మత్స్య మహా పురాణము
యమ గ్రసనాసుర యుద్ధము
సూతుడు ఇట్లు చెప్పసాగెను, అంతలో యముడు గ్రసనాసురుని చూచి క్రోధవ్యాప్తుడయి ఆ సూర్యతేజస్కునిపై బాణములు కురిసెను. ఆ అతిపరాక్రముడా దెబ్బలకు ప్రతీకారముగా భయంకరధను ఎక్కుపెట్టి పంచశత భీకర బాణములతో యముని నొప్పించెను. అతడాతని అతి పౌరుషమును లెక్కపెట్టక ఉత్తమ బాణ వర్షములతో గ్రసనుని బాధించెను. అ దానవేశ్వరుడది తనమీదకు వచ్చుచుండగనే శరవర్షముతో ఖండించెను. తన శరరాశి వ్యర్థమగుటచూచి యముడు వాని రథముమీదకు ముద్గరమును విసరెను. అదివచ్చుచు అకసమందుండగనే గ్రసనుడు ఎడమచేత ఎగసిపట్టి దానితోనే యముని మహిషమును కోపమున వేగముతో కొట్టి దానిని నేలబడగొట్టెను. మహిషము క్రిందపడునంతలో యముడు క్రిందకు దుమికి ప్రాసముతో గ్రసనుని మొగముపై కొట్టెను. వాడు మూర్ఛితుడయి క్రిందపడెను. భయపద పరాక్రముడగు జంభాసురు అది చూచి భిందివాలముతో యముని వక్షమునకొట్టెను. అతడు నెత్తురు నోటక్రక్కెను. యముడట్లు మర్దితుడగుట చూచి ధనాధిపతి కుబేరుడు పదివేలయక్షులతో కూడి గదాపాణియై జంబు నెదుర్కొనెను. దానవ సేనా పరివృతుడా జంభుడు కుబేరుని - ప్రాజ్ఞుడు తన మిత్రుని వాక్యమును గ్రహించినట్లు అందుకొనెను. అంతలో గ్రసనుడును తెలివినొంది యముని పయి గద విసరెను. అది బరువయినది - స్వర్ణాలంకృతము-శత్రువుల మర్దించునది. అది తనపై వచ్చుచుండుట చూచి యముడు ప్రతీకారముగా మేఘమువలె గర్జించుచు కోపముతో జ్వాలామాల సమకూలమగు దండము విసరెను.
ఆ దండమాకసమున గ్రసనుని గదతోచేరి మేఘమువలె ప్రకాశించెను. ఆరెంటి సంఘర్షము శిలా సంఘర్షమువలె దుఃసహమయ్యెను. వాటి ధ్వనితో దిగన్తరము జడత్వము నందెను. ప్రళయము రానున్నదేమోయని జగత్తులు వ్యాకులత పొందెను. క్షణములో ఆ నిర్హ్రాదము శాంతించెను. రాపిడికి నిప్పురవ్వలు ఆకసమున నిండెను. గగన దృశ్యము వీటిరాపిడితో భయంకర మయ్యెను. దండము గదను పిండిచేసి అనర్థము దర్వర్తనుని సంపదను జయించినట్లా దానవుని జయించి వానితలపై పడెను. దానితో వాడు దిక్కులు చీకటులై తోచగా వాడు తెలివితప్పి ధూళిలో మునిగి క్రిందపడెను. దాన ఇరుసేనలందు ఘోర హాహాకారము రేగెను. ముహూర్తమాత్రలో గ్రసనుడు తెలివంది తన శరీరము ఆభరణములు చెల్లాచెదరయి ధూళిధూసర మగుట గమ నించెను. దీనికి ప్రతీకారము ఏమియని యోజించెను. “నావంటి పనికి మాలిన వాని మూలమున ప్రభువున కవమానము, సేనలు నాపయి ఆధారపడి యున్నవి; నేను నశించిన అవియు నవించును. తన ఇచ్చచొప్పున ప్రవర్తించు వానికి గౌరవము లేదు. ప్రాణికి మరణము స్వాభావికము. వాడు వ్యర్థుడయి సదా హర్షముతో బ్రదికిన లాభమేమి?” అని ఆలోచించి ఆ మహాబలుడు వేగిరముగా లేచి కాలదండమును కొండను పోలిన ముద్గరమును చేబూని ఘోర సంకల్పుడై పెదవులు కొరుకుచు రథముపై శీఘ్రముగాపోయి యముని సమీపించెను. రౌద్రమగు ముద్గర మును మహా వేగమున త్రిప్పి యముని తలపైకి విసరెను. ప్రకాశించుచు తన పయికివచ్చు దానిని చూచి యముడు కన్నులు తడబడ తాను మహాబలుడు కావున ఎట్లో దానిని తప్పించు కొనెను. అతడు తప్పించుకొని దూరముపోగా గ్రసనుడు భీమకర్ములును మహాకోపులు భయం కరులు అగు వేలకొలది యమ కింకరులను నలుగగొట్టెను. నానాయుధ సహితమగు తన ఘోర కింకర వాహినియు నిహతమగుటచూచి యముడు చాల కలతనందెను. ఐనను కీంకర మయముగా నున్న యమసేనను చూచి గ్రసనుడు యముడే తన మాయతో వేలకొలది యము లను సృష్టించెనేమో అనుకొనెను. వాడు ఆ సేనను ఎదిరించి శరవర్ష మద్దానిపై కురిసెను.
