గ్రహయజ్ఞ విధానము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, పూర్వము శౌనకుడు ప్రశాంతుడై కూర్చుండియున్న వైశంపాయనుని సర్వకామములు పూర్ణములగుటకు ఉపకరించు శాంతికపౌష్టిక కర్మముల నెట్లాచరించవలెనని యడిగెను. వైశంపాయనుడు శౌనకునకిట్లు చెప్పనారంభించెను, శ్రీ-శాంతి-వృష్టి-ఆయువు-పుష్టి-అను అభ్యుదయములను పొందుటకుగాని (తనకు ద్వేష్యులగు) ఇతరులకు అపకారము కలిగించు తంత్రాచరణమును చేయుటకుగాని కోరువారు ఆచరించ వలసిన గ్రహ (ముల ఆరాధన) విధానమును తెలిపెదను; వినుము. సర్వ శాస్త్రములను పరిశీలించియు పురాణముల చేతను, శ్రుతుల చేతను చెప్పబడిన వానిని గ్రహించియు క్రోడీకరించిన గ్రంథ విస్తరముతో గ్రహశాంతి విధానమును ప్రతిపాదింతును.

విజ్ఞులగు దైవజ్ఞ విప్రులు నిర్ణయించిన శుభదినమున బ్రాహ్మణులచేత పుణ్యాహ వాచన మును జరిపించవలెను. గ్రహములను వాటి అధిదేవతలను మండపమున ప్రతిష్టించి వారినుద్దేశించి హోమము చేయవలెను. (ఇది గ్రహ శాంతి విధాన సంక్షేమము.)

(ఇకమీదట దీని విస్తరణము చెప్పబడును) పురాణములను శ్రుతులను బాగుగ ఎరిగిన మహనీయులు గ్రహ యజ్ఞము అయుత (పదివేల) హోమము-లక్షహోమము-కోటి హోమము-అని మూడు విధములని చెప్పుచున్నారు. ఇవన్నియు ఆయా విషయములలో సర్వ కామ ఫలములను ఇచ్చు శక్తికలవి. మొదట వీనిలోని మొదటిదగు అయుత హోమ రూపమగు నవగ్రహయజ్ఞ విధానము తెలిపెదను.

యజమానుడు తన ఇంటికి ఉత్తర పూర్వదిశ (ఈశాన్య దిశ) యందుకాని శివాలయ ప్రదేశమునకాని చతురగ్ర(స్ర)ము ఉదక్ల్పవము (ఉత్తరమునకు వాలుగనుండునదియు)ను పదికాని, ఎనిమిదికాని హస్తముల భుజము కలదియునగు మండపమును విధానానుసారముగ నిర్మించవలయును. దానికి దక్షిణమున నాలుగు ద్వారములును-అదే మండపమునకు ఈశాన్య మున రెండు జేనల పొడవు-అంతే వెడల్పు- అంతే లోతు కలిగిన గుంటను (హోమమునకు) దాని సమీపమున ఈశాన్యము నందే జేనెడు ఎత్తుగా నుండి వేదికను నిర్మించవలెను. ఈ వేదిక చతురస్రాకారముగ నుండవలెను. ఇది గ్రహములయు-వాటి అధిదేవతా ప్రత్యధి దేవతలయు ఆవాహనము కొరకు; ఈ వేదికకు చుట్టును నాలుగు వైపులు రెండు ప్రాకారములు (కొలది ఎత్తుకల గోడలవంటి కట్టలు) ఉండవలెను. ఇదియు ఉత్తరమునకు వాలుగా ఉండవలయును.

ఈచెప్పిన గుంటయందు (హోమకుండమునందు) అగ్ని ప్రణయనము (అగ్ని ప్రతిష్ఠించు టకు ముందు చేయవలసిన పరిస్తరణాది పూర్వకముగ అగ్ని ప్రతిష్ఠాపనము ప్రజ్వాలనము మొదలగునవి) చేసినపిదప ముప్పది ఇద్దరు దేవతలకు ఆవేదికయందు అవాహన ప్రతిష్ఠాపన ములు జరుపవలెను. (గ్రహములు 9+అధిదేవతలు 9+ప్రత్యధిదేవతలు 9+వినాయక దుర్గా వాయు ఆకాశ అశ్వినులు అను 5=32; ఇచట అశ్వి దేవతలు జంట దేవతలు కావున ఇద్దరను ఒకటిగానే గణించవలెను.)

