మత్స్య మహా పురాణము
శ్రీదేవి తన అష్టోత్తర శతస్థానములను తెలుపుట
1. వారాణసియందు విశాలాక్షి: 2. నైమిశమున లింగధారిణి; 3. ప్రయాగయందు శ్రీలలితా దేవి; 4. గంధమాధన (పర్వత)మున కాముక, 5. మానససరోవర క్షేత్రమున కుముద; 6. విశ్వేశ్వరమున విశ్వ: 7. వివ్వకయందు మా (లక్ష్మీ), 8. ఇచ్ఛా క్షేత్రమున మదనోత్కట; 9. గోమంతమున గోమతి; 10. మందారమున కామచారిణి; 11. చిత్రరథమున మదోత్కట; 12. హస్తినాపురమున జయంతి; 13. కన్యాకుబ్జమున గౌరి; 14. మలయపర్వతమున రంభ; 15. హిమవత్పర్వత సానువునందు నంద; 16. గోకర్ణమున భద్రకర్ణిక; 17. స్థాణీశ్వరమున భవానీ; 18. బిల్వకమున బిల్వపత్రిక; 19. శ్రీశైలమున మాధవి; 20. భద్రేశ్వరమున భద్ర; 21. వరాహశైలమున జయ; 22. కమలాలయమున కంబళ; 23. పుష్కర క్షేత్రమున పురుహూత; 24.కేదార క్షేత్రమున మార్గదాయిని; 25. రుద్రకోటియందు రుద్రాణి; 26. కాలంజర పర్వతమున కాళి; 27. మహాలింగ క్షేత్రమున కపిల; 28. మకుట క్షేత్రమున మకుట; 29. సాలగ్రామ క్షేత్రమున మహాదేవి; 30. శివలింగ క్షేత్రమున శివప్రియ; 31. మాయాపురి (జగన్నాధ క్షేత్రము) యందు కుమారి; 32. లలితమునందు సంతత; 33. ఉత్పలాక్షమున సహస్రాక్షి, 34. మహోత్పల మున హిరణ్యాక్షి: 35. గయయందు మంగళ, 36. పురుషోత్తమమున విపుల; 37. విపాశా నదీ క్షేత్రమున అమోఘాక్షీ; 38. పుండ్రవర్ధనమున పాటల; 39. సుపార్వ్వమున నారాయణి; 40. త్రికూట (పర్వత)మున భద్రసుందరి; 41. విపులక్షేత్రమున విపుల; 42. మలయాచలమున కల్యాణి; 43. కోటి తీర్థమున కోట్యక్షి 44. మాగధవనమున సుగంధ; 45. కుబ్జామ్రక క్షేత్రమున త్రిసంధ్య: 46. గంగాద్వారము అనగా హరిద్వారమున రతిప్రియ. 47. శివకుండ తీర్థమున సునంద, 48. దేవికానదీతటమున నందిని; 49. ద్వారకయందు రుక్మిణి, 50, బృందావనమున రాధ; 51. మథురయందు దేవకీ; 52. పాతాళమున పరమేశ్వరి; 53. చిత్రకూటమున సీత; 54. వింధ్యమున వింధ్యవాసిని; 55. సహ్యపర్వతమున (పడమటి కనుమలు) ఏకవీర, 56. హరిశ్చంద్రమున చంద్రిక, 57. రామతీర్థమున రమణ; 58. యమునాతీరమున మృగావతి; 59. కరవీరమున మహాలక్ష్మి, 60. వినాయకమున ఉమ; 61. వైద్యనాథమున ఆరోగ్య, 62. మహాకాశమున మహేశ్వరి; 63. శుక్లతీర్థమున అభయ; 64. వింధ్య కందరమున స్మృతి; 65. మాండవ్యమున మాండకి; 66. మహేశ్వరపురమున స్వాహా; 67. ఛాగలాండమున ప్రచండ; 68. అమరకంటకమున చండిక; 69. సోమేశరారోహ; 70. ప్రభాసమున పుష్కరావతి; 71. సముద్రతీరమునందు సరస్వతీ తీరమున దేవమాత; 72. మహాలయమున మహాభాగ; 73. పయోష్ణమున పింగళావతి. 