సావిత్రీ యమ సంవాదము

మాతృభక్తిచే ఈ(భూ)లోక సుఖములను, పితృభక్తిచేత మధ్యమ(అంతరిక్ష)లోక సుఖములను, గురుశుశ్రూష చేత బ్రహ్మలోక సుఖములను (జీవుడు) పొందును; ఈ మూడు భక్తి (సేవా) నియమములను ఎవరు పాటింతురో వారు అన్నిధర్మములను ఆదరించినవారే. ఎవరు ఇవి పాటించరో వారాచరించు సర్వక్రియలును నిష్పలములగును. వీరు మువ్వురును జీవించి యున్నంత వరకును ఇతర ధర్మ సేవన మేమియు చేయపనిలేదు; వారికి ప్రీతిని తనకు హితమును కలిగించుట యందాసక్తుడై ఎడతెగక వారి శుశ్రూష చేయుచుండవలెను, వీరి సేవాదికమునకు ఆటంకము లేకుండునట్లు ఇతర కార్యము లేవయిన తానుచేసినను అవి వీరికి తెలుపుచు చేయుచుండవలెను. ఇట్లు పురుషుడు అనగా జీవుడు చేయు పనులన్నియు ఈమువ్వురియందే ఇముడుచున్నవి.

అనవిని యముడు (ధర్మరాజు) ఇట్లనెను; సావిత్రీ! నీకోరిక నెరవేరినదికదా! (నీవు అనినట్లు పుట్టినింట నీ తల్లిదండ్రులను (పతిఇంట మగని తల్లిదండ్రులను మగనిని - గురువులను- సేవించితివి;) ఇపుడిక మరణించినవారి వెంటవచ్చి వారికి చేయవలసిన సేవ పరలోకమం దేదియు లేదు; అనియు ఇటనే ఉండి వారికి పారలౌకిక కర్మలు చేయవలెననియు శాస్త్రములందు చెప్పబడియున్నది; కనుక మరలుము; నీవిట్లు నావెంట వచ్చుటచే నీకు శ్రమము; నాకు ఆటంకము, అందుచే నీకు ఈ మాట చెప్పుచున్నాను; గురువుల (పెద్దల) పూజలందు భక్తి కలదానవు; అదికాక నీవు సరళ ప్రవర్తనము కల పతివ్రతవు; ధర్మమెరిగిన దానవుగదా నీవు! మరలుము, నీవిపుడు ఇంకను ముందునకు వచ్చిన కొలదిని ఇంకను శ్రమమగుచుండును అన సావిత్రి అతనితో ఇట్లనెను: స్త్రీలకు పతియే దైవతము, పతియే పరమగతి (కి సాధనము); సాధ్వియగు స్త్రీ పతిననుసరించుటయే ధర్మము; పతియే స్త్రీకి తన ప్రాణమునకును ధనమునకును ఈశ్వరుడు (సొంతదారుడు) స్త్రీకి పితయు సోదరుడును సుతుడును ఇచ్చునది కొంచెము మాత్రమే; అమితమగు (పుణ్య ధర్మ ఫలములను) ఈయగలిగినది పతియొక్కడే, అట్టి పతిని ఏస్త్రీ పూజించకుండును. సురోత్తమా! నాపతి పరులచే ఎచటికి తీసికొని పోబడునో తాము స్వయముగా నైన ఎచటికి పోవునో అచటికి నేనును యథాశక్తి (చేతనైనంతవరకు) పోవలసినదే! దేవా! నాపతిని తీసికొనిపోవుచున్న నీవెంట నేను రాలేనపుడు నేను ప్రాణములనే వదలుదును; మనస్విని (అభిమానవతి)యగు ఏ స్త్రీయైనను వైధవ్యమను పాపపు అక్షరములకు పాత్రమయి అలంకారములతో సౌభాగ్య లక్షణములతో ఉండవలసిన తాను ఆ అలంకారములకు దూరమై ముహూర్త కాలమయినను జీవించగలదా! అనగా ఆమెతో యముడుఇట్లనెను, పతివ్రతా! మహాభాగా! శుభరూపా! నీ విషయమున పరితుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములుకాక మరేదైన కోరుము; శీఘ్రమే ఇత్తును, అనగా సావిత్రి “మహాత్ముడు ధర్మజ్ఞుడగు నామామగారు రాజ్యమును, కన్నులును పోయియున్నారు, వారికా రెండును వచ్చునట్లు వరమునిండు” అన యముడు “శుభరూపా! నీవు చాల దూరము వచ్చితివి! వెనుకకు మరలుము; నీవడిగిన ఇదంతయు జరుగును, (ఇంకను వచ్చినచో) నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే ఇప్పుడిట్లు చెప్పుచున్నాను; (నామాట వినుము)” అనెను.

