కల్యాణ భీమ ద్వాదశీ వ్రతము

మనువు మత్స్యనారాయణు నిట్లడిగెను, దేవేశ్వరా! దేవా! మానవులకు స్వల్పమగు తపస్సు తోనే అనంతమగు ఆరోగ్యము ఐశ్వర్యము మోక్షము కలుగు నుపాయమును తెలుపుము. నీకు తెలియనిదేదియు లేదు. అనగా నారాయణుడిట్లతనికి తెలిపెను. పూర్వము రథంతర కల్పమున మందర పర్వతమున నున్న పినాకధారియగు మహాదేవుని భగవానుడు సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈ విషయమును అడుగగా అతడతనికి మనఃప్రీతికారకమగు ఈ విషయము ఇట్లు చెప్పెను: బ్రహ్మా! ఇప్పుడు జరుగుచున్న ఈ రథంతర కల్పమునుండి ఇరువది మూడవ కల్పమున వారాహ కల్పము వచ్చును. దానిలో ఏడవదగు వైవస్వతమన్వంతరమున ఇరువది ఏడవ ద్వాపరయుగపు తుదలో మిగుల మహా తేజస్కుడు వాసుదేవుడు అగు (సర్వమునందు తానుండుచు సర్వమునందు తానుండు) జనార్దనుడు విష్ణువు లోక (భూ) భారమును దించుటకు మూడుగానై ద్వైపాయన ముని-బలరాముడు-కృష్ణుడు అని ముగ్గురుగా అగును. కృష్ణునకే కేశవుడు కంసారి కేశి మథనుడు అనిప్రసిద్ధి. ఆ మహానుభావుడు క్లేశముల నన్నిటిని నశింపజేయువాడు.

దివ్యములగు అనుభావములుకల ఈనాటి (మత్స్యనారాయణుడు మనువునకు ఈ విషయ మును చెప్పిన కాలమునందలి) కుశస్థలీపురిని జగత్పతియగు నాయాజ్ఞచే (దేవశిల్పి) త్వష్ట శార్ణ ధనుర్ధారియగు శ్రీకృష్ణభగవానుని నివాసమునకై ద్వారావతీ పురియను పేర నిర్మించును. కైటభాంతకుడగు శ్రీకృష్ణుడు ఒకానొక సమయమున ఆద్వారకయందు సభయందు ఆసీనుడగును. అమిత ప్రకాశుడగు ఆయనను తన పత్నులును వృష్టిజాతీయులగు క్షత్రియులును మిగుల ప్రియులగు మిత్రులును, కురు వంశీయులగు క్షత్రియులును, దేవతలును, గంధర్వులును, దేవ గంధర్వులును పరివేష్టించి యుందురు. ఆసభలో పురాణములును, ధర్మమున కనుకూలము లగు కథా ప్రవృత్తులును సాగుచుండ మాటలనడుమ ప్రతాపవంతుడగు శ్రీకృష్ణుని భీమసేనుడు ఇపుడు నన్ను (మత్స్యనారాయణుని) నీవు (మనువు) అడిగిన ఈరహస్యమును భేదించు ప్రశ్నమును ప్రశ్నించును. తరువాత ఆ భీమసేనుడే ఈ ధర్మము (వ్రతము)ను ఆచరించువాడును ఆ ధర్మమును లోకమున ప్రవర్తింపజేయువాడును అగును.

ఆ భీమసేనుడు పాండు రాజకుమారుడు-మహాబలుడు; ఆ ధర్మాత్మునకు నేను వృకము అను పేరుగల జఠరాగ్నినిఇత్తును. అందుచే అతనికి వృకోదరుడను పేరుప్రసిద్ధమగును. అతడు బుద్ధిశాలియు దానశీలుడును పదివేల ఏనుగుల బలమంత బలముగల గొప్పవాడును వార్ధకము మొదలగు లోపములు లేనివాడును సాక్షాత్ రూపొందిన మన్మథుని వంటివాడును; ఐనను అతడు ధార్మికుడై ఉండియు తీవ్రమగు జఠరాగ్ని దీప్తి కలవాడగుటచే ఉపవాసము చేయుటకు శక్తిలేనివాడు.

