మత్స్య మహా పురాణము
యయాతి స్వర్గప్రాప్తి
శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను, ఇట్లు యయాతి తనకు ప్రీతిపాత్రుడగు పుత్రుని పూరుని రాజపదమునందు అభిషేకించి ముదితుడై వానప్రస్థుడై మునిగా నయ్యెను. అతడు వనవాసమును జరిపి అచటి బ్రాహ్మణులతో పాటుగా ఫలమూలము లాహారముగా ఇంద్రియముల నిగ్రహించి తుదకు స్వర్గమున కేగెను. అతడచట సుఖవాసమును పొంది ముదితుడై సుఖముగా నుండెను. కొంతకాలమునకు ఇంద్రు డతనిని క్రిందికి పడద్రోసెను. అతడు స్వర్గము నుండి జారిపడెను. కాని భూమికిచేరలేదు. అప్పటిలో కొంతకాల మంతరిక్షమందే యుండి యజ్ఞ సంసత నందు ఉండిన వసుమాన్ అష్టకుడు ప్రతర్దనుడు శిబి అను రాజులతో కూడి అట నుండియే మరల స్వర్గమున కేగెను అని నేను పరంపరలో వినియున్నాను.
శతానీకుడు శౌనకుని ఇట్లడిగెను, భగవన్! “యయాతి పృథివీ పాలకుడుగా శ్రేష్ఠుడు. వంశమునకు వృద్ధిని (శుభమును సంతోషమును అభివృద్ధిని) కలిగించినవాడు. సూర్యుని ప్రకాశముతో అగ్ని ప్రకాశముతో సమమగు ప్రకాశము కలవాడు. వంశమును విస్తరింప జేసినవాడు. వాస్తవమును నిర్మలమున అగు కీర్తిగలవాడు. మహామనస్కుడు. స్వర్గమునందును దేవర్షి గణముల ప్రశంసలందుకొనుచు, వారి సన్నిధియందు దేవరాజసముడై వెలుగొందెను” అందురు గదా! అట్టివాని నింద్రుడెట్లు ఏల స్వర్గమునుండి పడద్రోసెను? యయాతి చరితము నందలి ఈ యంశము లన్నియు అతని ఐహిక పారలౌకిక వృత్తాంతము నందలి తత్త్వము నంతయు వినగోరుచున్నాను.
శౌనకుడు శతానీకునకు ఇట్లు చెప్పెను, నాయనా! యయాతి కథ ఉత్తమమయినది. సర్వపాపములను పోగొట్టి పుణ్యమును కలిగించునది. అతని ఐహ లౌకిక పారలౌకిక వృత్తాంతమును తాత్త్వికముగా వివరింతును. వినుము.
నహుష పుత్రుడగు యయాతి తన కడపటి కుమారుడగు పూరుని రాజ్యమునందు అభిషేకించి ముదితుడై వనమునకు ప్రవ్రాజితుడయ్యెను అంటిని గదా! అంతకుముందే అతడు యదువు మొదలగు కుమారులను రాజ్యపు మేరల యందును అంతకు వెలుపలను నిలిపెను. వనమునందు ఈరాజు వానప్రస్థుడుగా ఫలమూలములు ఆహారముగా ఇంద్రియ నిగ్రహము కలిగి అరణ్యమునందు చాల కాలముండెను. చిత్తమును తీక్ష్ణమొనర్చుకొని క్రోధమును జయించి పితృదేవతలు తృప్తినొందించుచు అగ్నియందు వానప్రస్థ విధానమున హోమాదికము జరుపుచుండెను. ఆ ప్రభువు వనములందు అభించు ఆహారాదికమును దేవతలకు నివేదించిన తరువాత ఆ హవిష్యమునే అతిథులకు ఆహారముగా ఇచ్చి వారి నాదరించుచుండెను. శిలవృత్తి (పొలములు మొదలగుచోట్ల రాలిన ధాన్యకణముల నేరితెచ్చుట) ఉంఛవృత్తి (సేద్యపు పొలములలో రాలిన ధాన్యపు కంకులను ఏరితెచ్చుట) అవలంబించి దేవతలకు అతిథులకు పితరులకు వినియోగించగా శేషించిన ఆహారమునే తినుచుండెను. ఇట్లారాజు వేయినిండు సంవత్సరములు జీవితము గడపెను. తరువాత మూడుమాసములు జలాహారుడై మనస్సును వాక్కును నియమించు కొనియుండెను. తరువాత సోమరితనములేక సంవత్సరము పాటు వాయుభక్షుడయ్యెను. తరువాత సంవత్సరకాలము పంచాగ్ని మధ్యమున తపస్సాచరించెను. వాయు వాహారముగా ఆరు మాసములు ఏకపాదస్థితుడై తపస్సుచేసెను. పుణ్యకీర్తియగు ఆ యయాతి తన ప్రకాశముతో రోదసులను (ద్యుభూలోకముల నడుమ ప్రదేశమును) నింపివేయుచు స్వర్గము చేరెను.