సావిత్రి యమునితో ఇట్లనెను, సత్పురుషులకు సజ్జనులతో సమాగమము లభించిన తరువాత క్లేశము ఎక్కడిది? దుఃఖము ఎక్కడిది. సత్పురుషులు సదా సజ్జనులకును అసజ్జనులకును గతి యగుదురు; కాని అసజ్జనులు మాత్రము సజ్జనులకుగాని అసజ్జనులకుగాని కడకు తనకేకాని గతి (ఉపకారకులు) కారు; అకారణముగనే లోకమునకు అపకారముచేయు (శత్రువులగు) ఖలులవలన భయముండునట్లు విషమువలన కాని అగ్నివలనకాని శత్రువుల వలనకాని శస్త్రముల (ఆయుధముల) వలనకాని భయముండదు; సజ్జనులు తమ ప్రాణముల వదలియైనను పదార్థమును (పరోపకారమను-అర్థము ప్రయోజనమును) చేయుదురో అట్లే అసజ్జనులును తమ ప్రాణములు పోగొట్టుకొనియైనను పరపీడ కలిగించుటలో ఆసక్తులయియుందురు; సజ్జన లోకము (సమూహము) పరలోక (సఖసాధన) మునకై ప్రాణములనైన గడ్డిపోచవలె వదలుకొన సిద్ధమగునో దానిని పరోపకార సమర్థులగు అసజ్జనులు తృణమువలెనే వదలుదురు, అయా జనసమూహములందున్న అసజ్జనులను దండించుటకై బ్రహ్మ తానై రాజును ఏర్పరచి సృష్టించెను; రాజు నరులను పరీక్షించవలయును; అసజ్జనులను నిగ్రహించ (దండించ) వలయును, లోకమందు ఇట్టివాడే లోకత్రయ (సుఖములను) మును జయించు వారందరలో ఉత్తముడు, ప్రజలు తమ రక్షణమును బీజరక్షణమును లోకరక్షణమును చేసికొనుటకై ఎట్లు ధాన్యమును పరీక్షించి మంచి దానినుంచుకొని చెడుదానిని వదలి ఆ మంచి ధాన్యమును మరల పైరువేసి వృద్ధిపరతురో అట్లే రాజు కూడ సజ్జనులను పరిపాలించుచు అసజ్జనులను నిగ్రహించుచు ప్రజలను వర్ధిల్ల చేయవలయును. స్వర్గమును పొందగోరు రాజు చేయదగినది ఇంత మాత్రమే. జగత్తులకు పతి అగు ధర్మరాజా! లోకములందు రాజు చేయదగిన కృత్యము ఇంతకంటె ఇతరము ఏదియు లేదు. ఇట్లు అసజ్జన నిగ్రహముతోను సజ్జన పరిపాలనముతోను రాజు శాసించలేని అసజ్జనులను కూడ శాసించువాడవు నీవు; ఆ హేతువుచే దేవులందరికంటె నీవు అధికుడవగు దేవుడవు అని నాకు తోచుచున్నది. లోకము సరిగా నడుచునట్లు చేయుచు దానిని సరియగు వ్యవస్థయందు నిలుపువారు సజ్జనులే, అట్టి సజ్జనులలో శ్రేష్ఠుడవు నీవు. ఆ హేతువుచే నేను నీవెంట (ఎంత దూరము) వచ్చుచున్నను క్షమము(శ్రమ) లేదు; అనవిని యముడు “విశాలాక్షీ! ధర్మ సంబద్ధములగు నీ వచనములను విని నీ విషయమున తుష్టుడనయితిని, సత్యవంతుని ప్రాణములను తప్ప మరేదయిన వరమును శీఘ్రమే కోరుకొనుము” అన సావిత్రి “విభూ! నాకు నూరుమంది సహోదరులగు అనగా నా తల్లి కడుపుననే జన్మించిన భ్రాతలు వరముగా కోరుకొనుచున్నాను. ఆ వరమును ఇమ్ము, ఇంతవరకును పుత్రులు లేమిచే అనపత్యుడుగానున్న మా తండ్రి పుత్ర లాభము వలన ప్రీతినందునట్లు అనుగ్రహించుము” అనెను.