వాడు క్రోధమూర్ఛితుడై కల్పాంత రుద్రుడయ్యెను. శూలముతో సూటిగ పోవు బాణములతో గదతో ముద్గరములతో దారుణప్రాణ ప్రహారములతో వారినందర చితుకగొట్టెను. కింకరులలో కొందరు విలాసముగా తమ బాహుమండలములతోను కొందరు రాలతోను కొందరు మహోన్నత వృక్షములతోను గ్రసనుని కొట్టిరి. మరికొందరు వానిని గోళ్ళతోపీకిరి; పండ్లతో కొరికిరి. మరి కొందరు పిడికిళ్ళతో వీపుపయి గ్రుద్దిరి.
వారట్లు తన వెంటబడి బాధించగా గ్రసనుడు క్రోధముతో నిండి వారిని వేలమందిని శరీరములు ఎత్తి విడిచి నేలపై నలుగరాచెను. మరికొందరను పిడికిళ్ళు ఎత్తి కొట్టి చంపెను. దానితో వాడు బడలిక చెందెను. వానిచేతిలో తనసేన చచ్చుటయు వాడట్లగుటయు చూచి యముడు దండమెత్తి వాని పయికి పోవుచుండ వాడది గమనించి గదతో నతనిని కొట్టెను. యముడది లెక్కసేయక వాని రథమునులాగు వ్యాఘ్రములను చంపగా ఆరథము కదలకపోయెను. సంశయ ముత్తమ పురుషుని చిత్తమును వదలినట్లు గ్రసనుడా రథము వదలి పదాతియై యమునితో బాహు యుద్ధమునకు తలపడెను. యముడును ఆయుధములను వదలి వానితో యుద్ధమునకే సిద్ధపడెను. గ్రసనుడు తన కటివస్త్రములతో యముని మూటకట్టి పిచ్చివానిని సంభ్రమము త్రిప్పినట్లు గిరగిరత్రిప్పెను. యముడంతలో తనబాహు ద్వంద్వముతో వాని మెడపట్టు కొని గిరగిర త్రిప్పి నేలపైకి విసరెను. తరువాత వారు పరస్పరము పిడికిళ్ళతో గ్రుద్దుకొనిరి. దైత్యుడతికాయుడు కావున దీనితో యముడలనెను. అతడు రాక్షసుని మొగము వీపుపై ఉంచుకొని విశ్రాంతి తీసికొనదలచెను. వాడది గమనించి అతనిని నేలపై అదిమి తన బాహువులతో మోకాళ్ళతో నలుగ పొడిచెను.
యముడు నిర్జీవుడగుటచూచి దానవు డతనిని విడిచి ఉద్దతమగు జయము పొంది నందున ఆ మహాబలదైత్యుడు గర్జించి తన సైన్యమును చేరి కొండవలె అచలుడయి నిలిచెను. వాడు కుబేరునికి మర్మ భేదకములుగా వదలిన బాణములతో దిక్కులు నిండి మూతపడెను. వాడు కోపించి కుబేరసేనను కూడ మిగులు నొప్పించెను. అది చూచి ప్రతాపవంతుడా కుబేరుడును ధనువాకర్ణాంతములాగి అగ్ని తేజస్కములగు వేలకొలది బాణములను వాని వక్షముపై వదలెను. నూరిటితో సారథిని పదింటితో ధ్వజమును డెబ్బదితో వాని కాలుసేతులను పదిటితో ధనువును కొట్టెను. విషతైలముతో పూయబడి నెమలి ఈకలు పింజలందు కట్టియుండి సూటిగాపోవు బాణములను జంభుడు కుబేరుని రొమ్మున నాటెను. కుబేరుడు త ధైర్యముపూని భయంకర మగు ధనువులాగి వాడియగు వేలకొలది బాణములతో దిక్కులను విదిక్కులను భూమిని జంభుని సేనను కప్పివేసెను. రవి మండలమును మూసెను. దానవ నేనను చంపెను. అతి పౌరుషుడగు జంభుడు కుబేరుని ప్రతియొక బాణమును తన వేలకొలది బాణములతో ఖండించెను. కుబేరుడు కోపించి నానాసాయక వర్షములతో వానిసేనను నశింపజేయసాగెను. అదిచూచి జంభుడు స్వర్ణా లంకారములుకలది అయోమయము భయంకరమునగు ముద్గరము పూని ధన దాను చరులగు యక్షులను వేలకొలదిగా నలుగగొట్టెను. వారాదెబ్బలు తినుచు తాళలేక భయంకరముగా ఆర్త ధ్వనులు చేయుచు కుబేరుని రథమునకు చుట్టును మూగిరి. తన యనుచరులట్లు మర్దితు లగుట చూచి కుబేరుడు దారుణమగు శూలము చేబూపెను. వేలకొలది రాక్షసులను చంపెను. దానవుడు తనవారు అనేకులు నశించుచుండుటచూచి శత్రు మర్దనమగు పరశువు పూని వాడి వాదరగల ఆ గండ్ర గొడ్డలితో కుబేరుని రథమును నున్నని బట్టను ఎలుక ఖండించినట్లు నూవు గింజంత ముక్కలుగా నరకెను.
