మత్స్య మహా పురాణము
పూరు వంశమున వివిధ వంశములు
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను, అజామీధునకు నీలినియందు నీలుడు అతనికి మహాతపఃఫలముగా సుశాన్తి అతనికి పురజిత్ అతనికి పృథుడు అతనికి భద్రాశ్వుడు అతనికి ముద్గలుడు జయుడు వారాహుడు పృథుడు కపిలుడు కలిగిరి. వీరు ఐదుగురు ఐదు భాగములుగా నున్న పంచాల జనపదములకు పాలకులయిరి. వీరిలో సంవృతాంగిరసుని వంశమునందలి కాణ్వాయనుల కోవలోనివారై కణ్వ ముద్దలులనబడిరి. ముద్గలునకు బ్రహ్మ తత్త్వవేత్తలలో ఉత్తముడును మహాయశుడును నగు ఇంద్రసేనుడు అతనికి వంధ్యాశ్వుడు అతనికి మేనకయందు దివోదాసుడను రాజర్షియు యశస్వినియగు అహల్యయునను కవలలు కలిగిరి. అహల్యకు శరద్వంతుని వలన ఋషిశ్రేష్ఠుడగు శతానందుడు అతనికి సుమహాతపుడు అతనికి ధనుర్వేద పారగుడగు సత్యధృతి కలిగిరి. ధార్మికుడు అమోఘ రేతస్కుడునగు అతడు జలమునందుండి ఒక అచ్చరను చూడగా అతని రేతస్సు స్కలనమై ఆ సరస్సునందు పడెను. దానియందే ఆ రేతస్సువలన ఒక స్త్రీ శిశువును ఒక పురుష శిశువును జనించిరి. వేటకు వచ్చిన శంతనుడు ఆ పరిసరములందు తిరుగుచు అచట నడయాడుచున్న ఆ శిశువుల జంటను కృపతో తీసికొని కాపాడెను. వీరే కృపుడు -కృపి (ద్రోణుని భార్య)- అనువారు) దివోదాసునకు మిత్రాయతి-మైత్రాయణుడు అనువారు వారిలో మిత్రాయతికి మైత్రేయుడు అతనికి చైత్యవరుడు అతనికి సుదాసుడు కలిగిరి.
సుదాసునకు సంతతిలేక వంశము క్షీణించు సమయమున అజమీడునకు సోమకుడను కుమారుడు కలిగెను. అతనికి జంతుడు అను కుమారుడు కలిగి సంతతి లేకయే హతుడయ్యెను. ఇట్టి స్థితిలో మరల సోమకునకు నూటొక్క మంది కుమారులు కలిగిరి. అది ఎట్లు జరిగెననగా-అజమీఢుడు (అజమీడుని కుమారుడు) అగు ఈ సోమకుని భార్య పేరు కూడ ధూమిని. ఈమె తనకు సంతానము లేకపోయినందున మరల సంతానముపై వాంఛ కలిగినదయి నూరు సంవత్సరముల పాటు దుశ్చరమగు తపస్సాచరించెను. విధానము ననుసరించి అగ్నిని వేల్చెను. పవిత్రమగు హవిష్యాద్యాహారమునే తినెను. ఉత్తమములగు వ్రతముల నియమములు పాటించుచు అగ్ని హోత్రమునకు అమర్చిన (వేదిక చుట్టునున్న) దర్భలయందే నిద్రించెను. ఇట్లామె విధూతపాప (పాపములను దూరము చేసికొన్నది)కాగా అట్టి ఆమెతో సంగమించిన ఈ ఆజమీఢుడుగు సోమకునకు ఆమె యందు మొదట ధూమవర్ణుడగు కుమారుడు కలిగెను. ఆ పొగరంగుతో తన తేజము ఆ(నం)వరింపబడినందున ఆ క్షేత్ర ఋషి సంవరణుడనబడెను. ఆ తరువాత ఈ సంవరణునకు సోదరులుగా సోమకునకు మరి నూరుమంది కుమారులు కలిగిరి. సంవరణుని కుమారుడు కురువు. ఈ కురువు తమ పూర్వ రాజధానియగు ప్రతిష్టానము (ప్రయాగ) దాటి కురుక్షేత్రమువరకు రాజ్యము విస్తరింపజేసెను. ఎట్లన అతడు అనేక సంవత్సరములపాటు తాను సేద్యముచేసి ఆ ప్రదేశమును పంట పొలమునుగా చేసెను. అందుచే దానికి కురుక్షేత్రము (కురురాజు చేసిన పంటచేను) అనుపేరు వచ్చెను. పంటకు అనుకూలము కాని భూమిని తనకృషిచే పంటపొలముగా మార్చుట కతడుచేసిన యత్నమునకు మెచ్చి ఇంద్రుడు ఆ ప్రదేశము