ఖగోళ విషయము

సప్త ద్వీపములును సప్త సముద్రములును అయా భూతములును వాని సంభవ విస్తరమును ఎంతవరకు కలదో అంతవరకును (అంత మేరలో) ఈ సూర్యచంద్రులు తిరుగుచునే యుందురు. పృథివీ విస్తారము ఎంతయని విచారణ చేయవలసివచ్చినచో ఈ చంద్రా దిత్యులు మొదలగువారు పృథివీ వ్యాప్తికి వెలుపల కూడ సంచరించుచునేయున్నారు. వారి పరిమాణము కూడ పృథివీ పరిమాణముకంటె భిన్నమై ఎక్కువదిగానో తక్కువదిగానోయున్నది. కాని వ్యవహారార్థమై మాత్రము భూమి ఉన్నంతమేర మాత్రమే సూర్యచంద్రుల వ్యాప్తియున్నదని భావించి భూమికిగల పరి మాణమునకు తగినట్లే అంతరిక్షపు పరిమాణము కలదని ఎంచవలెను. ‘అవ’ ధాతువునకును ‘ఋ’ ధాతువునకును గల అర్థముల ననుసరించి-రవి ‘రాశినుండి రాశికి సంచరించును లోకముల నిర్మించును రక్షించును ప్రకాశింపజేయును గావున రవి (ఋ+అవ్+ఇ=రవి-ఇయర్తి- అవతి ఇతి రవిః)’ అనబడును.

ఇకమీదట సప్తద్వీప సప్త సముద్ర సహిత భూమండలమున సూర్యచంద్రులగతి ప్రకారమును వారి పరిమాణమును ఈ మొదలగునవి చెప్పెదను. ఈ ‘చంద్ర సూర్యులు’ అను నర్థమునందే ‘మహః’ అను శబ్దము కూడ నిష్పన్నమగుచున్నది. ‘మహ్యతే అయం’ ‘ఇతడు పూజింపబడును.’ ‘గొప్పవాడై యుండును.’ ‘మహీయంతే అనేన జ్యోతిషి’ ‘ఇతని చేతనే ఇతర జ్యోతిస్సులు పూజితములగును’ అని ‘మహః’ అను శబ్దము వ్యుత్పన్నమగుచున్నది.

లోగడ చెప్పిన భూమండల వైశాల్యమంతయే రవి మండల వ్యాసమని చెప్పెదరు. రవి మండలవ్యాసము తొమ్మిదివేల యోజనములు; దానిచుట్టుకొలత వ్యాసమునకు మూడింతలు; చంద్రుని వ్యాసము రవి వ్యాసమునకు రెండింతలు; భూవ్యాసము (సరాసరి) ఏబది లక్షల యోజనములు. మహామేరు ప్రాంతమున భూవృత్తము తక్కువగా నుండును. అచ్చట భూవ్యాసము ఈ సగటు వ్యాసములో సగము మాత్రమే-అనగా ఇరువది ఐదు లక్షల యోజనములుండును. భూగోళపు మధ్య భాగమున వ్యాసము అత్యధికముగా నుండును. అది ఒకకోటి ఎనుబది తొమ్మిది లక్షల ఏబదివేల యోజనములుండును. భూమికి దక్షిణోత్తరాగ్రముల మధ్య దూరము మూడుకోట్ల డెబ్బది తొమ్మిది లక్షల యోజనములు; దీని (ఉత్తర దక్షిణములుగా ఏర్పడెడి భూ వృత్తపు) చుట్టుకొలత పదునొకండు కోట్ల ముప్పది ఏడు లక్షల యోజనములుండును. ఇది భూమికి సంబంధించిన అన్ని విధముల మండలముల వ్యాసమును చుట్టకొలతలును.

తారకల (నక్షత్ర గ్రహాదుల) సన్నివేశమున (అమరిక)కై ద్యులోకమున ఎంత మండలము కలదో పర్యాసపు (భూమి చుట్టును గ్రహాదికము తిరుగుటకు సంబంధించిన) అమరికకై భూలోక సమీపమున ఎంత మండలము కలదో అవి రెండును ఒకదానికి మరియొకటి సరిపోవునవిగానే ఉన్నవి. మహామేరువునకు తూర్పున మానసోత్తరమను శిఖరమునకు పై భాగమున ‘వస్వోకసారా’ అను ఇంద్రుని నగరము బంగారు అలంకరింపబడినది కలదు. మహామేరువునకు దక్షిణముగా మానసోత్తరమునకు పైభాగముననే కల యముని నివాసమగు ‘సంయమనీ’ పురము కలదు. మేరువునకు పడమటగా మానసోత్తరమునకు పైభాగమున ‘సుభా’ (ప్రాచీన పారసీక నగరమునకు ‘సుసా’ అని పేరు.) అను నగరము కలదు. ఇట్లే మానసోత్తరపు పైభాగమున మేరువునకు ఉత్తరమున సోముని ‘విభా’ నగరము ఉన్నది. ఇట్లు లోకపాలురు నలుగురును లోక వ్యవస్థార్థము (సూర్య సంచారగణనకై) నాలుగుదిక్కులందును ఆయా నగరములందు ఉన్నారు. (అని భావించవలెను.) లోకపాలుర కందరకును పైగా దక్షిణాయనమున సూర్యుడు చివరి దశలో (ఉత్తరాయ నము ఆరంభము కాబోవునప్పుడు) ఆప మండలమున (సూర్యడు పయనించెడు అశ్విన్యాది నక్షత్ర మార్గమునకు ఆప మండలమని పేరు) ధనుస్సును వదలిన బాణమువలె మహావేగమున జ్యోతిశ్చక్ర మార్గమున పోవును. అమరావతిలో మధ్యాహ్నమయినపుడు సంయమనమున ఉదయము సుఖానగరమున అర్ధరాత్రము విభానగరియందు అస్తమయము జరుగును. ఇట్లే సంయమనమున మధ్యాహ్న మయినపుడు సుఖానగరము ఉదయము విభానగరమున అర్ధ రాత్రము అమరావతి యందస్తమయము. ఇట్లే సుఖానగరమున మధ్యాహ్నమయినపుడు విభానగరమున ఉదయము అమరావతియందు అర్ధరాత్రి-సంయమని యందస్తమయము; విభానగరమున మధ్యాహ్నమయినపుడు అమరావతియందు దయము సంయమని యందర్ధరాత్రి సుఖా నగరమందస్తమయము జరుగును.

