ఇలుని వెదకుటకై శరవణమునకు పోవుట

ఇంకను సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, అనంతరము వైవస్వతమను కుమారులగు ఇళుని సోదరులు ఇక్ష్వాకుడు మొదలగువారు రాజగు ఇళుని వెదకుచు శరవణోద్యాన సమీపమునకు వెళ్ళిరి. వారికి అందరకు అచ్చట తమ ఎదుట ఒక ఆడు గుర్రము కనబడెను. దాని మేను రత్నములు తాపటము చేసిన పల్యాణము (జీను)తో ప్రకాశించుచుండెను. ఆ బడబ చాల ఉత్తమమయినది. ఉత్తమ లక్షణములు కలది. వారు ఆ పల్యాణమును గుర్తించిరి. అది తమ రాజగు ఇళుని అశ్వమునకు సంబంధించినదే అని తెలిసి వారాశ్చర్యపడిరి. ఇది ఆ మహాత్ముని (ఇళుని) చంద్రప్రభయను పేరుగల గుర్రమే. ఇది ఉత్తమమగు బడబగా మారినది. ఇందులకు హేతువు ఏమి? అని ఆలోచించిరి. తరువాత వారు తమ పురోహితుడగు వసిష్ఠుని కడకు పోయి “అయ్యా! మీరు యోగవేత్తలలో శ్రేష్ఠులు. ఎందువలన ఈ విచిత్రము జరిగెనో తెలుపుడు” అని వేడిరి.

వసిష్ఠుడును తన జ్ఞానమయ నేత్రముతో చూచి: “ఈ శరవణమున ప్రవేశించిన పురుష ప్రాణి స్త్రీత్వమును పొందును అని పూర్వము పార్వతి ఈ ఉద్యానము విషయమున వ్యవస్థ చేసెను. దానిచేత దీనిలో ప్రవేశించినందున రాజుతో పాటుగానే ఈ అశ్వముగూడ స్త్రీత్వమును పొందినది. కుబేరునితో సమానుడగు ఈ ఇళరాజు మరల పురుషుడగు నట్లుగా యత్నము చేయ వలసియున్నది. అందులకై పరమేశ్వరుని ఆరాధించి అనుగ్రహింప జేసికొనవలసి యున్నది” అని చెప్పెను. అంతట ఆ మనుపుత్రులు మహేశ్వరుడు ఉన్న చోటికి పోయిరి. పార్వతీ పరమేశ్వరులను వివిధ స్తోత్రములతో స్తుతించిరి. వారు వీరితో ఇట్లు పలికిరి. “ఈ వ్యవస్థ దాటరానిది. కానీ ప్రస్తుతమున ఇట్లు చేయుడు. ఇక్ష్వాకుడు అశ్వమేధము చేసి దాని ఫలమును మాకు అర్పణ చేయవలయును. దాని వలన ఇళ (మరల పురుషుడై) కింపురుషుడుగా అగును.”

ఆ మాట విని ఆ మనుపుత్రులందరును అట్లేయని వెళ్ళిరి. ఇక్ష్వాకుడు అశ్వమేధముచేసి తత్ఫలమును పార్వతీ పరమేశ్వరులకు అర్పించెను. ఇళ (ఇలుడు) కింపురుషుడయ్యెను. తరువాత ఆ వీరుడు ఒక మాసము పురుషుడుగా ఒక మాసము స్త్రీగా అయ్యెను. ఇళుడు ఇళగా బుధుని గృహమున ఉన్న కాలములో ఆమె గర్భము ధరించెను. ఆమెకు అనేక సద్గుణములు గల ఒక కుమారుడు కలిగెను. ఇట్లు (ఇళా గర్భమున) ఒక కుమారుడు కలిగిన తరువాత బుధుడు మరల స్వర్గ లోకమునకు పోయెను. ఇళ పేరిట ఆ దేశ భాగమునకు ఇళవృత వర్షమను పేరువచ్చెను. (ఇది బహుశః నేటి మంగోలియా కావచ్చును!) ఇట్లు ఇళ కుమారుడగు ఐళుడు చంద్ర సూర్య వంశముల రెంటి నుండియు పుట్టినవాడై ఆ వంశములకు అభివృద్ధిని, శుభమును కలిగించువాడయ్యెను. అతని పేరు పురూరవసుడు. అతడు చంద్ర వంశమును వృద్ధి చేయువా డయ్యెను. ఇక్ష్వాకుడు సూర్యవంశకర్త అయ్యెను. ఇళుడు కింపురుషుడుగా ఉన్న సమయమున అతనికి సుద్యుమ్నుడు అని పేరు. ఆ సుద్యుమ్నునకు శత్రువులచే ఓటమి నెరుగని వీరులగు ముగ్గురు కుమారులు కలిగిరి. వారిలో ఉత్కలుడు ఉత్కల దేశములకు గయుడు గయకు హరితాశ్వుడు కురుజనపదములతో కూడిన తూర్పు దేశమునకు రాజులైరి.