అతనికి విశ్వాత్ముడును లోకగురుడును అగు వాసుదేవుడు (శ్రీకృష్ణుడు) అన్ని వ్రతము లలో గొప్పదియగు ఈవ్రతము తెలుపును. ఇది సమస్త యజ్ఞముల ఫలము నిచ్చునది - సర్వపాప రాసులు నశింపజేయునది -అశేష దుఃఖములు శమింపజేయునది-సకల దేవతల పూజలనందు కొనునది. పవిత్రములగువానిలో పవిత్రమును శుభములగువానిలో శుభమగునదియు భవిష్యము లగు వానిలో భవిష్యము (ఇంకముందెంత కాలము వరకైన లోకమున ప్రచారములో నుండునది) పురాతనములగు వానిలో పురాతనమయినది (ఎంతో కాలమునుండి లోకమున ప్రచారము నందున్నది.

వాసుదేవుడు భీమసేనునకు ఇట్లు చెప్పెను: నీవు అన్ని అష్టమీ ద్వాదశీ చతుర్దశీ తిథుల యందును ఇతరములగు శుభ నక్షత్ర తిథులయందును ఉపవసించి వ్రతము అనుష్ఠించుటకు శక్తి లేనివాడవయినచో ఈ పాప ప్రణాశకమగు మాఘ శుక్ల దశమి ఏకాదశీ ద్వాదశీ తిథుల యందయిన ఈ చెప్పబోవు విధానమున వ్రతము చేసినచో విష్ణుస్థానము నందగలవు.

ఇట్లు గోవిందుని (లక్ష్మిని - గరుడుని) శివుని వినాయకుని నానావిధ గంధమాల్య ధూపదీప భక్ష్యములతో పూజించవలయును. ఆవుపాలతో వండిన పులగమును నేతితో మౌనముగా భుజించవలెను. నూరడుగులు నడువవలెను. సాయంకాలము కాగానే మర్రి ఊడను కాని చండ్రపుల్లను కాని ఉపయోగించి దంతధావనము చేసి తూర్పుగానో ఉత్తరముగానో తిరిగి కూర్చుండి అచమించవలెను. పిమ్మట సూర్యాస్తమయము కాగానే సాయం సంధ్యను ఉపాసించ వలయును. నమో నారాయణాయ-అహంత్వాం శరణంగతః- (నేను నిన్ను శరణు చొచ్చు చున్నాను) అని ప్రార్థించి భూమిపై నిద్రించవలెను.

(ఏకాదశీ దినకృత్యము) ఏకాదశినాడు నిరాహారుడై యుండి లెస్సగా కేశవుని అభ్యర్చిం చవలెను. (పిమ్మట విష్ణుని ఇట్లు ప్రార్థించవలెను.) “నేను ఈ రాత్రియంతయు గడపి (రేపు ఉదయము) స్నానమాడుదును. పాలతోగాని నేతితో గాని (నిన్ను ఉద్దేశించి) హోమము చేయు దును. బ్రాహ్మణులతో కూడ క్షీరముతో భోజనము చేయుదును. ఇట్లు నియత మనస్కుడనై నీ వ్రతము చేయుదును. ఆ వ్రతమును నిర్విఘ్నము చేయుము” అని ఇట్లు ప్రార్థించి కడపట ఇతిహాస కథను విని భూమిపై పరుండవలెను.

