మత్స్య మహా పురాణము
నారాయణ అవతార హేతువు
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను, ఇది ఇట్లుండ నిండు. దేవుడును మహాదేవుడును ప్రజాపతియు దేవేశుడునగు నారాయణుడు విహారార్థమయి ఈ లోకమునందు మానవుల నడుమ కృష్ణుడుగా జన్మించును అని మత్స్యమూర్తి చెప్పినట్లే ఆయన వసుదేవుడు ఆచరించిన తపస్సునకు ఫలముగా దేవకియందు పద్మనేత్రుడు చతుర్భుజుడుగా దివ్యరూపుడుగా కాంతిలో ఉజ్జ్వలుడుగా అవతరించెను. శ్రీవత్స లాంఛనము మొదలగు దివ్య లక్షణములు చూచి వసుదేవుడు “ప్రభూ! నీ రూపము నుపసంహరింపుము. మహావిక్రములగు నా మొదటి కుమారులందరను కంసుడుచంపెను. కనుక నేను వానికి భయపడుచున్నాను” అని వసుదేవు డనగా అచ్యుతుడు తన దివ్య రూపమును ఉపసంహరించెను. తరువాత భగవానుని అనుజ్ఞతో వసుదేవుడు శ్రీకృష్ణుని నందగోపుని గృహమునకుచేర్చి ఇతనిని అతనికిచ్చి ఈ శిశువును కాపాడుమని కోరెను. ఇతని వలన సర్వ యాదవులకును శుభము కలుగును. దేవకీ గర్భ సంజాతుడగు ఈతడు కంసుని చంపును. అనియు వసుదేవుడు నందునితో ననెను.
ఇది విని ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: వసుదేవుని కాని నందుని కాని భగవానుడు నాయనా! అని పిలిచెను. దేవకి ఆయనను గర్భమును ధరించి కనెను. యశోద పోషించెను. ఇంత అదృష్టము పొందిన ఈ నలుగురును ఎవరు? అనగా సూతుడు వారికిట్లు చెప్పెను: ఆది ప్రజాపతి దంపతులు అదితీయు కశ్యపుడును మీకు తెలియును గదా! కశ్యపుడు బ్రహ్మాంశము. అదితి పృథివి అంశము. మహాబాహుడు అగు నారాయణుడు దేవకి కోరికలను పూరించెను. (ఏలయన కశ్యపుడే వసుదేవుడు. అదితియే దేవకి.) ఎన్నడును జననమును ఎరుంగని ఆ మహాత్ముడును జననమందెను. ఆ యోగాత్ముడు యోగమాయచే సర్వభూతములను మోహపెట్టి తనుతాను మానవునిగా చూపెను. యజ్ఞములును ధర్మమును నశించగా ఆ ప్రభువు వృష్ణివంశమునందు అవతరించి ధర్మ సంస్థాపనమును రాక్షస నాశమును జరిపెను. ఆయనకు రుక్మిణి సత్యభామ నాగ్నజితి సుధామ శైబ్య గాంధారి లక్షణ మిత్రవింద కాళింది-దవ-జాంబవతి-సుసీమ-మాద్రి-కౌసల్య-విజయ మొదలగు పదునారువేలమంది భార్య లుండిరి.
రుక్మిణికి రణవిశారదులు మహాశూరులు మహాబలులు నగు చారుధేష్ణుడు, ప్రద్యుమ్నుడు సుచారుడు భద్రచారుడు, సుధేష్ణకు భద్రుడు, పరశుడు, చారుగుప్తుడు, చారుభద్రులు, సుచారకుడు, చారుహాసుడను కుమారులను కడగొట్టుగా చారుమతి అనెడి కన్యయు కలిగిరి. సత్యభామయందు భానుడు, భ్రమరవీక్షణుడు, రోహితుడు, దీప్తిమాన్, తామ్రవ్రక్తుడు, జలంధరుడు అను కుమారులును నల్గురు కుమార్తెలును కలిగిరి. జాంబవతికి యుద్ధ నిపుణుడగు సాంబుడును మిత్రవిందకు మిత్రవాన్-మిత్రవిందుడు-నాగ్నజితికి మిత్రబాహు సునీతులు కుమారులైరి. ఈ మొదలగు కుమారులు వేలకొలదిగ శ్రీకృష్ణునకు కలిగిరి. వీరు మొత్తము ఒక లక్షయు ఎనుబది వేల మంది. వీరిలో ఉపసంగునకు వజ్రుడు సంక్షిప్తుడు. గవేషణునకు భూరీంద్రసేనుడు భూరి అనువారు-ప్రద్యుమ్నునకు వైదర్భియందు బుద్ధిశాలియు రణమునం రెదురులేని వాడునగు అనిరుద్దుడు యజ్ఞుడు మృగకేతనుడు అనువారును సాంబునకు కార్శ్యాశ్వుని కూతువలన బలశాలురు సత్వస్వభావులు వీరులు దేవసదృశులునగు ఐదుగురు కుమారులు కలిగిరి. ఆనాడు యాదవులు మొత్తము మూడుకోట్లమంది. వీరందరును దేవాంశరూపులును మహాబలులును వీర్యవంతులును మహాతేజస్సంపన్నులును. పూర్వము దేవాసుర యుద్ధములందు మరణించిన అసురులు మరల మానవులందు జన్మించి ఇతర మానవుల నందరను బాధింపసాగిరి. వారిని నశింప జేయుటకై విష్ణువు యాదవ వంశమున పుట్టెను. అతనికి తోడుగా నున్న ఈ యాదవులు మహాత్ములు నూటొక్క ప్రధాన వంశములవారు. ఈ వంశము వైష్ణవ వంశమే. వారికి విష్ణువు నాయకుడై వారిని నడపెను. ఇటు సర్వ యాదవులును శ్రీకృష్ణుని ఆజ్ఞయందు నడచిరి.
ఋషులు సూతునితో, కొందరు పెద్దలు “సృష్టులు అన్నియు సప్తికారూపమయినవి. అవి సప్తర్షులు, కుబేరుడు, మణిహరుడను యక్షుడు, శాలాకి, నారదుడు, సిద్ధుడగు ధన్వంతరి, ఆదిదేవుడగు విష్ణువు అను సప్తదేవతలతోనే సమగ్రమగుచున్నది” అని చెప్పుదురు. ఆ సృష్టులు ఎన్ని విధములు? ఆ మహాత్ముని ప్రాదుర్భావములు జరిగినవెన్ని? జరుగనున్నవెన్ని? ఆ మహానుభావుడు శాంత స్వభావులగు బ్రహ్మ క్షత్రియ జాతులందును-అందునను వృష్ణ్యంధక వంశశ్రేష్ఠుడై యాదవులందును ఏల జన్మించవలసి వచ్చెను? మరల మరల మానవులలో ఆయన ఏల జన్మించ వలసి వచ్చెను? అని అడుగగా సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెను: నిజమే! విష్ణువు తన దివ్య దేహమును విడిచి (మరుగుపరచి) ఈలోకమున మానవులందు జన్మించును. హేతువు చెప్పెదను. వినుడు. యుగధర్మము తలక్రిందులు కాగా, కాల స్వభావము మిగుల శిథిలము కాగా, దేవాసుర యుద్ధములు ప్రవర్తిల్లును. అట్టి సమయములందే ఈశ్వరుడగు హరి అవతరించును. ఎట్లన-పూర్వము హిరణ్యకశిపుడును, బలియు అను అసురులు లోకత్రయమును పాలించుచుండ ఆయా కాలములందు పదిదివ్య యుగములకాలము దేవాసురులకు మహా యుద్ధము జరిగెను. జగత్తులన్నియు అత్యాకులములయ్యెను. దేవతలు విష్ణుని విదేశమునందును అసురులు బలి హిరణ్య కశిపుల నిదేశమునందును నిలిచి యుద్ధమును జరిపిరి. బలీని నశింప జేయుటకై జరిగిన యుద్ధము దేవతలకును అసురులకును నాశకరమును అయ్యెను. ఆ ప్రసంగమున కలిగిన భృగు శాపము నిమిత్తము కాగా శ్రీనారాయణుడు మానవుల యందు అవతరించుచుండును.