ఇట్లు సూర్యుడు నిరంతరమును అలాత చక్రమువలె (కొరవి గిరగిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె) తిరుగుచునే యుండును. దక్షిణము వరకుగల దిక్కులందును ఈ చెప్పిన క్రమమున తిరుగుచు సారెవలె తిరుగు (గుండ్రముగానున్న) నక్షత్ర చక్రమున అతడు నడచు చుండును. పూర్వాహ్న మధ్యాహ్న పరాహ్ణ కాలములందు వేరువేరు స్థితులలో ఉండు కిరణములతో భూమిని తపింపజేయును. ఎట్లన ఉదయమునుండి అతని కిరణముల తాపము అధికమగుచు మధ్యాహ్నమునకు అత్యధికమగును. అప్పటినుండి క్రమముగా తగ్గుచుపోవును.

సూర్యోదయాస్తమయముల బట్టియే తూర్పు మొదలగు దిక్కుల వ్యవస్థ జరుగును. సూర్యుడు ఉదయించుచున్నట్లు కనబడు దిశ ఉదయదిశ (అక్కడి వారికది తూర్పు). అస్తమించుచున్నట్లు కనబడు దిశ అస్తదిశ (అక్కడి వారికది పడమర) అన్నిటికంటె ఉత్తరమున మేరువు-అన్నిటికంటె దక్షిణమునందు లోకాలోకము (పర్వతము) ఉన్నట్లు భావన చేయవలయును; భూమియందలి ఒక భాగమును పూర్తిగా వదలి మరియొక విదూర భాగమునకు పోవుట వలన సూర్యుడు అక్కడివారికి రాత్రులందు కనబడడు. ఏ భూభాగమునకు అతడు పోవునో అక్కడ నూరువేల కిరణములు కలవాడై ఆకాశపు ఉచ్చ స్థానమున అక్కడి వారికి కనబడును. అది వారికి పట్టపగలు.

సూర్యుడు ఒక ముహూర్త కాలములో కొన్ని ‘అంశ’ (12 భాగలదూరమాకాశమున పయనించును. ఇది ముప్పదియొకలక్షల ఏబదివేల యోజనములగును. ఇది ముహూర్త కాలములో రవిగమన వేగము. ఈ గతిలో పయనించుచు రవి దక్షిణ దిశకుపోయి మాఘమాసమున దక్షిణాయన గతిని వదలి పుష్కరద్వీప మధ్య భాగమున సంచరించుచు మేరుపర్వతమున మానసోత్తర శిఖరప్రాంతమునకు వచ్చుసరికి అచ్చట క్రాంతి మండల పరిమాణము విషువ మండలమునందు ఉండుదానికి మూడింతలగును. రవి ఒక అహో రాత్రములో పయనించు దూరము తొమ్మిదికోట్ల నలువది లక్షల యోజనములగును. (3150000X30=94500000)

దక్షిణదిశనుండి మరలి సూర్యుడు విషువ మండలము (రాత్రింబవళ్ళు సమముగా నుండు కాలమును ఏర్పరచు క్రాంతి వృత్త భాగము) లోనికి వచ్చియుండి అచటినుండి క్షీరోద సముద్ర మునకు ఉత్తర దిశగా సంచరించనారంభించునపుడు ఆ విషువ మండలపు యోజన పరిమాణము మూడుకోట్ల ఇరువదియొక లక్షలు; శ్రావణమాసమున రవి క్రాంతిమండలమునకు ఉత్తరమున గోమేద ద్వీపమునకు ఉత్తరమున పయనించునపుడు అచ్చట మండలపు పరిమాణము ఒకకోటి ఎనుబది లక్షల ఏబది ఏనిమిది యోజనములు.

అప మండలము అనబడు నక్షత్రచక్రము దక్షిణభాగము ఉత్తరభాగము మధ్యభాగము అని మూడు భాగములగును. మధ్యభాగమునకు జరగ్గవస్థానము-ఉత్తర భాగమునకు ఐరావత స్థానము-దక్షిణ భాగమునకు-వైశ్వానర స్థానము అని పేరులు. స్థానమును పథము అని కూడ వ్యవహరింతురు. ఒక్కొక్క భాగములో మరల మూడేసి ఉపభాగములు (వీథులు)కలవు. వానిలో నాగవీథి ఉత్తరభాగమందును అజవీథి దక్షిణ భాగమునందును వచ్చును.