చతుశ్శాలాది స్వరూప వివేచనము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను, లోగడ చెప్పిన నామక్రమమున మొదట చతుశ్శాల గృహస్వరూపమును తెలిపెదను. 1. ఇది నాలుగువైపులను వాకిండ్లును అళిందములును (పంచలు-వసారాలు) కలిగిన నాలుగు శాలా గృహములు కలది; దీనికి సర్వతోభద్రము అని శాస్త్ర వ్యవహారము; దేవతలకును నృపులకును ఇదిచాల మంచిది; 2. అన్ని విషయములును ఇట్లే ఉండి పడమటకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము సంధ్యావర్తమనబడును; 3. దక్షిణమునకు మాత్రము వాకిలిలేని చతుశ్శాలము స్వస్తికము; 4. ఉత్తరమునకు మాత్రము ద్వారములేని చతుశ్శాలము రుచకము; ఇక త్రిశాల గృహములు: ఉత్తరమున మాత్రము శాలలేనిది (తూర్పు పడమర దక్షిణములందు శాలలుకలది) ధాన్యకమనబడును, ఇది క్షేమవృద్ధికరము - బహుపుత్ర ఫలప్రదము; తూర్పున శాలలేని త్రిశాలగృహము ‘సుక్షేత్ర’ మనబడును. ఇది శుభమును ఆయువును యశమును కలిగించును, శోకమోహనాశకము; దక్షిణమున శాలలేని త్రిశాల గృహమునకు ‘విశాల’మని పేరు. ఇది కులక్షయకరము. వ్యాధి భయావహమును, పశ్చిమమున మాత్రము శాలలేని త్రిశాల గృహమునకు పక్షఘ్నమనిపేరు, ఇది మిత్రబంధుసుత నాశమును సర్పభయమును కలిగించును; ఇక ద్విశాల గృహముల గురించి వివరణ. దక్షిణ పశ్చిమముల యందు శాలలుకలది సర్వధాన్యఫలప్రదము, క్షేమవృద్ధికరమును పుత్రఫలప్రదమును; పశ్చిమోత్తర శాలలుకల ద్విశాలము యమసూర్య మనబడును, రాజభయాగ్ని భయప్రదము-కులక్షయకరము; ఉత్తర పూర్వ దిక్శాలలుకల ద్విశాలము ‘దండ’ మనబడును; అది అకాలమృత్యు-పరచక్ర (సేనా) భయజనకము; పూర్వదక్షిణ శాలాద్వయముకల ద్విశాలము ‘ధన’ మనబడును; అది శస్త్రభయ పరాభవ భయప్రదము; తూర్పు పడమరల శాలలుకల ద్విశాలము ‘చుల్లీ’ అనగా ప్రొయ్యి అనబడును; ఇది మృత్యుభయదము - వైధవ్యప్రదము; ఉత్తర దక్షిణములందు మాత్రము శాలలుకల ద్విశాలము ‘కార్యము’ అనబడును, ఇది భయప్రదము; ఇవికాక సిద్ధార్థము- వజ్రము మొదలగు పేరులుకల ద్విశాలా భేదములనుకూడ వివేకులు నిర్మింపరాదు.

ఇకమీదట రాజభవనపు కొలతలను చెప్పెదను; అది ఉత్తమాది భేదమున ఐదు విధములు (బహుశః 1.ఉత్తమము; 2. ఉత్తమమధ్యమము; 3. మధ్యమము; 4. మధ్య మాధమము; 5. అధమము) వీనిలో మొదటి దాని వెడలుపు 108 మూరలు; మిగిలిన నాలుగింటికిని క్రమముగా దీని నుండి ఎనిమిదేసి మూరలు తగ్గును; పొడవు ప్రతిదాని యందును వెడల్పుకంటె - వెడల్పులలో మరియొక చతుర్థాంశ మధికము.

