మత్స్య మహా పురాణము
మండపాది లక్షణము
ప్రాసాద (దేవాలయ)మునకు ఉత్తరమందుకాని తూర్పునకాని (హోమాది ప్రక్రియలకు) మండపముండవలయును; అది పదునారుకాని పండ్రెండుకాని హస్తముల (మూరల) ప్రమాణము కల నాలుగు భుజములతో చతురస్రాకృతితో నుండవలయును; దాని నడుమ వేదిక ఉండవలెను. ఈ మండపము చుట్టును అంచుకట్ట మొదలగు అవధి జ్ఞాపికలు ఉండవలయును. ఈ వేదిక నాలుగుకాని ఐదుకాని ఏడుకాని మూరల భుజములతో చతురస్రముగా నుండవలయును; ఈ మండపము చతుర్ముఖమై నాలుగు వైపులను నాలుగు తోరణములతో (ద్వారములతో) ఉండ వలయును, ఈ ద్వారములలో తూర్పుద్వారము జువ్వి కొయ్యతో, దక్షిణ ద్వారము మేడి కొయ్యతో, పశ్చిమ ద్వారము రావి కొయ్యతో, ఉత్తర ద్వారము మర్రి కొయ్యతో చేయవలయును; ఈ ద్వారముల నిలువు కమ్ములు ఐదుమూరల పొడవుతో చేయవలయును; అందు ఒక మూరెడు ముక్క భూమిలోనికిపోగా నాలుగు మూరలు భూమిపై నుండును.
మండప మందలి భూతల మంతయు చక్కగా అలికి కంటికి ఇంపుగా ఉండునట్లు చేయ వలయును; దానినంతటిని నానావిధ వస్త్రములతోను పుష్పములతోను పల్లవములతోను అలంకృతముగా చేయవలయును, ఇట్లు మండపమును శోభింపజేసిన తరువాత నాలుగు ద్వారము లందును ఒక్కొక్క ద్వారపు రెండేసి నిలువు కమ్ముల దగ్గరను రెండేసి చొప్పున, మొత్తము ఎనిమిది కలశములను ఉంచవలయును; వానికి రంధ్రములు సొట్టలు మొదలగునవి ఉండరాదు; వానియందు ప్రకాశించు పదారు వన్నె బంగారు ఉంచవలయును; మామిడి చిగుళ్లతో వానిని కప్పవలయును; రెండేసి నూతన వస్త్రములు చుట్టవలెను; నానా పుష్ప ఫలములను అందుంచవలెను; ఇట్టి ఈ కలశములను చందనోదకముతో నింపవలయును; ఆ మండపాంతర్భాగము నందు ఇవి అన్నియును నిలిపి వానికి గంధ ధూపాదికముతో అర్చనలు జరుపవలయును, తరువాత మండపముపై అన్ని వైపులను ధ్వజములను (జెండాలను) ఎక్కించవలెను. ఇవికాక అన్ని దిక్కులందును ఆయా దిక్పాలకులకు చెందిన ధ్వజములను కూడ ఎక్కించవలయును, మండపపు పై భాగమున నట్టనడుమ మేఘమువంటి ధ్వజమును ఒక దానినికూడ ఎక్కించ వలయును; వానికి ఆయా దేవతా మంత్రములతో గంధధూపాధికముతో యథాక్రమముగ అర్చనలు జరుపవలయును; వారివారి మంత్రములతో లోకపాలురకు బలులుకూడ అర్పించ వలయును; బ్రహ్మకు అంతటిలో పైభాగమందును శేషునికి వాసుకికి అంతటిలో క్రింది ప్రదేశమందును పుష్ప గంధాదికమును అర్పించవలయును; ఆయా దేవతలకై ఏయే మంత్రములు శ్రుతియందు చెప్పబడి యున్నవో ఆయా లోకపాలురకు ఆయా మంత్రములతో పూజయును జరుప వలయును. ఇట్లు తోరణ సహితముగా అధివాసనశాలను ఏర్పరచిన తరువాత దేవతా మూర్తులకు ఒక రాత్రిని మూడురాత్రులుకాని ఐదురాత్రులుకాని ఏడురాత్రులుకాని అధివాసనము జరుపవలసి ఉండును.
ఈ అధివాసన మండపమునకు ఉత్తరమున, ఈ మండలపు కొలతలో సగము కొలతతో కాని మూడవవంతు కొలతతో కాని నాలుగవవంతు కొలతతోకాని స్నానమండపమును నిర్మించ వలయును. లింగమునో అర్చామూర్తినో (ప్రతిష్ఠించ వలసిన దానిని) తెప్పించిన తరువాత ఆ తెచ్చిన శిల్పులనువారి పరిచారకులనుకూడ యజమానుడు ఆయా విషయములను సంప్రదాయములను ఎరిగి వస్త్రాభరణాదికముతో పూజించవలయును. తరువాత క్షమించుడని అతడు వారిని ప్రార్థించవలయును.