ఇళుడు స్త్రీత్వమున తన కుమారుడగు పురూరవసుని ప్రతిష్ఠానము (పెషావర్ కావచ్చును) అను నగరము రాజధానిగా (ఆర్యావర్త భాగమునకు) రాజుగా అభిషేకించి తాను కందమూల ఫలములు ఆహారముగా వానప్రస్థ వ్రతమును అనుష్ఠించుటకై వనమునకు పోయెను. ఇళుని సోదరుడగు ఇక్ష్వాకుడు మధ్యదేశమునకు (హిమాలయము వింధ్యము వినశనము ప్రయాగ ఈ నాలుగు ఎల్లలకు నడుమ ఉండు దేశమునకు) రాజయ్యెను. నరిష్యంతుని కుమారుడు శపుడు. నాభాగుని కుమారుడు అంబరీషుడు. ధృష్టునకు ధృష్టకేతుడు చిత్రనాథుడు రణధృష్ణుడు అనువారు ముగ్గురుకుమారులు. ఆనర్తుడను కుమారుడును దారికా అను కన్యయును శర్యాలి సంతానము. ఆనర్తుని కుమారుడు ప్రతాపశాలియగు రోచమానుడు. అతని దేశము ఆనర్తము. అతని రాజధాని కుశస్థలి. ఆనర్తుని కుమారుడు రేవుడు. అతని కుమారుడు రైవతుడు. అతనికే కకుద్మాన్ అనియు పేరు. ఇతడు దేవుని కుమారులు నూరుమందిలో జ్యేష్ఠుడు రైవతుని కూతురు రేవతి బలరాముని భార్యగా ప్రసిద్ధురాలు. కరూశునకు చాలమంది కుమారులు కలిగిరి. వారు కారూశులు అను పేర ప్రసిద్ధులు. పృషధ్రుడు (పృషదశ్వుడేమో?) గోవధమువలన తనగురుని శాపముచే శూద్రత్వమును పొందెను.

ఋషిసత్తములారా! ఇక్ష్వాకు వంశమును చెప్పబోవుచున్నాను వినుడు. ఇక్ష్వాకునకు కుక్షి కుక్షికి వికుక్షి అను రాజ శ్రేష్ఠుడు కలిగెను. ఇతడు కుక్షి పుత్తుల నూరుగురలో పెద్దవాడు. వికుక్షి కుమారులలో పదునైదుమందియే పర్వతపుటుత్తర దేశమునకు ప్రభువులైరి. వీరుకాక ఇంకను నూట పదునాల్గు మంది వికుక్షి కుమారులు మేరువునకు దక్షిణపు దేశమును పాలించిరి. వీరిలో పెద్దవాడు కకుత్స్థుడు. అతని కొడుకు సుయోధనుడు. అతని కొడుకు పృథువు. అతని కొడుకు విశ్వశాఖుడు. అతని కొడుకు ఇంద్రుడు. అతని కొడుకు యవనాశ్వుడు. అతని కొడుకు శ్రావస్తుడు అతని కొడుకు వత్సకుడు. శ్రావస్తుడు గౌడ దేశములో తన పేర శ్రావస్తీ నగరము నిర్మించెను. వత్సుని కొడుకు విహర్షకుడు. అతని కొడుకు కులాదుడు. అతడు దుందు అనువానిని చంపి నందున దుందుమారుడని ప్రసిద్ధిపొందెను. అతనికి దృఢాశ్వుడు దండుడు కపిలాశ్వుడు అను ముగ్గురు కుమారులు. దృఢాశ్వుని కుమారుడు ప్రమోదుడు. అతని కుమారుడు హర్యశ్వుడు. అతని కుమారుడు నికుంభుడు. అతని కొడుకు నంహతాశ్వుడు. అతనికి అకృతాశ్వుడు రణాశ్వుడు అను ఇద్దరు కుమారులు. రణాశ్వుని కుమారుడు యవనాశ్వుడు. అతని కుమారుడు మాంధాత. అతని కుమారులు పురుకుత్సుడు-ధర్మకేతుడు-ముచుకుందుడు. శత్రుజిత్ అనువారు నలుగురు. పురుకుత్సుని కుమారుడు వసుదుడు. అతడు నర్మదకు పతి. అతని కొడుకు సంభూతి. అతని కొడుకు త్రిధన్వుడు. అతని కుమారుడు త్రైయారుణుడు. అతని కుమారుడు సత్యవ్రతుడు. అతని పుత్రుడు సత్యరథుడు. అతని సుతుడు హరిశ్చంద్రుడు. అతని తనయుడు లోహితుడు. అతని కుమారుడు. వృకుడు. అతని కొడుకు బాహుడు. అతని పుత్రుడు సగరుడు. అతడు పరమ ధార్మికుడు. అతనికి ప్రభ, భానుమతి అను ఇద్దరు భార్యలు. వారు పుత్రులను కనగోరి ఔర్వ మునిని ఆరాధించిరి. అతడు మెచ్చి వారికి కోరిన వరములనిచ్చును. ఆ వరప్రభావమున ప్రభకు అరువదివేల మంది కుమారులు కలిగిరి. భానుమతికి అసమంజుడు అను ఒకే కుమారుడు కలిగెను. వారిలో అరువదివేలమందియు భూమిని త్రవ్వుచు (కపిలరూపుడగు) విష్ణునిచే దగ్ధులైరి. అసమంజుని కుమారుడు అంశుమంతుడని ప్రసిద్ధినొందెను.

అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అతని సుతుడు భగీరథుడు. అతడే తపస్సుచే గంగను భూమికి తెచ్చెను. కనుకనే గంగ భాగీరథియైనది. అతని కొడుకు నాభాగుడు. అతని కుమారుడు అంబరీషుడు అతని కుమారుడు సింధు ద్వీపుడు. అతని సుతుడు అయుతాయుడు. అతని పుత్రుడు ఋతుపర్ణుడు. అతని కొడుకు కల్మాషపాదుడు. అతని కుమారుడు సర్వకల్పుడు. అతని కొడుకు అనరణ్యుడు. అతని కుమారుడు నిఘ్నుడు. అతనికి అనమిత్రుడు రఘువు అను ఇద్దరు కుమారులు. రఘుని కుమారుడు దిలీపుడు. అతని కుమారుడు అజుడు. అతని సుతుడు దీర్ఘబాహువు. అతని పుత్రుడు అజపాలుడు. అతని కుమారుడు దశరథుడు. అతనికి నారాయణుని అంశవలన నలుగురు కుమారులు కలిగిరి. వారిలో జ్యేష్ఠుడు రాముడు. రావణుని అంతమొందించినవాడు అతడే. భృగువంశ శ్రేష్ఠుడగు వాల్మీకి అతని చరితమును రచించెను ఇక్ష్వాకువంశ వర్ధనులగు లవకుశులను ఇద్దరు అతని కుమారులు. కుశుని కుమారుడు అతిథి. అతని కుమారుడు నిషధుడు. అతని కుమారుడు నళుడు. అతని కుమారుడు నభుడు. అతని కుమారుడు పుండరీకుడు. అతని కొడుకు క్షేమధన్వుడు. అతని కుమారుడు వీరుడు ప్రతాప వంతుడునగు దేవానీకుడు. అతని కొడుకు అహీనగుడు. అతని కుమారుడు సహస్రాశ్వుడు. అతని కొడుకు చంద్రావలోకుడు. అతని కుమారుడు తారాపీడుడు. అతని కుమారుడు చంద్రగిరి. అతని సుతుడు భానుచిత్రుడు. అతని పుత్రుడు శ్రుతాయువు. భారతయుద్ధమున మరణించిన శ్రుతాయువు ఇతడే. కశ్యప వంశమున పుట్టి ప్రసిద్ధినొందిన నలులు ఇద్దరు. వారిలో ఒకడు వీరసేనుని కుమారుడు. మరి యొకడు నిషధుని కుమారుడగుటచే నైషధుడనబడిన నలుడు.

వివస్వంతుని (సూర్యుని) వంశమున జన్మించి బంగారు నాణెములనే బంగారమునే అనేకవిధ ద్రవ్యములనే దక్షిణలుగా ఇచ్చి యజ్ఞముల నాచరించి ప్రసిద్ధులయి లోకములకు మేలుచేసిన రాజులు వీరు. వీరిలోను ఇక్ష్వాకు వంశమున జన్మించినవారే ప్రధానముగా ఇచట పేర్కొన బడినారు. (అనమిత్రుడు కృతయుగమున రాజగును)