సేనాపతి గృహ నృపగృహములకు నడుమ (అతిథులుగా వచ్చిన) నృపులకు గృహములుండవలెను; అచటనే భాండాగారము (ఉగ్రాణము-స్టోర్ హౌస్) నుండవలెను; సేనాపతి గృహ చాతుర్వర్ణ్యుల గృహములకు నడుమ రాజపూజ్యులగు పెద్దల బసకై గృహములుండవలెను; అందే మంత్రి-సేనాపతి ప్రభృతుల కుమారుల గృహములును రాజ పితృ గృహము కూడ ఉండవలెను, వనవాసులగు వారి (విడిది) గృహములు ఏబది మూరల వెడల్పుతో ఉండవలయును. ఈ చెప్పిన పొడవులను వెడల్పులను శాలకు కొంతయును అళిందమునకు (పంచకు) కొంతయునుగా విభజించవలయును. దాని విభాగము ఎట్లనిన, రాజునకును సేనాపతికిని నిర్మించు గృహములకై చెప్పిన వెడల్పునకు డెబ్బది మూరలు చేర్చి ఆ మొత్తమును పదునాలుగుతో భాగించగా వచ్చినంత వెడల్పు అళిందమునకును గ్రహించవలయును.

విప్రుల గృహములకు సంబంధించిన మహాశాల ముప్పదియారు మూరల ఏడు అంగుళముల పొడవుండవలయును, అంతకంటె ఎక్కువ పొడవు ఉండరాదు.

క్షత్రియుల గృహముల మహాశాల పొడవు ముప్పది ఆరు మూరల పదియంగుళములు ఉండవలెను.

వైశ్యుల మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదమూడంగుళములు ఉండవలయును.

శూద్రుని మహాశాల పొడవు ముప్పదియైదు మూరల పదునైదంగుళములు.

శాలకు ముందు భాగమున వీధిక (శాలయంత పొడవునను ఆవరణముగాని, నిర్మాణము గాని లేని ‘నడక’ ప్రదేశము) ఉన్నచో అట్టి వాస్తును ‘సోష్ణీషము’ వెనుక వైపున వీథిక యున్నచో అట్టి వాస్తును ‘శ్రేయోచ్ఛయము’ శాలకు రెండువైపులను వీథిక కల వాస్తును ‘సావష్టంభము’ అన్ని వైపులను వీథికయున్న వాస్తును ‘సుస్థితము’ అందురు. చాతుర్వర్ణ్యులకును ఈ నాలుగు విధములగు వాస్తులలో ప్రతియొకటియు శుభకరము.

(ఎక్కువ భూమిక (అంతస్తు)లతో భవనములు కట్టునపుడు) భవనపు గర్భపు వెడల్పు (భజము) ఎంత యుండునో దానిలో పదునారవవంతు అగు మూరల ఎత్తుగ మొదటి అంతస్తు ఉండవలయును, అంతకుమించి ఎక్కువ అంతస్తులకు పోవుకొలది మొదటి అంతస్తు ఎత్తులో పండ్రెండవ వంతు తక్కువగా రెండవదియు, రెండవదాని ఎత్తులో పండ్రెండవ వంతు తక్కువగా మూడవ యంతస్తును, ఈ క్రమములో ఉండవలయును. ఇది యొక విధము, అథవా - అన్ని అంతస్తులు నాలుగు మూరల ఎత్తుతోనే ఉండుట రెండవ పద్ధతి.

గోడలు-కాల్చిన ఇటుకలతో కట్టవలయును; వాని మందము శాలా విస్తారములో (వెడల్పులో) పదునారవ వంతు ఉండవలయును; గోడలు కొయ్య తునుకలతో గాని మట్టితోగాని కట్టవచ్చును. ఏవిధమగు వాస్తు (నిర్మాణము)ల యందైనను గృహపు మొత్తపు వెడల్పును నడుమింటి (గర్భపు) వెడల్పును సరియగు అనుపాతములో నుండవలయును.

ద్వారపు వెడల్పు అరువది ఎనిమిది అంగుళములును దాని ఎత్తు అంతకు రెట్టింపు (నూట ముప్పది యారంగుళములు)ను ఉండవలయును; వాకిటి ఎత్తు ఎన్నిమూరలో ద్వారశాఖల వెడల్పు అన్ని అంగుళములుండవలయును. ఈ మందము అన్ని వాస్తులయందును వర్తించును; ద్వారముపై వేయు ఆడ్డుపట్టె (ఉత్తరాసి) మందము ద్వారశాఖల వెడల్పులో నాలుగవ వంతుండ వలయును; ఈ అడ్డుపట్టెను మేడికొయ్యతో చేయవలయును.