(ద్వాదశీ దిన కృత్యము) ద్వాదశినాడు ఉదయమున నదికిపోయి మృత్తికతో స్నానముచేసి వేదబాహ్యుల నెవరిని చూడక తాకక వారితో మాటలాడక సంధ్యావందనమును పితృ తర్పణమును చేయవలెను. నారాయణుని సూర్యుని ఈశ్వరుని నమస్కరించవలెను. ఇంటిముందు యథాశక్తిగ మంటపమును (పందిరిని) ఎనిమిది మూరలుకాని పది మూరలుకాని భుజముండు నట్లు చతుర స్రముగా నిర్మించి దాని నడుమ నాలుగు మూరల కొలతతో చతురస్రాకారపు చక్కని వేదిక (అరుగు) నిర్మించవలెను. అంతే కొలతగల తోరణమును కూడ దానిపై చుట్టును కట్టవలయును. ఆ వేదిక నడుమ పైనుండి వ్రేలాడునట్లు జలపూర్ణమై మినుప గింజంత రంధ్రముకల కడవను వ్రేలాడదీయవలయును. దానినుండి పడు ఉదకధారను రాత్రియంతయు యజమానుడు కృష్ణాజినముపై కూర్చుండి తన తలపై పడునట్లు చేసికొనవలెను. ఇట్లు అనేక జలధారలు పడుటచే విస్తారమగు ఫలము కలుగునని వేదవేత్తలు చెప్పుదురు. అట్లే వ్రతదినమున విష్ణుని శిరముపై ఈ కలశము నుండి గోక్షీరధారపడునట్లు చేయవలెను.

పిడిమూర కొలతతో చతురస్రపు కుండమును దానిచుట్టును మూడు మేఖలలను (అంచులను) చేయవలెను. దానిముందు యోనిచక్రమును ఏర్పరచవలయును. బ్రాహ్మణులు విష్ణు దైవత్యములగు మంత్రములతో ఏకాగ్ని విధానమున విష్ణుని ఉద్దేశించి అజ్యాహుతులను వేయవలయును. హోమమునకు యవలు నేయి తిలలు ఆవుపాలతో నేతితో వండిన చరువును ఉపయోగించవలయును. ఆహుతులు మినుపగింజంత పరిమాణముతో ఉండవలయును. హోమ స్థానమునందు పదమూడు జలకలశములను నిలుపవలయును. వాటిపై నానా విధములగు భక్ష్యముల నుంచవలయును. పంచరత్నములతో మేడి చిగురాకులతో తెల్లని క్రొత్త వస్త్రములతో వాటినలంకరించవలయును. నలుగురు ఋగ్వేదీయులు ఉత్తరముఖులై కూర్చుండి హోమము చేయవలయును. నలుగురు యజుర్వేదీయులు రుద్రమంత్ర జపము చేయవలయును. నలుగురు సామవేదులు విష్ణువే వతాక సామమంత్రములు పఠించుచుండవలయును. వీరందరు శుభ లక్షణములు శుభ వస్త్రధారణము కలిగి శుభద్రవ్యములు దగ్గరనుంచుకొని యుండవలయును.

ఇట్లు పూజా-జప-హోమ-ప్రక్రియ ముగిసిన తరువాత వస్త్ర-మాల్య-గంధానులేప నములతోను స్వర్ణాంగుళీయ-కటక-హేమభూషణములతోను మంచములతో పడకలతోను శక్తికి లోపము రానీయక ఆపండ్రెండుమంది విప్రులను పూజించవలెను. ఆచార్యునకు మాత్రము ఋత్విక్కులలో ఒక్కొక్కరికి ఇచ్చిన దానికి రెట్టింపు దక్షిణాదికము ఈయవలెను.

తరువాత ఆరాత్రి గీత వాద్యవినోదములతో గడుపవలెను. తెల్లవారిన తరువాత (త్రయోదశి నాడు ఉదయమున) ఈ పదముగ్గురకును (గాని మరి పదముగ్గురు బ్రాహ్మణులకు గాని) పదు మూడు పాడియావులను దానమీయవలెను. అవి బంగారు కొమ్ములు వెండి గిట్టలు పాలు పిడుకుటకు కంచుపాత్రలు నూతనవస్త్రపు కప్పడములు కలవై పొడువక తప్పిపోక మంచి స్వభావముకలవై యుండవలెను. వాటిని చందనముతో అభిషేకించి దానము ఈయవలెను. పిమ్మట వారిని భక్ష్యభోజ్య సమన్వితముగా భుజింపజేసి తానును ఉప్పు పులుపు కారములేని ఆహారము భుజించి వారిని వీడ్కొని తన భార్యాపుత్రులతో కూడ ఎనిమిది అడుగులు కూడ వెళ్లి వారిని సాగనంపవలయును. “క్లేశములు నశింపజేయువాడును దేవేశుడు నగు కేశవుడు నేను జేసిన ఈవ్రతముచే ప్రీతినొందుగాక! శివుని హృదయ (తత్త్వ)ము విష్ణువు - విష్ణుని హృదయ (తత్త్వ)ము శివుడు; ఇట్లు వారిరువురు నడుమ నేను అభేదమును భావనచేయు చున్నాను. కావున నాకు శుభమగు ఆయువును శుభములును కలుగుగాక!” అని పలుకుచు ఆ కుంభములను గోవులను శయనీయములను వస్త్రములను ఆయాబ్రాహ్మణుల ఇండ్లకు పంపవలయును. శక్తిలేని యజమానుడు అందరకును (బ్రాహ్మణులకు) కలిసి ఒకే శయ్యనైన సామగ్రులతో అలంకరించిన దానిని ఈయవలెను.

