మత్స్య మహా పురాణము
గృహాది నిర్మాణార్థమై భూపరీక్ష
మొదట భూమిని పరీక్షించి తరువాత ఆ పరీక్షిత భూమియందు వాస్తుప్రకల్పనము (వాస్తు యజ్ఞ పూర్వకముగా గృహభవన ప్రాసాదాది నిర్మాణారంభమును నిర్మాణమును) జరుపవలయును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వరుసగా శ్వేతరక్తపీత(పచ్చని), కృష్ణ (నల్లని) భూములు ప్రశస్తములు; విప్రులకు తీయని, క్షత్రియులకు వగరుగల, వైశ్య శూద్రులకు ఇరువురకును వగరు కారము కలిసిన రుచిగల భూములు మంచివి.
తరువాత భూపరీక్షకై పిడిమూరంతలోతు అంతేపొడవు అంతే వెడలుపు గల చిన్న గుంతను త్రవ్వి దానియందు అంతట బాగుగ అలుకవలెను; దానిలో పచ్చిమూకుడు ఉంచి దానిలో నేయిపోసి నాలుగు దిక్కులందును నాలుగు వచ్చునట్లు వత్తులు ఆమూకుటిలో ఉంచి వానిని వెలిగించి ఆ గోతియందు నడుమ ఉంచవలెను. అపుడు ఏదిక్కునందలి దీపములు ఎక్కువ కాంతితో వెలుగుచుండునో చూడవలెను; బాగుగ వెలుగుటలో తూర్పుది విప్రులకు, దక్షిణపుది క్షత్రియులకు, పడమటిది వైశ్యులకు, ఉత్తరపుది శూద్రులకు మంచిది. అన్ని దిక్కు లందలి దీపములును బాగుగ ప్రకాశము నిచ్చుచున్నచో దానిని సామూహిక వాస్తుప్రదేశ మందురు ఇట్టి భూమి అన్ని వర్ణములవారికి మంచిది; తరువాత ఆ త్రవ్విన మట్టితోనే ఆ గోతిని పూడ్చవలెను; ఆ గోయి పూడుటకు ఆ మన్ను ఎక్కువయినచో చాల మంచిది; సరిపోయినచో సమము; తక్కువయినచో మంచిదికాదు అనగా ఆ భూమియందు గృహ నిర్మాణము తగదు. తరువాత ఆ భూమిని నాగటితో దున్ని అన్నివిధములగు విత్తనములను చల్లవలయును, అవి అందు మూడునాళ్ళకు మొలకెత్తినచో చాలమంచిది; ఐదునాళ్ళు పట్టినచో మధ్యమము; ఏడు దినములు పట్టినచో అధమము; ఇట్టి ప్రదేశము గృహ నిర్మాణమునకు పనికిరాదు.
ఇట్లు స్థలమును పరీక్షించి అది గృహనిర్మాణమునకు పనికివచ్చునని నిర్ణయించిన ప్రదేశమును పంచగవ్యములతోను ఓషధులతోను సంమిశ్రితమయిన జలముతో కలయంపి చల్లి తడుపవలెను; తరువాత ఆ ప్రదేశమున ఎనుబదియొక గడులు (అంకణములు) వచ్చునట్లు బంగారు నరకుతో రేఖలు గీచికొనవలెను; తరువాత దానిపై పిండితో పూయవలెను; దానిపై మరల అంతటను దారముతో ఆలోడనము చేయవలెను; తరువాత ఆ త్రాటితో తూర్పు పడమరలుగా పదియు ఉత్తర దక్షిణములుగా పదియు రేఖలు గీయవలెను. ఇది సర్వ వాస్తు విభాగములందును చేయవలసిన పని. ఇట్లు గీయుటచే తొమ్మిది తొమ్మిదులు ఎనుబది యొకటి గదులు ఏర్పడును. ఈ గదులయందు వెలుపలగా ముప్పది రెండు మందిని, లోపలగా పదు ముగ్గురను-మొత్తము నలువదియైదు మందిని ఆయా దేవతలను, యజమానుడు ఈశాన్య కోణాదిగా ఆయా స్థానములందు నిలిపి హవిస్సుతో పూజించవలయును, వారివారి స్థానములను వారివారి నామ ములను తెలిపెదను. వారు వరుసగా- అగ్ని, పర్జన్యుడు, జయన్తుడు, ఇంద్రుడు, సూర్యుడు, సత్యుడు, భృశుడు, ఆకాశుడు, వాయువు, పూషన్, వితథుడు, గృహక్షతుడు, యముడు, గంధర్వుడు, భృంగరాజుడు, మృగుడు, పితృగణము, దౌవారికుడు, సుగ్రీవుడు, పుష్పదంతుడు, జలాధిపుడు (వరుణుడు), అసురుడు, శోషుడు, పాపుడు, రోగుడు, అహి, ముఖ్యుడు, భల్లాటుడు, సోముడు, సర్పుడు, అదితి, దితి-ఈముప్పదిరెండు మందియు బయటి గదులయందు ఉండు వారు; ఇందులకులోగా ఈశానాది చతుష్కోణము లందును ఆపుడు, సావిత్రుడు, జయుడు, రుద్రుడు అనువారిని నిలుపవలెను, నట్టనడుమ గదియందు బ్రహ్మయుండును; అతనికి దగ్గరలో ఒక గది విడిచి మరియొక గదియందు ఎనిమిదిమంది సాధ్యులను నిలుపవలయును; వారు వరుసగా-ఆర్యముడు, నవిత, వివస్వాన్, ఇంద్రుడు (విబుదాధిపుడు), మిత్రుడు, రాజయక్షుడు, పృథ్వీధరుడు, ఆవవత్సుడు అనువారు. వీరిని ప్రాగాదిగా నిలుపవలయును. ఇపుడు ఆయామూలలందు పదికులను తెలిసికొందుము: పదము = అంకణము (గది); పదికులు=ఒక్కొక్క అంకణమునకు అధిపతులు.
ఎట్లు అనిన ఈశాన్య కోణమునందలి దితి, పర్జన్యుడు, అగ్ని, ఆపుడు, ఆపవత్సుడు, ఆగ్నేయము నందలి ఆకాశ, పూష, వాయు, సావిత్ర, సవితృలు, నైరృతము నందలి, మృగ, దౌవారిక, పితృగణ, జయ, విబుధాధిపులు, వాయవ్యము నందలి పాపాహిరోగ రుద్రరాజ యక్ష్ములు ఈ ఇరువది మందియు ఒక్కొక్క గది(డి)కి అధిపతులు, తూర్పున జయంతుడు, ఇంద్రుడు, సూర్యుడు, సత్యుడు, భృశుడును; దక్షిణమున వితథ గృహక్షత, యమ, గంధర్వ, భృంగ రాజులును; పడమట సుగ్రీవ, పుష్పదంత, వరుణాసుర శోషులును; ఉత్తరమున ముఖ్య భల్లాట, సోమ, సర్పాదితులును అను ఈ ఇరువది మందియు రెండేసి గదు(డు)లకు అధిపతులు. లోపలి వరుసలోని ఆర్యముడు, వివస్వంతుడు, మిత్రుడు, పృథ్వీధరుడు-అను నలుగురును మూడేసి గదు(డు)లకు అధిపతులు; నడుమ ఉన్న బ్రహ్మ తొమ్మిది గదు(డు)లకు అధిపతి. ఇట్లు
మూలలందలి 20 మందియు - 20 × 1 = 20 గదులకు అధిపతులు
దిక్కులందలి 20 మందియు - 20×2 = 40 గదులకు అధిపతులు
లోపలి 4 మందియు - 4 × 3 = 12 గదులకు అధిపతులు
నడుమ 1 (బ్రహ్మ) - 1 x 9 = 9 గదులకు అధిపతులు
మొత్తము 45 మందియు - 81 గదులకు అధిపతులు
ఇపుడు పైని చెప్పిన వానిలో వంశములు ఏర్పడు విధానము చెప్పెదను; వాయువు నుండి రోగునివరకు ఒక రేఖను పితరులనుండి అగ్నివరకు ఒక రేఖను గీయవలెను; ఇవి రెండును బ్రహ్మస్థాన మధ్యబిందువునొద్ద పరస్పరము ఖండించుకొనును; తరువాత ముఖ్యుని నుండి భృశునివరకు ఒకరేఖను శేషునినుండి వితథుని వరకు ఒకరేఖను సుగ్రీవుని నుండి అదితివరకు ఒకరేఖను మృగునినుండి పర్జన్యుని వరకు ఒకరేఖ గీయవలయును, ఈ నాలుగవ దానిని జయుని వరకు గీయుటయు కొందరు మతమున గలదు; ఆయా పదముల నడుమ ఏర్పడు ఈరేఖల సంపాత (పరస్పర ఖండన) స్థానములకు మర్మములు అని పేరు; కోణస్థానములకు త్రిశూలమని వ్యవహారము; ఈ సంపాత ప్రదేశము లందుగాని త్రిశూల స్థానములందు గాని స్తంభములు నిలుపరాదు; దూలము (తుల)ల అదుకులుగా కీలములు బంధించుట, ఒక దూలముతో మరియొక దూలమును ప్రక్కప్రక్కగా కలుపుట - ఒక దూలముతో మరియొక దూలమును ఒకదాని చివరి భాగమును కొంత మరియొక దానిపైకి వచ్చునట్లు కలుపుట మొదలగునవి చేయకుండలెను; [కీలము, ఉచ్ఛిష్టము, ఉపఘాతము అనునవి ఈ చెప్పిన అర్థములలో శాస్త్రీయ పారిభాషిక పదములుగ మూలమందు వాడబడినవి.]
