మత్స్య మహా పురాణము
భూగోళ వర్ణనారంభము
భగవత్తత్త్వమును అంతర్యామిగా-కాలరూపునిగా-దేశరూపునిగా-దేశకాలోభయ రూపునిగా ఉపాసించవలయును. వీనినే ఆధునికులు కేవలము ప్రకృతియందలి అంశములుగా అనుచున్నారు. కాల పరిమాణ వ్యవస్థయు-యుగ-మహా యుగ-కల్పాది రూపములును ఆయా యుగములందుండెడి ధర్మాధర్మ ప్రవృత్తియును భగవంతుని కాలరూపునిగా ఉపాసించుటకు తోడుపడును.
ఋషులు సూతుని ఇల్లు అడిగిరి, మత్స్య నారాయణుడు మనువునకు భువన విస్తారము ఎట్లు చెప్పెనో అది ఉన్నది ఉన్నట్లు (ఏ మాత్రమును విడువక) మాకు తెలుపుము అని అడుగ వారికి సూతు డిట్లు చెప్పెను: మత్స్యరూపుడగు విష్ణువు భానుపుత్రుడగు వైవస్వత మనువునకు భూమండల(స్వరూప)మును సముద్రములతో ద్వీపములతో కూడిన భూగోళ స్వరూపమును (దాని వివరణమును) తెలిపెను. మునిపుంగవులారా! అదియంతయు చెప్పెదను; వినుడు. నేను భూగోళ (విషయ)మును మీకు చెప్పగోరి మొదట దేవేశ్వరుడును విశ్వేశ్వరుడును కారణ రూపుడును నగు విష్ణుని దోసిలియొగ్గి నమస్కరించి చెప్ప నారంభింతును.
మనువు మత్స్యు నిట్లడిగెను: భగవన్! భూమండలమును (గూర్చి) విస్తరముగా వినగోరుచున్నాను. దాని విస్తారము (వైశాల్యము) ఎంత? ద్వీపములు ఎన్ని? సముద్రములు ఎన్ని? దానియందు మేరువు ఎట్లున్నది? కేశవా! ఇది యంతయు నాకు తెలుపుము. అన శ్రీమత్స్యుడిట్లుచెప్పెను. భూమండల(స్వరూప)మును (దానియందుగల) సప్తద్వీపముల (విషయ) మును సప్త సముద్రముల(విషయ)మును యథాతథముగా చెప్పెదను. ధరాతలము ఏబదికోట్ల యోజనముల విస్తారముకలది. అది సప్త సముద్రములతో సప్త ద్వీపములతో ఆవరింపబడియున్నది. లవణేక్షు సురాసర్పిర్దధి క్షీరజల సముద్రములు ఏడు. జంబూ ప్లక్షశాల్మలి కుశ క్రౌంచశాక పుష్కర ద్వీపములు ఏడు.