74. కృతశౌచ క్షేత్రమున సింహిక, 75. కార్తికేయ క్షేత్రమున యశస్కరి; 76. ఉత్పలావర్తకమున లోల; 77. సాగరసంగమమున సుభద్ర; 78. సిద్ధవనమున లక్ష్మీమాత; 79. భరతాశ్రమమున అనంగ; 80. జాలంధరమున విశ్వముఖి; 81. కిష్కింధ పర్వతమున తార; 82. దేవదారువనమున పుష్టి; 83. కాశ్మీర మండలమున మేధ; 84. హిమాద్రి యందు ఉమాదేవి; 85. షష్ఠక్షేత్రమున వస్ర్తేశ్వరి; 86. కపాలమోచనమున శుద్ధి; 87. కాయావరోహణమున మాత; 88. శంఖద్వారమున ధ్వని; 89. పిండారకమున భృతి; 90. చంద్రభాగ తీరమున కల; 91. అచ్ఛోదమున శూలధారిణి; 92. వైనాక్షేత్రమున అమృత; 93. బదరీక్షేత్రమున ఊర్వశి, 94. ఉత్తకురువులందు ఓషధి; 95. కుశద్వీపమునందు కుశోదకి; 96. హేమకూటమున మన్మథ; 97. కుముదమున సత్యవాదిని; 98. అశ్వత్థమున వందనీయ; 99. వైశ్రవణాలయమున(ని) విధి; 100. వేదవదనమున గాయత్రి; 101. శివసన్నిధియందు పార్వతి; 102. దేవ లోకమునందు ఇంద్రాణి; 103. బ్రహ్మశరీరమున సరస్వతి; 104. సూర్యబింబమునందు ప్రభ, 105. సప్తమాతృకల యందు వైష్ణవి; 106. పతివ్రతలయందు అరుంధతి; 107. సుందరులగు స్త్రీలయందు తిలోత్తమ; 108. సర్వ ప్రాణుల చిత్తములందును బ్రహ్మకల అను శక్తి.
ఇట్లు ఇచ్చట శ్రీదేవి నామములను నూట ఎనిమిదింటిని పేర్కొనుట ఐనది. ఈ పేర్కొన్న నూట ఎనిమిది తీర్థక్షేత్రములను విన్నను స్మరించినను సర్వపాపముల నుండి ముక్తి లభించును. ఈ తీర్థములయందు స్నానముచేసి నన్ను దర్శించినవారు సర్వపాపముక్తులై కల్పమంత కాలమును శివపురమున వసింతురు. నాయందు తత్పరత కలిగి ఈ క్షేత్రములందు నివసించు వారు బ్రహ్మలోకమును గూడ దాటి శివలోకమును చేరుదురు శుక్లపక్షమున తృతీయయందుగాని, అష్టమినాడుగాని శివ సన్నిధియందు నా ఈ అష్టోత్తర శతనామములను వినిపించినవారు బహు పుత్రవంతులగుదురు. గోదాన శ్రాద్ధ దాన కాలములందుగాని అనుదినమునను గాని దేవతార్చనా సమయమునగాని దీనిని పఠించు వివేకులు బ్రహ్మపదమును పొందుదురు. ఇట్లు పలుకుచునే శ్రీ సతీదేవి తన దేహమును స్వయముగా దహించుకొని చిత్స్వరూప అయ్యెను.
మొదట స్వయంభూ బ్రహ్మయొక్క దక్షిణాంగుష్ఠము నుండి జనించి స్వాయంభువుడనబడిన ఈ దక్షుడే (తన కుమార్తెయగు సతీదేవి శాపముచే) ప్రచేతసులనబడు పదిమందికి మారుగా దక్షుడై (మరల) పుట్టెను. సతీదేవియు పార్వతియై పుట్టి శివుని అర్ధాంగమునకు స్వామిని అయ్యెను. ఈ రెండవ జన్మమున ఆమె మేన గర్భమునందు జనించి భుక్తి, ముక్తి ఫలప్రదమైనది. అరుంధతి ఈ అష్టోత్తర శతనామములను జపించుచు ఉత్తమ యోగసిద్ధి పొందెను. రాజర్షియగు పురూరవుడును ఇష్టములును ఉత్తమములును అగు లోకములను పొందెను. భార్గవ ముని అల్లుడు అగు యయాతీయు పుత్రలాభమును, ధనలాభమును పొందెను. ఇట్లే ఇతరులగు దేవతలును, దైత్యులును, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులును ఈ నామాష్టోత్తర శతకమును స్మరించి తమ ఇష్టముల సిద్ధింపజేసికొనిరి. ఇది వ్రాయబడియున్న చోటును దేవ సన్నిధిలో ఇది పఠింప-పూజింపబడు చోటునను శోకముగాని, దారిద్ర్యముగాని ఎన్నడును కలుగదు.