మత్స్య మహా పురాణము
తారకాసుర విజయము
సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: ధ్వజమును ధనువును లేకుండగా పారిపోవు చున్న నారాయణ దేవుని చూచి ఇంద్రుడు రణమున దేవతలు ఓడిరని గ్రహించెను. దైత్యులు ముదితులయి యుండుటచూచి అతనికి ఏమి చేయుటకును తోచలేదు. పాకాసురుని అణచిన వాడగు సురేంద్రుడు నారాయణునికడు వచ్చి మిగుల ప్రోత్సాహకము మధురమగు వచనమును ఇట్లు పలికెను. దేవా! దుష్టమానసులగు ఈ దానవులతో ఆడుకొనదవేల? దుర్జనులు తెలిసికొనిన లోపము కలవానికి కార్యాచరణ మెక్కడిది? అట్టివాడు ఏమియు చేయజాలడు. శక్తుడగువాడు నీచుని ఉపేక్షించినచో వాడది తన బలమే యనుకొనును. కావున మతిమంతుడగు వాడు పట్టుబడిన నీచుని విడువరాదు. తమకు అగ్రేసరులగు వారిసహాయ సంపత్తిచేతనే వీరులు జయ మందుదు రందువా, ప్రభా! మీరు హిరణ్యాక్షుని వధించినపుడు మీకెవరు సహాయులుగా నుండిరి? హిరణ్యకశిపుడును వీర్యవంతుడును మదముచే పొగరెక్కి చెలరేగినవాడును కదా? ఆ భయంకరాకారుడును నీదగ్గరకు రాగానే ఏమియు లేకుండ రూపుమాసిపోయెనుకదా! దేవశత్రు వులయి నీకు ప్రతిబలులుగా నిలిచిన దైత్యేంద్రుడు ఎల్లరును నీదగ్గరకు రాగానే మంటలను చేరవచ్చిన మిడుతలవలె నయిరికదా! హరీ! యుద్ధమున అసురులకును దైత్యులకును నీవే నాశకరుడవు. ఇప్పుడును నీవు అట్లే వారికి అంతకుడవయి దేవతలకు ఆశ్రయము అగుము. ఇంద్రుడిట్లు ప్రబోధించగా మహాభుజుడును సర్వభూతములకు ఆశ్రయుడునునగు హరి బలమున తేజమున శక్తి సమృద్ధియందును మిగుల వృద్ధిపొందెను. అంతట అధోక్షజుడు హరి ఆ కాలము నకు తగిన వాక్యమునిట్లు ఇంద్రునితో పలికెను. దైత్యేంద్రులను ఆయా వధోపాయముల తోనే కాని మరియొక విధముగా చంపుట మనకు శక్యముకాదు. తారకుడు ఏడు దినముల శిశువు చేతిలో తప్ప జయింప అలవికాడు. ఒకడు స్త్రీ చేతిలో చావవలసిన వాడు; ఇంకొకడు కుమారి చేతిలో చావవలయును. భయంకర విక్రముడగు జంభదానవుడు మాత్రము చంపసాధ్యుడు, అ దానవుడు కూడ నీచేతిలో తప్ప చచ్చువాడుకాడు; కావున లోకహరుడగు జంభుని నీవు దివ్యధైర్య మవలంబించి చంపుము. నారక్షణలో నీవు జగత్కంటకుడగు జంభ దానవుని నిర్మూలించుము.
వైకుంఠుడు పలికిన ఆ మాటవిని దేవశత్రు హంతయగు సహస్రాక్షుడింద్రుడు దేవతల నందరను సైన్యరచన చేయుడని యాజ్ఞాపించెను. సర్వలోకములయందలి తపో వీర్యము లకు సారరూపులగు ఏకాదశరుద్రులను ఇంద్రుడు అగ్రేసరులను (సేనాపతులను)గా చేసెను. వారందరును సర్పములు పడగలు భుజకీర్తులుగా బిగించి కట్టుకొనిన వారు; బలవంతులు; నీలకంఠులు; చంద్రరేఖా సమూహముతో అలంకృతములగు పెద్ద కేశపాశములు గలవారు, శూలముల కాంతుల జ్వాలలతో పూయబడిన దేహములు గలవారు, భుజమండలములతో భయంకరులు; పచ్చనై ఎత్తయిన జటాజూటములు గలవారు, సింహచర్మములు శరీరములకు చుట్టుకొన్నవారు, మహాఽ సురులు తరిమినవారు, 1. కపాలి; 2. పింగళుడు; 3. భీముడు, 4. విరూపాక్షుడు; 5. విలోహితుడు; 6. అణేశుడు; 7. శాసనుడు; 8. శాస్త్ర; 9. శంభుడు; 10. చండుడు; 11. కుశుడు అని వారి నామములు; అనంతబలులు ప్రభావ శాలురునగు ఈ ఏకాదశ రుద్రులును దేవ సేనాగ్రభాగమును పాలించుచు దానవులను చీల్చి చెండాడుచు దేవతలకు తృప్తి కలిగిం చుచు మేఘములవలె గర్జించుచుండిరి. హిమాచలము వంటిది గొప్పది బంగారు తామరల మాలలతో అలంకృతము కదలు చామరములు కలది బంగారు దండములతో రత్న రాసులతో అలంకృతము నాలుగు దంతములు కలది మత్తతతో నిలిచినది మహామద జలము స్రవించునది కామరూపధారియగు ఐరావత గజముపై దేవేంద్రుడు హిమాలయ శృంగమునందు తేజోవంతుడగు రవివలె కూర్చుండెను. అమిత విక్రముడగు వాయుదేవత ఇంద్రుని ఎడమవైపును, తన జ్వాలలతో దిఙ్ముఖములను నింపుచు అగ్ని కుడివైపును కాపాడుచుండిరి. ఇంద్రుని అతని సేనను వెనుకనుండి శ్రీమహావిష్ణువు రక్ష సేయు చుండెను. ఆదిత్యులు, పసువులు, విశ్వదేవులు, మరుత్తులు, అశ్వినులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, నాగులు అలంకరించుకొని శస్త్రములనే ధనముగా ఉంచుకొని బంగారు సొమ్ములు దాల్చి కోటికోటి ఒక్కొక్క బృందము బృందముగా తమతమ బిరుదులు దాల్చియుండిరి. తమముందు నిలిచి స్తోత్ర పాఠకులు తమ కీర్తులను వినిపించు చుండ ఇంద్రునితో కూడి ఈ దేవ జాతుల వారెల్లరును దర్పవంతులయి దైత్యవధకై ముందునకు వచ్చిరి.