అంతట కుబేరుడు పదాతియై భయంకరమగు గదను తీసికొనెను. అది ఇదివరకు మహా యుద్ధ విమర్దములందు గర్వించిన శత్రువులు నశింపజేసినది; ఏప్రాణులకును ఎదిరించరానిది; ఎన్నో ఏండ్లనుండి పూజింపబడుచుండినది, ఆ పూజతో బహు చందనములు పూయబడి బహు పుష్పములతో అధివాసితమయి యుండినది, నిర్మలమగు ఉక్కుతో చేయబడి బరువయి అమోఘ మయి స్వర్ణభూషణ భూషితమయినది; కుబేరుడు సంక్రుద్ధుడయి జంభుని తలపైకి దానిని విసరెను. మెరుపులు గుంపులతో అలంకృతమయి వచ్చుచున్న దానిని చూచి జంభుడు దాని నాపుటకయి బంగారు భుజకీర్తులతో అలంకృతములయిన తన బాహువులతో బాణ వర్షమును చక్రములను కుణపములను భశుండులను ప్రాసములను పట్టినములను ప్రయోగిం చెను. ఆ గద వాటినన్నిటిని వ్యర్థములనుగాజేసి మహోల్క ప్రకాశించుచు గిరి కందరమున పడినట్లు వాని పక్షమున వచ్చిపడెను. అగదాఘాతముతో వాడు రథపు కూబరమున (నొగలమీద) తెలివి తప్పి పడిపోయెను. వాని ముక్కుల నోట రక్తము స్రవించెను.
జంభుడు మరణించెనని తలచి కుజంభుడు కుబేరుని వాక్యమువిని మిగుల కోపించి భయంకర నినాదము చేయుచు అతని చుట్టును బాణపువలు అల్లెను. బలియగు యక్షేశ్వరుడు వాడియగు అర్ధ చంద్రబాణములతో ఆ వలను ఛేదించి కుజంభునిపై శరవర్షము కురిసెను. ఆదైత్యుడు ఆశర సమూహమును నిశిత శరములతో ఛేదించెను. తన శరవృష్టి వ్యర్థమగుటచూచి కుబేరుడు హేమఘంటా భూషితమగు శక్తిని (ఆయుధమును) దుర్ధర్షమగు దానిని తీసికొని రతనాల భుజకీర్తుల కాంతిరాశితో నవ్వు చున్నదో అన్నట్లున్న తన బాహువుతో వేగమున గిరగిర త్రిప్పి కుజంభునిపై వదలెను. ఆ దారుణశక్తి కుజంభ హృదయమును చీల్చెను. గుండె నిబ్బరము లేనివాని హృదయమున వానికి తెలియక విచారణ చేయకపోవుటచే దూరిన ధనాశవలె వాని హృదయమును భేదించి భూమిని చేరెను. ఆ దైత్యుడు ముహూర్తకాల మస్వస్థుడై తేరుకొని దారుణాకారుడై పొడవయి వాడిమొనగల పట్టినమును చేత ధరించి దానితో కుబేరుని వక్షమును- హృదయ మర్మాంతర్భాగమున నాటుకొను తీ క్ష్ణరూపమగు వాక్యముతో ఉత్తమవంశ జాతుని హృదయమును వలె చీల్చెను. ఆ పట్టసముపడగానే కుబేరుడు మిగుల మూర్ఛితుడై శిథిలమయిన పర్వతమువలె రథపు ఆసనమున కూలబడెను.
ధనపతి ఇట్లగుటచూచి నరవాహనుడగు నిరృతి నిశాచరబలము తనవెంట రాగా ఖడ్గ హస్తుడయి భీమ విక్రముడగు జంభునిమీదకు పరుగెత్తెను. ఎదిరించ నలవికాని నిరృతిని చూచి రాక్షసేశ్వరుడగు కుజంభుడు తన దైత్యులను అతని రథము పయికి పురికొల్పెను. అతి భీషణులగు వారినిచూచి తన భూషణకాంతితో రవివలెవెలుగు ఆ నిరృతి శీఘ్రమే తన రథము నుండి దుమికి వచ్చి ఒరనుండి తీయగా ఆకాశమువలె నీలపు కాంతితో వెలుగు ఖడ్గముతో కమలములను వలె దైత్యుల ఋజు ముఖములను ఖండించెను. ఆ కుజంభుని క్రిందికి మీదకు రాకుండ అదుపులో నుంచి ప్రచండ కోపరక్త నేత్రుడై పెదవులు కొరుకుచు కనుబొమలు ముడివడి వికటమయి కనబడగా దానవులను ఖండించెను. వాడు తనసేన దాదాపు నిఃశేషమగుట చూచి బహువిధముల నిరృతిమీదకు పరుగెత్తెను. అంతలో జంభుడు తెలివొంది కుబేరుని అనుచరులను వేలకొలదిమందిని పాశములతో సజీవముగా బంధించెను. అతని కాంతి వంతములగు రత్నములను ధన నిధులను దివ్య వాహనములను విమానములను దానవులు స్వాధీనమొనర్చుకొనిరి. అంతలో ధనపతి తెలివొంది ఆ స్థితిచూచి దీర్ఘమగు వేడి ఊర్పు విడిచి రోషరక్త నేత్రుడయి గారుడాస్త్రమును ధ్యానించి దానితో అభిమంత్రించిన బాణమును వింట సంధించి దానిని దానవసేనపయి ప్రయోగించెను. అది శత్రు విదారణమయినది. దానిచే మొదట అతని ధనువునుండి పొగలగములు రేగెను. తరువాత దీప్త తేజస్కములగు కోట్లకొలది నిప్పుల రవ్వలు చెలరేగెను. పిమ్మట ఆ అస్త్రము అకసమును అన్నివైపులను జ్వాలలతో ఆకుల పరచెను. అంతట ఆ అస్త్రము క్రమముగ ఎవరికి నడ్డగింప సాధ్యముకాని నానారూపములు ధరించెను. ముహూర్త కాలములోక మంధకారావృత మయ్యెను. అంతలో అంతరిక్షమున పరస్పర వ్యాప్తములగు తేజస్సులు కానవచ్చెను. అంతట అతి పరాక్రముడుగు కుజంభుడు పదాతియై కుబేరుని వైపునకు పరుగెత్తెను. ఆదైత్యుడు తనవైపునకు పరుగెత్తి వచ్చుట చూచి కుబేరుడు తడబడుచు పారిపోవ సిద్ధపడెను. పారిపోవు అతని రత్నాలంకృత కిరీటము అంబరము నుండి మహోల్కవలె ప్రకాశించుచు భూతలమున పడెను. ఎవరికి నెదిరించరానివారును నానా శస్త్రాస్త్రహస్తులు నభిమానధనులునగు ధనదా (కుబేరా)ను చరులగు యక్షులు ఆ పడిన మకుటము చుట్టును మూగి తమ ప్రభువు రణమునుండి పారిపోయినపుడు అతని భూషణము రణరంగమున పడిపోయి ఉండగా దానిముందు మరణించుటయే వీరులకు ఉచితము అనుచు యుద్ధమునకు సంసిద్దులయిరి. చండ పౌరుషుడగు దానవుడా కుజంభుడు అది చూచి యోర్చజాలక భయంకరా కృతియై కొండంత బరువయిన భుశుండిని పట్టి మకుట రక్షకులను నలుగగొట్టెను. తరువాత వాడా కిరీటమును మూర్తిమంతములగు కుబేరుని రత్నములను నిధులను కూడ తన రథమం దుంచుకొని ఇట్లు కుబేరుని జయించి దనుజేంద్ర సంఘము నడుమనున్న తన సేనకడకు పోయెను. కుబేరుడు దీనుడై జుట్టు విరియబోసికొని ఇంద్రుని కడకు పోయెను.
