మత్స్య మహా పురాణము
ప్రళయాను వర్ణనము
మత్స్యుడు మనువునకు ఇట్లు చెప్పెను, యోగియు సత్యమూర్తియు, అగు నారాయణుడు సూర్యుడయి మిగుల ప్రజ్వలించు కిరణములతో సముద్రములు ఎండింపజేయును. సముద్ర నదీ కూప పర్వతములందలి జలమునంతను తన కిరణములతో గ్రహించి ఇట్లు భూస్థిత జలము త్రాగినతరువాత పాతాళమునకుపోయి అచటి జలమునుకూడ పీల్చును. తరువాత అరవిందాక్షుడగు ఆపురుషోత్తముడు ప్రాణులయందలి మూత్రరక్తాది ద్రవమును కూడ పీల్చును. బలవద్వాయులై అఖిల జగమును చలింపచేయుచు ప్రాణుల ప్రాణాపాన సమానాది వాయువులను కూడ లాగివేయును. తరువాత దేవగణాది సర్వ ప్రాణుల పంచేంద్రియ గుణములను పంచభూతములను పృథివికుండు ఘ్రాణగంధ శరీర (ఘనీభవన)ములు (ఈమూడును వరుసగా 1.ఇంద్రియము; 2.దాని విషయము - పృథివీ భూత లక్షణము) జలమునకుండు జిహ్వారస స్నేహములు అగ్నికుండెడు చక్షూరూప విపాకములు వాయువు నందలి ప్రాణ స్పర్శ విపాకములును ఆకాశమునకు ఉండు శ్రోత్ర శబ్ద శూన్యతలును (వీటికి మూల తత్త్వమయిన సర్వప్రాణుల మనోబుద్ధి క్షేత్రజ్ఞ (చైతన్య) తత్త్వములును వరేణ్యుడు (ప్రార్థనీయుడు - శ్రేష్ఠుడు) పరమేష్ఠి (సర్వోత్తమ స్థానమందున్న) హృషీకేశుడు (ఇంద్రియాధిపతి) అగు భగవానుని ఆశ్రయించియుండు లోకమాయయు భగవంతునిచే ముహూర్తములో నశింప జేయబడును. తరువాత ఆ భగవానుని కిరణములతో చుట్టుకొనబడినదియు వాయువుచే ఆక్రమింపబడినదయి వృక్షశాఖల నాశ్రయించి యుండునదియు ఆ కొమ్మల రాపిడితో పుట్టినదియునగు ప్రళయాగ్ని వందల విధములుగా మండుచు సర్వమును చుట్టుకొని దహించి వేయును.
ఆ అగ్ని పర్వతములు వృక్షములు గుబురులు పొదలు లతలు వల్లులు తృణములు దివ్య విమానములు (భవన విశేషములు) వివిధ పురములు వాటి నాశ్రయించదగినవి అన్నియు కాల్చును. లోకగురుడగు హరి సర్వలోకములను భస్మీకరించి మరల అదేయుగాంతమున అదే ప్రక్రియతో ఆ అగ్నిని చల్లార్చును. నల్లని మహామేఘమై నూరుల విధముల వేలకొలది వానలు కురియించి దివ్య జలమను హవిస్సుతో భూమిని తడుపును. పాలవలె నుండి రుచికల శుభ పవిత్రోత్తమ జలముతో భూమి మహాతృప్తిని పొందును. వర్షమువలన ఏర్పడిన ఆ నీటి వరదతో కప్పబడినదయి భూమి సర్వప్రాణి రహితమయి ఏకార్జన జలావృతయగును. ఎంతటి మహా సత్త్వము (ప్రాణు)లును అమిత శక్తి శాలియగు పరమాత్మునందు ప్రవేశించును. జగమంతయు అర్క వాయ్వాకాశాదులు లేక రూక్షమయి (ఆర్ద్రతలేక) మరుగుపడగా అమిత విక్రముడు సనాతనుడునగు భగవానుడు సముద్రములను ప్రాణులను తనుదాను కూడ మొదట ఎండింపజేసికొని తరువాత దహించి పిమ్మట నీటితో ముంచెత్తి తానొకడేయుండి పురాణ (మొదటి) శుద్ధ రూపము నాశ్రయించి తాను నిద్రించును.
ఇట్లా యోగి ఏకార్ణవ జలమునందు వ్యాపించి దానియందనేక సహస్ర యుగముల కాలము యోగ మందుండును. (సర్వలయమే యోగము.) ఈ పరమాత్ముని ఎవ్వరును వ్యక్త రూపునిగా గాని అవ్యక్త రూపునిగా గాని నిశ్చయింపజాలరు. ఈ (ఉత్తమ) పురుషు డెవ్వరు? ఇతని యోగము ఏది? ఈ యోగి ఎట్టి యోగి? భగవానుడగు ఈ ప్రభు వెంత కాలము ఏకార్ణవ స్థితియందుండును? అని ఎవరును ఎరుగరు. ఆ దేవసత్తము డొక్కడే కాని అతనిని చూచువాడు తెలుపువాడు తెలిసికొనువాడు పార్శ్వచరుడు ఎవరును ఉన్నట్లు (శాస్త్ర ప్రమాణముచే) తెలియదు. ఆకాశము భూమి వాయువు జలము అగ్ని - ఈ పంచభూతములను ప్రజాపతిని భువన రక్షకుడగు సురేశ్వరుని వేదముల కాశ్రయుడు మహామునియగు బ్రహ్మను తనయందు లయింపజేసి మరల ఏకార్ణవ జలమందు తన ఇచ్ఛతోనే శయనించియుండును.