యముడు సత్యవంతుని సూక్ష్మదేహము కొనిపోవుట

మత్స్యుడు మనువుతో ఇట్లు చెప్పెను. కట్టెలు కొట్టుచుండగా సత్యవంతునకు తలనొప్పి వేయసాగెను, వేదనతో బాధపడుచువచ్చి అతడు భార్యతో ఇట్లు పలికెను. ఈ కట్టెలు కొట్టిన శ్రమతో నాకు తలనొప్పికలిగినది; చీకటిలో ప్రవేశించుచున్నానేమో అనిపించుచున్నది; నాకేమియు తెలియుట లేదు; నీతొడపై తలనుంచి నిద్రించవలెననిపించుచున్నది అని రాజ పుత్రితో చెప్పి నిద్రతో కండ్లుకూరుకొని పోవుచు ఆ రాజకుమారుడు ఆమె ఒడిలో తలపెట్టుకొని నిదురించెను. పతివ్రతయు మహాభాగయు అగు ఆ రాజ పుత్రికిస్వయముగా తానొక్కడు మాత్రమే అచటికి వచ్చిన యముడు కనబడెను. అతడు నల్లకలువ పూరేకువలె నల్లనివాడు; పచ్చని వస్త్రము ధరించిన ప్రభువు; అతడు తన చుట్టును మెరపు తీగలు చుట్టుకొనినదియగు నీటితో నిండిన మేఘమువలెనుండెను, రవిసమాన కాంతిగల కిరీటముతోను కుండములతోను ప్రకాశించుచుండెను. ఆతనివెంట గొప్ప పరివారమును కాలుడును మృత్యువును కూడనుండిరి.

ఇట్టి యమధర్మరాజు ఆ ప్రదేశమునకు వచ్చెను, సత్యవంతుని దేహమునుండి బొటనవ్రేలి యంత పరిమాణముగల (సూక్ష్మ దేహాత్మక) పురుషుని తీసి అతనిని (కర్మఫల రూప) పాశముతో బంధించి త్వరితముగ దక్షిణ దిక్కునకు పోయెను. ఉత్తమ స్త్రీయగు సావిత్రియును తన పతిగత జీవితుడగుట చూచి ఏమియు తడవు చేయక సోమరితనము చూపక ఆ ధర్మరాజు ననుసరించి పోవసాగెను.అంతట అట్లుపోవుచు దోసిలిపట్టి వణకుచున్న హృదయముతో ఆమె ఇట్లు పలికెను.