) తమ ఇచ్చవచ్చిన చోటికి వెళ్లిరి.

ఋషి సంఘములు ఇట్లు శాల నుండి వెళ్లిపోయిన తరువాత దేవతలు యజ్ఞమును జరిపిరి. కాని బ్రాహ్మణులు కాని క్షత్రియులుకాని రాజులుకాని చాలమంది (హింసాత్మక యజ్ఞము లతో పనిలేకయే) తపస్సుతోనే సిద్ధి పొందిరి. అట్టి వారిలో ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ధ్రువుడు మేధాతిథి వసువు (ఋషులతో హింసాత్మక యజ్ఞము తగునని చెప్పిన యాతడు) సుధామన్ విరజన్ శంఖపాత్ - రాజసుడు ప్రాచీనబర్హి - పర్జన్యుడు హవిర్ధానుడు మొదలగు రాజులును ఇంకను ఇట్టివారే మరికొందరును తపశ్చర్యతోనే స్వర్గమునకు పోగలిగిరి. వీరందరును లోకమున ప్రతిష్ఠిత కీర్తి శాలురును మహాత్ములు నగు రాజర్షులే.

కావున సర్వ హేతువులచేతను హింసాయుత యజ్ఞము కంటెను తపస్సే విశిష్టతర మయినది. పూర్వము బ్రహ్మ ఈవిశ్వమును తపస్సుతోనే సృష్టించెను. కావున తపస్సుతో సృష్టింప బడిన ఈవిశ్వ స్థితికిని తపస్సే మూలము. కావున తపస్సుచే కలుగు సిద్ధి యజ్ఞము వలన కలుగదు అని సిద్ధాంతము.

స్వాయంభువమన్వంతరమున యజ్ఞము మొదటిసారిగా ఇట్లు ప్రవర్తిల్లెను. అది మొదలుకొని ఈ విధమగు యజ్ఞము యుగముల క్రమమున ప్రవర్తిల్లుచు కొనసాగుచున్నది.