అంతట నిరృతి కుజంభునితో తలపడి అమోఘమగు తామసమయ నవలంబించి జగత్తంతయు నంధకారమయము కావించి ఆ దైత్యేంద్రుని మోహపరచెను. దానిచే దానవ బలములు కనులు కనబడక తామున్న చోటినుండి అడుగైన కదల్బజాలకపోయిరి. నిరృతి సైనికులును మంచు చీకటిలో పరమాతురములయిన వాహనములతోనున్న దానవ సేనను నానాస్త్ర వర్షముతో చావగొట్టిరి. ఇట్లు దైత్యులు చావుదెబ్బలు తినుచుండ కుజంభుడు మూఢ చేతస్కుడు కాగా ప్రళయమేఘ సమానుడగు మహిష దానవేంద్రుడు ఉల్కలగమితో అలంకృత మయిన సావిత్రమను అస్త్రమును సంధించి ప్రయోగించెను.
ప్రతాపి అగు సావిత్రమను అస్త్రశ్రేష్ఠము విజృంభించుచుండ వెంటనే ఘోరాంధ కారము నశించెను. ఆకాశమంతయు నిప్పురవ్వలతో నిండి శరత్కాలమున వికసించిన ఎర్ర తామరలు కల నిర్మల సరస్సువలె ప్రకాశించగా, అంతవరకు చీకటిలో సంభ్రాంతు లయియున్న దానవులకు కన్నులు వచ్చి వారు క్రూర మనస్కులయి దేవసేనను తరిమిరి. కోపముతో వారు వదలిన బాణములతో సార్వాస్త్రమును తొలగ గొట్టబడెను. అంతట భయంకర ధనువును సర్పమువంటి బాణములను తీసికొని నిరృతి రథము మీదకు కుజంభుడు పరుగెత్తెను. అతడు తన అనుచరులతో తన వైపునకు వచ్చుచుండుట చూచి నిరృతి క్రూర సర్ప విషముపూసిన నిశిత బాణములతో వారిని కొట్టెను. బాణములను తీసుకొనుట సంధించుట విడుచుట తెలియరానంత వేగముగా ప్రయోగించిన బాణములతో నిరృతి కుజంభుని బాణములను మిగులశీఘ్రముగా ఛేదించి ఒక తీవ్ర బాణముతో వాని ధ్వజమును కూల్చి ఒకదానితో సారథిని మరికొన్ని బాణములతో గుర్రములను చంపెను. కుజంభుడా యుద్ధ విజృంభణలో నిరృతి ధనువునుచూచి క్రోధ రక్తనేత్రు డయి తన రథమునుండి దుమికి శరదాకాశమువలె నిర్మలమగు ఖడ్గమును పది చంద్ర ఖండ ములుగల పలకను(డ్రాలును) తీసికొని నిరృతిమీదకు పరుగెత్తెను. అతడు ముద్గరముతో దైత్యుని కొట్టగా వాడా దెబ్బతో నిశ్చేష్టుడై ధీరమగు పర్వతమువలె ఊరకుండి పోయెను. అతి దుర్జయుడగు రాక్షసేంద్రుడా కుజంభుడు ముహూర్తకాలములో తెప్పరిల్లి నిరృతి రథమెక్కి ఎడమ చేతితో అతనిని పట్టుకొని మోకాలితో అతనిని త్రొక్కిపట్టి జుట్టుపట్టుకొని మహాక్రోధముతో అతని తల నరుక పూనెను. ఇంతలో వరుణదేవుడు పాశముతో ఆ దానవేంద్రుని భుజద్వయమును బంధిం చెను. అట్లు దైత్యుని పౌరుషము విఫలము కాగా వరుణుడు దయమాలి గదతో వానిని కొట్టగా వాడాదెబ్బతో చెవుల నుండి రక్తము క్రక్కుచు మెరపులతో నిండిన మేఘమువలె ప్రకాశించెను. కుజంభు డట్లగుట చూచి మహిషాసురుడు వాడి కోరలతో భయంకరమగు నోరు తెరచుకొని నిరృతిని వరుణుని మ్రింగుటకు పూనెను.
