మత్స్య మహా పురాణము
గ్రహణ స్నాన విధి
మనువు మత్స్య నారాయణుని ఇట్లు ప్రార్థించెను, చంద్రసూర్యగ్రహణములు సంభవించి నపుడు స్నానము చేయవలయునని శాస్త్రము విధించుచున్నది కదా! దాని విధానమును అందు వినియోగించవలసిన ద్రవ్యములను మంత్రములను మీనుండి వినగోరుచున్నాను. అనగా నారా యణు డతనికి ఇట్లు తెలిపెను, ఏ రాశియందు గ్రహణము సంభవించునో ఆ రాశియందు చేయవలసిన స్నానపు విధానమును మంత్రములను ద్రవ్యములను తెలిపెదను వినుము. చంద్ర సూర్యగ్రహణములు జరుగబోవుచున్నవి అనగా ముందుగానే బ్రాహ్మణులచే స్వస్తి వాచనమును జరిపించుకొన వలయును. నలుగురు బ్రాహ్మణులను లెస్సగా శుక్ల వస్త్రములతో శుక్ల గంధ ద్రవ్యములతో సంపూజించవలయును. గ్రహణమునకు ముందుగానే దర్భాదికమగు ఓషధులను సంపాదించుకొనవలయును. రంధ్రములు లేని నాలుగు కడవలను నాలుగు సముద్రములను వలె నాలుగుచోట్ల వేరువేరుగా నిలుపవలెను. రథములు అశ్వములు గజములు గోవులు నిలుచు తావులనుండియు పుట్టలు నదీద్వయ సంగమ నదీ సాగర సంగమ ప్రదేశముల నుండియు పెద్ద హ్రదములనుండియు రాజద్వార ప్రదేశములనుండియు మట్టిని తెచ్చి వాటియందు వేయవలెను. పంచగవ్యములను మంచి ముత్తెములను గోరోచనమును పద్మములను శంఖము లను పంచరత్నములను స్పటికమును తెల్ల చందనమును తీర్థజలములను తెల్ల ఆవాలను ఏనుగ దంతమును కలువపూలను వట్టి వేళ్ళను గుగ్గిలమును కూడ వాని యందు వేయవలయును. పిమ్మట ఈ మంత్రములతో ఆయాదేవతలను ఆ నాలుగు కడవలలోనికి ఆవాహనము చేయ వలయును. (వచ్చి వాటియందు నిలుపవలసినదిగా పిలువవలయును.)
అన్ని సముద్రములును నదులును తీర్థములును మేఘములును నదములును ఈ యజ మానునకు దురితమును నశింపజేయుటకై ఈ కలశములలోనికి వచ్చుగాక! వజ్రధరుడు ఆదిత్యులకు ప్రభువు సహస్రనయనుడు అగు ఇంద్రుడు గ్రహపీడను పోగొట్టుగాక! సర్వదేవతలకు ముఖము వంటివాడు అమిత ప్రకాశముకలవాడు అగు అగ్ని చంద్రగ్రహణము వలన కలిగిన పీడను పోగొట్టుగాక! ప్రాణుల కర్మలకు సాక్షి మహిష వాహనుడు ధర్మదేవుడు అగు యముడు చంద్రగ్రహణమువలన కలిగిన పీడను తొలగించుగాక! రాక్షస గణాధిపతియు సాక్షాత్ ప్రళయాగ్ని వంటి వాడు ఖడ్గహస్తుడు అతి భయంకరుడు అగు నిర్భతి గ్రహ బాధను తొలగించుగాక! ప్రాణరూపుడై యుండి లోకములను రక్షించువాడు కృష్ణమృగము (నల్లని లేడి) యందు ప్రీతి కలవాడునగు వాయువు చంద్రగ్రహణముచే కలిగిన గ్రహపీడను పోగొట్టుగాక! నిధిపతియు ఖడ్గశూల గదాధరుడునగు కుబేరుడు చంద్రగ్రహణము వలన గ్రహపీడను పోగొట్టుగాక! చంద్ర ధరుడు పినాకధారి వృషభ వాహనుడగు శంకరుడు చంద్రగ్రహణ పాపములు నశింపజేయుగాక! త్రిలోకముల యందున్న స్థిరచర భూతములు బ్రహ్మ విష్ణు సూర్యాది దేవతలు అందరును గ్రహణ పాపములను పోగొట్టుగాక!
ఈ విధముగా పూర్ణముగా మంత్రింపబడిన సర్వగుణ సమన్వితములగు కుంభముల లోను ఋగ్యజుస్సామ మంత్రములతోను స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని పూవుల తోను తెల్లని సుగంధములతోను వస్త్రదాన గోదానములతోను బ్రాహ్మణులను ఇష్టదేవతలను పూజించవలయును.
తరువాత ఈ మంత్రములనే (పత్రములపై వ్రాసి కరక (గరిగ) యందుంచి వాటితో పాటు బంగారును రత్నములను చేర్చి యజమానుని వస్త్ర ఖండమునందు కాని పట్టము మీద (జంపకానా వంటి దానిమీద) కాని ఆకడవలతో కూడ యజమానుని కూర్చుండ పెట్టుదురు. తరువాత ఆ మంత్రలేఖనములతో కూడిన గరిగను యజమానుని తలమీద ఉంచుదురు. తరు వాత యజమానుడు ప్రాఙ్ముఖుడై దేవతలను పూజించి నమస్కరించుచు చంద్రగ్రహణ కాలము నంతటిని గడపును. చంద్రగ్రహణము విడిచిన తరువాత గోదానము అనెడు శుభమును (కేశఖండనమును) జరిపించుకొనవలెను. స్నానము చేసియున్న బ్రాహ్మణునకు తానంతవరకు కూర్చుండియున్న వస్త్రమును ఈయవలెను.
ఈ విధానము ననుసరించి గ్రహణ స్నానము చేసినవానికి గ్రహపీడ కలుగదు. వాని బంధుజనులకును కీడు కలుగదు. ఉత్తమ శుద్ధిని ఉత్తమమగు క్షేమారోగ్యములను పొందును.
సూర్య గ్రహణమునందు ఎల్లప్పుడును మంత్రములతోపాటు సూర్య నామములను కీర్తించవలెను. చంద్ర సూర్యోపరాగ (గ్రహణ)ములందు పద్మరాగమును ప్రశస్తమగు కపిలగోవును కూడ విత్త సంపన్నుడైనచో దానము చేయవచ్చును.
దీనిని చదివినను వినినను సర్వపాప విముక్తుడై శివలోకమునందు సుఖించును.