పుణ్యమును రమణీయమున గునట్లు వరమునిచ్చెను. అతనిబట్టి ఆ వంశము చాల గొప్పది. కావుననే ఆ వంశమువారికి కౌరవులను పేరు వచ్చెను. అతనికి సుదన్వన్ జఘ్ను (హ్ను)వు పరీక్షిత్ ప్రజనుడు అనువారు కలిగిరి. సుధన్వునకు మతిమంతులలో శ్రేష్ఠుడు చ్యవనుడు అతనికి ధర్మార్థ తత్త్వవేత్తయు త్యాగశీలుడును మహాతపస్వియు యజ్ఞకర్తయు అగు ‘క్రిమి’ అతనికి ఇంద్రసముడు మహావీర్యుడు సమర్థుడు అంతరిక్షమునందు పయనించువాడు అగుటచే ఉపరిచరుడు అనబడు వసువనునతడు కుమారుడయ్యెను. ఇతడు చేది దేశరాజు కనుక చైద్యుడు. అతనికి గిరికయందు మహారథుడై మగధరాజుగా ప్రసిద్ధుడైన బృహద్రథుడు పుత్రశ్రవసుడు, కుశుడు, హరివాహనుడు, యజువు, మత్స్యుడు, కాలుడు అను ఏడుగురు కుమారులు కలిగిరి. వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు అతనికి వృషభుడు అతనికి పుష్పవాన్ అతనికి పుష్పుడు అతనికి సత్యధృతి అతనికి సుధన్వుడు అతనికి సర్వుడు అతనికి భువనుడు అతనికి బృహద్రథుడు అతనికి అతని భార్యలయందు జనించిన రెండు శకలములను ‘జర’ అనునామె సంధించుటచే కలిగిన జరాసంధుడు కలిగిరి. ఇతడు మహాబలుడై సర్వక్షత్రియ విజేత యయ్యెను. అతనికి సహదేవుడు అతనికి సోమవిత్ అతనికి శ్రుతశ్రవుడు కుమారులయిరి. ఇది మాగధుల వంశము.
ఉపరిచరవసు కుమారులలో ఐదవవాడగు యజువునకు సురథుడు అతనికి విదూ రథుడు అతనికి సార్వభౌముడు అతనికి జయత్సేనుడు అతనికి రజతుడు అతనికి మహాభౌముడు అతనికి అయుతాయువు అతనికి అక్రోధనుడు అతనికి దేవాతిథి అతనికి దక్షుడు అతనికి భీమసేనుడు అతనికి దిలీపుడు అతనికి ప్రదీపుడు అతనికి దేవాపిశంతను బాహ్లికులను ముగ్గురు కుమారులు కలిగిరి. వీరిలో బాహ్లికునకు ఏడుగురు కుమారులు (బాహ్లికదేశపు రాజులు) బాహ్లికేశ్వరులనబడిరి. దేవాపిని ప్రజలు అసహించుకొనుటచే అతడు ముని యయ్యెను.
అనగా ఋషులు సూతునిట్లడిగిరి: “రాజపుత్రుడగు ఆ దేవాపియందు ఏ దోషము న్నందున ప్రజలు అతనిని అసహించుకొనిరి?” అనగా సూతుడిట్లనెను. అతనికి బొల్లి (తెల్ల కుష్ఠు) వ్యాధిఉండెను. అందుచే ప్రజలు అతనిని ఆదరముతోచూడక అసహించుకొనిరి. దీనికిని క్షత్రియుల విషయమున దేవతలు సంకల్పించిన ఒకానొక కార్యమే హేతువయ్యెను. అందుచే మహాభిషక్ అనియు శంతనుడనియు బిరుదనామములు గల రెండవ రాజపుత్రుడు రాజయ్యెను. ఏలయన అతడు మహావిద్వాంసుడు. అతని విషయమున ఈ పురాతన శ్లోకము చెప్పుదురు. “శిథిల శరీరుని కాని (వృద్ధుని కాని) రోగిని కాని అతడు ఎవరిని తన చేతితో తాకునో అతడు మరల యువకుడు అగును. అందుచే అతనిని “శంతనుడు-శం-సుఖమును; తనోతి-వృద్ధి చేయువాడు–అందురు.” అతడు జాహ్నవిని వివాహమాడగా ఆమెయందతనికి దేవవ్రతుడను కుమారుడు కలిగెను. అతనికే పుత్రియగు ‘కాలి’యందు శంతనునకు ప్రీతిపాత్రుడు శాంతాత్ముడు అకల్మషుడునగు విచిత్రవీర్యుని క్షేత్రమున (భార్యలు అంబిక-అంబాలికలయందు) ధృతరాష్ట్రుడు పాండుడు అను కుమారులను (శూద్రియందు) విదురుని కృష్ణద్వైపాయనుడు ఉత్పాదించెను.