దేవతా సమూహము రక్షించుచుండ ఏనుగుల రథముల గుర్రముల ధ్వనులతో కూడి ఎల్ల సమయములందును ధ్వజ వస్త్ర కోటులతో అలంకృతమయి ఒప్పు ఆ ఇంద్రసేన దైత్యుల శోకము నధికము చేసెను. వచ్చుచున్న ఆ దేవ సేనను చూచి గజాసురుడు గజ రూపుడును మహామేఘములతో కూడిన మహా సముద్రమువలె భయంకరుడును పరశువు ఆయుధముగా ధరించినవాడును విశాలదంతములతో వికటుడును నయి దేవతలను పాదములతో నలచెను, చేతులతో విసరెను, గండ్రగొడ్డటితో తెగగొట్టెను. ఆ రౌద్ర విక్రము డిట్లు తమ సేనను పడగొట్టు చుండ వేరువేరు విధములగు శస్త్రాస్త్రములతో సన్నద్ధులయి యక్ష, గంధర్వ, కిన్నరులు అందరును కూడి పాశములను, పరశువులను, భుశుండులను, కుంతములను, తీక్షములగు ప్రాసములను అతి దుఃసహములగు ముద్గరములను ప్రయోగించిరి. ఆ దైత్యుడు వాని నన్నిటిని గజరాజు కమలములనువలె మ్రింగెను. కోపముతో తన దీర్ఘభుజమును చరచిన చప్పుడుతోనే దేవతలను పడగొట్టుచు ఆ గజదైత్యుడు తేరి చూడనైన నలవికాక సంచరించెను. వాడు వచ్చిపడిన దేవతా బృందము నందెల్ల మహా హాహాకారము రేగుచుండెను. తమసేన అన్ని దిక్కులకు పారిపోవు. చుండుట చూచి అహంకారముతో రేగిన జ్వాలలతో వెలుగుచు రుద్రులు పరస్పరము ఇట్లు పలికిరి: ఏమయ్యా! ఈ దైత్యేంద్రుని పట్టుకొనుడు; ఈ మహాసురుని చీల్చుడు. పదును పెట్టిన నిశిత శూలములతో వీనిని మర్మములందు విరుగగొట్టుడు. ఈ వాక్యమును విని కపాలియను రుద్రుడు వాడి మొన కలిగిన శూలమును చక్కగా తుడిచి ఎడమచేతితో పట్టుకొనెను. చక్రములవలె కనుబొమలు ముడివేసి దృఢమగు పిడికిటి పట్టుతో నిర్మలమగు శూలము పట్టుకొని గజ దానవుని కుంభ దేశమున కొట్టెను. తరువాత దశరుద్రులు కూడ నిర్మలమగు ఉక్కుమొనలుగల శూలములతో పర్వతమువంటి దృఢ శరీరముగల ఆదైత్యుని కొట్టిరి. నీలమగు శూలపు మొనలతో పొడువబడుచు ఆ రంధ్రముల నుండి రక్తము కారుచున్న నల్లని దేహకాంతిగల ఆగజాసురుడు బాగుగా విచ్చిన నల్ల కలువలతోను ఎర్రకలువలతోను తెల్లని దేహచ్ఛాయ కల హంసలతోను అన్నివైపుల నిండిన శరదృతువు నందలి నిర్మల సరస్సువలె ప్రకాశించెను. గజాసురుడు బాధనొందుచు చిగురాకులవంటి తన చెవులు కదలుచుండ తన దంతములతో రుద్రుని నాభిని చీల్చెను.
గజదైత్యుడు ఇద్దరు రుద్రులతో యుద్ధమున చిక్కియుండుటచూచి మిగిలిన నవరుద్రులును వాని శరీరమును వివిధ శస్త్రములతో చెక్కిరి. చచ్చిన మహిషము దగ్గరనున్న నక్కలవలె వానికడ వారు ఆ బలశాలురు రణనిర్భయు లయియుండిరి. అంతట ఆ అసురు పుంగవుడు కపాలిని భీముని విడిచి నవ రుద్రులమీదకు పరుగెత్తెను. వారిని కాలితాపులతో దంతములతో చేతులతో వాడు మర్ధించెను. తుములు యుద్ధములో వాడు శ్రమనందగా కపాలి రుద్రుడు వాని చేయి పట్టుకొని వానిని మహావేగమున త్రిప్పెను. దానిచే వాడు శ్రమాతురుడై కొన ఊపిరితో నుండి యుద్ధోత్సాహమును యుద్ధోత్సవపు పూనికను విడిచివేసెను. కపాలి రుద్రుడు వాడు పడుచుండగనే సర్వాంగముల నుండి రక్తము కారుచుండవాని చర్మమును భయంకరముగా ఒలిచి దానిని వస్త్రముగా చేసికొనెను. వాడు మరణించుటచూచి మహాబలులగు దానవులెల్ల వేలకొలదిగా భయపడిరి, పారిపోయిరి, దేవతల కొట్టిరి, వారిమీదకు వచ్చిపడిరి. రక్తసిక్త మైన గజ చర్మ వస్త్రము ధరించిన ఆ కపాలి రుద్రుని చూచిన దానవులకు అన్ని దిక్కులందును భూమిమీదను వారికి ఆ భయంకర రుద్రుడే కనబడుచుండెను.
ఇట్లు మహాబలుడగు దైత్యుడు మరణించగా ప్రళయ మేఘములవలె మ్రోగు దుర్ధరదుందుభి మ్రోగించుచు నిమియను దానవుడు ఏనుగునెక్కి ఆటకు వచ్చిపడి దేవసైన్యమును కలవరపెట్టెను. వాని గజము పోయిన దిక్కున నెల్ల దేవతలు భయార్తులయి తెలివి తప్పి తమ వాహనములతో కూడ ఆచోటువిడిచి పారిపోవుచుండిరి. దాని మదపు వాసన తగులగానే దేవ గజములు చెల్లా చెదరగుచుండెను. దేవసేన పారిపోవుచున్నను ఇంద్రుడు మాత్రము నారాయణునితో దిక్పాలకు లతో కూడి రణమున నిలిచెను. నిమి వాహన గజము తన కడకు రాగానే ఇంద్రుని ఐరావతము భయపడుచు భయంకరముగ ఘీంకరించుచు ఎంత నిలిపినను యుద్ధ రంగమున నిలువక పారిపోసాగెను.