ఇట్లు చెప్పిన సూత వచనమును విని ఋషులిట్లు ప్రశ్నించిరి: దేవాసురుల యుద్ధము మూలమున విష్ణువు శాపమునేల పొందెను? దేవాసుర యుద్ధ మెట్లు జరిగి ఇట్టి స్థితికి హేతువయ్యెను? మాకు తెలుపుడు.
అనగా సూతుడిట్లు చెప్పసాగెను, దాయభాగ నిమిత్తమున (త్రైలోక్యపాలనాధికారము ఎవరిదను విషయమున) దేవాసురుల నడుమ శండామర్మాంతరము వరకు పండ్రెండు మారులు యుద్ధము జరిగినట్లు తెలుపబడియున్నది. ఇవి వరుసగా నారసింహము, వామనము, వరాహము అమృతమంథనము, తారకామయము, ఆడీవధము, త్రైపురము, ఆంధకారము, వృత్రఘాతకము, ధాత్రము, హాలాహలము, కోలాహలము అనునవి. వీనిలో నారసింహమున హిరణ్యకశిపుడు నరసింహునిచే చంపబడెను. వామనమున త్రివిక్రమమూర్తియగు వామనునిచే బలి బంధింపబడెను. వరాహమున దేవతలతో హిరణ్యాక్షుడు చేసిన యుద్ధమున వరాహమూర్తి వానితో ద్వంద్వ యుద్ధము నాచరించి వానిని చంపెను. సముద్రమును రెండుగా చేసెను. అమృతమంథనమున ఇంద్రుడు యుద్ధమునందు ప్రహ్లాదుని జయించెను. తారకామయమున-ప్రహ్లాద కుమారుడు విరోచనుడు నిత్యము ఇంద్రుని చంపు పూనికతో నుండుటయు ఇంద్రుడు వానిని జయించుటయు జరిగినది. ఆడీవధమున విరోచనుడు వసువులనెడి దేవతల బాణములకు గురి అయ్యెను. త్రైపురమున త్ర్యంబకుని చేతిలో దానవులందరును మరణించిరి. అంధకారమున (అంధక - అర) (అంధకవధ యుద్ధమున) దేవతలును మనుష్యులును పితరులును అసురులును పిశాచులును దానవులను చాలవరకుచంపిరి. ధాత్రమను యుద్ధము దేవదానవులకు జరిగినట్టిది. హాలాహలమనెడి ఈ యుద్ధమునందు విష్ణుని సహాయునిగాగొని ఇంద్రుడు దీనిని ముగియజేసెను. ఈయుద్ధముననే ఇంద్రుడు యోగవేత్తయు మాయతో మరుగుపడు శక్తికలవాడునగు ధ్వజుడను వానిని జయించెను. ఇక పండ్రెండవదియగు (జయ) కోలాహల యుద్ధమున విప్రచిత్తి ధ్వజుని రూపము ధరించి (ధ్వజుని వలెనే మాయాచ్ఛన్నుడై) తన సోదరుల తోను ఇతరులగు దానవుల తోను అసురులతోనుకూడి యుద్ధము చేసెను. దేవతలు కృష్ణునితో (విష్ణునితో) కూడి తమ శత్రువులను బంధించిరి. ఇట్లు యుద్ధములనెడు యజ్ఞములు ముగిసిన తరువాత దేవతలు అవభృథ (యజ్ఞదీక్షాన్త)స్నానముచేసిరి. ఆ ప్రసంగమున వారు శండమర్కులను దర్శించిరి.
ఇట్లు దేవాసురుల నడుమ జరిగిన పండ్రెండు యుద్ధములును ఈ ఇరుపక్షములవారికిని నాశము కలిగించినను తుదకు దేవతలకు జయము లభించి ప్రజలకు హితకరములయ్యెను.
హిరణ్యకశిపుడు ఒక అర్బుదముమీద డెబ్బది రెండు నియుతములమీద ఎనుబదివేల సంవత్సరములు త్రైలోక్య పాలకుడయ్యెను. ప్రహ్లాదుడును, బలియు ఒక్కొక్కరు ఇరువది నియుతముల డెబ్బదివేల సంవత్సరములు త్రిలోక పాలకులయిరి. మహౌజస్సంపన్నులగు వీరు అసురులలో నుండి వచ్చిన ఇంద్రులు అనగా అసురులై యుండియు త్రైలోక్య పాలనముచేసి ఇంద్రులైన వారు. మరల పది దివ్యయుగములపాటు ఈత్రైలోక్యము అసురుల క్రింద నుండు టయు మరి అంతేకాలము అది ఇంద్రుని వశమయి అతని ఏలుబడిలో నుండుటయు ఇట్లు పర్యాయ క్రమమున జరుగుచుండును. ఇట్టి పర్యాయములలో ఒకమారు దేవతలకు త్రైలోక్య పాలనాధికారము వచ్చినప్పుడు శుక్రుడు తన శిష్యులగు అసురులను విడిచి (జయోత్సవ రూపమున యజ్ఞము చేయుచున్న)దేవతలకడకు పోయెను. ఇది చూచి దైత్యులు శుక్రుని కడకు పోయి “అయ్యా! మేము జీవించియుండగనే మమ్ములను విడిచి మారాజ్యమును విడిచి దేవతల యజ్ఞమునకు పోవుచున్నారే! మేము ఇచట నిలువలేము. రసాతలమున ప్రవేశింతుము” అనిరి. అది విని శుక్రుడు విషణ్ణులగు దైత్యదానవులను ఓదార్చుచు ఇట్లు పలికెను: “మీరు భయపడకుడు. మిమ్ములను నాతేజముచే మరల ఉద్ధరించగలను. మంత్రములు ఓషధులు రసద్రవ్యములు వివిధములగు బంగారు మొదలగు ధనములు నాఅధీనమున సముద్రముగా నున్నవి. అవి మీకొరకే నాదగ్గర దాచియుంచితిని. అది యంతయు మీకిత్తును.” నా దగ్గర నున్న ఈ వస్తువు సంచయములో నాలుగవ వంతు మాత్రమే దేవతలకు గలదు అనెను.
