దుర్గము ఉండవలసిన స్థానము

మత్స్య నారాయణుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను. రాజు తన రాజధానిగా ఏర్ప రచుకొని దుర్గము నిర్మించవలసిన చోటున- తనకు సహాయులు అందుబాటులో నుండ వల యును, అదిగడ్డి కట్టెలు సమృద్ధిగా దొరకుచోటు కావలెను, సామంతులందరు అడకువతో నుండి తన కడకు వచ్చి సేవింప వీలుగా దేవ మధ్యము కావలెను; వైశ్య శూద్ర జనులధికముగా ఉండి ఆవశ్యకమయినచో ఇతరులును ఉండుటకు అనువగునదియై బ్రాహ్మణులు కొలది మంది యుండి కర్మకరులు (ఆయా పనులవారు) అధికముగా నుండుచోటు కావలెను, పంటల విషయమున దేవమాతృకము (మెట్ట) కారాదు; నదీమాతృకము (మాగాణి) కావలెను; రమ్యమై అనురక్తులగు జనులతోకూడి యుండవలెను, అచటిజనులకు పన్నుల పీడ అధికముగా ఉండ రాదు; పుష్పఫలోపేతమై శత్రు సేనలకు అగమ్యమై ఆపదలు (శత్రు భయాదికము) వచ్చినపుడు శీఘ్రమే ఆశ్రయించి రక్షించుకొనుటకు అనుకూలమై సుఖ దుఃఖములు సమానముగా కలిగి (ఈ రెంటిలో ఏవియు అధికముగా లేక) సతతము ప్రీతిదాయకమయి సరీసృపములు (సర్పాదులు) వ్యాఘ్రములు తస్కరులు లేక యుండవలెను; ఈ అనుకూల్యములలో లభించినన్ని ఉన్నచోటిని రాజు తన నివాసమునకై ఎన్నికచేసికొనవలెను, (విషయము=ఆశ్రయము)