అంతట యముడు ఆమెతో నిట్లనెను, నిర్మల స్వభావా! నీవు వచ్చిన త్రోవను పొమ్ము, నీ భర్తకు జరుపవలసిన ఔర్ధ్వ దైహిక కార్యముల విషయములలో యత్నము చేయుము; అంతేకాని లోకాంతరగతుడగు ఇతనిని నీవు వెంటనంటజాలవు; భద్రా! నీవు నీ గురువులకు (అత్త ఇంటి పెద్దలగు అత్తమామలకు)ను ముఖ్యగురుడేయగు సత్యవంతునకును చేసిన శుశ్రూషచేత నీవు మహాపుణ్యమును సమార్జించితివి; ఆ హేతువుచేతనే నాదూతలను పంపక నేను స్వయముగా వచ్చి ఇతనిని తీసికొనిపోవుచున్నాను. వరవర్ణినీ; విజ్ఞానవంతుడు అగు పురుషుడు ఆచరించవలసిన కర్తవ్యము తల్లిని తండ్రిని గురుని శుశ్రూషించుట అనునది మాత్రమే, వనమందుండియు నిరంతరమును సత్యవంతుడు ఈమువ్వురను పూజించెను; సంతోషపరచెను; శుభరూపా! ఇట్లు ఇతడు చిరకాలము అనుభవించదగినంత స్వర్గమును జయించిన వాడయినాడు; శుభా! తపముచే బ్రహ్మచర్యముచే గురు (పెద్దల) శుశ్రూషచే అగ్ని శుశ్రూషచే పురుషులు స్వర్గసుఖ ప్రాప్తులగుదురు, ఎవరేకాని-విశేషించి-విప్రుడు ఆచార్యుని తన తండ్రిని, తల్లిని, అన్నను అలక్ష్యపరచరాదు; ఆచార్యుడు బ్రహ్మరూపుడు; తండ్రి ప్రజాపతి రూపుడు; తల్లి పృథివీ రూప; అన్న స్వయముగ తనరూపమే. మానవులు జన్మించుటలో వారి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహాక్లేశము అనుభవింతురు. నూరేండ్లకయినను వారి ఋణము తీర్చుకొనుట శక్యముకాదు. కావున వారికిని ఆచార్యునకును సర్వదా ప్రీతి కలిగించవలయును. ఈ మువ్వురును సంతుష్టులయినచో సర్వ తపస్సులును సమాప్తములగును. ఈ మువ్వుర శశ్రూషయే పరమతపమని పెద్దలందురు. వారి అనుమతి లేనిదే ఇతర ధర్మమేదియు ఆచరించరాదు; వారు మూపురే మూడు (పృథివ్యం తరిక్షద్యు) లోకములు; మూడు (బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ) ఆశ్రమములు. మూడు (ఋగ్యజు స్సామ) వేదములు; మూడు (దక్షిగార్హపత్యాహవనీయ) అగ్నులు; తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురుడాహవనీయాగ్ని. ఈ అగ్నిత్రయము అన్నిటికంటెను గొప్పది. ఈ మూడిటి విషయమున గృహస్థుడు పొరపడరాదు. అట్లున్నవాడు పైజెప్పిన లోకత్రయ (సుఖ)మును జయించును; ప్రకాశించు (తేజోమయమగు) తన శరీరముతో కూడి దేవునివలెనే ద్యు(స్వర్గ) లోకమున సుఖించును. భద్రా! కల్యాణీ! నీ కోరికలు నెరవేరినవి; కావున నీవు మరలుము. నీవనిన ఈ విషయమంతయు జరుగును. ఇంకను నీవు నన్ననుసరించుటచే నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును, అందుచే ఈ మాట ఇట్లు చెప్పుచున్నాను.