కుజంభుని దురాలోచననుగమనించి నిరృతి వరుణులు మహావేగియగు మహిషుని రథ మార్గము విడిచి భయ విహ్వలులయి భయంకర ముఖములతో వేగముగా పారిపోయిరి. వారిలో నిరృతి శీఘ్రమే ఇంద్రుని శరణుచొచ్చెను. మహిషుడు కోపముతో వరుణుని మీదకు పరుగెత్తెను. వరుణుడట్లు యమునినోట పడనుండుట చూచి చంద్రుడు సోమాస్త్రము ప్రయోగించి మంచు రాశితో సంకటము కలిగించెను. వాయవ్యాస్త్రముకూడ ప్రయోగించెను. అదిసాటిలేనిది. ఆ మంచుతోను గాలిచే కలిగిన సంతోషము (ఎండుట) తోను దానవులు వ్యథనొందిరి. హిమ శీతముచే వారి పౌరుషములు వ్యర్థమయ్యెను. వారు కదలలేకపోయిరి. అస్త్రశస్త్రముల తీసికొన లేకుండిరి. ఆ మహాహిమపాతముతోను చంద్రుడు ప్రయోగించిన అస్త్రములతోను దానవ శరీరములు కాలిపోవుచుండెను. చలితో మొగము వణకుచుండగా మహిషుడు నిశ్చేష్టుడయి చేతులతో చంకలు ముడిచి పట్టుకొని తలవంచుకొని కూర్చుండెను. ఇట్లు దానవులందరు చంద్రునిచే బాధలపాలయి తేజో రహితులయి ప్రతీకారమేమియు చేయలేక యుద్ధ సంకల్పము దూరముగా వదలి ఉండిపోయిరి. అంతట కాలనేమి కోపోద్దీపితుడయి దానవులతో నిట్లనెను. సర్వ శస్త్రాస్త్ర పారంగతులును శృంగారులునగు దానవ శూరులారా! మీలో ఒక్కొక్కరే తమ భుజములతో జగత్తంతయు ఊపివేయగలవారుగదా! చరాచర జగత్తంతయు మ్రింగగలవారు గదా! దేవతలందరు కలిసియు తమ విక్రమములన్నియు కలిపినను వారు మీలో ఒక్కొక్కని శక్తిలో పదారవవంతును పూరించుటకు కూడ చాలరే! ఇట్టి మీరు పరులకు ఓడి భయార్తు లయి ఊరకుందురేల? ఇది ఏ శూరులకును తగదు; దైత్యజాతీయులకు మొదలే తగదు. లోక తారకుడగు తారకుడు మన ప్రభువు; మనము ఇట్లు యుద్ధమును చాలించి వెనుకకు వచ్చినచో అతడు కోపించి మనలను చంపును. అతడిట్లనుచున్నను దైత్యులు చలిచే స్మృతులు లేక వాక్య ప్రకటన శక్తిలేక మూగవారయిరి. యుద్ధము చూడవలెనన్నంతనే వారికి కాళ్ళు వణకుచుండెను.
ఆ దైత్యదానవులు స్మృతిరహిత చేతస్కులగుటయు, చలితో శక్తి రహితులు అగుటయు చూచి మహాసురుడా కాలనేమి ఆసమయమునకు ఉచితమగు కార్య మాలోచించు కొనెను. దానవ మాయ నాశ్రయించి తన తేజస్సును విస్తరించి దానితో గగనమును దిక్కులను విదిక్కులను నింపెను. తన శరీరము నందుండియే పదివేల భాస్కరులను నిర్మించెను. మాయతో దిక్కులన్నియు భయంకరాగ్నులతో నింపెను. దానితో త్రైలోక్యమును జ్వాలాకులమయి చంద్రుని శక్తి శమించెను. మంచు చల్లదనముతో ఏర్పడిన దుర్దినము తొలగెను. ఇట్లు కాలనేమి మాయతో దానవసేనకు తెలివి వచ్చుట చూచి లోకైక లోచనుడగు రవి కోపించి అరుణునితో రథమును శీఘ్రమే కాల నేమియున్న చోటికి పోనిమ్ము. అచ్చట గొప్పయుద్ధమును శూర సంక్షయమును జరుగ వలయును. మనకు బలమువచ్చినది. దానితో వీడు చంద్రుని చేతిలో ఓడినట్లే అనెను. ఇట్లు రవి పలుకగా అరుణుడు తెల్లని చామరముల కుచ్చులతో అలంకృతములయిన అశ్వములను యత్నముతో గ్రహించి రథమును అటకు పోనిచ్చెను. అంతట లోకదీపుడగు సూర్య భగవానుడు ధనువుతీసి ఎక్కుపెట్టెను. ఆ మహాభాగుడు భయంకర సర్పములవంటి రెండు శరములు తీసి ఒకటి శంబరాస్త్రముతో ఇంకొకటి ఇంద్రజాలముతో అనుసంధించి వదలెను. దానితో క్షణములో రూపవిపర్యయ మేర్పడి దానవులు దేవతలుగా దేవతలు దానవులుగా కనబడసాగిరి. కాలనేమి ప్రళయ యమునివలె రోషించి పరులు అని తలచి తన వారినే చంపుచుండెను. తీక్ష ఖడ్గముతో భయఙ్కర శిలావర్షముతో ఘోరమగు గదతో గండ్రగొడ్డలితో అనేకుల శిరస్సులను రథికులను రథములులాగు ఉష్ట్రములను ఖండించెను. రథములను నలుగగొట్టెను. రథములను గుర్రములను రథాశ్వముల వేగముతోనో పిడికిటి పోటులతోనో నలుగ పొడిచెను.