ఈ విషయము తెలిసికొని దేవతలు భయపడిరి. వారందరును దైత్య దానవులకు ఆ ధనాదికము పోకుండ తామే అది గ్రహింపగోరిరి. శుక్రుడు మనకడనున్న ధనమునుకూడ బలాత్కారమున లాగికొనుచున్నాడు. దానిని దైత్య దానవులు తమ అధీనము చేసికొనక ముందే ఈ శుక్ర శిష్యులను చావగొట్టి పాతాళమునకు పంపుదుము అని ఆలోచనము చేసిరి. క్రోధావేశముతో వారు దానవుల కడకు పోయి వారిని చావగొట్టసాగిరి. దానవులు తాళలేక శుక్రుని కడకు పరుగెత్తుకొని పోయిరి. శుక్రుడది చూచి అసురులకు రక్ష కల్పించెను: దానితో అసురులే దేవతల బాధింపసాగిరి. కావ్యుడక్కడనే ఉండుటయు అసురులు నిర్భయులుగా నుండుటయు చూచి దేవతలు వారిని విడిచి వెనుకకు మరలి వచ్చిరి.
తరువాత శుక్రుడు పూర్వము బ్రహ్మ చెప్పిన హితకరమగు వచనమును జ్ఞప్తికి దెచ్చికొని పూర్వ వృత్తాంతములను స్మరించుచు అసురులకును అవి జ్ఞాపకము చేయుచు ఇట్లు పలికెను “మహాసురులారా! వామనుడు మూడడుగులతో మీ త్రైలోక్య రాజ్యమును హరించెను. బలిని బంధించెను. జంభుడును విరోచనుడును చంపబడిరి. పండ్రెండు సంగ్రామములయందును మహాసురులెందరో ఆయా ఉపాయములతో సురలచేతిలో మరణించిరి. మీలో కొలది మంది మాత్రము మిగిలినారు. ఇపుడు యుద్ధము చేయరాదు. నీతిమార్గముల అనుసరించవలయును. కాలపు మార్పునకై ఎదురుచూడవలయును. విజయము ఇప్పింపగలవాడు మహేశ్వరుడు. అతని కడకుపోయి ఆయనను ప్రార్థింతము. ఎదురులేని మంత్రముల నాయన నుండి సంపాదింతము. అపుడు దేవతలతో పోరి జయము సంపాదింతము.
శుక్రుని వచనమును విని మేమందరమును ఆయుధములను వదలుచున్నాము. రాత్రుల యందు ఆహారము కూడ తినము. వల్కలములను ధరించి వనమున తపమాచరింతుము. మేము మరల వచ్చు వరకు మనకు యుద్ధము ఉండదు అని ప్రహ్లాదాది దానవులు దేవతలతో ఒడంబడిక యొకటి చేసికొనిరి.
ప్రహ్లాదుడు సత్యముతో శపథముచేసి చెప్పిన ఆ మాటను విని దేవతలు సంతాపము వదలి సంతోషముకలిగి యుద్ధ ప్రయత్నములనుండి నివృత్తులయిరి. ఇట్లు దేవాసురు లిరువురును ఆయుధములు దూరముగా పారవైచి సంతుష్టులయిరి.
తరువాత శుక్రుడు అసురులతో “మీరు తహతహపడక తపస్సాచరించుచు కొంచెము కాలము ఓపికపట్టుడు. కాలమే జరుగవలసిన పనులనుచక్కపెట్టును. దానవు లందరును మా తండ్రి ఆశ్రమమందుండి నాకై ఎదురుచూచుచుండుడు” అని వారిని నెమ్మదిపరచి మహాదేవుని కడకుపోయెను. అతడు ఈశ్వరునితో “దేవా! నాకు బృహస్పతికి తెలియని మంత్రములు - దేవతలకు పరాజయమును దానవులకు జయమును కలిగించునవి-కావలయును” అనెను. అదివిని మహా దేవుడు “భార్గవా! నీవు తలక్రిందులుగా ఉండి వ్రత (నియమ)ముల ననుష్ఠించుము. వేయి ఏండ్లు నిండుసరికి నీకు కణదూమము దర్శనమిచ్చినచో నీకు సిద్ధి కలుగును. మంత్రములు లభించును” అనెను. శుక్రుడును సరే అనెను. దేవా! నీవు ఆదేశించిన వ్రతము నాచరింతును అని ఆ దేవుని పాదములంటి పలికెను. ఈశ్వరుని అనుమతితో కుండధారుడై ధూమకృత్-కాకవ్రతము నారంభించెను.
ఇట్లు శుక్రుడు అసురుల వ్రతమునకై మంత్రముల కోరి మహేశ్వరునికడ బ్రహ్మచర్యము నాచరించుచుండుట దేవతలెరిగిరి. అసురులు శుక్రుని నీతిపూర్వకముగా రాజ్యాధికారమునందు నిలిపిరనియు వారు తెలిసికొనిరి. ఈ అవకాశములో దేవతలు బృహస్పతిని ముందుంచుకొని ధనుర్ధరులై అస్త్రాద్యాయుధములు ధరించి అసహనముతో కోపముతో అసురుల పైకి పోయిరి. ఇది చూచి వారు భయపడి దేవతలతో “దేవతలారా! మీరు మాకభయమిచ్చియు మమ్ము చంప దలచి వచ్చియున్నారు. మా ఆచార్యుడు దగ్గరలేడు. తపోవ్రతమునకై పోయి ఉన్నాడు. మేము మా అయుధముల వదలియున్నాము. నారబట్టలు కృష్ణాజినములు ధరించి నిష్క్రియులమై ఏసాధనములును పరివారము లేక ఉన్నాము” అనిరి. ఐనను వారు వినలేదు. వారపుడు “మనము యుద్ధమున దేవతల జయించజాలము. యుద్ధము చేయలేనపుడు మనకు శుక్రుని మాతయే దిక్కు” అని తలచి వారామెను శరణువేడిరి. ఆమె వారికి అభయమిచ్చెను. దానవులారా! మీరు భయపడకుడు. భయపడకుడు. నా సన్నిధిలో నుండగా మీరు భయపడవలసిన పనిలేదు అనెను. అప్పటికిని విడువక దేవతలు బలాబలములు విచారించక బలమును ఉపయోగించి దానవులను చావగొట్ట సాగిరి. అదిచూచి దేవియగు శుక్రమాత క్రోధముతో దేవతలారా! మిమ్ములను ఇంద్రుడు లేని వారినిగా చేయుదు ననెను. సర్వ సంభారములతో సన్నద్ధులయిన దేవతలను ఇంద్రునికూడ తపోధనయు యోగయుక్తయు అగు ఆమె స్తంభింపజేసెను. ఇంద్రుడును స్తంభించి మూగవాడువలె అయ్యెను. అదిచూచి దేవతలు అవశులై ఇంద్రునితో కూడ విష్ణుని కడకు పోయిరి. విష్ణువు దేవసంఘముల స్థితి చూచి ఇంద్రునితో “సురోత్తమా! నీవు నన్ను ప్రవేశించి దాగియుండుము. నే నసురుల నందర చంపుదు” అనెను.