ధృతరాష్ట్రునకు గాంధారియందు దుర్యోధనాదులు నూరుగురును పాండునకు పృథ (కుంతి)యందు ధర్మవాయుదేవేంద్రులవలన యుధిష్ఠిర, భీమార్జునులు మాద్రియందు అశ్విదేవుల వలన నకులసహదేవులు కుమారులయిరి. ఈ ఐదుగురికి ద్రౌపదియందు వరుసగా ప్రతివింద్య శ్రుతసేన శతకీర్తి శ్రుతవర్మ శతానీకులు కలిగిరి. వీరుకాక ధర్మజునకు దేవకి అను నామెయందు యౌధేయుడు, భీమునకు హిడింబయందు ఘటోత్కచుడు, కాశీరాజు పుత్రియగు జలధరయందు సర్వగుడు, అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు, నకులునకు చేదిరాజ పుత్రియగు కరేణుమతియందు నిరమిత్రుడు సహదేవునకు మాద్రి అను నామెయందు సుహోత్రుడు కుమారు లయిరి. అభిమన్యునకు శత్రుధనవిజేతయగు పరీక్షిత్ అతనికి పరమ ధార్మికుడగు జనమేజయుడు కలిగిరి. జనమేజయుడు ఒక యజ్ఞములో వాజసనేయియగు బ్రాహ్మణుని బ్రహ్మగా వరించెను. అది చూచి సహించక వైశంపాయన మహర్షి జనమేజయుని నిట్లు శపించెను: “దుర్బుద్ధి! నీ మాట నీ దేశమునందే చెల్లక పోవుగాక! నీవు ఈ లోకమున జీవించి యుండగనే దేశము విడిచి ప్రవాసమునకు పోదువుగాక” అని మరియు జనమేజయునకు యజ్ఞాధికారము లేదని అతనిని యజ్ఞములు చేయవలదని వైశంపాయనుడు వారించెను. ఈతనికి యాజులు (యజ్ఞములు చేయించినవారు) నశింతురనియు అతడు శపించెను. అయినను రాజీది లెక్కపెట్టలేదు. ఇందు క్షత్రియుడే గెలిచెనని కొందరు బ్రాహ్మణులు అతని నాశ్రయించి యుండిరి. కొందరు వైశంపాయన శాపమున నశించిరి. జనమేజయుడును పౌర్ణమాసేష్టితో ప్రజాపతిని (యజ్ఞేశ్వరుని) ఆరాధించెను. తరువాత నాతడు వాజసనేయక విధానముతోనే రెండుమారులు అశ్వమేధయాగము చేసెను. మహావాజసనేయుడను కీర్తి పొందెను. కాని వైశం పాయనుతో వాదమున అతనిచే అభిశప్తుడై బ్రహ్మగా తన యజ్ఞములందుండిన వాజసనేయ బ్రాహ్మణునితో కలిసి అడవులకు పోయెను. జనమేజయుని కుమారుడు శతానీకుడు. అతడు మహావీర్యవంతుడు. జనమేజయుడు అతనిని రాజ్యమునందభిషేకించెను. శతానీకుడు చేసిన అశ్వమేధయాగ ఫలముగా అతనికి అధిసీమ కృష్ణుడను కుమారుడు కలిగెను. ఇప్పుడు అతడు పాలన సేయుచున్నాడు. అతని పాలన కాలములోనే మీరీ దుష్కరమగు దీర్ఘసత్ర యాగము చేయుచున్నారు. ఇప్పటికిది మూడు సంవత్సరములు పుష్కర క్షేత్రమున జరిగినది. రెండేండ్లపాటు కురుక్షేత్రమున దృషద్వతీనదీ తీరమున జరిగినది. (ప్రస్తుతము నైమిశారణ్యమున జరుగుచున్నది.)