పారిపోవుచున్న దానిమీదనే ఎదురుత్రిప్పిన మొగముతో ఉండి ఇంద్రుడు దైత్యునితో యుద్ధము చేసెను. అతడు చక్రముతో నిమి వక్షమున కొట్టెను. గదతో వాని గజమును గట్టిగా కొట్టెను. కాని వాడది లెక్కపెట్టక నిశ్చలపౌరుషుడై ముద్గరముతో ఐరావతపు కటిదేశమును కొట్టెను. ఆ దెబ్బతిని అది వెనుక కాళ్ళు ముడిచి కొండవలె క్రిందపడెను. అది నిమిగజమును చూచి భయపడుచు త్వరగా లేచి అటనుండి పారి పోయెను. అంతలో ఇసుక ధూళితో నిండిన భయంకర వాయువు వీచెను. దానికెదురు నిలిచిన నిమి గజము రక్తముకారుచు గొప్ప గైరిక ధాతువుల మడుగుతో నున్న పర్వతము వలె ప్రకాశించెను. అంతలో కుబేరుడు బరువయిన గద ఎత్తి దైత్యేంద్రుని వైపు విసరగా అది నిమి గజపు తలపై పడెను. ఆ దెబ్బతో ఆ ఏనుగు మూర్చనందెను. దంతములతో భూమి చీలుచుండ అది కొండవలె నేలపై పడెను. దానితో దేవసేనలో సింహనాదములును ఏనుగుల ఘీంకారములును అధికమయ్యెను. ధానుష్కుల అల్లె త్రాళ్ళ టంకారములును గుర్రములు సకిలింతలును వ్యాపించెను. నిమి గజము చావగా నిమి దైత్యుడు పారిపోగా దేవతలు చేయు సింహనాదము విని జంభుడు నేయి పోసిన అగ్నివలె మహాకోపముతో మండిపడెను. వాడు కోపరక్త నేత్రుడై ధనువున బాణము సంధించి దేవతల నెల్లరను నీలుడు నీలుడనుచు తన సారథిని ప్రేరించుచు వేగముగ పోవుచున్న ఆతని రథకాంతి ఉదయ పర్వతమున ఉదయించుచున్న సహస్రాదిత్య కాంతివలె నుండెను. పతాకములతో చిరుగంటల గుంపులతో శ్వేతచ్ఛత్రముతో ఒప్పు రథముతో వాడు దేవసేనల హృదయముల నలుగగొట్టుచుండెను. ఇట్లు వచ్చుచున్న జంభునిచూచి ఇంద్రుడు దృఢమగు ధనువును తైలముతో శుద్ధిచేసిన మొనగలిగి సూటిగా పోవు అర్ధచంద్ర బాణమును తీసికొని దానితో దైత్యుని ధనుస్సును శరమునుఖండించెను. వాడు వెంటనే యదివదలి శరముల వెదజల్లు మరి ఒక ధనువును తైలధౌతములయి సూటి గపోవు సర్పాకృతి శరములను తీసికొని వానితో పదింటితో ఇంద్రుని మోకాళ్ళను రెండింటితో హృదయమును రెండింటితో భుజ మూలములను కొట్టెను. ఇంద్రుడును దాన వేంద్రునిపయి బాణముల గమి వదలగా వాడవి తన దగ్గరకు వచ్చులోపలనే అగ్నిజ్వాలల వంటి బాణములతో పదేసి ముక్కలుగా ఖండించెను. ఇంద్రుడా దానవేశ్వరుని వర్షాకాలమున తాను మేఘములతో ఆకాశమును కప్పునట్లు కప్పెను. ఆ దానవుడును దుర్నివారములగు మేఘములను వాయువు దిఙ్ముఖములకు ఎగురగొట్టినట్లు తన వాడియుమ్ములతో ఇంద్రుని ఆ బాణములను చెదరగొట్టెను. ఇంద్రుడును తన క్రోధమును ఎక్కువసేపు నిగ్రహించుకొనలేక దానవేంద్రునిపై గంధర్వాస్త్రమును మహాద్భుతమగు దానిని ప్రయోగించెను. అంత దాని తేజస్సుచే అంతరిక్షము వ్యాప్తమయ్యెను. గంధర్వులును, కిన్నరులును (తమకు రక్షణగా) అద్భుతాకారములు గల నానాప్రాకార తోరణములు నిర్మించి వానినుండి ప్రయత్నముచే అస్త్రవృష్టి కురియుచుండ దానితో దానవమహాసేన దెబ్బతినుచు అప్రమేయ పరాక్రముడగు జంభుని శరణు చొచ్చెను. వాడు తానును ఇంద్రుని అస్త్రములవలని పీడచే వ్యాకులుడయ్యును సాధు జనుల ప్రవర్తనమును స్మరించి భయపడినవారిని రక్షింపపూనెను. ఆ దైత్యుడు మౌసలాస్త్రమును విడువగా జగత్తంతయు అంతటను ముసలములతో నిండెను. అవి ఒకేవిధముగ తమ పనిచేయుచు ఎదిరించ, అణగించరానివై ఉండెను. గంధర్వాస్త్రముతో నిర్మించబడిన గంధర్వ నగరములు (నగరాకార మేఘాదికము) ఈ ముసలములలో లయమందెను. జంభుడును మరియొక గంధర్వాస్త్రమును సంధించి పర సేనలపయి ప్రయోగించి ఒక్కొక్క దెబ్బతో వందల కొలదిగా గజములను, అశ్వములను ఈ దేవతలలోని మహారథులను శీఘ్రమే నశింపజేయసాగెను.