దేవతల చేతిలో మరణించు దానవులు మృతి సమయములో స్వరూపమునే ధరించుటతో నేమియను దానవుడు కాలనేమి చేతిలో కూడ తమవారే మరణించుట గమనించెను. కాలనేమి మాత్రము రోషావేశములో ఇది గురుతించలేదు. అంతట నేమి కాలనేమితో ‘దేవశత్రూ! కాలనేమీ! (దేవతా రూపములో కనబడు) నేను నేమినయ్యా! నాతో మాటలాడుము. మాయా మోహితుడ వయిన నీచేతిలో మహా విక్రముడవగు నీచేతిలో దేవ దుర్జయులగు పది లక్షలమంది దానవులు మరణించిరి. నీవు శీఘ్రమే బ్రహ్మాస్త్రము వదులుము. అది సర్వాస్త్రములను ప్రతిహతమొనర్చును.’ అని నేమి ప్రేరించగా సురకంటకుడు ఆకాలనేమి త్వరపడుచు, శరమున బ్రహ్మాస్త్రమును సంధించి ప్రయోగించెను. అంతట ఆ అస్త్రపు తేజముతో సచరాచరమగు త్రైలోక్యమును వ్యాప్త మయ్యెను. దేవసైన్య మంతయు రోషయుక్తమయ్యెను. శంబరాస్త్ర ప్రభావము శాంతించెను. దానితో సూర్యుడును శాంత తేజస్కుడయ్యెను. అంతట రవి మహేంద్రజాలము వహించి తన శరీరమును కోట్లకొలదిగా రూపొందించెను. మిగుల వెలుగొందు కిరణరాశితో జగత్రయ మాక్రాంత మయ్యెను. దానవసేన ఉడికిపోయి మజ్జారాశి రక్తరాసులు కారసాగెను. అంతట రవియు అన్నివైపుల కడు దట్టమగు అగ్నిని వర్షించి దానవేంద్రుల నేత్రములు అంధమొనరించెను. గజముల మేధస్సు కారెను. రథములు క్రిందపడెను. గుర్రములు ఉడికిపోయెను. రథికులు పిచ్చెత్తిరి. దప్పికవేసి నీరు నీరనుచు ఇటునటు పరువెత్తిరి. కొండలయందలి యడవులకును చెట్లు దట్టమగు నీడలకును తహతహలాడిరి. వారు అట్లు చెట్ల నడుమను క్రిందను లభించు నీడ కోరుచుండగనే ఘోరమగు దావాగ్ని వ్యాపించి చెట్లను కాల్చసాగెను. నీరు కావలసిన వారికి తమ ఎట్టఎదుటనే అలల మాలలతో నిండిన నీరు కనబడు చుండినను శ్రమవలన దానివరకు పోలేకుండిరి. అచట చేరలేక హత చేతస్కులై భూమిపై చాచుకొని పడిపోవుచుండిరి. దానవశ్రేష్ఠులు రణరంగము నందచ్చటచ్చట మాత్రమే కనబడుచుండిరి. ఇట్లు రథములును గజములును అశ్వములును పడిపోయెను. పదాతులలో మిగిలినవారును పరుగెత్తుచు గొంతుక నుండి రక్తము క్రక్కుచుండిరి. దానవులు వేలకొలదిగ మృతులయి కనబడుచుండిరి.
ఇట్లు దానవేంద్రులకు మహాక్షయము కలుగుచుండ కాలనేమి రోషావిష్ణుడై తీవ్ర కోపవశమున గ్రుడ్లు త్రిప్పుచు అనేకములగు మెరపులు మెరయుచు గంభీరములగు చరపులవంటి చటచట ధ్వనులతో ఉరుముచు ఉండు ప్రళయ మేఘమువంటి మేఘముగా అయ్యెను. లోక హృదయకంటకు డతడు ఇట్లయి గగన వైశాల్యమంతయు కప్పి రవి మాయను నశింపజేసెను. దానవులకు బలప్రదమగు చల్లని నీటిని వర్షించెను. దానిచే దానవులు తమపై వర్షము కురియగా వాడిన వరి మొలకలవలె క్రమముగా ఓదార్పు పొంది తెప్పరిల్లిరి. తరువాత ఆ మేఘరూపిగానే కాలనేమి దేవసేనలపై దుర్జయమును ఉగ్రమునగు శస్త్ర వర్షము కురిసెను. మహా తేజో వంతములగు ఆ దైత్యాస్త్రములు వానతో బాధనొందుచు వేరుగతి కానకార చలికి బాధపడు గోవులవలె అయి ఒకరి వీపులపై మరియొకరి చేతులు ఆనించుకొనిరి. ఒకరిలో ఇంకొకరు దాచిపెట్టుకొనిరి. ఏనుగుల యందును గుర్రములయందును పాపము వాటి బాధ వాటియందే ఉండిపోయెను. అవి కొన్నికొన్ని ఆయా ప్రాకారములయందును పర్వతావరణము లందును అచ్చటచ్చట దాగెను. దేవసైనికులు కొందరు చేతులతో తమతమ మొగములు కప్పుకొని శరీరములు ముడుచుకొని పోయిరి. మరికొందరు శత్రువులు చూచుచు సంభ్రాంతులై ఏమియు తోచక ఇటునటు పరుగెత్తుచుండిరి. ఇట్లుజరుగుచున్న యుద్ధమున దేవతలకే అక్షయమగుచుండెను. శస్త్రములతో తెగిన-విరిగిన అవయవ సంధులు పగిలిన పగులని తలలు తెగిన తొడలు మోకాళ్ళు జారిపడిన ధ్వజ సంఘములు పిండి ఐన ధ్వజములు భూమిపై పడి కనబడు చుండెను. వెడలిపోవుచున్న గుర్రములతో కదలక కొండలవలెనున్న గజములతో స్రవించిన నెత్తుటి మడుగులతో భూమి వికృతమయ్యెను. ఇట్లు బలశాలియగు కాలనేమి దైత్యుడు ముహూర్త మాత్రములో పదివేల గంధర్వులను ఐదులక్షల యక్షులను అరువది వేలమంది (దేవపక్ష మందలి) రక్షస్సులను మూడు లక్షల మంది కింకరులను ఏడు