శ్రీవామన చరిత్రము

ఋషులు సూతునితో ఇట్లనిరి, సూత్రా! నీవు మాకు రాజధర్మమును అద్భుత (ఉత్పాత) యాత్రా-స్వప్న శకున విషయములను విస్తరించి తెలిపితివి. ఇపుడిక మరల విష్ణు మాహాత్మ్యమును తెలుపవేడుచున్నాము, అతడెట్లు వామనుడయి బలిదానవుని బంధించెను, హరిలోకత్రయ మాక్రమించునపుడు అతని రూపము ఎట్లుండెను అనిన సూతుడు ఇట్లనెను.

పూర్వము అర్జునుడు ద్రౌపదీ విషయమున సమయభంగమొనరించి తీర్థయాత్రకై వెడలెను. ఆ ప్రసంగమందతడు కురుక్షేత్రమునందలి వామనాయతన మందలి వామనుని చూచి అటనున్న తపోధనుని శౌనకుని ఇదే ప్రశ్న అడిగెను. ఏ హేతువుచే ఈ దేవుడు వామనాకృతి యయ్యెను. ఈ పూజ్య భగవానుడు పూర్వము వరాహ రూపుడేల యయ్యెను? ఇది వామనునకు ఇష్ట క్షేత్రమెటులయ్యెను. అనగా శౌనకుడిట్లు చెప్పెను. కురునందనా! ధీమంతులయిన వామన వారాహుల మాహాత్మ్యమన విస్తరముగ చెప్పెదను. పూర్వము ఇంద్రుడు అసురులచే నిర్వాసితుడై దేవతలు వారిచే విజితులు కాగా దేవజననియగు అదితి పరమదుఃఖితయై తన కుమారులెట్లు మరల అభ్యుదయ మందుదురాయని చింతచేయుచు, వేయి దివ్య సంవత్సరములు కృష్ణుని మెప్పించుటకై మౌనము దాల్చి, వాయు భోజనయై తపమాచరించెను, కురునందనా! దైత్యులచే నిరాకృతులయిన తన తనయులను చూచి నేను వ్యర్థ పుత్రునయితినే అని నిర్వేదముతో ప్రణతు రాలయి పరమార్థ ప్రకాశకబుద్ధితో అర్థవంతములగు వాక్కులతో దేవదేవుడును సర్వగతుడునగు హరిని నమస్కరించి ఇట్లు స్తుతించెను.

స్మరించినవారి ఆర్తి నశింపజేయువాడును, పద్మమాలియు, పరమ కల్యాణ కల్యాణుడును, ఆది బ్రహ్మరూపుడును, పంకజనేత్రుడును, పంకజనాభుడును, పద్మసంభవుని, జన్మకారణుడును, ఆత్మయోనియు, మనోహర రూపుడును, ఇంద్రియ నిగ్రహము కలవాడును, దృశ్య జగద్రూపుడు, పరమార్థ రూపుడు, చక్రియు, శంఖ ఖడ్గహస్తుడు, హిరణ్యరేతస్కుడు, ఆత్మజ్ఞానముగల యోగులచే చింతింపబడువాడు, స్వయంయోగియు, నిర్గుణుడు విశేషరూపుడు హరియు పరబ్రహ్మరూపుడు అగు హరికి నమస్కారము. ఎవనియందు జగము ప్రతిష్ఠితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునకు అతిస్థూలునకు శంఖికి నమస్కారము, అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖులగు జను లెవనిని చూడజాలతో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవనిని తమ హృదయము లందేయున్న వానిగా చూతురో ఎవని యందన్నము జలము నదులు సమస్త జగము ఉన్నదో అట్టి జగదాధారునకు నమస్కారము; ఆద్య ప్రజాపతియు పితరులకును పరమపతి(పిత)యు దేవతాపతియు అగు కృష్ణునకు వేధో (చతుర్ముఖ బ్రహ్మ) రూపునకు నమస్కారము. మనస్సుతో చింతించినంతనే పాపము హరించు విశుద్ధుడు పరుడు అగు హరికి వేధకు (సృష్టికర్తకు) నమస్సు; సర్వభూతములును దేవదేవేశుడు అవ్యయుడు అగు ఎవని నెరిగినంతనే జన్మ మరణ రహితులగుదురో(నో)ఆ హరికి నమస్కరింతును, యజ్ఞపరాయణులు యజ్ఞమందుఎవనిని యజ్ఞుడను పేర ఆరాధింతురో అట్టి యజ్ఞపురుషునికి, విష్ణునికి, ప్రభునికి, ఈశ్వరుని నమస్కరింతును.