అంత సురాధిపు డింద్రుడు త్వాష్ట్రాస్త్రమును ప్రయోగించెను. అతడది సంధించుచుండగనే అగ్నిజ్వాలలు చెలరేగెను. దానినుండి ఇంద్రుడు యంత్రమయములగు ఎదిరించ నలవికాని, దివ్యాయుధములను కూడవదలెను. ఆ యంత్రములతో అంతరిక్షమున పందిరి నిర్మించబడెను. దానితో మౌసలాస్త్రము శమించెను. జంభుడు ఈ యంత్ర సముదాయమును లోపింపజేయు శైలాస్త్రము ప్రయోగించ దానినుండి మహా ప్రమాణముగల రాళ్ళవాన ప్రవర్తిల్లెను. అది యంత్రములను నూవు గింజలంతగచేసి శత్రువుల తలలపై పడెను. ఆ వేగముతో భూమికూడ బ్రద్దలయ్యెను. సహస్రాక్షుడగు పురందరు (ఇంద్రు) డంతట వజ్రాస్త్రము ప్రయోగించ శైలాస్త్రపు రాలవాన అన్నివైపులను శిథిలమయ్యెను. అది చూచి శైలము వంటివాడగు జంభుడు త్వరితముగా మహాపరాక్రమముతో ఐషీకాస్త్రమును ప్రయోగించి ఇంద్రునికి ప్రియమగు వజ్రాస్త్రమును శమింపజేసెను. దుర్ధరమగు ఐషీకాస్త్రమును వాడు సంధించుచుండగనే దేవ సేనలు రథములతో గజములతో కూడ మండిపోయెను. ఐషీకాస్త్ర తేజముతో తమ సేన మండుచుండ సురసత్తముడును పాకాసురుని శాసించినవాడును బలాసురుని చంపినవాడునగు ఇంద్రుడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించగా ఐషీకాస్త్ర మణగిపోయెను. ఆగ్నేయాస్త్ర విజృంభణముతో జంభుని శరీరము కాలిపోయెను. వాని రథమును సారథియుకాలెను. తన యస్త్రము ఇట్లు ప్రతిహతము కాగా బుద్ధిస్ఫూర్తికల ఆ దైత్యేంద్రుడు అగ్ని జ్వాలల నణచగల వారుణాస్త్రము ప్రయోగించెను. అంతట క్షణములో అకసము మేఘములతోను తళతళ మెరయు మెరపుతీగలతోను ఆకుల మయ్యెను. గంభీరమగు మద్దెల మ్రోతల (వంటి ఉరుము)లతో దిక్కులంతట నిండిపోయి ఆకసము నుండి పడు ఏనుగు తొండపులావు జలధారలతో భూమియంతయు దిక్కులన్నియు నిండిపోయెను. ఆగ్నేయాస్త్రము శమించుటచూచి ఇంద్రుడు మేఘ సముదాయమును నశింప జేయగల వాయవ్యాస్త్రమును ప్రయోగించెను. వాయవ్యాస్త్రముతో మేఘమండలము చెదరిపోగా అకాశము నల్లకలువ పూరేకులవలె నిర్మలమయ్యెను. అతి రూక్షమగు వాయువుచే దానవులు కంపితులైరి. వారిలో బలశాలురుకూడ రణమున నిలువజాలక పోయిరి. అంతట జంభుడు ఆ వాయువును ప్రతిహతము చేయుటకై దశయోజన విస్తారముగల పర్వతమయ్యెను. దేవతలకు భయము గొల్పుచు వాడు భయంకరమగు నానాయుధములను ఖడ్గలతలను వృక్షములను దేవతలపై వదలుచుండెను. అంతట శతక్రతుడు (నూరు యజ్ఞములు చేసిన) ఇంద్రుడు పర్వతాకారుడగు జంభునిచే వాయువణచబడగా వానిపై వజ్రమయాస్త్రముతో మహావజ్రమును ప్రయోగించెను. ఆ వజ్రము పడగానే అచలరూపుడగు ఆ దైత్యేంద్రుని కందరములు (గుహలు) నిర్దరములు అంతటను చీలిపోయెను. అంతట ఆ దానవేంద్రుని శైలరూపమాయ నివర్తించెను. అంతట మహాతీవ్రుడగు ఆ జంభుడు మహాపర్వత సమానాకార గజముగా మారెను. దేవసేన నది నలుగత్రొక్కెను. దంతములతో దేతలను చావగొట్టెను. కొందరిని వీపుతో మరికొందరను తొండముతో చుట్టి విరుగగొట్టెను. ఇట్లు వాడు దేవసేనను నశింప జేయుచుండ వృత్రదానవుని చంపిన ఆ ఇంద్రుడు త్రిలోకముల వారికిని ఎదిరించనలవికాని నారసింహాస్త్రమును వదలెను. దాని తేజస్సులో నుండి వేలకొలది నారసింహమూర్తులు బయటికి వచ్చెను. అమూర్తులు కోరల మొనలు విచ్చి నవ్వుచు కర్కశములగు గోళ్ళు కలవై యుండెను. వానినా గోళ్ళతో చీల్చి ఆమూర్తులు వాని గజ సంబంధి మాయను నశింపజేసెను.
అంతట వాడు వందలకొలది పడగలతో ఆకులమయి తన విషశ్వాసలతో దేవసేనలోని మహారథులను కాల్చివేయు మహాఘోర సర్పమయ్యెను. అంతట మనోహర భుజశక్తి గల ఇంద్రుడు గరుడాస్త్రమును ప్రయోగించగా దానినుండి వేలకొలది గరుడులు వెలువడిరి. వారు సర్పాకృతియగు జంభుని ఖండములు చేయగా దానితో వాని మాయ నశించెను. తన మాయ నశించగా జంభ మహాసురుడు చంద్ర సూర్యగమన మార్గ వ్యాపియగు అతులరూపము ధరించి నోరు తెరచి సురపుంగవులను మ్రింగ సంకల్పించెను. అంతట మహా రథములును, మహారథులును, గజములును వానినోటిలోనికి పోయెను. దేవసేనయు పాతాలమువలె తాళ్ల ప్రమాణముగల దౌడలుగల వాని భయంకరమగు నోటిలో ప్రవేశించెను. బలీయుడగు దానవుడు తన సేనను మ్రింగుచుండ ఇంద్రుడును తన వాహనమును అలసిపోగా దీనుడయ్యెను. ఏమి చేయవలయునో తోచక విష్ణునితో నతడిట్లు పలికెను. ఏకర్తవ్యమాశ్రయించి మనము దానవునితో యుద్ధము చేయదలచితిమో దానిలో ఇంకేమి మిగిలియున్నది? అనగా వజ్రాయుధునితో బుద్ధిశాలియగు విష్ణువు ఇట్లుపలికెను. చేతకాని పిరికివాడువలె నీవు ఇప్పుడు యుద్ధము మానుట సముచితము కాదు. పురందరా! నీవు శీఘ్రముగా నీ శత్రుమాయను నశింపచేయవలయును. నాకు ఈ దైత్యుడు తన అధిక పౌరుషమాశ్రయించి స్థిరత్వము నొందినవాడుగా కనబడుచున్నాడు. నీవు మోహము నందకుము. శక్రా! ప్రభూ! శీఘ్రముగా నా అస్త్రమును స్మరింపుము. అనగా దేవరాజు ప్రకుపితుడై శుచియై దానవుని పక్షమున నారాయణాస్త్రమును ప్రయోగించెను. ఇంతకు లోపలనే ఆదైత్యుడు నోరుతెరచి క్షణములో గంధర్వ, కిన్నర, నాగరక్షో జాతులవారిని మూడు లక్షల మందిని మ్రింగెను. అంతతో నారాయణాస్త్రమా అసురుని వక్షమున పడగా భేదిల్లిన ఆ హృదయము నుండి బహురక్తము స్రవించెను. అ దైత్యానందకరుడు మహాగాఢమగు రణ రంగమును విడిచిపోయెను. ఆనారాయణాస్త్రము తేజముతో ఆ దైత్యుని ఆరూపము నశించగా వాడాకాశమున నెచటనో ఎవరికి కాన రాకుండ అంతర్హితుడయ్యెను.