లక్షలమంది (దేవపక్షీయ) రాక్షసముఖ్యులను లెక్కపెట్టరానంత మంది ఇతరులగు దేవ జాతీయులను కోట్లకొలదిగ క్రుద్ధుడయి చంపి చిత్రము లగు అస్త్రముల ప్రయోగించుచు రణ దుర్జయుడయ్యెను. ఇట్లు మహాం మరుల మహాసంఘమున భయానకమగు ప్రతిభయస్థితి ఏర్పడెను. ఇది చూచి వీరులగు అశ్వినులు సంక్రుద్ధులయి ఆశ్చర్యము కలిగించు కవచముతో ఉజ్జ్వలులయి ప్రళయ కాలాగ్ని సమానుడగు ఆ దైత్యుని కాలనేమిని యుద్ధము నందు సమీపించి భయంకరాకారుడగు ఆ ఘోరుని ఒక్కొక్కరు అరువదేసి బాణములతో కొట్టిరి. వారి బాణపు దెబ్బలతో కన్నులు వానికి కొంచెము నొప్పి కలిగెను. ఎనిమిది అరలు గలదియు రణములో అంతకుని పోలినదియు అగు చక్రమును తీసికొని దానితో వాడు అశ్వినులు రథకూబరమును నరకెను. తరువాత వాడు ధనువు తీసికొని సర్ప సమానాకార శక్తులు కల శరముల ప్రయోగించి ఆకాశమును కప్పివేసి వారి తలలను నొప్పించెను. వారు మిగుల వాడి బాణములతో దైత్యుని బాణములను ఖండించిరి. వారి ఈకృత్యము చూచి కాలనేమి కోపావిష్టుడై అయోమయమును కాలదండమువలె భయంకరమును (స్వయం) భీమమునునగు ముద్గరమును చేకొని అది వేగమున త్రిప్పి అశ్వినులు రథముపైకి విసరెను. అది తమవైపునకు వచ్చుచు ఆకాశములో కనబడగానే శీఘ్రముగా అశ్వినులు తమ రథమును ధనువులను విడిచి దుమికిరి. బంగారు (సొమ్ముల)తో అలంకృతమగు కొండను పోలు ఆముద్గరము వారి రథమును పిండిచేసి భూమిని కూడ చీల్చెను. ఆశ్చర్యకర యోధులా అశ్వినులు అదిచూచి దానవేంద్రుని వారించుటకై వజ్రాస్త్రము ప్రయోగించి అతి దారుణ వజ్రవృష్టి ప్రవర్తిల్లజేసిరి. ఘోర వజ్ర ప్రహారములతో ఆ దైత్యేంద్రుడు మరుగుపడుటయే కాక సర్వసైన్యము కాంచుచుండ క్షణములో వాని రథము ధ్వజము ఛత్రము కాంచనమయ కవచము మిక్కిలిగ తిలలంత ముక్కలు చేయబడెను. అశ్వినులు ఆ దుష్కరకృత్యము చూచి బలశాలి భీమ విక్రముడా దైత్యుడు నారాయణాస్త్ర ప్రయోగముచే తత్తేజముచే వజ్రాస్త్ర మణచి వేసెను. మరి వెంటనే అశ్వినులను జీవగ్రాహముగా పట్టుటకును యత్న మారంభించెను. అశ్వినులు భయపడి వణకుచు తమ శస్త్రములువిడిచి భీతితో ఇంద్ర రథము కడకు పరువెత్తిరి. మహాబలుడా కాలనేమి దైత్యుడు వారిని వెంటనంటి తనవెంట దైత్యానీకము వచ్చుచుండ ఇంద్రసేనను సమీపించెను.
దైత్యుని అ క్రోధముచూచి సర్వభూతములును అది సర్వలోక క్షయావహమయి దాన ఇంద్రుని పరాజయమగునని తలచెను. ప్రధాన పర్వతములే చలించెను. అకసమునుండి ఉల్కలు పడెను. దిక్కులందు మేఘములు ఉరిమెను. సముద్రములు మిగులపొంగెను. ఈ భూతస్థితి వికారమును చూచి భగవానుడు గరుడధ్వజుడు అంత వరకు తానవలంబించియున్న యోగనిద్రను విడిచి నాగ పర్యంకము నుండి మేలుకాంచి లేచెను. శ్రమనందినపుడు లక్ష్మీ కరద్వంద్వముచే లాలించబడు పాదపద్మములు శరన్నీలోత్పల సుందర దేహకాంతి కౌస్తుభోద్భాసి వక్షము భాస్వర మనోహర కేయూరములు కల మహానుభావు డాతడు అసురులు కలిగించు కల్లోల మాలోచించి గరుడుని పిలిచెను. నానాకారాస్త్రములు వర్షించగల గరుడుడు తన పిలుపందుకొని రాగా ఆతని నారోహించి నారాయణుడు దివ్య నానాస్త్ర తీవ్ర జ్వాలాలంకృతుడై యుద్ధరంగమునకేగెను. అచట నతనికి కారు మొయిళ్ళగములను పోలి పౌరుషోత్కటులగు దానవేంద్రులు కలిగించు ఉపద్రవములతో ఇబ్బందిపడుచు ఇంద్రుడు కనబడెను. వంశానుగతముగా వచ్చి బాధించుచున్న ఘోరదురదృష్టములనుండి పురుషుని రక్షించుటకు అతడు ఉత్తమ దేశకాలము లందాచరించిన సుకృతఫలము కాపాడవచ్చినట్లు నారాయణుడింద్రునిపుడు కాపాడవచ్చెను. అంతలో దైత్యులకు వేడి వెలుగులతో ఉదయాద్రిపై ప్రకాశించు రవిని పోలిన జ్యోతిర్మండల మాకాశమున కానబడెను. ఆ తేజఃప్రభావమును దానవు లెరుగగోరు చున్నంతలో వారికి ప్రళయాగ్ని భీకరుడగు గురుడుడును కాంతులతో ఒప్పు వేలకొలది మెరపులగముల సమీపమందలి మేఘమువలె అతని నారోహించి యున్న అచ్యుతుడును కనబడిరి. అతనిని చూచి దైత్యేంద్రు డాకాలనేమి హర్షపూర్ణ మనస్కుడై ఇట్లనుకొనెను.