ఇంద్రుడట్లే చేసెను. ఇంద్రుడు విష్ణునిచే రక్షితుడగుట చూచి శుక్రమాత కోపించి ‘ఇంద్రా! నా తపోబలము ఎట్టిదో తెలియునా? సర్వభూతములు సాక్షిగా నేను విష్ణునితో కూడ నిన్ను దహింతును.’ అనెను. ఇట్లు శుక్రమాత తిరస్కార పూర్వకముగా పలుకగా ఇంద్ర విష్ణు లిరువురును కలవరపడిరి. ఇప్పుడీమెనుండి ఎట్లు తప్పించుకొనవచ్చును? అని విష్ణువు ఇంద్రుని అడిగెను. ప్రభూ! ఆమెనన్నును, నిన్నును దహించక మునుపే ఈమెను నీవు చంపుము. నేను నీకంటెను ఎక్కువగా కలవర పడుచున్నాను అని ఇంద్రుడనెను. అంతట విష్ణువు బాగుగా ఆలోచించెను. ఇంద్రుడును, తానును ఆత్మరక్షణ మొనరించుకొనవలెననిన స్త్రీవధ చేయవలయును. లేనిచో తమకు కీడు తప్పదు. ఇట్టి ఇరకాటములో విష్ణువుపడెను. ఆపదుద్ధరణము నందు ఉత్తమమగు చక్రమును వెంటనే విష్ణువు స్మరించెను. అప్పుడును విష్ణువు త్వరపడసాగెను. చేయదలచిన పని త్వరగాచేయవలెను. లేనిచో తమకు కీడు కలుగునను భయము కలుగుచుండెను. ఆ దేవి చేయదలచిన క్రూరకర్మము ఎరిగి విష్ణువు క్రుద్ధుడై ఒకవైపు భయపడుచునే భృగుపత్నీ శిరమును ఖండించెను.
ఘోరమగు ఈ స్త్రీవధను చూచి భృగుముని క్రోధము చెందెను. అతడు చేతకానివాడు కాదు. తన భార్యావధకు కోపించిన అతడు విష్ణుని శపించెను. ‘నీవు స్త్రీ అవధ్యురాలను ధర్మము ఎరిగియుండియు స్త్రీని వధించితివి. కావున నీవు ఏడుమారులు మనుష్యుల నడుమ మానవుడుగా జన్మింతువు’ అని ఆయన విష్ణుని అభిశపించెను. ఆ శాపఫలముగా లోకమున ధర్మము నశించినపుడెల్ల లోకహితమునకై శ్రీవిష్ణువు మనుష్యుడుగా లోకమున జనించుచుండును.
ఇట్లు పలికి భృగుముని వెంటనే తన పత్ని శిరమును తీసికొనెను. దానిని మిగిలిన శరీరముతో చేర్చెను. ఇట్లు పలికెను: “దేవీ! విష్ణునిచేత చంపబడిన నిన్ను ఇదిగో! మరల ఒకటిగా కూర్చుచున్నాను. నేను ధర్మమును సమగ్రముగా ఎరిగినవాడనైనచో ఆచరించినవాడనైనచో-నేను పలుకునది సత్యమేయైనచో ఆ సత్యముతో నీవు జీవింతువుగాక!” ఇట్లు పలికి మంత్రములతో శాంతి జరుపబడిన జలములతో ఆమె (శరీరము)ను ప్రొక్షించి, “జీవించుము” అనెను. ఆమె అతని ఆమాటతోపాటే జీవితురాలయ్యెను. నిదురమేల్కాంచినట్లు లేచిన ఆమెను చూచి సర్వదిశల నుండియు సర్వభూతములును సాధువాదములు (చాల బాగుగా నున్నది అను పలుకులు) పలికిరి. ఇట్లు ఆ దేవిని ఆ సమయమున భృగు మహాముని జీవింపజేసెను. దీనిని సర్వ దేవతలును చూచుచుండిరి. ఇది ఎంతయో ఆశ్చర్యకరమగు విషయమయ్యెను. ఈ సందర్భములో భృగు మహాముని ఏమాత్రమును కలవరపాటు చెందకుండుట మరియు ఆశ్చర్యకరము. ఇది చూచి ఇంద్రుడు ఇకముందు శుక్రుని వలన మరింకేమి కీడు మూడునో అని మరింత భయపడెను. అతని మనస్సునకు శాంతియే లేకపోయెను.
ఇంద్రునకు నిదురయే పట్టలేదు. అతడు అదే పనిగా ఆలోచించి ఒక నిర్ణయమునకు వచ్చెను. తనకూతురగు జయంతితో ఇట్లు పలికెను: “బిడ్డా! ఇదుగో! ఈ శుక్రుడు శత్రునాశమునకై దారుణ తపమాచరించుచున్నాడు. మహాబుద్ధిశాలియగు ఇతని వలన నెంతయో వ్యాకులుడనగు చున్నాను. కనుక నీవతనికడకు పొమ్ము. అతని శ్రమను పోగొట్టు శుశ్రూషలు చేసెదననుము. నీవు ఏమాత్రమును ఏమరుపాటుగాని సోమరితనముకాని లేక ఆయా ఉపచారములతో ఇతనిని ఆరాధించుము. ఆబ్రాహ్మణుని సంతోషపెట్టుము. నేను నిన్నతనికి ఇచ్చుచున్నాను. నీవు వెంటనే పొమ్ము. నాపక్షమున ప్రయత్నము చేయుము.”
ఇట్లు పలికిన ఇంద్రుని వచనము విని జయంతి సరేయని శుక్రుడు తపమాచరించు చున్న చోటికి పోయెను. అతనిని చూచెను. శుక్రుడు అవాఙ్ముఖుడై కణ ధూమమును త్రాగుచున్నట్లుండెను. యక్షుడు పెట్టుచున్న కుండధారణ యాతనను అనుభవించుచుండెను. జయంతి ఇంకను దగ్గరకు పోయిచూచెను. ఇన్ని బాధలు పడుచుండియు కావ్యుడు స్వస్వరూపము ఏమాత్రము వికారము పొందకయుండెను. ఆమె అతనికి తాను చేయవలసిన శుశ్రూష చేయ సాగెను. తన తండ్రి చెప్పిన విధమున ఆమె శుక్రునకు పరిచర్యలు చేసెను. ఆమె సహజముగనే మధురముగా మాటలాడు స్వభావము గలది. ఆమె శుక్రుని మనస్సునకు అనుకూలముగా మాటలాడుచుండును. ఆవశ్యకమయిన ఆయా సమయము లందు అతనికి స్పర్శ సుఖము గలుగునట్లు గాత్ర సంవాహనము (కాలు సేతులు వెన్ను మొదలగునవి నొప్పి తీరునట్లు ఒత్తుట)లచే అతనికి హాయి కలిగించుచుండును. అతని వ్రతానుష్ఠానమున కనుకూలములగు ఆచరణలు ఆచరించుచుండును. ఇట్లు ఆమె చాల సంవత్సరములు శుక్రుని సేవించెను.
ఇట్లు వేయి సంవత్సరములు నిండెను. శుక్రుని ధూమ వ్రతము ముగిసెను. శివుడు శుక్రుని వరము కోరుకొమ్మనెను. “ఈ వ్రతమును నీవు తప్ప మరియెవ్వరును ఆచరించలేదు. అందువలన తపస్సుచే కాని బుద్ధిబలముచే కాని శాస్త్ర జ్ఞానముచే కాని బలము కాని తేజస్సుచే కాని నీవు ఒక్కడవే దేవతలనందరను నీ క్రింది వారినిగా చేసికొనగలవు. విదే! నీ మనస్సునందు ఏఏ అభిలషితములుకలవో అవి ప్రతి ఒక్కటియు నీవు పొందెదవు. ఈ విషయము మరియెవ్వరి కిని చెప్పకుము. ఈ వరముచే నీవు అందరను మించినవాడవు అగుదువు.”