దైత్యేంద్రుడగు జంభుడు ఎవరికిని ఇంద్రియములకు గోచరముకాకుండ అకసమునందుండి గొప్ప శస్త్రములను సురసేనా సంహారకముగా ప్రయోగించెను. వ్యర్థములు కానివియు అక్షయములునగు ప్రాసములను గండ్ర గొడ్డండ్రను చక్రములను ముద్గరములను గొడ్డండ్రను హులనములను భిండివాలములను ఇనుపగదలను రౌద్రుడగు దానవుడు ప్రయోగించెను. దేవసేనలందు దానవునిచే ప్రయోగించబడిన భయంకరములగు బహు సంఖ్యగల అస్త్రములతోను కుండలములతో కూడిన శిరస్సులతోను ఏనుగు తొండములవంటి తొడలతోను కొండలవంటి ఏనుగులతోను విరిగిన కాడులు చక్రములు ఇరుసులు రథములు సారథులు అనువానితోను భూమి నిండినదై రక్తమాంసముల అడుసుతో రక్తపు భయంకర హ్రదములందలి సుడులతో శవరాశులనెడి కొండలతో కూడినదై సంచరించుటకే సాధ్యముకాని దయ్యెను. రణరంగమున కబంధములు గందరగోళముగా నృత్యము చేయుచుండెను. వసయు రక్తమును కారుచు అడుసుగా ఏర్పడెను. ఈస్థితి సమస్త ప్రాణులకును జగత్త్రయ ప్రళయముతో సమమై తోచుచుండెను. ఈ రణములో నక్కలు గ్రద్దలు కాకులు చాల సంతోషము నందెను. రణరంగములో - ఒకచోట కాకి యొకటి శవపు కన్ను పీకుచు కాపు కావనుచుండెను. ఒకచోట నక్కలు బలిసిన ప్రేవులు ఈడికొని పోవుచుండెను. ఒకచోట కొంగ ఒకటి తన ముక్కుతో ఏదియో నమలుచు చూచువారికి భీతి కొల్పుచు కూర్చుండెను. వేరువేరు జాతుల కుక్కలొకచోట మృతుని మాంసమును తినుచుండెను. ఒకచోట తోడేలు ఏనుగు నెత్తురు త్రావి దాని ప్రేవులలో దాగి కూర్చుండెను. ఒకచోట కుక్కలు గుర్రముల శవములను ఈడ్చికొనిపోవుచుండెను. ఒకచోట పిశాచ జాతీయులు రక్తాసవము తెగత్రావి తమ ప్రియురాండ్రతో కూడి వేగముగా పరుగిడుచు ప్రమోదముతో మత్తిల్లి సంబరపడు చుండిరి. ఈశవపు మొగము నాకు తెచ్చి ఇమ్ము, ఈ(గుర్రపు) గిట్ట నాకు చాలా ఇష్టము; ఈచేయి పద్మమువలె నున్నది; నాకిది కర్ణపూరము (చెవి సొమ్ము)గా అగును; అనుచు కొందరు స్త్రీలను చుండ మరియొక పిశాచి రోషముతో కూడి దయ ఇంచుకయు లేక (తాను కోరిన మాంసాదికము తెచ్చి ఈయలేదని) తనప్రియుని చూచుచుండెను. మరియొక (ప్రియుని) ప్రియురాలు తన ప్రియుడు ఉష్ణరక్తమను ఆసవము తనకు తెచ్చి ఈయగా ఒక శవపు చర్మము ఒలిచి దానిని చిక్కని చిగురాకు (దొన్నె)గా చేసికొనెను. (దానిలో రక్తాసవము త్రాగుచుండెను. ) ఒక యక్షస్త్రీ గొడ్డలితో చెట్టు నొకటిని నరకి (దానిని ఊయెలకట్టు స్తంభముగా చేసికొనెను.) ఏనుగు దంతమును శిశువుగా చేసికొనెను. ఏనుగు కుంభపు డిప్పను (ఊయెల తొట్టిగా) తీసికొనెను. కుంభము నుండి లభించిన ముత్తెముకూడ తీసికొనిపోయి అవి తన ప్రియునకు ఇచ్చి అతని అనుగ్రహమును కోరెను. యక్షులును, రాక్షసులును (అచ్చటచ్చట) రక్తాసవమును త్రావుచుండిరి.
ఒక పిశాచము తన అనుచర పిశాచమును పిలిచి ఇట్లనుచుండెను. శ్మశానము నందు కనబడుచు లభించు ప్రాచీపీనుగ రక్తము నాకురుచించుటలేదు. తనప్రియురాలి ఎదుట ప్రాణ త్యాగము చేసిన ఆ కిన్నరుని రక్తాసవము నాకు తెచ్చి ఇమ్ము: అది అశ్వశవపు వెంట్రుకల వాసన పట్టించి ఉండవలయును; అని కిన్నరుని ముఖమునెత్తురు మెచ్చుచు ఆ పిశాచము మనుష్యశవమును (మెచ్చక) వదలివేసెను. “ఆచచ్చిన ఏనుగును చూచుచున్నను నాకేమియు భయము లేదు.” “ఆ దానవుని శవమును నేనొక్కదాననే తినలేను. (ఇద్దరము కలిసి తిందము.)” అని ఇట్లు పలు విధములుగా యక్షస్త్రీలు (యక్షిణులు) తమ ప్రియులతో పలుకుచుండిరి. మరికొందరు యక్ష రాక్షసులు కపాల పాణులయి ఉండిరి. తెగతిండి పోతునైన నాకు ఇంకను ఇండు - ఇండు; అని కొంద రనుచుండిరి. మరికొందరు రక్తనదులలో దిగి స్నానము చేయుచుండిరి. మరికొందరు రక్తముతో పితరులకు తర్పణము చేయుచు మాంసములను పితరులకు అర్పించు చుండిరి. మరి కొందరు రక్తముతో పితరులకు తర్పణము చేయుచు మాంసములను పితరులకు అర్పించు చుండిరి. మరికొందరు యక్షరాక్షస పిశాచాదులు ఏనుగుల పీనుగులు తెప్పలుగా నెత్తుటి మడుగులను దాటుచుండిరి.