ఇది విని ఋషులు సూతునిట్లడిగిరి: “రోమహర్షణా! నీవు ఇంతవరకును గడచిన వృత్తాంతములు చెప్పితివి. ఒకమీదట భవిష్యద్వృత్తాంతములను నీనుండి వినగోరుచున్నాము. ఇకమీదట క్షాత్ర ధర్మము ఎవరియందు నిలుచును? కాబోవు రాజులెవ్వరు? వారి ఆయుః ప్రమాణము వారిపేరులు కాలము యుగ ప్రమాణము యుగదోషములు యుగక్షయము యుగము లందలి సుఖదుఃఖ ధర్మాధర్మములు విచేష్టితములు ఇవి అన్నియు మాకు చెప్పవేడుచున్నాము.”
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను, అద్భుతములను చేయగల మహాను భావుడు వ్యాసుడు నాకు చెప్పియున్న విధమున ఇక రాబోవుచున్న కలియుగమును మన్వంతరము లను రానున్న విషయములను తెలిపెదను. ఇక్ష్వాకు పూరు వంశములందు రాబోవు రాజులను వీరుకాక ఆంధ్ర, పౌండ్ర, కళింగ, చూళిక యవన కైవర్తాభీర శబరులు (చూళికలు-పఠానులలో ఒక తెగవారు; యవనులు-గ్రీసు, టర్కీ మొదలగు దేశములవారు; కైవర్తులు-పల్లెకారులు; ఆభీరాః-అహీర్ అనబడు జాతివారు; శబరాః-చెంచుబోయ మొదలగు జాతులవారు.) ఇతర మ్లేచ్ఛ జాతుల రాజులు ఈ మొదలగు శూద్ర జాతీయులు భారతదేశమునకు బయటినుండి వచ్చి ఈ దేశమును ఏలనున్న రాజులను క్రమమున పేర్కొందును. వినుడు.
ఇపుడు (ఈ పురాణ కథాకాలమున) పాలించుచున్న అధిసీమ కృష్ణునకు విచక్షుడు కుమారుడయి పాలనచేయును. అతని కాలమున హస్తినాపురము గంగలో కొట్టుకొనిపోగా అతడు కౌనుం(శాం)బిని రాజధానిగా చేసికొనును. అతనికి భూరిశ్రేష్ఠుడు అతనికి చిత్ర రథుడు అతని ఎనిమిదిమంది కుమారులలో శుచిద్రథునకు వృష్టిమాన్ అతనికి సుషేణుడు అతనికి సునీథుడు అతనికి నృచక్షుడు అతనికి సుఖీలవుడు అతనికి పరిప్లవుడు అతనికి సుతపుడు అతనికి మేధావి అతనికి పురంజయుడు అతనికి కురుభావ్యుడు అతనికి నిర్మముడు అతనికి బృహద్రథుడు అతనికి వసుధాముడు అతనికి శతానీకుడు అతనికి భవిష్యోదయనుడు అతనికి మహీనరుడు అతనికి దండపాణి అతనికి నిరామిత్రుడు అతనికి క్షేమకుడు కుమారులగుదురు.
ఈ క్షేమకుని విషయమున పురాతనులు పలికిన గీతము ఇట్లున్నది: “దేవతలును, ఋషులును సత్కరించుచుండిన బ్రహ్మ క్షత్ర జాతుల బ్రాహ్మణుల-క్షత్రియుల (బ్రాహ్మణ ధర్మమును అనుసరించి ప్రవర్తించి దానినుద్ధరించు క్షత్రియుల-క్షత్ర ధర్మమును పాటించు బ్రాహ్మణుల) ఏజన్మము, ఏవంశము ( ఈ భారతదేశమున) కలదో అదియంతయు ఈ కలియుగమున క్షేమక రాజును ఆశ్రయించి వర్ధిల్లును.”
ఋషులారా! మీకు ఇట్లు ఈ పౌరవవంశ చరితమును ఉన్నది ఉన్నట్లు వివరించితిని. దీనిలో ప్రధానుడు గాను ఈ చెప్పిన వంశమునకు ఒకమూల పురుషుడుగాను ఉన్న మహాత్ముడు అర్జునుడు.