మత్స్య మహా పురాణము
అగమ్యాగమన ప్రాయశ్చిత్తము
ఇక అగమ్యాగమన ప్రాయశ్చిత్తము తెలిపెద వినుము. స్వజాతీయ స్త్రీయోనియందును శిష్యపత్నీ, పుత్రపత్నీ, కుమారీ యోనులయందును అంత్యజ స్త్రీ యోనియందును రేతస్సు విడిచినచో గురుతల్పగమన ప్రాయశ్చిత్త మాచరించవలయును. మేనత్తను, పిన(పెద)తల్లిని మేనమామ భార్యను కూడినచో చాంద్రాయణ మాచరించవలెను; వివేకి ఎవ్వడును వీరిలో ఎవ్వరినిగాని పెండ్లాడరాదు; జ్ఞాతిస్త్రీలను, మేనమామ కూతులను, పతితలను పెండ్లాడినను, మనుష్యేతర ప్రాణి యోనులందును, ముట్టుత యోనియందును రేతః సేక మాచరించినను కృచ్ఛసాంతపన మాచరించవలయును. పురుషుడు ఆచరించు స్వాభావిక మైథునమును కాని స్త్రీ ఆచరించు పురుషాయుత మైథునమును కాని ఎద్దుల బండియందో పగటివేళనో చూచినచో వస్త్ర సమేతుడై జలములందు మునిగి స్నానమాడవలెను. అజ్ఞానముచే చండాల స్త్రీని, అంత్యజస్త్రీని పొందినను, ఆమెచేతి అన్నము తినినను, ఆమెను పెండ్లాడినను పతితుడగును. తెలిసియే ఇవి చేసినచో తత్సముడగును. పరమపురుషుడగు విప్రునితో కూడి చెడినస్త్రీని (భార్యను) భర్త ఒంటరిగది యందు బంధించి ఉంచి పరదార గమనమున పురుషుడు ఆచరించవలసిన వ్రతములను ఈమెచే ఆచరించజేయవలయును. ఆమె మరల అదే తప్పుచేసి దోషమందినచో చాంద్రాయణ వత్రమాచరించి శుద్ధయగును; ఒకరాత్రి వృషలి అనగా శూద్రస్త్రీని పొందిన ద్విజుడు మూడు సంవత్సరములపాటు ప్రతిదినమును ఏకభుక్తము చేయుచు (గాయత్ర్యాదికము) జపించ వలయును. ఇట్లు నాలుగు వర్ణముల వారును చేయు ఆయా పాపములకు ప్రాయశ్చిత్తములు చెప్పబడినవి.