ఇట్లు మిగుల సంకటమగు దేవాసుర యుద్ధములో వీరభటులు దుర్జయులై నిర్భయులై ప్రకాశించుచుండిరి. అంతలో మహాబలులగు ఇంద్రుడును, కుబేరుడును, వరుణుడును, వాయువును, అగ్నియు, యముడును, నిరృతియు ఈ అందరును దానవుల వైపునకు ఆకాశములోనికి దివ్యాస్త్రములను వదలిరి. దానవుని విషయములో దేవతల అస్త్రములు వ్యర్థములయ్యెను. ఆ యుద్ధము మహాతుములమయి కోపావేశమునకు హేతువయ్యెను. దైత్యునితో (డి యుద్ధములో) అలసిన దేవతలకు ఏమి చేయుటకును తోచలేదు. వారి సర్వావయవములును దైత్యాస్త్రములతో గాయములయి వారేమియు చేయజాలకుండిరి. చలికి బాధనొండు గోవులవలె వారొకరిలో మరియొకరు ముడుచుకొనిరి.
ఇట్టి స్థితిలో నున్నవారిని చూచి విష్ణువు ఇంద్రునితో దేవేంద్రా! బంధరహిత మగునది కావున బ్రహ్మాస్త్రమును స్మరింపుమనెను. విష్ణుప్రేరణచే నాతడు ధనువున నొక బాణమును సంధించెను. అది మహాతేజోయుతము, సంపూజితము, దివ్యము, శత్రు నాశకము, సంధానము చేసినంతనే శత్రువులను చంపునది; ఎదిరించ నలవికాని యట్టి బాణమును ధనువునందమర్చి యతడు బుద్ధిమంతుడు కావున సమాహిత చిత్తుడయి అస్త్రమంత్రమును స్మరించెను. నియమిత మనస్కుడయి ఆమంత్రము ఉచ్చరించెను. ఆతడు మొగము ఎత్తి ఆకాశమువైపు చూచుచు, దైత్యవధ నుద్దేశించి అభిసంధించినదియు వ్యర్థము కాని తేజము కలదియు నగు ఆబాణమును ఆకర్ణాంతము లాగిన ధనువునుండి వదలెను.
అంతట ఆ జంభాసురుడును ఈ మహాస్త్ర సంధానము జరుగుట చూచుచునే తన మాయను విడిచి నేలపై నిలిచెను. వాని నోరెండ సాగెను. శరీరము వణక సాగెను. బలము తగ్గినందున వాడు తడబడుచు కలతనొంద సాగెను. అంతట ఇంద్రుడు అస్త్ర శ్రేష్ఠముతో అభిమంత్రించిన ఆ అర్ధ చంద్రశరము ఆ మహారణము నందు మహాబలముతో వెడలి ఇంద్రుడు చేయు శస్త్రాస్త్ర ప్రయోగమున అతనికి దగ్గరచుట్టమయి నూతన రవి బింబమును పోలిన రూపముతో శత్రువు పైపడెను. దానితో కిరీటపు కొనయందలి విస్ఫుట కాంతులతో నిండినది సుగంధయుత నానా పుష్పముల వాసనలలో మునిగినది ధూమావృత మగు అగ్నివలె ఒప్పు వెంట్రుకలు కలది కుండల సహితము అగు జంభాసుర శిరము పడిపోయెను.
ఆ జంభాసురుడు హతుడు కాగా దానవేంద్రులు యుద్ధమునకు పెడమొగమయి భగ్న సంకల్పులై తారకాసురుని కడకు పోయిరి. వాడును భయపడిన ఆ దైత్యులను చూచెను. జంభునితో కూడ నలుగురు దానవేంద్రులు రణరంగమున దేవతల చేతిలో మరణించిరని వినెను. తారకుడంతట అభిమానముతో, దర్పముతో, గర్వముతో పరాక్రమముతో అహంకారముతో తన సైన్యమునకు రోషమెక్కించెను. పిమ్మట తారకుడు విజయశీలమగు రథము ఆరోహించెను. అది వేయి గరుత్మంతులను పూన్చినది; సర్వ ఆయుధములను అమర్చినది; సర్వాస్త్రముల రక్షణము కలది; త్రైలోక్య మందుండు సర్వ సమృద్ధులతో కూడినది; విశాలమగు పెద్ద ఆసనము కలది; వాడట్లు మహాసేనతో కూడి శీఘ్రముగా యుద్ధమునకు వెడలెను. అంతకులోగా ఇంద్రుడును జంభుని అస్త్రశస్త్రముల దెబ్బలతో గాయపడిన సర్వావయవములను కల ఐరావతమును విడిచి మాతలిచే రక్షితమును జయశీలమునగు రథము నధిష్ఠించియుండెను. అది కాచిన బంగారపు అలంకారములు కలది; మహారత్నములు తాపటము చేసినది; చతుర్యోజన విస్తీర్ణము; దానిని సిద్ధ సంఘములు చుట్టియు ఉండెను. దాని చుట్టును గంధర్వులు కిన్నరులు పాడుచుండిరి. అప్సరసలు నృత్య మొనర్చుచుండిరి. ఆ రథము సర్వాయుధములతో దట్టమయి విచిత్రములు నాశ్చర్యకరములునగు కూర్పులతో ప్రకాశించుచుండెను.