శివుడు శుక్రునకు ఈ వరములతో పాటు ప్రజాపతిత్వమును కుబేరత్వమును అవధ్యత్వమునుకూడ వరములుగా ఇచ్చెను. ఇట్టి వరములు పొందిన శుక్రునకుసంతోషముచే శరీరమున రోమాంచము కలిగెను. హర్ష వశమున అతనికి శివుని విషయమున దివ్యస్తోత్రము చిత్తమున స్ఫురించెను. అతడట్లు తలక్రిందులుగా ఉండియే శివుని ఈ విధముగా స్తుతించెను.
నల్లని కంఠము కలవాడు సూక్ష్మతమరూపుడు శోభనమగు తేజస్సుకలవాడు. లయము చేయువాడు కావ్యస్వరూపుడు-సంవత్సరరూపుడు అన్నమునకు అధిపతి-జటాజూటము కలవాడు (దుష్టులకు) భయంకరుడు-హర్యక్షు (కుబేరు)నకు వరములొసగినవాడు చక్కగా స్తుతింపబడువాడు-స్తుతింపబడిన అన్ని అర్థములును తానైనవాడు.
నిర్గుణుడు గుణముల (తత్త్వము)ను ఎరిగినవాడు నామరూపాది విభాగము నొందిన వాడు వేటి చేతను చేయబడనివాడు (స్వయం సిద్ధుడు) వికృతములగు (బేసి సంఖ్యగల) కన్నులు కలవాడు ఎల్ల భూతములకు మిత్రుడు (ఉదయించు సూర్యరూపమున నున్నవాడు) సాంఖ్యతత్త్వరూపుడునగు నీకు నమస్కారము. పృథివి అంతరిక్షము ద్యులోకము మహర్లోకము జనస్తవ స్సత్య లోకములునను లోకముల రూపముననుండు నీకు నమస్కారము. నామ రూపాదికముతో వ్యక్తము కానివాడు మహద్ రూపుడు భూతములకు ఆదియగువాడు ఇంద్రియరూపుడు ఆత్మతత్త్వము నెరిగిన వాడు అన్నిటి కంటెను గొప్పవాడు సర్వతత్త్వ రూపుడునగు నీకు నమస్కారము. నిత్యుడు, అత్మలింగరూపుడు, సూక్ష్ముడు, చేతనరూపుడు, బోధము పొందినవాడు, సర్వవ్యాపియగువాడు మోక్షరూపుడు అగు నీకు నమస్కారము. మూడు లోకముల యందు ఉండు నీకు నమస్కారము. వీటికిపైగా ఉండు మూడు లోకములయందు ఉండు నీకు నమస్కారము. సత్య లోకముతో ముగియ నాలుగు లోకముల యందును మహాలోకముతో ముగియు నాలుగు లోకముల యందును ఉండు నీకు నమస్కారము.
బ్రహ్మజ్ఞుడవగు పరమేశ్వరా! ఈ నామస్తోత్రమునందు నేనేదైన పొరబాటులు పలికినను ఇది పలికిన ఇతడు నాభక్తుడేకదా అను దయతో నన్ను క్షమించ ప్రార్థించుచున్నాను అని. శుక్రుడు దేవేశుడును, ఈశ్వరుడును, నీలలోహితుడునగు శివునితో ఇట్లు పలికి బహువారములు మిగుల ప్రణామములుచేసి దోసిలి యొగ్గి మౌనము వహించెను. భవుడును సంప్రీతుడై శుక్రుని శరీరమును మెల్లగా స్పృశించి మిక్కిలి స్పష్టముగా తనదర్శనమును ఇచ్చి అచ్చటనే అంతర్ధానము నందెను.
తన అనుచరులతో కూడ ఆ దేవు డంతర్థానమునందిన పిమ్మట తన సమీపమందున్న జయంతినిచూచి శుక్రుడిట్లు పలికెను: సుందరీ! ఎవ్వరిదానవు! ఎవరవు? నా దుఃఖములో పాలుపంచుకొనుచున్నావు. నేను మహాతపస్సాచరించుచున్న కాలములో నన్ను కాపాడుచుంటివి. ఇటువంటి భక్తి వినయము ఇంద్రియ నిగ్రహము స్నేహము నా విషయమున చూపుచుండిన నీపై నేను ప్రీతుడనయితిని. నీకేమి కావలయును? చెప్పుము. అది ఎంత దుర్లభమయినను నీ కోరిక నెరవేర్చెదను. అనగా ఆమె “అయ్యా! దివ్యమగు తపశ్శక్తిచే కలిగిన జ్ఞాననేత్రముతో చూచి నాకోరికను మీరే ఎరుగ ప్రార్థించుచున్నాను” అనెను. శుక్రుడు దివ్య దృష్టితో చూచి “భామినీ! పది ఏండ్లపాటు నీవు భూతములకు వేనికిని అదృశ్యురాలవై నాతో కలిసియుండ గోరుచున్నావు. నల్ల కలువపూలవంటి చాయయు ఉత్తమ సుందర రూపమును మనోహర నేత్రములును మధురమగు వాక్కునుకలదానవగుటచే నేనును నిన్ను కామించుచున్నాను. నీకోరికను తీర్చెదను. ఇంటికి పోవుదము రమ్ము అనెను. తరువాత శుక్రుడు స్వగృహమునకు వచ్చి జయంతిని పెండ్లాడెను. అట్లే పది ఏండ్లు ఏ భూతములకును కనబడక జయంతితో కూడి దాంపత్యము అనుభవించు చుండెను.
ఇట్లుండగా దైత్యులును తమ గురువగు శుక్రుడు తపస్సునందు కృతార్థుడై తిరిగి వచ్చెనని తెలుసుకొనిరి. వారు సంతోషమునంది ఆయనను చూడగోరి అతని ఇంటికి పోయిరి. కాని శుక్రుడు మాయచే కప్పువడియున్నందున, అతడు వారికి కనబడలేదు. అతడు మాయచే మరుగు పడియున్నాడని గుర్తెరిగి వారును మరలిపోయిరి.
శుక్రుడు శివునివలన వరములను పొందివచ్చెననియు, అయినను జయంతికి మేలు చేయగోరి పదిఏండ్లపాటు మాయతో ఆవృతుడై మరుగుపడియుండుననియు బృహస్పతి తెలుసుకొనెను. ఈ అవకాశములో అతడు ఇంద్రుని ప్రేరణచే శుక్రుని రూపము ధరించి దైత్యులను తనకడకు పిలిచెను. వారు తనకడకు రాగా అతడు వారితో “నాకు యాజ్యులు (యజ్ఞాదులు చేయింపబడు వారు) అగు మీకు స్వాగతము. నేను మీకు మేలు చేయగోరి వచ్చి నాను. నేను సంపాదించి తెచ్చిన విద్యలను మీచే అధ్యయనము చేయింతును” అని పలికెను. వారును సంతోషముతో విద్యాధ్యయనార్థము బృహస్పతిని ఆశ్రయించియుండిరి.
కాలము గడచెను. పదిఏండ్లును నిండెను. ఆ సమయము ముగియుసరికి జయంతీ శుక్రులకు దేవయాని జన్మించెనని పరంపరలో వినుచున్నాము.