ఈ విధమగు సర్వభాగ సన్నివేశములతో కూడిన ఈ చతుశ్శాలాత్మకమగు గృహ నిర్మాణమునకుగాను వ్యవస్థచేసిన ఈ ప్రదేశమును వాస్తుపురుషుని దేహముగా భావనచేయ వలయును; పైని చెప్పినట్లు లిఖించిన వంశరేఖలలో అగ్ని స్థానము నుండి పితృ స్థానమునగల కోణాగ్రమువరకుగల పొడవు వాస్తుపురుష దేహదైర్ఘ్యము; శిరఃస్థానమున అగ్నియు, ముఖము నందు అపుడును ఎడమ, కుడి స్తనములందు పృథ్వీధరుడును, ఆర్యముడును, వక్షఃస్థలమునందు అపవత్సుడును, ఎడమ-కుడి నేత్రముల యందు దితియు పర్జన్యుడును; ఎడమ-కుడి శ్రోత్రముల యందు అదితియు జయంతుడును; ఎడమ-కుడి అంస(భుజమూల) సంధులయందు సర్పుడును ఇంద్రుడును; దక్షిణ భుజమందు సూర్యభృశాకాశ వాయువులును; సోమభల్లాట ముఖ్యాహిరోగులు వామభుజమునందును; రుద్రరాజు యక్ష్ములు వామహస్తమందును; సావిత్ర నవితృలు దక్షిణ హస్తమునందును; వివస్వంతుడును మిత్రుడును కుడి- ఎడమ జఠర (ఉదర) భాగములందును; పూషుడును పాపయక్షుడును కుడి ఎడమ హస్తముల మణిబంధము లందును; అసురశోషులు వామపార్శ్వమందును; వితథగృహక్షతులు దక్షిణ పార్శ్వమునందును; యమవరుణులు కుడి- ఎడమ ఊరువులయందును; గంధర్వ పుష్పకులు కుడి-ఎడమ జానువుల యందును, భృంగ- సుగ్రీవులు కుడి ఎడమ జంఘల (పిక్కల) యందును, దౌవారిక మృగులు ఎడమ-కుడి స్ఫిక్ (పిరుదు)లయందును; ఇంద్రజయులు మేడ్రము (పురుష మర్మావయవము) నందును, హృదయమందు బ్రహ్మయు నున్నట్లు భావనచేయబడి పూజింపబడుదురు.
ఇంతవరకును చెప్పిన ఏకాశీతి సదనిర్ణయము ఈశ్వర సద్మములకు అనగా ధనవంతుల గృహములకు సంబంధించినది; రాజులకును దేవతలకును సంబంధించు గృహవిశేషములను ప్రాసాదములు అందురు. ప్రాసాదములయందు వాస్తు రూపము చతుః షష్టి పదములతో (అరు వది నాలుగు అంకణములతో) ఏర్పడును; అనగా నిర్మాణమునకు ఉద్దేశించిన ప్రదేశమును తొమ్మిది నిలుపురేఖలతో తొమ్మిది అడ్డురేఖలతో విభజించగా 8 × 8 = 64) అరువదినాలుగు గదులుగా ఏర్పడును, బహిఃకక్షనములయందు నాలుగు గదులందును ఆయా దేవతలు ఎనిమిది మందియు అర్ధపదములకు అధిపతులు; అట్లే అంతఃకోణముల యందును; బ్రహ్మస్థానము దీనినడుమ నాలుగుపదములతో-అంకణములతో ఏర్పడును. ఇరువదిమంది రెండేసి పదములకు అధి పతులు; రెండు పార్శ్వములందును ఉండు దేవతలు ఒక్కొక్కరు ఒకటిన్నరేసిపదములకు అధిపతులు.