“దేవతలకు సర్వస్వమీ నారాయణుడే. ఇతడోడిన దేవతలోడుదురు. కేశవుడని హరియని ప్రసిద్దుడగు ఈతడే దైత్యసేనలకు యముడు. లోకేశుడగు ఈతని నాశ్రయించియే దేవతలు యజ్ఞభాగ భోక్తలయియున్నారు.” ఇట్లనుచుండగనే దానవులందరు హరి నన్నివైపులు చుట్టిరి. కాలనేమి మొదలగు మహారథులగు పదిమంది దైత్యులు గరుత్మంతుని నారాయణుని కూడ వివిధాస్త్రములతో కొట్టిరి. వారిలో కాలనేమి అరువదిటితో, నిమి నూరింటితో, మథనుడు ఎనుబదింటితో, జంభకుడు డెబ్బదింటితో, శుంభుడు పదింటితో, మిగిలిన దైత్యేశ్వరు లొక్కొక్క రొక్కక్కటితో, బాణములతో విష్ణుని జనార్దనుని ప్రహరించిరి. గురుడుని పడేసి బాణములతో యత్నపూర్వకముగా (బలము కొలది) కొట్టిరి. దానవాంతకుడు అది సహించక ఒక్కొక్క దానవు నారేసి బాణములతో కొట్టెను. మరల కాలనేమి రోషరక్త విలోచనుడయి చెవినంట ధనువులాగి విడిచి మూడు బాణములతో నారాయణుని రొమ్మున కొట్టెను. బంగారుతో కూడిన ఆ బాణము లాతని హృదయమున స్పష్ట ద్యుతియగు కౌస్తుభరత్నపు దీప్త కిరణములవలె కానవచ్చెను. ఆ దెబ్బలతో కొంచెము శ్రమనందియు విష్ణువు ముద్గరము తీసికొనెను.
అతడది వేగముగా త్రిప్పి దానవేంద్రునిపై విసరెను. క్రూరుడా దానవేంద్రుడు హస్త లాఘవముచూపుచు అది ఇంకను తను చేరక ఆకాశమందుండగనే నూవు గింజలంత ముక్కలు చేసెను. అంతట విష్ణువు ప్రకుపితుడై భయంకరమగు ప్రాసాయుధమును తీసికొనెను. ఆ ఆయుధముతో నారాయణుడు దైత్యుని హృదయమున కొట్టగా కాలనేమి క్షణములో తెలివి తెచ్చుకొని తీక్షమగు మొన కలిగి బంగరు గంట చప్పుడులతో పెద్దగ నవ్వుచున్నదో యనునట్లున్న శక్తిని తీసికొని దానితో విష్ణుని వామభుజము చీల్చెను. శక్తితో చీల్చి రక్తము కారుచున్న విష్ణువు భుజము పద్మరాగ మణిమయమగు భుజకీర్తితో వలె ప్రకాశించెను. అంత విష్ణువు ప్రకుపితుడయి విపుల ధనువును వాడియై మర్మభేదములగు పదునేడు బాణములను తీసికొని తొమ్మిదిటితో దైత్యుని హృదయమును, నాలుగింటితో వాని సారథిని, ఒకదానితో ధ్వజమును, రెంటితో వాని ధనువును ఒకదానితో ఎడమ భుజమును కొట్టెను. గాఢముగా హృదయమున తగిలిన హరి బాణములు దెబ్బలతో కారుచున్న రక్తముతో ఎర్రనయిన మహా బాధాకుల మానసుడై కాలనేమి గాలితో కదల్చబడిన మోదుగు చెట్టువలె కంపించెను. అది చూచి ఇదే యదనని కేశవుడు గద తీసికొని వేగమున కాలనేమి రథముపైకి విసరెను. ఉగ్రము విపులమునగు ఆ గద కాలనేమి తలపై పడగా వాని శిరము చూర్ణమై మకుటము పిండియై వేగముగా స్రవించు రక్త ప్రవాహముతో వాడు ధాతు ద్రవము స్రవించు పర్వతమట్లు కనబడెను. వాడు అట్లు విరిగిన తనరథముపై తెలివితప్పి కొన ఊపిరితోపడిపోయెను. రథాసనముపై పడిన ఆ దైత్యుని చూచి అచ్యుతుడు చక్రాయుధుడు ప్రభుడునగు హరి చిరునవ్వుతో ‘అసురా! విడిచితి; పొమ్ము; ఇప్పటికి నిర్భయుడవయి బ్రతుకుము; తరువాత కొలది కాలములో నేనే నీకు యముడనగుదును’ అనెను. ఈ మాటలు విని కాలనేమి సారథి అతని రథమును అటనుండి తొలగించి వానిని దూరముగా కొనిపోయెను.