అంతట శుక్రుడు తన యాజ్యులగు దానవుల మంచిచెడ్డలను విచారించగోరెను. నేను నాయాజ్యులను చూడబోయెదనని అతడు జయంతితో పలికెను. “మహాతపస్వీ! నీ భక్తులను అనుగ్రహించుము. సజ్జనుల ధర్మము ఇదియే కదా! నేను నీ ధర్మమునకు లోపము కలుగనీయను అని జయంతి పలికెను.
దేవాచార్యుడగు శుక్రుడు పోయి దానవులను దైత్యులను చూచెను. బృహస్పతి శుక్రరూపమున వారిని వంచించెనని అతడు ఎరిగెను. “దైత్యులారా! నేను శుక్రుడనని గురుతించుడు. ఇతడు వివిధ రూపములు ధరించుటలో సమర్థుడగు బృహస్పతి. ఇతడు మిమ్ము వంచించెను. నామాట వినుడు” అనెను. శుక్రుడు అట్లు పలుకుట విని దైత్యులు తడబాటు చెందిరి. వారు ఆ ఇరువురను చూచుచుండిరి. ఆ ఇరువురును పవిత్రమగు చిరునవ్వుతో స్థిరముగా కూర్చుండియుండిరి. వారందరును మిగుల మూఢచిత్తులయిరి. వారికి ఏమియు అర్థము కాకపోయెను. అట్టి దైత్య దానవులను చూచి శుక్రుడు మరల “నేను మీ ఆచార్యుడనగు శుక్రుడను. ఇతడు దేవాచార్యుడు ఆంగిరసుడు (బృహస్పతి). మీరందరు నన్ననుసరించుడు ఈ బృహస్పతిని విడువుడు” అనెను. అసురులును శుక్రుని ఈ మాటలు వినిరి. వారు ఇద్దరను గమనించి చూచిరి. ఎంత చూచినను వారికి ఆ ఇద్దరకు గల భేదము ఏమియు గోచరించలేదు. తపోధనుడగు బృహస్పతి ఏమాత్రము తడబడక దానవులతో ఇట్లనెను. “దైత్యులారా! మీ గురుడనగు శుక్రుడను నేనే. ఇతడు (వాస్తవ శుక్రుడు) నా రూపము దాల్చిన బృహస్పతి. ఇతడు ఇట్లు మిమ్ములను మోసపుచ్చుచున్నాడు.” అంతట దానవులు అందరును తమలోతాము సంప్రతించుకొనిరి. అందరు కలిసి గట్టిగా ఇట్లనీరి: “ఇతడు పది సంవత్సరములనుండి మనలను తన శిక్షణ యందుంచుచున్నాడు. ఇతడే మనకు ప్రభువు (యోగక్షేమము కలిగింపగల సమర్థుడు) ఇతడే మనకు గురువు. ఈ (రెండవ) బ్రాహ్మణుడు అవకాశము చూచుకొని వచ్చినవాడు.” ఇట్లు పలికిన వారందరును మాయా శుక్రునికి చాగిలపడి నమస్కారము చేసిరి. చాల కాలమునుండి అలవాటు పడియున్నందున వారు సత్యమును గుర్తించలేకపోయిరి. అందుచే వారు బృహస్పతి మాటనే సత్యముగా గ్రహించిరి. వారు క్రోధముతో కండ్లెర్రజేసి శుక్రునితో ఇట్లు అనిరి: “ఇతడే మా గురువు. కనుక నీవు వెళ్లిపొమ్ము. నీవు మాకు గురువవుకావు. ఈతడు శుక్రుడో, బృహస్పతియో మాకు అక్కరలేదు. ఈ భగవానుడే మాగురువు. మేమందరమును ఇతని ఆజ్ఞయందే ఉంటిమి. ఉన్నాము. ఉందుము. నీవు ఇటనుండి తిన్నగా వెళ్ళిపొమ్ము. తడవు చేయకుము” అనిరి. ఇట్లు పలికి దానవులు అందరను బృహస్పతిని గురునిగా ఆశ్రయించి ఉండిరి. తాను చెప్పిన అంతటి గొప్ప హితవచనమును దైత్యులు వినకపోవుటచేత శుక్రుడు వారిపై చాల కోపించెను. వారి గర్వము కూడ అతనికి కోపహేతువయ్యెను. “మాయా బలమున బృహస్పతి చేసిన బోధనములువిని మీరు నన్నాశ్రయింపకున్నారు. కావున దానవులారా! మీరు తెలివి కోల్పోయి పరాభవముల పాలగుదురుగాక!” అని పలికి శుక్రాచార్యుడు తాను వచ్చిన త్రోవను పోయెను.
శుక్రునిచేత దానవులు శపింపబడినట్లు తెలియగనే బృహస్పతి తాను కృతార్థుడయ్యెనని తలచి హర్షము పొందెను. అసురులు బుద్ధి కోల్పోయినమాట అతనికి సంతోషము కలిగించెను. వెంటనే అతడు స్వరూపము ధరించెను. అంతర్థానము కూడ పొందెను.
అతడట్లు అంతర్ధానము పొందగా దైత్యులు విభ్రాంతులయిరి. అయ్యో! ఛీ! అతడు మనలను మోసగించెనే! అని ఒకరితో మరియొకరనసాగిరి. ఈ ఆంగిరసుడు (బృహస్పతి) మనలను వెనుక నుండియు, ముందు నుండియు దెబ్బతీసెనే! అతడు తన మాయ చేష్టలతో మనలను మోసగించెనే! అని చింతించిరి. అంతట వారు చింతచే నోళ్ళెండిపోవుచుండ ప్రహ్లాదుని ముందుంచుకొని శుక్రుని అడుగుల వెంటనే బయలుదేరి అతడు వెళ్లిన మార్గమును అనుసరించి పోయిరి. చివరకు శుక్రుని సమీపము చేరిరి. తలవంచుకొని అతని ముందు నిలువబడిరి.
మరల తన ఎదుటికి వచ్చిన తన యాజ్యులైన దానవులను చూచి శుక్రుడు వారితో నేనెంత హెచ్చరించినను “మీరందరును నామాటపై ఆదరము చూపకపోతిరి. నాపై మీరు చూపిన అవమాన దృష్టికి ఫలముగా మీరు అవమానము పొందితిరి” అనెను.
శుక్రాచార్యుడు ఇట్లు పలుకుచుండ ప్రహ్లాదుడు బాష్పములు క్రమ్మిన కన్నులతో ఇట్లు పలికెను: “భార్గవా! మీరు మమ్ములను విడువవలదు. మాకు మీరే ఆశ్రయము. మేము మిమ్ము ఆశ్రయించుచున్నాము. మీకు భక్తులము. ఇట్టి మాకు మీరు ఆశ్రయము ఇండు. మీరు మాకు కనబడని సమయములో దేవగురువు మమ్ములను మోసగించెను. మమ్ములను మాయలో పడవేసెను. తపస్సుచే దీర్ఘములగు నేత్రములుగల మీరు ఎంతవరకైన మీదృష్టి ప్రసారము చేయగలరు. మీరే మామనస్సులలోనికి చూడుడు. మేము మీభక్తులము. మమ్ములను విడువ వలదు. భృగునందనా! మీరు మమ్ముల ననుగ్రహింపనిచో-మీరు మమ్ములను అలక్ష్యముగా చూచినచో-మేము ఇప్పుడే రసాతలమును ప్రవేశింతుము.