ఎట్లనగా 1. సూర్యుడు; 2. చంద్రుడు; 3. అంగారకుడు; 4. బుధుడు; 5. గురుడు; 6. శుక్రుడు; 7.శని; 8. రాహువు; 9. కేతువు అను లోకహిత సంపాదకులగు గ్రహములు తొమ్మిది. (వీరి స్థానములు): 1.నడుమ; 2. ఆగ్నేయము; 3. దక్షిణము; 4. ఈశాన్యము; 5. ఉత్తరము; 6. తూర్పు; 7. పశ్చిమము; 8. నైరృతము; 9. వాయవ్యము. వీరినందరను తెల్లని బియ్యముతో ప్రతిష్ఠించవలెను. వీరి అధిదేవతలు: 1. రుద్రుడు; 2. ఉమ; 3. స్కందుడు; 4. విష్ణువు; 5. బ్రహ్మ; 6. ఇంద్రుడు; 7.యముడు; 8. కాలుడు; 9. చిత్రగుప్తుడు. ఇక ప్రత్యధిదేవతలు: 1.అగ్ని; 2. జలము; 3. పృథివి; 4. విష్ణువు; 5. ఇంద్రుడు; 6. ఐంద్రి (ఇంద్రాణి-శచి); 7. ప్రజాపతి; 8. సర్పములు; 9.బ్రహ్మ. వీరినేకాక వ్యాహృతిత్రయముతో ప్రత్యేకముగా వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినుల కైదుగురకు అవాహన ప్రతిష్ఠాపనములు జరుపవలెను. నవగ్రహ వర్ణములు: 1. రక్తవర్ణము; 2. శ్వేతము; 3.రక్తము; 4.పింగళ (ఎరుపు పసుపుల మిశ్రణము), 5. పింగళము; 6. శ్వేతము; 7. కృష్ణము; 8. కృష్ణము; 9. ధూమము (పొగరంగు) వీరి పూజయందు వస్త్రములును పుష్పము లును వారివారి రంగులు కలవి. ధూపము మాత్రము నిర్మలము సుగంధము కలది ఏదైనను సరియే. పూవులతో పాటు ఫలములగూడ అర్పించవలెను. వీరినైవేద్యమునకు 1. బెల్లపు అన్నము; 2. నేతిపాయసము; 3. సంయావము (గోధుమ రవ్వను పాలతో వండినది.); 4. పాలతో ఉడి కించిన పిండి; 5. పెరుగన్నము; 6. నేతి అన్నము; 7. పులగము; 8. మినుప వంట; 9. చిత్రాన్నము (పులి ఓగిరము); ఈ తొమ్మిది గ్రహములకును ఇతర దేవతా ప్రత్యధి దేవతలకును వినాయ కాదులకును భక్ష్యములేవైనను నివేదించవచ్చును.

(కలశ స్థాపనము), ఈ గ్రహవాహన వేదికకు ఈశాన్యమున పెరుగు అక్షతలు పంచ రత్నములు పంచపూగములు (పోకకాయలు) వేసి మామిడి చిగురాకులతో పండ్లతో నూతన వస్త్రద్వయముతో కప్పిన అరంధ్ర కలశమును ప్రతిష్ఠించి దానియందు వరుణుని అవాహితునిగా జేయవలెను. దానియందు గంగాది నదులనుండి సముద్రములనుండి తెచ్చిన నీటిని పోయవలెను. అనీటియందు గజాశ్వరథములుండు తావులనుండి గోవులు నిలుచుచోటి నుండి పుట్టనుండి నదీసంగమముల నుండి హ్రదములనుండి (మగుడుల నుండి) సేకరించి తెచ్చిన మట్టినికూడ వేయవలెను. ఈనీరు యజమానునిస్నానార్ధము వినియుక్తమగును. అన్ని సముద్రములును నదులును తీర్థములును మేఘములును నదములును యజమానుని క్షయింపజేయుటకై దీనియందు సన్నిహితములగుగాక! అను అర్థమిచ్చు మంత్రముతో వీటన్నిటి నందావాహనము చేయవలెను. పిమ్మట నేయి, యవలు, వడ్లు, తిలలు మొదలగు వానితో హోమ మారంభించవలెను. ఆయాగ్రహములకు విహితములగు సమిధలు. 1. (తెల్ల) జిల్లేడు; 2. మోదుగు; 3. చండ్ర; 4. ఉమ్మెత్త 5. రావి; 6. మేడి; 7. జమ్మి, 8. గరిక; 9. దర్భలు. ఈ సమిధలు ప్రాదేశ మాత్ర దైర్ఘ్యము (ప్రాదేశము-లుడితి అని తెలుగులో వాడుక-కుడిచేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు వీటిని రెండువైపులకును చాచగా ఏర్పడు పొడవు) కలిగి కొనలుగాని కొమ్మలు (చిల్లలు)గాని, ఆకులుగాని లేక సూటిగా ఉండవలెను. ప్రతియొక ఆవాహిత దేవతకును ఈ సమిధలను తేనెతో-నేతితో- పెరుగుతో వేరువేరుగా తడిపి వేరువేరుగా నూట ఎనిమిది మారులుగాని నూట ఇరువది ఎనిమిది మారులుగాని వేల్చవలయును. (కనుక ఈ సంఖ్యకు సరిపోవునన్ని సమిధలు ఉండ వలయును.)

కొసలు-కొమ్ములు (చిల్లలు) ఆకులు లేకుండు సమిధలు సేకరించుట ఈ గ్రహయజ్ఞము నందే కాదు-ప్రతిహవన కార్యమునందును ఇంతే.

(హవన విధానము) ప్రతి దేవతకును ప్రతి ఆహుతియందును ఋత్విక్కులు మంత్ర- దేవతా తత్త్వములు పరమార్థము (తాత్త్వికార్థము) నెరిగి దానికి దానికి విహితమయిన వేరువేరు మంత్రములను ఉపాంశువుగా (దగ్గరనున్న వారికి మాత్రము వినబడునట్లును-ఐనను స్పష్టముగా) ఉచ్చరించుచు సమిధలను వేల్చవలయును. ప్రతి ఆహుతితోను నేతిని చరుద్రవ్యమును, భక్ష్యములు మొదలగువానిని కూడ చేర్చవలయును. ఆయా గ్రహములకును దేవతలకును విహితములగు మంత్రములతో పదిఆహుతులను వ్యాహృతులతో మిగిలిన ఆహుతులను వేల్చవలెను. హోమము జరుపు విప్రులు ప్రాఙ్ముఖులుగానో, ఉదఙ్ముఖులుగానో కూర్చుండవలెను. మొదట ప్రతి దేవతకును సిద్ధపరచిన చరుద్రవ్యమును ఆయా గ్రహములకును దేవతలకును విహితములగు మంత్రములతో అభిమంత్రించవలెను. పిమ్మట ఆ చరువుతో వేరువేరు దేవతలకు హోమము జరిపి పిమ్మటనే హోమము నారంభించవలెను.