మత్స్య మహా పురాణము
కోటి హోమగ్రహ యజ్ఞము
ఈచెప్పిన లక్ష హోమగ్రహ యజ్ఞమునకు నూరింతలగునది కోటి హోమగ్రహ యజ్ఞమని స్వయంభూబ్రహ్మ చెప్పెను. ఆహుతులు-దక్షిణలు-కలుగు ఫలము-అన్ని విషయములందును ఇది దానికి నూరింతలుగానుండును. దీనియందును గ్రహములు-తదధిదేవతా ప్రత్యధిదేవతలు-వీరి ఆవాహన విసర్జనము లందు హోమమునందు స్నాన దానములందు వినియోగించవలసిన మంత్రములును జరుప వలసిన ప్రక్రియయు లక్ష హోమమునందువలెనే యుండును. కుండము మండపము-వేదికలు-వీని విషయమున మాత్రము భేదము కలదు; అది తెలిపెదను.
కోటిహోమమునందు కుండము చతురస్రముగా నాలుగు హస్తములు పొడవు వెడలుపు లోతులు కలిగి ఉండవలెను. దానికి అంగములుగా యోనిచక్రములు రెండుండవలెను. కుండమునకు చుట్టును మేఖలలు (వప్రములు-కుండమునకు నలువైపులనుండు అంచు కట్టలవంటి చిరుగోడలు) మూడుండవలెను. వీనిలో (లోపలినుండి) మొదటిది రెండంగుళములు రెండవది మూడంగుళములు మూడవది నాలుగంగుళములు ఎత్తు కలిగియుండవలెను. వెడల్పు వరుసగా రెండు-రెండు-నాలుగు-అంగుళములుండవలెను. యోని లక్షణము: ఏనుగు ముఖమువలె త్రిభుజాకారము కలిగి తాబేటివీపువలె నడుమ ఎత్తుగను రెండు ప్రక్కలందును తక్కువ ఎత్తుతో నుండవలెను. దీని ఎత్తు (నడుమ భాగమున) వితస్తి (జేనెడు-పండ్రెండంగుళములు) ఒక్కొక్క భుజపు కొలత ఆరుకాని ఏడుకాని అంగుళములుండవలెను. రంధ్రములు నుండవలెను. ఇది అన్ని కుండముల విషయమునను కుండమునకు ముందుండవలసిన యోనుల లక్షణము. ప్రతియొక మేఖలమీదను ఆచటనచట రావి ఆకు ఆకృతిని ఏర్పరచవలెను. కోటి హోమగ్రహ యజ్ఞమునందు వేది నాలుగు వితస్తుల (వితస్తి=12 భారతీయాంగుళములు) కొలతకల భుజములతో చతురస్రముగా ఉండవలెను. వప్రముల (మేఖలల) ఎత్తును వేదికల ఎత్తును లోగడనే చెప్పబడినది. మండపము పదునారు హస్తముల భుజములతో చతురస్రముగా ఉండవలెను.
(ఋత్విక్కుల స్థానములు) ఈ మండపమున ఋగ్వేద పారంగతుని తూర్పు ద్వారమునను యజుర్వేదిని దక్షిణ ద్వారమునను సామవేదిని పశ్చిమ ద్వారమునను అథర్వవేదిని ఉత్తర ద్వారమునను నిలుపవలెను. హోమమునకు ఎనిమిది మంది వేద వేదాంగ వేత్తలగు విప్రులను నియమించవలెను. ఈ పండ్రెండు మందిని వస్త్రమాల్యగంధానులేపనములతో సర్వా భరణములతో పూజించవలెను. (మండపమునందలి ఋత్విక్కులలో ఋగ్వేది తూర్పు ద్వారము నందు ఉత్తరపు మొగమైయుండి రాత్రి సూక్త-రుద్రసూక్త-పవమాన సూక్తములను శుభకరములగు శాంతి సూక్తములను పఠించుచుండును. దక్షిణ ద్వారమునందలి యజుర్వేది శక్తిసూత్ర, రుద్ర సూక్త, సౌమ్యసూక్తములను, శాంతి సూక్తములను పఠించుచుండును. పశ్చిమ ద్వారమునందలి సామవేది సౌపర్ణ వైరాజాగ్నేయ రౌద్ర జ్యేష్ఠ సామములను శాంతి మంత్రములను పఠించు చుండును. ఉత్తర ద్వారమునందు అథర్వ వేది శాంతి-సౌర-సంవరణ-పౌష్టిక-మహారాజ-సూక్తములను పఠించుచుండును. వెనుకటివలెనే ఏడుమందికాని, ఐదుమందికాని హోమము జరుపుదురు. స్నాన, దాన మంత్రములును (పూర్ణాహుతి యందు) మృత కుంభ వసు ధారా విధానములును లక్ష హోమమునందు వలెనే యుండును.
ఈ విధానమున కోటి హోమము నాచరించినవాడు ఇహమున సర్వకామపూర్తినొంది పరమున ముక్తి నొందును. ఈ చెప్పిన మూడు విధములగు గ్రహ యజ్ఞముల విషయమును పఠించినను వినినను సర్వపాప విముక్తుడు శుద్ధాత్ముడునై ఇంద్ర పదమునందును. పదునెనిమిది వేల అశ్వమేధములను చేసినందువలన పొందునంత ఫలములను ఈకోటి హోమము నాచరించుట వలననే పొందును. వేలకొలది బ్రహ్మ హత్యలును అర్బుదముల భ్రూణ (సాంగముగ వేదాధ్యయనము చేసిన విప్రుని) హత్యలును చేసినందున కలిగిన పాపములును ఈకోటి హోమగ్రహ యజ్ఞము నాచరించుటచే నశించునని శివుడే చెప్పెను.