ఆ దేవరాజ రథమునకు చుట్టును అన్ని వైపులను దేవతలు హరితో కూడి కవచములు ధరించియుండిరి. భూమి కంపించెను. రూక్షమగు వాయువు వీచెను. సముద్రములు ఉవ్వెత్తుగ లేచి కలతపడెను. రవి తేజము తగ్గెను. అస్త్రములు మండెను. బాహువులు కంపించెను. ఇట్లు సమస్త ముద్భ్రాంతమగు నంతలో తారకుడట కనబడెను. ఒకవైపు తారకాసురుడు; మరొకవైపు దేవ సంఘములు; ఒకవైపు లోకనాశము; మరొకవైపు లోకోద్ధరణము; జగత్సంక్షయమొకవైపు; జగత్పాలనము మరియొకవైపు; ఇట్లు దేవాసుర భేదముతో ఆ సేనా సముదాయము రెండు అయియున్నను ఒక్కటియే అయియున్నట్లు కనబడుచుండుట సర్వభూతములును ప్రేక్షకులయి చూచుచుండెను. త్రిలోకములందును సత్తా (ఉనికి) రూపములోనున్న ప్రతియొక వస్తువును ఆ సమయములో తమతమ విభూతులు కోల్పోయి కనబడుచుండెను. అస్త్రములు, తేజస్సులు, ధనములు, ధైర్యము, శోభ, బలము, వీర్యము, పరాక్రమము - అన్నియు తమ విభూతులను కోల్పోయెను. ఆ సన్నివేశము సురాసురులు సర్వతేజస్సులకును వారి తపోబలమునకును ఒరపిడి రాయి యయ్యెను.
అంతట ఆదేవతలును తమ వైపునకు వచ్చుచున్న ఆ తారకుని హృదయమును అగ్ని సమానాగ్రములుకల తొమ్మిదేసి బాణములతో కొట్టిరి. వాడట్లు హృదయమున దెబ్బతినియు ఆ బాణములు లెక్కచేయక దేవతల నొక్కొక్కరిని తొమ్మిదేసి బాణములతో నొప్పించెను. తారకుడు ప్రయోగించు బాణములు లోకనాశమునకే పుట్టినవేమోయన్నట్లు ముందునకు పరుగిడు చుండెను. తరువాత కాలమున తమ భార్యల కన్నుల నుండి నిరంతరము కారనున్న కన్నీరువలె ఎడతెగని బాణరాశిని దేవతలు దానవులపై ప్రయోగించిరి. ఆ బాణరాశి ఇంకను తనకడకు చేరక మునుపే ఇంకను ఆకాశమం దుండగనే తారకుడు వానిని కుపుత్రుడు, మహాప్రఖ్యాతిని పొంది నదియు, మిగుల నిర్మలమై క్రమమున కీర్తి వహించుచు వచ్చుచున్నదియునగు తన మహావంశమును తన చెడునడువడులతో నాశమొందించినట్లు నాశమందించెను.
పిమ్మట వాడు దేవతలు తమ భుజములతో ప్రయోగించిన బాణజాలమును నివారించి పిమ్మట బాణములతో భూమ్యాకాశములను దిక్కులను కూడ నింపెను. తన బాణజాలములతో దేవబాణములను పుంఖ (పింజ) ప్రదేశములందు విరిగిపోవునట్లు ఖండించెను. ఆ తారకుని బాణజాలములు మిగుల వాడియగు మొనలు కలవి, గ్రద్దల - నెమళ్ళ ఈకలు రెక్కలు పింజలందు కట్టియున్నవి; చెవి వరకు ధనువు లాగి వదలినవి; విమలములయినవి; బంగారముతో వెండితో ప్రకాశించుచున్నవి; శాస్త్రార్థము చేయునప్పుడు సంశయ విషయములను ఆయా యర్థములను వికల్పనములతో విడమరచి ఖండిచినట్లువాడు దేవ బాణములను ఖండించెను. పిమ్మట వాడు నూరు బాణములతో ఇంద్రుని కొట్టెను. దెబ్బదింటితో నారాయణుని, నూరింటితో అగ్నిని, పదింటితో వాయుదేవుని, పదింటితో యముని, డెబ్బదింటితో కుబేరుని, పదునెనిమిదింటితో వరుణుని, ఇరువది ఎనిమిదింటితో నిరృతిని కొట్టి మరల ఒక్కొక్కరిని మర్మ స్థానముల భేదించి నొప్పించు పదేసి బాణములతో కొట్టి మాతలిని మూడింటితోను, గరుడుని పదింటితోను, అరుణుని పదింటితోను, యముని వాహనమగు మహిషమును పదిటితోను కొట్టెను. తరువాత వాడు కణుపు వంపులుగల బాణములతో దేవతల కవచ సమూహములను ధనువులను ముక్కలు చేసెను. దేవతలు కవచములును, ధనువులును లేక బాణములతో గాయపడి వేరు ధనువులను, బాణములను తీసికొని వాని చుట్టును మూగిరి. ఆ దానవేంద్రుడు సత్వరముగా దేవతలను శరములతో బాధించెను. అంతట దేవత లందరును క్రోధరక్త నేత్రులయిరి. అంతట దానవుడును క్రోధరక్తనేత్రుడయి అగ్ని సమాన బాణములను అమరులపై వర్షించెను. అటులే వాడు బాణములను తీసికొని ఉత్తమ భుజశాలియగు ఇంద్రుని శీఘ్రముగా నుదుట కొట్టెను. మహేంద్రుడును రథ పీఠమందే వణకిపోయెను. రథమందుండియు శ్రీఘ్రముగా మోహమంది పడిపోయెను. వాడు అంతరిక్ష మందు వేయి రవి బింబములు కనబడగా చూచి విష్ణువని గుర్తు తెలిసి తన వీర్యము ఉద్భూతము కాగా రెండు బాణములతో నారాయణుని భుజ మూలము నందు కొట్టెను. తరువాత వాడు ప్రేతపతియగు యముని వసువులను వరుణుని అగ్ని కల్పములగు శరములతో గాయపరచెను. నిరృతిని అగ్నిని రూక్షములగు శరములతో అవలీలగా కొట్టి మిగుల నొప్పించెను.
