పుష్పవాహనోపాఖ్యానము

పూర్వము రథంతర కల్పమున రవితేజస్కుడగు పుష్పవాహనుడను రాజుండెను. అతడు తపముచే బ్రహ్మను మెప్పించి కామగమనముగల కాంచన కమలమును సంపాదించి తన నగరవాసి జనముతోకూడ సమస్త ద్వీపములందును సురలోకమునందును సంచరించుచుండెను. అతడు కల్పాదియందు ద్వీపములలో ఏడవదియగు పుష్కర ద్వీపమున వసించుచుండెడివాడు. బ్రహ్మ అతనికిచ్చిన పుష్కరము (పద్మము) అదియే. దీనిచే అతనిని దేవదానవాదులు పుష్పవాహనుడనిరి. నాడు ఆ రాజునకు సాటి ఎవరును లేరు. అతని తపోనుభావ మట్టిది. ఆతని పత్ని నారీసహస్రముచే వంద్యమానయు లావణ్యవతియునై భవునకు పార్వతివలె ఆ రాజునకు ప్రియయై యుండెను. ఆమెకు ధర్మాత్ములు ధానుష్కశ్రేష్ఠులు నగు పదివేల మంది తనయులు కలిగిరి. ఇదియంతయు చూచికొని రాజు తరచు వెరగొందుచుండి యొకనాడు తనకడ కభ్యాగతుడై వచ్చిన ప్రచేతను నిట్లడిగెను. “నాకు దేవమానవ పూజ్యమగు ఈయచల సంపద అమరసుందరుల కంటె మిన్నయగు ఈపత్ని అల్పతపముతోనే తుష్టుడై బ్రహ్మ ఇచ్చిన ఈ పుష్పయానము చంద్రుని పరివేష్టించిన తారాగణమువలె నా ముందు కాంతిహీనులై నన్ను పరివేష్టించి యుండు చతురంగ బలసమేతులగు ఈ శతకోటి నృపులు-ఇదంతయును కలుగుటకు గత జన్మమున నేనో నా పత్నియో నాతనయులో అశేష ఫలాప్తి హేతువగు పుణ్యమేమిచేసియుంటిమో దయార్ద్ర చేతస్కుడవై తెలుపుము.”

అనగా ప్రచేతుడు ఇట్లు పలికెను, రాజా! నీ కీ సర్వసంపదలకును హేతువగు నీ పూర్వ జన్మవృత్తమును చూచితిని. గత జన్మమున నీవు అనుదినము పాపకారియగు లుబ్ధకుడవు. నీ శరీరమును పరుషాంగసంధులు దుర్గంధము కలిగి ప్రాణులకు భయతాపకరమయియుండెను. పర్వతచరురాలయినను నీయందు విముఖయైనను నీకు అత్యంత ప్రియతమయగు భార్య తప్ప జననీ సుత సుహృద్బంధుజన మెవ్వరును నీకు లేకుండిరి.

ఇట్లుండ ఒకప్పుడు రౌద్రమగు అనావృష్టిచే ఆహారము లేకపోగా నీవు క్షుత్పీడితుడవై ధాన్య ఫలాదికము కూడ దొరుకని తరి నీకు పంకావృత తటము కలిగి అనేక పద్మయుతమగు కౌలను కనబడెను. నీవు దాని నుండి అనేక పద్మములు కోసి వాని నమ్మి లాభ మార్జించుటకై విదిశయను నగరమేగి అట పగలంతయు తిరిగితివి. వానిని కొనువారెవ్వరును దొరుకక నీవు నీపత్నితో అలసి క్షుత్పీడితుడవై యొక భవనాంగణమున కూర్చుంటివి. అంతరాత్రి కాగా వినవచ్చిన మంగళవాద్య ధ్వని జాడబట్టి అది వినవచ్చు చోటికి భార్యతో ఏగితివి. అచట అనంగవతియను వేశ్య చేయుచుండిన విష్ణుపూజను చూచితివి. ఆమె అపుడు తన విభూతి ద్వాదశీ వ్రత సమాప్తికై మాఘ శుక్ల ద్వాదశినాడు గురునకు లవణాచలమును సర్వోపస్కరయుక్త శయ్యను దానమిచ్చుచుండెను. అదిచూచి మీ రిరువురును భక్తి కలిగి ‘ఈ కమలములతో పనియేమి?’ అని వానితో విష్ణుని అలంకరించి అర్చించితిరి.

అది చూచి తుష్టయై అనంగవతి వారికి మూడు వందల పాడియావులను మూడు పలముల సువర్ణమును నిమ్మని తన వారి నాదేశించెను. కాని మీరు అధిక సత్త్వము నవలంబించి అవి తీసికొనకుంటిరి. అంతట అనంగవతి భక్ష్యభోజ్య లేహ్యచోష్య రూప చతుర్విధాన్నములు తెప్పించి మిమ్ము తినుడన మీరును ‘అమ్మా! ప్రసంగవశమున అనుకొనకుండగనే ఉపవాసముతో శుభావహమయి రాత్రి గడచినది. కాన రేపు భుజింతుము. మేము జన్మప్రభృతిగా ఓ శుభవ్రతా! దేవీ! పాపిష్ఠులము. అని జవాబిచ్చి ఇట్లు ఈప్రసంగమున మీ ఇరువురకును ధర్మలేశమును జాగరణానుష్ఠానఫలమును అబ్బినవి.

ఉదయమున ఆ అనంగవతి శయ్యయు లవణపర్వతమును గ్రామములును గురువు నకును వస్త్రాలంకార కనకయుతములైన పండ్రెండు పాడియావులు బ్రాహ్మణులకును దానము చేసెను. సుహృన్మిత్ర దీనాందకృపణులతోపాటు ఆమె ఈ లుబ్ధక దంపతులకును భోజనము పెట్టి వీడ్కొనెను. రాజా! ఆలుబ్ధక దంపతులుగా నుండిన మీరు వ్రతమునచేసిన పూజా మాహాత్మ్యమున మీ పాపములన్నియు నశించి ఈ పద్మ గృహమును కామగమనమును ఈ సంపదాదిక మంతయును బ్రహ్మరూపుడగు నారాయణునిచే మీకు ఈయబడినవి. ఆ అనంగవతియను వేశ్యయు ఇపుడు మన్మథుని రెండవభార్యయై ప్రీతియనుపేర రతీదేవికిసవతిగా నున్నదై లోకానంద జననియు సకలామర పూజితయునై యున్నది.

కావున ఓరాజేంద్రా! నీవును ఈ పద్మ గృహయానమును భూతలమున విడిచి గంగాతీరమున విభూతి ద్వాదశీ వ్రతము నాచరింపుము. మోక్షము నందెదవు. ఇట్లు ప్రచేతుడు పలికి యంతర్హితుడు కాగా ఆ రాజును అతడు చెప్పినది యెల్ల అట్లే ఆచరించెను. ఆ ఫలమును కూడ పొందెను. కావున నారదా! దీని నాచరించిన యాతడు అఖండఫలమునందును. శక్తి యున్నంతలో పండ్రెండు ద్వాదశులయందు ఉపవాస పూజా దక్షిణాదానాదికమును విత్తశాఠ్యము చేయక భక్తితో నాచరించుటచే కేశవుడు తుష్టుడగును.

కలుషనాశకమగు దీనిని భక్తితో వినినను చదివినను ఇతరులకు తెలిపినను కోటి శతవత్సరములపాటు దేవలోకమున వసించును.