మత్స్య మహా పురాణము
కుమార స్వామి జనించుట
వీరకుడు తనయందు స్నేహ వాత్సల్యములలో నిండియున్న తన తల్లి గిరిసుత ఈమెయే యని యెరుగడు. అందుచే అతడింకను “కమలలోచనా! నా తల్లికి తప్ప - మరి ఇతర స్త్రీకి ఇందు ప్రవేశములభించదు” అనెను. అదివిని దేవిమనస్సు నందిట్లు ఆలోచించెను. వాయువు నాకు ఎవరి విషయము తెలిపెనో ఆవ్యక్తి స్త్రీ కాదు, అతడు దైత్యుడు. క్రోధవ్యాపితనై నేను ఆ కారణముగా వీరకుని శపించితిని. క్రోధ ప్రేరితులయిన వారు మూఢులై అకార్యములు చేయుట తరచుగా జరుగుచుండును. క్రోధముచే కీర్తి నశించును. క్రోధము స్థిర సంపదను చంపును. నేనును క్రోధవశముననే వాస్తవము నిశ్చయముగా ఎరుగలేక పుత్రునే శపించితిని. విరుద్ధ కృత్యములు చేయుట నరులకు విపత్తులు సులభముగా కలుగును. ఇట్లాలోచించుచు శైలజ వీరకునితో తన పద్మకాంతి వంతమయిన మొగము సంసిద్ధమయిన లజ్జతో వికృతము కాగా ఇట్లు పలికెను. వీరకా! నీకు మతి పొరపాటు కలుగనిచ్చు కొనకుము; నేను మీ అమ్మను; శంకరప్రియను; హిమగిరిపుత్రిని; కుమారా! నాదేహకాంతి మారినపొరబాటుచే సందేహభావన పొందకుము. తుష్టుడై పద్మసంభవుడు నాకీ గౌర కాంతి ఇచ్చెను. ఆడి అను దైత్యుడు చేసిన మాయ తెలియనప్పుడు నేను నిన్ను శపించితిని. శంకరుడు రహస్య ప్రదేశ మందుండగా అన్యస్త్రీ ప్రవేశము జరిగినది నాకు తెలియలేదు. శాపము మరల్చుట శక్యము కాదుకాని ఒకమాట చెప్పుచున్నాను. వీరకా! త్వరలో నీవు సర్వసంకల్ప పూర్ణుడవు అయ్యెదవు. అనగా వీరకుడు పూర్ణమాననుడై తల్లికి శిరసా సమస్కరించి అపుడే ఉదయించిన పూర్ణచంద్రుని వలె కాంతితో నున్న హిమశైల పుత్రితో ఇట్లనెను.