ఆ దినము అంతయు ఇతిహాస పురాణ కథాశ్రవణములతో గడుపవలయును. ఇట్లు చేసినచో విపులమగు సంపత్ భాగ్యములు కలుగును.

కావున భీమసేనా! నీవు మత్సరములేక (ఇతరులతో పోటీచేయు తలంపులేక) సత్త్వగుణము నవలంబించి లెస్సగా ఈ వ్రతము నాచరింపుము. ఈ వ్రత మతి రహస్యమయినను నీయందలి స్నేహముచే నేనునీకిదితెలిపితిని. నీవు దీనిని అనుష్ఠించుటచేత సర్వపాప ప్రణాశనమగు ఈ వ్రతమునకు భీమ ద్వాదశీ వ్రతమను పేరు ప్రసిద్ధ మగును. పూర్వ కల్పములందు కల్యాణినీ వ్రతమని ప్రసిద్ధమయి ఇష్టవరప్రదమగు దీనికి నీవు ఈ వారాహ కల్పమున ఆదికర్తవు (మొదట చేసినవాడవు) కావలయును. ఏలయన ఈ వ్రతకల్పము అంతయు కీర్తించినను స్మరించినను అతడుకూడ దేవేంద్రుడగును. కుతూహలముతో (దీనిని చేసినచో ఏఫలము కలుగునో చూతమని) ఒకానొక ఆభీర (ఆహీరులను గోపాలకుల) కన్య జన్మాంతరమునందు ఈ వ్రతముచేసి దేవ వేశ్యలలో శ్రేష్ఠయగు ఊర్వశియయ్యెను. ఒకానొక వైశ్యకన్య దీని నాచరించి మరియొక జన్మమున పులోముని కూతురై ఇంద్రుని భార్యయగు శచి యయ్యెను. ఆ జన్మమున ఆమెకు పరిచారికగా నున్న యామె ఇపుడు నాభార్య సత్యభామగా అయినది. ఇపుడు మహేంద్రుడుగా వసువులుగా గణదేవతలుగా దేవకోటులుగా రాక్షసశ్రేష్ఠులుగా నున్నవారు కూడ ఒకప్పుడు ఈ వ్రతము నాచరించినవారే.

నోటియందు పదివేల కోట్లు నాలుకలున్నను దీని మహిమము చెప్పుట సాధ్యము కాదు. ఇది కలికలుష నాశకము. అనంత పుణ్యప్రదము అని ఇట్లు శ్రీకృష్ణుడు భీమసేనునకు చెప్పును.

దీని నాచరించినవారు తమ పితరులను అందరను నరకము నుండి ఉద్ధరించినవా రగుదురు. సకలార్థ ప్రదమగు ఈ ద్వాదశీ వ్రత మహిమమును వినినవాడును చదివి ఇతరులకు పరోపకార బుద్ధితో వినిపించినవాడును బ్రహ్మత్వమును పొందును.

పూర్వకల్పములందు కల్యాణినీ ద్వాదశీ వ్రతమను పేర బ్రహ్మదేవునిచే లోకమున ప్రవర్తిల్ల చేయబడిన ఈ వ్రతము వాసుదేవుని ఉపదేశముచే భీమసేనునిచేత చేయబడి అనంత పుణ్యప్రదమయి భీమ ద్వాదశీ వ్రతమని ప్రసిద్ధమగును.