శుక్రాచార్యుడు యథార్థమును తెలిసికొనెను. అతడు సహజముగానే కరుణా స్వభావుడు. భూతలముపై అనుకంప కలవాడు. ప్రహ్లాదాది దైత్యులును తన్నెంతగానో బ్రతిమాలిరి. అందుచే అతడు తనకోపము అణచుకొని ప్రహ్లాదునితో ఇట్లు పలికెను: “మీరు భయపడవలదు. రసాతలమునకు పోవలసిన పనిలేదు. అవశ్యము జరుగవలసిన విషయములు ఏవో మీకును జరిగినవి-నాకును జరిగినవి. దైవనిర్ణయము బలవత్తరము. దానిని మనము మార్చజాలము. నాయాజ్యులగు మీకు దురదృష్టవశమున తెలివి తప్పినది. మరల తగిన కాలమున మీకు తెలివివచ్చును. దేవతల చేతిలో మీరు ఓటమి పొంది పాతాళమునకు పోవలసిన అగత్యము ఎప్పటికిని రాదు. ఇప్పుడు మీకు ప్రతికూల సమయము వచ్చి ఇట్లు జరిగినది అని బ్రహ్మ పలికియున్నాడు. నా అనుగ్రహమున మీరుశక్తి సంపత్సమృద్ధమైన త్రైలోక్యరాజ్యమును అనుభవించితిరి. పది దివ్యయుగములపాటు దేవతల శిరస్సులపై మీ పాదముల నిలుపగలిగితిరి. మీ రాజ్యకాలము ఇంత మాత్రమే అనిబ్రహ్మ పూర్వము చెప్పియుండెను. మరల సావర్ణిక మన్వంతరమున నీకు (ప్రహ్లాదునకు) రాజ్యాధికారము వచ్చును. తరువాత మీమనుమడు బలి మరల త్రిలోకములకును ఈశ్వరుడగును. ఈ విషయమును రహస్యమున మీమనుమడైన బలితో స్వయముగా విష్ణువే చెప్పియుండెను. విష్ణువు తాను బలినుండి వంచనచే లోకములను హరించిన సమయమున అంతవరకు బలి తన పాలిత ప్రదేశములందన్నిట ప్రవర్తిల్లజేసిన లోకప్రవృత్తులను గూడ మోసముచే తీసివేసికొనెను. అందుచే ప్రీతుడై విష్ణువు బలికి ఈ వరమునిచ్చెను. (బలిచక్రవర్తి తన పాలనకాలమున త్రిలోకములందును ఒక ఉత్తమమగు పాలన వ్యవస్థను నిలిపెను. విష్ణువు దేవతలకై బలినుండి త్రిలోకరాజ్యమును హరించెనేకాని బలి అతఃపూర్వము లోకములందు నిలిపిన ప్రవృత్తుల కంటె మేలగు ప్రవృత్తులను దేవతలు కాని మానవులుకాని ఎవ్వరును ఏర్పరుపలేరు. కావున తరువాత దేవతలు బలి అంతకుమునుపు నడుపుచుండిన ప్రవృత్తులతోనే లోకపాలనను సాగించిరి. ఇది బలి గొప్పతనము. బలి ఇట్టి ఉత్తమ పాలకుడు గావున అతని విషయమున విష్ణువు ప్రీతుడై అతనికి ఉత్తమ వరములిచ్చుట ఆశ్చర్యకరముకాదు. అందుచే బలి మరల దేవరాజ పదము నలంకరించి తీరవలయును అని ఈశ్వరుడే నాతో చెప్పియున్నాడు. అందుచేత బలి అంతవరకును ఏ భూతములకును అదృశ్యుడై మంచి కాలమునకు ఎదురు చూచుచుండును. అట్లే విష్ణువు నీకును అమరత్వమును వరముగ నిచ్చియున్నాడు. అందుచే నీవు ఏమియు తహతహపడక పర్యాయక్రమములో (వంతుల ననుసరించి) దేవతల అధికారము తరువాత మీ అధికార కాలము వచ్చువరకు ఎదురు చూడ వలయును. నేను నీముందు అసత్యము పలుకజాలను. ఈ విషయము నీతో ఇప్పటికే చెప్పవలసియుండెను. కాని బ్రహ్మ చెప్పవలదనుటచే నాకు ఈ భవిష్యత్ తెలిసియుండియు నీకు చెప్పి యుండ లేదు. ఈ నాశిష్యులిద్దరును (శండుడు, మర్కుడు అనువారు) బృహస్పతికి ఆదరపాత్రులై యుండి దేవతలతో కలిసియుండి (మీకు నాశము కలుగనీయ కుండునట్లు) దేవతలను వారింతురు.”
అని ఇట్లు శుక్రుడు దానవులకు చెప్పెను. అతడు ఎట్టిక్లిష్టమయిన పనులనైనను సునాయాసముగా చక్కపెట్టగలవాడు. తప్పక జరిగి తీరెడి భవిష్య ద్విషయములనే శుక్రుడు తమకు చెప్పెను. కనుక ప్రహ్లాదుడు మొదలగు దైత్యులందరును హర్షముతో వెడలిపోయిరి.
శుక్రుడు చెప్పినట్లు తమకు దేవతలవలన భయము రానున్నదని ఎరిగి దానిని వారించు కొనదలచి దైత్యులు కవచములను ఆయుధములను ధరించి దేవతలను యుద్ధమునకు ఆహ్వానించిరి. అది చూచిన దేవతలును ఆయా సామగ్రులను సమకూర్చుకొని దైత్యులతో తలపడిరి. ఈ దైవాసుర యుద్ధము నూరేండ్లు జరిగెను. దీనిలో తుదకు దైత్యులే దేవతలను గెలిచిరి. దేవత లోడిరి. దేవతలు అందరును మంత్రాలోచనము చేసిరి. యజ్ఞముచే (భగవానుని) ఉపాసించి దైత్యులను ఓడింతము అని సంకల్పించిరి.
వారంతట శుక్ర శిష్యులగు శండా మర్కులను బ్రాహ్మణులను పిలిచి “మనము యజ్ఞము జరుపుదము. తరువాత ఇప్పటికి యుద్ధమున గాయపడకుండిన దైత్యులనందరను యుద్ధమునకు పిలిచెదము. మనమందరము కలిసి దానవులను గెలిచి వారి ధనమును గెలిచి కొందము” అనిరి. ఇట్లు మోసముతో ఒడంబడిక చేసికొని శండామర్కులు దేవతల పక్షమునకు పోయిరి. దీనికి ఫలితముగా దేవతలు గెలిచిరి. దైత్యులు ఓడిరి. శండామర్కులు తమ్ము విడిచిపోయినందున దానవులు బలహీనులైరి. ఇట్లు పూర్వము దైత్యులు శుక్రుని కోపము మూలమున దెబ్బతిని దేవతల చేతిలో పరాభవమునందిరి. అపుడు మరల వారు శండామర్కుల నాశ్రయించిరి.