సర్వజ్ఞుడగు ఎవడు వేదవేత్తలచే సర్వ వేదములందును గానము చేయబడునో వేదవేద్యు డగు అట్టి విష్ణునకు జిష్ణునకు నమస్కారము; ఎవనినుండి విశ్వముత్పన్నమయి ఎవనియందు లయమందునో, విశ్వపురాకకు నిలుకడకు కారణ భూతుడగు అట్టి మహాత్మునకు నమస్కారము. బ్రహ్మాది స్తంభపర్యంతమగు ఈ విశ్వమెవనిచే వ్యాప్తమో అట్టి ఉపేంద్రునికి నేను ఈ మాయా జాలము తరించుటకై నమస్కరింతును. తోయ స్వరూపుడైయుండి అఖిలమును పోషించు విశ్వుని విశ్వపతిని ప్రజాపతిని విష్ణుని నమస్కరింతును; ఎవనిని విశుద్ధ మనోవాక్కాయ కర్మలతో ఆరాధించి అఖిలమగు అవిద్యను తరింతురో ఆ యుపేంద్రుని నమస్కరింతును, సుఖదుఃఖము లకు హేతువులగు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియయి వర్తించువాడు నగు ఉపేంద్రునకు వందనము; రాత్రులందేర్పడు చీకటిని రవివలె అసురమయ మగు రూపొందిన చీకటిని వధించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును; కపిలాది యోగి స్వరూపము నుండి అజ్ఞానమయతమమును జ్ఞాన ప్రకాశ ప్రదానమున నశింపజేయు హరికి నమస్కరింతును; ఎవని నేత్రములగు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమును సతతము చూచుచున్నారో అట్టి ఉపేంద్రునికి నమస్కరింతును, సర్వేశ్వరుడును సర్వుడును అగు ఎవనియందు నేను చెప్పిన ఇది యంతయు సత్యమో అసత్యము కాదో అట్టి అజుని విష్ణుని ప్రభుని అవ్యయుని నమస్కరింతును; నేను చెప్పిన ఇదియంతయు సత్యము కావునను జనార్ధను డింతకంటెను అధికుడు కావునను ఈ సత్యముచే నా మనోరథము లన్నియు సఫల ములయి పూరింపబడుగాక!

ఇట్లు స్తుతింపబడి వాసుదేవ భగవానుడు సర్వభూతముల కదృశ్యుడయియు అదితికి దర్శనమిచ్చుచు ఆమెతో ఇట్లు పలికెను. ధర్మజ్ఞా! అదితీ! నీ మనోరథములన్నియు నాయనుగ్రహ మున నిస్సంశయముగ సిద్ధించును; మహాభాగా! నామాట వినుము, నీ అభివాంఛితమగు వరము ఏదియో కోరుము, నీకత్యంత శ్రేయము కలుగును; నాదర్శన మెన్నడును విఫలము కాదు, అన అదితి ఇట్లనెను: దేవా! భక్తవత్సలా! నీవు నా భక్తితో ప్రసన్నుడ వయినచో నాపుత్రుడగు ఇంద్రుడు త్రైలోక్యాధిపతి అగుగాక! మహాసురు లతని రాజ్యమును యజ్ఞభాగములను హరించి నారు, వరదుడవగు నీవు ప్రసన్నుడవయినచో నాకుమారుడు మరల అవి పొందుగాక! కేశవా! వానికి రాజ్యముపోవుట దుఃఖకరముగాదు, నాసవతి కొడుకు మావాని దాయభాగమును హరించె ననుట మాహృదయమునకు బాధ కలిగించుచున్నది, అన భగవానుడిట్లనెను: దేవీ: నీ యభీప్సి తము అనుగ్రహించితిని; నా అంశమున కశ్యపుని వలన నీగర్భమున జన్మింతును, తరువాత దేవశత్రువులను సంహరింతును, ఆనంద కరురాలా! సంతోషమందుము, అనగా అదితి ఇట్లనెను; దేవదేవేశా! అనుగ్రహించుము, విశ్వభావనా! నీకు వందనము, దేవా! కేశవా! నేను నిన్ను నాగర్భమున మోయజాలనేమో! ఎవనియందు విశ్వము నెలకొన్నదో, ఎవరు తాను స్వయముగా విశ్వరూపుడో అట్టి ఈశ్వరుడగు దుర్ధరుని నిన్ను నేను ఉదరమున మోయజాలను.

అనగా భగవానుడు ఇట్లనెను: మహాభాగా! సత్యమంటివి; నాయందే జగమంతయు ప్రతిష్టితము, నన్ను ఇంద్రాది దేవత లెవ్వరును మోయజాలరు; కాని నేను సర్వలోకములను అందలి స్థావర జంగమములతో దేవాసుర మనుషులతో నిన్నును కశ్యపునికూడ మోయగలను; భద్రరూపా! కావున నీవు భయపడకుము; నేను నీ గర్భమందుండగా నీకు శ్రమముకాదు, చెమటయు పట్టదు; దక్షపుత్రీ! నేను అన్యసుదుర్లభమగు అనుగ్రహమును నీయందు చూపు చున్నాను; నేను నీగర్భమందున్న కాలమున నీపుత్రులకెవరయిన హాని కలిగించినచో వారికి తేజోహాని కలిగింతును; వ్యథ నందకుము. అని పలికి వెంటనే ఈశ్వరుడు అంతర్హితుడయ్యెను. ఆ అదితియు కాలమున పురుషోత్తముని గర్భముగాపొందెను, కృష్ణుడు గర్భస్థుడైయున్న కాలమున సకల భూమియు చలించెను, మహాశైలములు వణకెను, సముద్రములు క్షోభిల్లెను; అదితి లలితముగా నెచట అడుగుంచినను, అచటనెల్ల భూమి భేదముచేవంగెను, ఆ కాలమున పరమేష్ఠి యగు విష్ణువు చెప్పినటులే సర్వదైత్యులకును తేజోహాని అయ్యెను.