అశూన్యశయన వ్రతము

బ్రహ్మ ఈశ్వరుతో నిట్లనెను. భగవన్! స్త్రీ పురుషులకు విరహ-వ్యాధి-రోగ-భయ- దుఃఖములు కలుగకుండు ఉపాయమును తెలుపుమనగా ఈశ్వరుడిట్లు చెప్పెను: నారాయణుడు లక్ష్మీ సమేతముగా క్షీరసాగరమున నిరంతరము వసించుచుండునుగదా! ఆయనను శ్రావణ శుక్ల ద్వితీయనాడు అర్చించినచో అన్ని కోరికలును నెరవేరును. అశూన్యశయన ద్వితీయ అనబడు ఈనాడు గోవిందుని కల్పోక్త విధానముతో సంపూజించి గోభూహిరణ్య దానములు చేసినవారు డెబ్బది వేల కల్పములు కలకాలము సుఖింతురు.

ప్రార్థనామంత్రము, శ్రీవత్సధారిన్! శ్రీకాంతా! శ్రీవాసా! అవ్యయా! శ్రీపతీ! ధర్మార్థ కామప్రదా! నాగార్హ్యము హానిచెందకుండుగాక! మా దాంపత్యము భంగము నొందకుండుగాక! మా అగ్నులు దేవతలు పితృదేవతలు పితరులు హాని నొందకుందురు గాక! మధుసూదనా! నీకు వలెనే నాకును కళత్రముతో నిత్యసంబంధ ముందుగాక! నీ శయన మెల్లప్పుడు అశూన్యమయి యుండునట్లే నాశయనముకూడ అశూన్యమై యుండుగాక! పూజా సమయమున గీత వాద్యముల వినిపించవలెను. ఇందులకు శక్తిలేనివారు ఘంటానాదమే చేయవచ్చును. ఏలయన ఘంట సర్వ వాద్యరూప మయినది.

ఇట్లు గోవిందుని పూజించి పగలు ఉపవసించి ఆ రాత్రి(నక్తం) తైలము-ఉప్పు -(పులుపు)- కారము లేని ఆహారము తిని ఆ రాత్రి గడుపవలెను. తెల్లవారినతరువాత కుటుంబియు వేదపండితుడును శ్రోత్రియుడును సర్వ క్రతు కర్తయు ఎక్కడను ఏ లోపములేనివాడును అంగవైకల్యము లేనివాడును అగు విప్రునకు లక్ష్మీనారాయణ ప్రతిమను దీపములను అన్నపు పాత్రములను మంచమును పరపులను దిండ్లను ఆనుకొను దిండ్లను పాదుకలను చెప్పులను గొడుగులను చామరములను ఆసనములను ఇంకను ఇష్టములగు సాధన సామగ్రులను తెల్లని గంధపు పూత సామగ్రులను పూల(దండల)ను దానము చేయవలయును. ఆ బ్రాహ్మణుని అతని పత్నిని మంచముపై కూర్చుండ పెట్టి శాస్త్రోక్త విధానమున అలంకరించి పత్నికి భక్ష్య భోజ్య సమన్విత పాత్రను పతికి సర్వసామగ్రీ యుక్తమగు లక్ష్మీ నారాయణుల బంగారు ప్రతిమను చేతికీయవలెను.

ధనమునకై లోభించక యథాశక్తిగా కల్పవిధానముగా నారాయణుడే దిక్కని ఈ అశూన్య శయనవ్రతము చేయువారు దాంపత్యమున వియోగము లేకుండ ఆచంద్రతారార్కము వైరూప్యము శోకములేక సుఖింతురు. వారికి పశుపుత్ర ధన నాశమును కలుగదు. ఏడువేల ఏడువందల కల్పముల పాటు వారు విష్ణులోకమున సుఖింతురు.