దైత్యులు ఇట్లు కావ్యుని (శుక్రాచార్యుని) కోపముచే వ్యాప్తులై ఎచ్చటను ఏ ఆశ్రయమును లేనివారైరి. దేవతలచే ముట్టడించబడి వారిచేతిలో ఓడిపోయి ఎన్నో క్లేశముల పాలైరి. ప్రహ్లాదుని అజ్ఞకు లోబడి నడచుకొనని రాక్షసులందరును మానవుల చేతులలోకూడ మరణింతురని బ్రహ్మ పూర్వమే పలికియుండెను. తరువాత అది మొదలుకొని భృగు శాపమును నిమిత్తముగా చేసికొని ప్రభువగు శ్రీనారాయణుడు లోకమున ధర్మము మిగుల శిథిలమయినపుడెల్ల ధర్మవ్యవస్థను రాక్షస నాశమును కలిగించుటకై మరలమరల అవతారములను ఎత్తనారంభించెను. ఇట్లు అతడు అజుడు-జన్మము లేనివాడయ్యును జన్మము నందసాగెను.
వీనిలో మొదటిది ధర్మావతారము: చాక్షుష మన్వంతరమున నారాయణుడు అంశముతో ధర్ముడుగా అవతరించెను. అతని ప్రాదుర్భావ కాలమునందే ఆ చాక్షుష మన్వంతరము నందే దేవతలు యజ్ఞము నాచరించిరి. ఈ యజ్ఞము నందు బ్రహ్మ అధ్వర్యుడుగా నుండెను.
రెండవది నారసింహావతారము: నాలుగవ దివ్య యుగమునందు అమరులకు ఆపదలు కలుగగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వధించుటకై నారాయణుడు నారసింహుడయ్యెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమునకు రుద్రుడు పురోహితుడు (అధ్వర్యుడు) అయ్యెను.
మూడవది వామనావతారము: సప్తమ మహాయుగపు త్రేతాయుగమున త్రిలోకములును బలి వశగతములు కాగా నారాయణుడు వామనుడుగా అవతరించెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమున ధర్ముడు (మహాముని) అధ్వర్యుడు అయ్యెను.
ఇవి శ్రీమహావిష్ణువునకు భృగుశాప నిమిత్తమున కలిగిన జన్మములలో మూడు. ఇవి దివ్యములగు (దేవతాతత్త్వ సంబంధులగు) అవతారములు. ఇవికాక మిగిలిన ఏడును మానుషములు.
నాలుగవది దత్తాత్రేయావతారము: ఇది ప్రథమ త్రేతాయుగమున జరిగెను. ఈ కాలమున దేవతలు జరిపిన యజ్ఞమునందు మార్కండేయుడు పురోహితుడయ్యెను.
పదునైదవ త్రేతాయుగమున జరిగిన మాంధాతృ చక్రవర్త్యవతారము ఐదవది. అతనికి రైభ్యుడు పురోహితుడయ్యెను.
పందొమ్మిదవ త్రేతాయుగమున జరిగిన పరశురామావతారము ఆరవది. ఈ విభుడు సర్వక్షత్త్రాంతకరుడు. ఇతడు జమదగ్ని కుమారుడు. విశ్వామిత్రుడీతనికి పురోహితుడు.
ఇరువది నాలుగవ త్రేతాయుగమున రావణవధార్థమై దశరథ కుమారుడుగా జనించిన శ్రీరాముని అవతారము ఏడవది. ఇతనికి వసిష్ఠుడు పురోహితుడు. ఇరువది ఎనిమిదవ ద్వాపర యుగమున పరాశరపుత్రుడుగా జన్మించిన వేదవ్యాసుడు ఎనిమిదవ అవతారము. జాతుకర్ణ్యుడు ఈతనికి పురోహితుడు. ఈతడు ధర్మ ప్రతిష్ఠాపనమును అసురనాశమును జరుపుటకు హేతుభూతుడయ్యెను.
పద్మనేత్రుడగు శ్రీనారాయణుడు ఇదే ఇరువది ఎనిమిదవ ద్వాపరమున దేవకీ వసుదేవుల కుమారుడగు కృష్ణుడుగా అవతరించెను. ఇది తొమ్మిదవ అవతారము. ఇతని పురోహితుడు ద్వైపాయన వ్యాసుడు.
ఈ కల్పమునందే యుగధర్మము క్షీణించగా కల్ప సంధ్యాకాలమున విష్ణు యశుడు అనునాతనికి కల్కి అనుపేర కుమారుడుగా శ్రీనారాయణుడు జనించును. ఇది పదియవ అవతారము. ఇతనికి పారాశర్య వ్యాసుడు అగ్రేసరుడై యుండును. యాజ్ఞవల్క్యు డీతని పురోహితుడు. ఆయుధములు ధరించిన లక్షల కొలది విప్రులు ఈతనికి సేనగా నుందురు. ఈతడు దుష్టులగు అనేక భూతములను పాషండులను వేదములకు విప్రులకు శత్రువులగు నరులను వేదద్వేషులగు రాజులను అంతము నొందించును. సముద్రముల అంచులవరకు గల ఈ భూమండలమునందలి దుష్టులను నశింపజేయును. ఆ కాలము నందే జనులును దుష్టులగు వారు మోహితులై ఒకరిని మరియొకరు వధించుకొందురు. జరుగవలసిన భవితవ్యత ప్రేరించగా ఆదుష్టులందరు అట్లు నశించగా ఇంతలో కలియుగము గడువగా ఆ కల్కి మూర్తి అంతర్ధానమునందును.
యుగాంతమున ప్రజలను రక్షించు నిమిత్తమయి చివరకు రాజులందరును నశింతురు. వారిని రక్షించు వారెవ్వరును ఉండరు. వారు ఒకరిని మరియొకరు చంపుకొందురు. వారు మిగుల దుఃఖముల పాలగుటయే కాక అవి చెప్పుకొనుటకు దిక్కులేని వారగుదురు. అందరును ఒకరిని మరొకరు హింసించుకొనుచు సమముగా దుర్మార్గులగుటతో వారు తమ ఆస్తులు విడిచి పురములు గ్రామములు విడిచిపోవుదురు. ఆయా ఆశ్రమ ధర్మములకు కావలసిన వస్తువులే దొరుకక పోవును. వర్ణాశ్రమ ధర్మములు నశించును. జనపదములలో అన్నమును విక్రయింతురు. చతుష్పథము (నాలుగు వీధులును కలియు కూడలు)లలో వేదములు అమ్ముదురు. ధనమునకు ఆశపడి వేద ధర్మములును అందరకును బహిరంగముగా ప్రవచింతురు. స్త్రీలు తమ శీల పవిత్రతను అమ్ముకొందురు. ప్రజలు పొట్టిదేహములు కలవారు అల్పాయుష్కులు, అడవులలో నదీ తీరములలో పర్వతములలో నివసించు వారగుదురు. వారలు చర్మములు ధరింతురు. ఘోరములగు సంకటముల పొందుదురు. అందరును వాదగొండులగుదురు. ఆస్తులు తగ్గి పోవును. బుద్ధి వాదములు చేయుదురు. అల్పబుద్ధులు అగుదురు. సంకర ప్రధానమగు కలియుగములో ప్రజలు ఇట్లు కష్టములను పొందుదురు. తుదకు కలియుగములో జనులిట్లు కష్టములు పడిపడి, ఒకేమారు నాశము పొందుదురు. అంతట కృతయుగమారంభమగును.
ఇట్లు మీకు యదువంశమును తెలుపు ప్రసంగమున దైవాసుర యుద్ధమును చక్కగా చెప్పితిని. విష్ణుయశమును కూడ తెలిపితిని. ఇక మీదట తుర్వసు ద్రుహ్య్వనుపూరుల వంశమును తెలిపెదను.