క్షణకాలములో విష్ణువు, ఇంద్రుడు, అగ్ని మొదలగువారు తెలివితెచ్చుకొని ఒకటిగా కూడి వాడి అమ్ములతో ఆ ప్రచండుడగు తారక దైత్యునితోడ యుద్ధము చేసిరి. అది అనేక యుద్ధములతో సమానమై యుండెను. హరి హఠాత్తుగా ఆ దైత్యరాజు సారథిని వాని హృద్యమగు ధనువును వాడి అమ్ములతో కొట్టెను. అగ్ని వానిధ్వజమును మహేంద్రుడు వాని కిరీటమును కుబేరుడు బంగారుతో వెనుకవైపు నలంకరించియున్న ధనువును యముడు వాని భుజదండమును వాయువు రథాంగములను నిరృతి వాని కవచమును కొట్టిరి. అకృత్త్రిమమగు పరాక్రమముతో అమరులు చేయు యుద్ధమునుచూచి దైత్యనాథుడుగు తారకుడు తన రెండు బాహువులే సహాయులుగా పూని భయంకర ముద్గరమును ఇంద్రునిపైకి విసరెను. అది ఆకాశమున వచ్చుచుండుట చూచి ఇంద్రుడు రథము నుండి దుమికిపోయెను. ఆ ముద్గరము పరుషధ్వనితో రథపు నడుమపడి రథము పొడియయ్యెను. మాతలి మాత్రము చావలేదు. క్రిందపడి విష్ణుని పట్టుకొని వాడు వక్షమున గ్రుద్దెను. అతడు తెలివితప్పి గరుడుని మూపుపై పడిపోయెను. వాడు నిరృతిని వాని వాహనమును గాయపరచెను. భునుండితో యముని పడగొట్టెను. వహ్నిని భిండి వాలముతో తలపయి కొట్టెను. వాయుదేవుని తన భుజములతో పైకెత్తి భూతలమున పడవేసెను. కోపవంతుడై కుబేరుని తన ధనువు కొనతో నలుగ పొడిచెను. తరువాత దేవతా సమూహము నుండి ఒక్కొక్కరిని అసంఖ్యాకములగు అస్త్రములతో అమిత విక్రముడగు ఆ దైత్యేంద్రుడు కొట్టెను.
క్షణములో విష్ణువు తెలివినొంది సత్వరమే చక్రము గ్రహించి కేశవుడు అప్పటికి ఎందరో దానవులవసలతో తడిసినదియు వాడియగు మొనలుదేరిన అంచులు గలదియు అగు అద్దానిని అసురేంద్రుని దృఢవక్షమున విడిచెను. అది రవితేజముతో తారకవక్షమున పడి దానిని చీల్చి నల్లకలువ పూవువలె భూమిపయిపడెను. ఇంద్రుడు దానవులతోడి రణములలోతనకు జయాశాప్రదముగా నున్నచిరార్జితధనమగు వజ్రమును ప్రయోగించెను.
అది శౌర్యశాలియగు తారకుని శరీరమును తాకి తన జ్వాలలు చెల్లాచెదరయి నూరుగా విరిగి దయనీయ దశనందెను. వాయుదేవుడు తారకుని వక్షమున అంకుశమును అగ్నివలె జ్వలించుచున్న దానిని విడువగా అదియు వజ్రమువలెనే నాశమందెను. వాయువు తన ఆయుధము రణమున వ్యర్థమగుటచూచి పుష్పిత వృక్షములు కందరములందుగల పంచయోజన విస్తృత పర్వతశ్రేష్ఠమును పెల్లగించి ప్రయోగించెను. తారకుడు దానిని, అది ఇంకను వచ్చుచుండగనే, బాలుడు బంతిపట్టినట్లు పట్టివేసెను. అంత యముడు క్రోధమూర్ఛితుడయి దుర్జయమగు దండమును పూని ఎత్తి వేగముగా త్రిప్పి తారకుని తలమీదకు విసరెను. దైత్యు డద్దానిని బెదరించి తరిమెను. అగ్నిదేవుడు ఎవరికిని ఎదిరించ నలవికానిదై తనవలెనే ప్రకాశించుచు కనబడు శక్త్యాయుధమును తారకునిపై ప్రయోగించగా అది క్రొత్తగ వికసించిన శిరీష పుష్పమాలవలె వాని శరీరమందొప్పెను. అంతట లోకపాలుడగు నిరృతి ఒరనుండి ఆకాశమువలె నిర్మలమగు ఖడ్గమును లాగి తన కాంతులతో దిగ్భ్రాంతి గొలుపు అద్దానిని దానవేంద్రునిపై విసరగా అది వాని శరీరమున పడి శీఘ్రమే శతఖండములయ్యెను.
జలాధిపతియగు వరుణుడు భయంకరములగు దుష్ట విషగ్రంథులందలి విషాగ్నులతో భయంకరమగు సర్పరూపమగు పాశాయుధమును దైత్య భుజబంధనము చేయు తలంపుతో వదలగా వాని భుజము దగ్గరకు రాగానే రంపములవలె భయంకరములగు కోరలతో కూడిన పెద్దదౌడలు పగిలిపోయి ఆ సర్పము మరణించెను. అంతట వానికి అన్నివైపులను అశ్వినులు, సాధ్యులు, నాగులు, యక్షరాక్షస, గంధర్వులు అందరును ఒక్కుమ్మడియై ఆ మహాబలులు దివ్య నానాస్త్రహస్తులయి దైత్యేశ్వరుడగు తారకునిపై ప్రయోగించిరి. వజ్ర పర్వత సదృశమగు వాని దేహమున అవి గ్రుచ్చుకొననైన లేదు. దానవాధిపుడగు తారకుడు రథమునుండి దుమికి కోట్లకొలదిగా దేవతలను కర పార్శ్వములతో చావగొట్టగా హతశేష దేవసేనలు భీతములయి యుద్ధ సాధనములను వదలి దిశలకు పారెను. రణ విముఖులై పారిపోవు పాశములతో బంధించెను. వాడు అమర సిద్ధులు గంధర్వులు గాన ధ్వనులతో తను స్తుతించుచుండ దైత్యులు పొగడుచుండ అప్సరసలు వినోదపెట్టుచుండ విస్తృత శైలమువలె ఉన్నత శిరముతో తన నివాసమునకు పోయెను. త్రైలోక్య రాజ్యలక్ష్మియు వాని శరీరమునందు తన నగరమునందువలె ప్రవేశించెను. నాటినుండి వాడు కిన్నరులును, గంధర్వులును, నాగాంగనలును ఆయా వినోద ప్రక్రియలతో తను వినోదపెట్టుచు, ఉత్సవములు జరుపుచుండ ప్రచలన్మణికుండలా లంకృతుడయి పద్మ రాగమణీ వినిర్మిత పీఠమున కూర్చుండుచు త్రైలోక్యపాలనము సాగించెను.